విదేశీ విధానాలతో దేశం ‘విశ్వగురు’ అవుతుందా?

ABN , First Publish Date - 2022-03-05T06:45:36+05:30 IST

మోదీ ప్రభుత్వం తెచ్చిన జాతీయ విద్యావిధానం(ఎన్ఇపీ)–2020తో భారతదేశం తిరిగి ‘విశ్వగురు’ పీఠాన్ని అధిరోహించనున్నదని అధికార నేతలు, అనధికార ప్రముఖులు చాలామంది చెబుతున్నారు. ఇప్పటివరకు మనదేశంలో బ్రిటీష్ విదేశీ విద్య వారసత్వమే కొనసాగుతూ వచ్చిందనీ, మొట్టమొదటిసారిగా దేశ విద్యావ్యవస్థ ‘భారతీయకరణ’ అవనున్నదనీ ప్రకటిస్తున్నారు...

విదేశీ విధానాలతో దేశం ‘విశ్వగురు’ అవుతుందా?

నూతన జాతీయ విద్యా విధానం-లో ప్రస్తావించిన సెమిస్టర్ విధానం, 21వ శతాబ్టపు నైపుణ్యాలు, మల్టీ డిసిప్లీనరీ, అకడమిక్ క్రెడిట్ బ్యాంకు, నాలుగేళ్ల డిగ్రీ, ఆ డిగ్రీలో మల్టిపుల్ ఎంట్రీ-ఎగ్జిట్, విదేశీ విశ్వవిద్యాలయాలు, ఆన్ లైన్ చదువులు మొదలైన అంశాలలో ‘భారతీయత’ ఇసుమంతైనా కనిపిస్తోందా? గురువు ప్రత్యక్ష బోధన లేకుండా ఆన్‌లైన్ లో బోలెడు క్రెడిట్స్ పొందడం నలందా, తక్షశిల సంప్రదాయమా? పురాతన వారసత్వం, విశ్వగురు పాత్ర వంటి గంభీర భావనల మాటున దాగిన అసలు అజెండా ఉన్నత విద్యా కార్పొరేటీకరణే. 


మోదీ ప్రభుత్వం తెచ్చిన జాతీయ విద్యావిధానం(ఎన్ఇపీ)–2020తో భారతదేశం తిరిగి ‘విశ్వగురు’ పీఠాన్ని అధిరోహించనున్నదని అధికార నేతలు, అనధికార ప్రముఖులు చాలామంది చెబుతున్నారు. ఇప్పటివరకు మనదేశంలో బ్రిటీష్ విదేశీ విద్య వారసత్వమే కొనసాగుతూ వచ్చిందనీ, మొట్టమొదటిసారిగా దేశ విద్యావ్యవస్థ ‘భారతీయకరణ’ అవనున్నదనీ ప్రకటిస్తున్నారు. ప్రాచీన తక్షశిల, నలందా యూనివర్సిటీలలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది విద్యార్థులు చదువుకునేవారనీ, అలా తిరిగి భారత దేశ ‘విశ్వగురు పాత్ర’ను పునఃప్రతిష్ఠించనున్నట్లు, పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ‘భారతీయ జ్ఞాన పద్ధతులు’ పాఠ్య ప్రణాళికలో భాగమవుతాయని ఎన్ఇపీ–2020లో కూడా రాయడం జరిగింది.


ఆనాడు తక్షశిల, నలందాలలో మల్టీ డిసిప్లీనరీ వాతావరణంలో విద్యా బోధన జరిగిందనీ, కావున ప్రస్తుతం కూడా మల్టీ డిసిప్లీనరీ ఉన్నత విద్యా సంస్థలు మాత్రమే ఉండాలని ఎన్ఇపీ–2020 పేర్కొనింది. దీనర్థం ప్రాకృతిక, సామాజిక, మానవీయ శాస్త్రాలు; భాషలు, లలిత కళలు అన్నింటినీ అభ్యసించగలిగే అనేక కోర్సుల కాంబినేషన్ ఉండాలనీ, వందలాది సబ్జెక్టులలో ఇష్టం వచ్చిన ఏ కోర్సు కాంబినేషన్ నైనా ఎన్నుకునే ఛాయిస్ విద్యార్థులకు ఉండాలని. దీన్ని ఆధునిక పరిభాషలో ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) లేదా అకడమిక్ బ్యాంక్ క్రెడిట్(ఏబీసీ) అని పిలుస్తున్నారు.


ఇలా విద్యార్థి ఇచ్ఛ మేరకు ఎన్నుకోవడాన్ని ‘అనేక కళల్లో జ్ఞానం’, ‘లిబరల్ విద్య’, ‘హోలిస్టిక్ విద్య’ అని ఎన్ఇపీ–2020 అభివర్ణించింది. వాస్తవానికి తక్షశిల, నలందా యూనివర్సిటీలు నాడు గొప్ప జ్ఞాన కేంద్రాలుగా విలసిల్లినప్పటికీ, ఆ కాలంనాటికి పెంపొందిన జ్ఞానం చాలా పరిమితమైనది. కావున 64 కళలతో సహా సమస్త జ్ఞానాన్ని అధ్యయనం చేయడం సాధ్యమై ఉండొచ్చు. కానీ శాస్త్ర విజ్ఞానం అనేక శాఖోపశాఖలుగా ఎంతో విస్తరించిన నేటి ఆధునిక కాలంలో మల్టీ డిసిప్లీనరీ పేరుతో దాన్ని అనుసరించడం అసాధ్యమేకాక అవివేకం కూడా. వాస్తవానికి తక్షశిల, నలందాల ప్రాచీన ఘనతను ఆదర్శంగా పైకి ఉదహరించినప్పటికీ, లోపల సిఫార్సు చేసిన మల్టీ డిసిప్లీనరీ, సీబీసీఎస్, ఏబీసీ మొదలైనవన్నీ అమెరికా యూనివర్సిటీలలో అనుసరిస్తున్న పద్ధతులు. ఈ విదేశీ మోడల్స్‌ను ఏకంగా కాపీ చేసి, దానికి స్వదేశీ తక్షశిల, నలందాల స్వదేశీ టాగ్‌లను తగిలించడం జరిగింది.


అలాగే తక్షశిల, నలందాల భారీ పరిమాణ స్థాయిని ఉదహరిస్తూ, ప్రస్తుతం కూడా మూడు వేలమందికి పైగా విద్యార్థులు ఉండే ఉన్నత విద్యాసంస్థలు మాత్రమే కొనసాగేలా చేయాలని ఎన్ఇపీ–2020 నిర్దేశించింది. ఇది చాలా ప్రమాదకరమైంది. నేడు ప్రభుత్వరంగంలోని డిగ్రీ కాలేజీలు, యూనివర్శిటీల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉంది. కనీస వసతులు కరువై, ఏళ్లతరబడి అధ్యాపక పోస్టులు ఖాళీగాపడి, పరిశోధన మాట అటుంచి బోధన-అభ్యాసం సైతం అటకెక్కింది. ఇక్కడున్న కోర్సులకే దిక్కూ దివాణంలేక డిపార్టుమెంట్‌లకు డిపార్టుమెంటులే మూతబడుతుంటే, లిబరల్ విద్యతో సహా వందలాది మల్టీ డిసిప్లీనరీ కోర్సు కాంబినేషన్స్‌్‌తో, వేలాది విద్యార్థులతో విరాజిల్లే భాగ్యం కలిగే అవకాశం ఉందా? అసాధ్యం.


‘విశ్వగురుపాత్ర’ను పునఃప్రతిష్ఠించడానికి ‘భారతదేశం గ్లోబల్ విద్యా గమ్యంగా ప్రమోట్ చేయబడుతుందనీ, అందుకుగాను వంద విదేశీ ప్రఖ్యాత యూనివర్శిటీలను అనుమతించాలనీ, మనదేశ ఉన్నత విద్యా సంస్థలు ఇతర దేశాలలో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని’ ఎన్ఇపీ–2020 చెబుతోంది. ప్రముఖ విదేశీ యూనివర్శిటీలు వచ్చి, వాటి క్యాంపస్‌లను నెలకొల్పితే మనదేశ ఉన్నత విద్యలో ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి పెంపొందుతాయని కొద్దిమంది భావిస్తారు. అయితే ఇదొక భ్రమాజనితమైన ఆశ. ఎందుకంటే ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, ప్రిన్స్‌టన్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు ఒకానొక సామాజిక ప్రగతిశీల చారిత్రక దశలో స్థాపితమై, మానవాళి సంక్షేమం, సామాజిక ప్రగతి లక్ష్యంగా విద్యా బోధన, అభ్యాసం, పరిశోధన జరిగాయి.


అందువల్ల వివిధ జ్ఞాన శాఖల్లో ఎంతోమంది శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, సామాజిక విజ్ఞాన పారంగతులు, మేధావులు పుట్టుకొచ్చారు. మన దేశంలో సైతం స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే, జగదీష్ చంద్ర బోస్, సత్యన్ బోస్, సి.వి.రామన్, మేఘనాధ్ సాహా తదితరులు శాస్త్రవిజ్ఞానంలో నూతన ఆవిష్కరణలను చేయడమేకాక, వారు పనిచేసిన విద్యా, పరిశోధనా సంస్థల ప్రమాణాలను పెంపొందించి, వాటికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి పెట్టారు. ఇప్పుడు ప్రగతి నిరోధక పెట్టుబడిదారీ ప్రపంచీకరణ, విద్యతో సహా సమస్త రంగాలను ఒకేఒక్క నగ్న లాభాపేక్షకు బలిచేస్తున్న కాలంలో విదేశీ యూనివర్శిటీలు విద్యాప్రమాణాలను పెంపొందించడానికి అడుగుపెడతాయని ఆశించగలమా? వాస్తవానికి విదేశీ యూనివర్శిటీల ప్రవేశం ప్రపంచ వాణిజ్య సంస్థ గ్యాట్స్ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా జరుగుతోంది.


ఈ ఒప్పందానికి సమ్మతించిన మన పాలకులు మనదేశ విద్యా వ్యవస్థను గ్లోబల్ మార్కెట్‌కు అనుసంధానించడానికి అమెరికాలోలాగా నాలుగేళ్ళ డిగ్రీ కోర్సుకు, విద్యలో విదేశీ పెట్టుబడులకు సన్నాహాలు చేస్తున్నారు. గ్యాట్స్ ఒప్పందం ప్రకారం విద్య వాణిజ్యం చేసే సేవ, విద్యాసంస్థ ఆ సేవనందించే సరఫరాదారు, ఉపాధ్యాయుడు ఆ సేవకు ఫెసిలిటేటర్, విద్యార్థి ఆ సేవను పొందే వినియోగదారుడు. ఈ విధంగా ఫక్తు వ్యాపార భాషలో విద్యను నిర్వచించిన సామ్రాజ్యవాద గ్యాట్స్ ఒప్పందంలో భాగంగా వస్తున్న విదేశీ యూనివర్సిటీలు ‘విశ్వగురు పాత్ర’ను పోషిస్తాయనీ, విద్యావ్యవస్థ ‘భారతీయకరణ’ అవుతుందని విధానకర్తలు నమ్మబలుకుతున్నారు.


ఇక ఎన్ఇపీ–2020లో ఆకాశానికెత్తిన ‘భారతీయ జ్ఞాన పద్దతుల’ గురించి కొంత చెప్పాలి. నిజమే! ప్రాచీన కాలంలో ఇప్పుడు మన దేశమని భావిస్తున్న (అప్పటికి భారతదేశమనే భావనే లేదు) భూభాగంపై విజ్ఞాన శాస్త్ర కృషి జరిగింది. ఆనాడు ఆర్యభట్ట, భాస్కరాచార్యుడు, చరకుడు, సుశ్రుతుడు తదితర తాత్వికులు ఖగోళ, గణిత, వైద్య రంగాలలో కొన్ని సూత్రీకరణలు చేసి శాస్త్ర విజ్ఞానానికి బీజాలు వేశారు. ఈ ఆవిష్కరణల గురించి నేటి తరాలకు తెలియాలి. అయితే వీటిని ఒక ప్రత్యేక జాతికి, మతానికి, భౌగోళిక సరిహద్దులకు, సంస్కృత భాషకు, వేద, వేదాంతాలకు ముడిపెట్టి చెప్పడం చారిత్రక విరుద్దమేకాక సంకుచితం చేయడమవుతుంది.


వాస్తవానికి ప్రాచీన కాలంలో భారత భూభాగంతో పాటుగా, గ్రీకు, ఈజిప్టు, బాబిలోనియా (నేటి ఇరాక్) నాగరికతల కాలంలో వైజ్ఞానిక భావనల పరికల్పన జరిగి, జ్ఞానాన్ని భౌగోళిక సరిహద్దులను దాటి పంచుకోవడం జరిగింది. అలాగే ఆధునిక కాలంలో యూరప్‌లో వచ్చిన విజ్ఞానమంతా ప్రపంచ పరివ్యాప్తమైంది. ఈ విధమైన శాస్త్రీయ, చారిత్రక దృష్టితో కాకుండా, ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలన్నీ ప్రాచీన కాలంలోనే కనుగొన్నారనీ, విజ్ఞానమంతా వేదాలలోనే ఉందని చెబుతూ భావి తరాలలో తప్పుడు భావనలను పెంపొందించడం, జాతి దురహంకారాన్ని ప్రేరేపించడం జరుగుతోంది.


మరి ఎన్ఇపీ–2020లో ప్రస్తావించిన సెమిస్టర్ విధానం, 21వ శతాబ్టపు నైపుణ్యాలు, మల్టీ డిసిప్లీనరీ, అకడమిక్ క్రెడిట్ బ్యాంకు, నాలుగేళ్ల డిగ్రీ, ఆ డిగ్రీలో మల్టిపుల్ ఎంట్రీ-ఎగ్జిట్, విదేశీ విశ్వవిద్యాలయాలు, ఆన్‌లైన్ చదువులు మొదలైన అంశాలలో ‘భారతీయత’ ఇసుమంతైనా కనిపిస్తోందా? గురువు ప్రత్యక్ష బోధన లేకుండా ఆన్‌లైన్‌లో బోలెడు క్రెడిట్స్ పొందడం నలందా, తక్షశిలల సంప్రదాయమా? అమెరికా మోడల్స్‌కు మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రాచీన సంస్కృతి, పురాతన వారసత్వం, జాతి పరంపర, విశ్వగురు పాత్ర వంటి గంభీర పదజాలాన్ని పలుమార్లు వాడడం జరిగింది.


ఈ పదాల మాటున దాగిన అసలు అజెండా విద్యను, మరీ ముఖ్యంగా ఉన్నత విద్యను కార్పొరేటీకరణ చేయడం, గ్లోబల్ మార్కెట్‌లో భాగం చేయడం, దేశ-విదేశీ పెట్టుబడులకు స్వర్గధామంగా రూపొందించడం, కేవలం అతి కొద్దిమంది సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే సౌకర్యంగా మార్చడం, అసంఖ్యాక పేద, మధ్య తరగతి బడుగులకు నిరాకరించడం. ఒకవైపు కార్పొరేట్ కంపెనీలకు ప్రొఫెషనల్స్‌ను, పైస్థాయి అధికార వ్యవస్థను నడిపే బ్యూరోక్రాట్లను తయారుచేయడానికి అతికొద్ది మంది సంపన్నులకు ఆప్టిమమ్ లెర్నింగ్ లెవెల్స్ (ఓఎల్ఎల్), మరోవైపు పెట్టుబడిదారీ ఆర్థిక–పారిశ్రామిక-సేవా రంగాలకు అవసరమయ్యే వర్క్‌ఫోర్స్‌ను సిద్దంచేయడానికి అసంఖ్యాక బడుగులకు మినిమమ్ లెర్నింగ్ లెవెల్స్ (ఎమ్ఎల్ఎల్) అనే రెండు అంతస్తుల విద్యా విధానాన్ని ఎన్ఇపీ–2020 రూపొందించింది.

 -ఎస్. గోవిందరాజులు

ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ

Read more