తక్షణ రక్షకులు మన ఫ్యామిలీ డాక్టర్లు

ABN , First Publish Date - 2022-07-01T07:08:43+05:30 IST

ప్రతిసంవత్సరం జూలై ఒకటవ తేదీని జాతీయ డాక్టర్ల దినోత్సవంగా జరుపుకుంటారు.

తక్షణ రక్షకులు మన ఫ్యామిలీ డాక్టర్లు

ప్రతిసంవత్సరం జూలై ఒకటవ తేదీని జాతీయ డాక్టర్ల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ రోజున వారికి మిత్రులు, పేషెంట్ల నుంచి శుభాకాంక్షలు అందుతాయి. ఈ సంవత్సరం డాక్టర్ల దినోత్సవం చర్చా అంశం ‘ఫ్యామిలీ డాక్టర్స్‌ ఆన్‌ ద ఫ్రంట్‌లైన్‌’ అంటే వైద్య ఆరోగ్య రంగంలో ముందువరుసలో నిలిచే ఫ్యామిలీ డాక్టర్లు.


ఒకప్పుడు ప్రాథమిక ఆరోగ్య సేవల్లో ఫ్యామిలీ డాక్టర్ల ప్రాధాన్యత బాగా ఉండేది. ప్రతి ఇంట్లో ఒక డాక్టరుని నమ్ముకుని ఉండేవారు. వారి సలహాలను తూ.చ తప్పకుండా పాటించేవారు. క్రమంగా ఆ విధానం మరుగున పడిపోయింది. కానీ ఇప్పుడు ప్రతి చిన్న సమస్యకి స్పెషలిస్టులపై ఆధారపడుతున్నారు. చిన్న తలనొప్పికి న్యూరోసర్జన్‌ని సంప్రదించడం, వాంతులైతే గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ని కలుసుకోవడం వంటివి పరిపాటి అవుతున్నాయి. సాధారణంగా ఎదురయ్యే వ్యాధులను ఫ్యామిలీ డాక్టర్లు నయం చేయగలుగుతారు. డిఎన్‌బి, యండి వంటి ఫ్యామిలీ మెడిసిన్‌ పీజీ కోర్సుల్లో శిక్షణ పొందే అవకాశం మనదేశంలో ఉంది. అది ఇంకా బలోపేతం కావలసి ఉంది.


కరోనా వ్యాపించడంతో ప్రపంచంలో వైద్య ఆరోగ్య రంగాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రాథమిక ఆరోగ్యానికి ఉన్న ప్రాముఖ్యతని, ప్రజలకు అందుబాటులో ఉండే డాక్టర్ల వ్యవస్థనీ అందరూ గుర్తిస్తున్నారు. అందుకే ఫ్యామిలీ డాక్టర్ల గురించి మళ్లీ చర్చ మొదలయింది.


గతంలో రష్యాలో 1978లో జరిగిన ప్రపంచ దేశాల సమావేశంలో ‘ఆల్మా–ఆటా’ ఒప్పందం కుదిరినప్పుడు ప్రాథమిక ఆరోగ్యం ఎజెండా మీదికి వచ్చింది. తర్వాత 90వ దశకం నుంచి ప్రపంచీకరణ పెరగడం, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థల ఆదేశాలకు కట్టుబడి పనిచేయడం వంటి విధానాల వల్ల ప్రాథమిక ఆరోగ్యసేవలు దెబ్బతిన్నాయి. కొన్ని వ్యాధులపై మాత్రమే పరిశోధనలు చేయడం, కార్పొరేట్‌ ఆసుపత్రుల ప్రాధాన్యత పెరగడం, ప్రజల అవసరాలు తీర్చలేని దుస్థితికి దిగజారడం వంటి జాడ్యాలు వైద్యరంగాన్ని పీడించసాగాయి. తర్వాత ‘ఆస్టానా’ డిక్లరేషన్‌ కొంతమేరకు ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణని ప్రస్తావించింది.


గత ఇరవై సంవత్సరాల్లో ప్రాథమిక వైద్యాన్ని పునర్నిర్వచించడం జరుగుతోంది. నూతన సమగ్ర అవగాహన పెంపొందుతోంది. కరోనా నేర్పిన పాఠాల వల్ల మళ్లీ ప్రాథమిక వైద్యం గురించి చర్చ మొదలయింది. కొన్ని దేశాల్లో తాత్కాలికంగానైనా కార్పొరేట్‌ వ్యవస్థని పరిమితం చేసి, వైద్య రంగాన్ని గాని, ప్రముఖ ఆసుపత్రులను గాని జాతీయం చేసి, కరోనా నుంచి తమ దేశ ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. స్వీడన్‌, బ్రెజిల్‌, ఐర్లాండ్‌ వంటి చోట్ల ఈ ప్రయత్నాలు జరిగాయి. అందుకే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ), యునిసెఫ్‌ వంటి సంస్థలు ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ గురించి ఆదేశిక సూత్రాలను ప్రతిపాదించాయి. అలా ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థకి మళ్లీ ప్రోత్సాహం లభించింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం ‘నేషనల్‌ డాక్టర్స్‌ డే’ సందర్భంగా ‘ముందు వరుసలో ఫ్యామిలీ డాక్టర్లు’ అని ప్రకటించుకుంటున్నాం.


క్యూబా వంటి దేశాల్లో ఫ్యామిలీ డాక్టర్‌, నర్స్‌ టీంలు కుటుంబాల వారీగా బాధ్యత వహిస్తూ, వారి ప్రాథమిక ఆరోగ్య అవసరాలను తీరుస్తూ, వ్యాధి ముదరక ముందే గుర్తించి, తగిన సలహాలిస్తూ, అత్యవసర పరిస్థితుల్లోనో, అవసరమైతేనో స్పెషలిస్టులను సంప్రదిస్తారు. ఎనభై శాతం వ్యాధులని ఫ్యామిలీ డాక్టర్లు నయం చేయగలరు. పైగా వారు అందుబాటులో ఉంటారు, కుటుంబ సభ్యులందరినీ చూడగలుగుతారు. ఏ వ్యాధినైనా గుర్తించి నయం చేయగలుగుతారు.


అందుకే, ప్రస్తుతం మన దేశంలో ఆశాజనకమైన మార్పులు వస్తున్నాయి. జాతీయ మెడికల్‌ కమిషన్‌ గుర్తింపుతో రెండేళ్ల ఫ్యామిలీ మెడిసిన్‌ డిప్లొమా కోర్సు జిల్లా ఆసుపత్రుల్లో మొదలయింది. ఎయిమ్స్‌ వంటి అత్యుత్తమ జాతీయ వైద్య సంస్థల్లో ఫ్యామిలీ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్లు ఏర్పరిచారు. అనేక చోట్ల ఫ్యామిలీ మెడిసిన్‌ ఫెలోషిప్‌లు ఆరంభమయ్యాయి. ఆరు ఎయిమ్స్‌ సంస్థల్లో యం.డి ఫ్యామిలీ మెడిసిన్‌ కోర్సు కూడా మొదలవుతోంది. ‘ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌’ (ఐపిహెచ్‌ఎస్‌)ను ఇటీవల మార్చడం వల్ల జిల్లా ఆసుపత్రుల్లో, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ఫ్యామిలీ డాక్టర్ల నియామకానికి దారులు తెరుచుకున్నాయి. అత్యున్నత సామర్ధ్యంతో కూడిన మెరుగైన వైద్యం ఇవ్వగలిగిన ఫ్యామిలీ డాక్టర్ల వల్ల మన ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ బలోపేతమవుతుంది.


కాకపోతే, ఎంబిబిఎస్‌ స్థాయిలోనే ఫ్యామిలీ మెడిసిన్‌ని బోధించడంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఆ డిపార్టుమెంట్లను తెరిచి, బోధకులను నియమించడంలో మనం ఇంకా వెనుకబడే ఉన్నాం. ఈ లోటు తీర్చగలిగితే ప్రజల కోసం పనిచేయగల వైద్యనిపుణులు, ప్రజలకు మెరుగైన వైద్యసేవని ప్రాథమిక స్థాయిలోనే అందించగల ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థ నెలకొంటే మన ఆరోగ్య వ్యవస్థ రూపు మారిపోతుంది. ప్రజల కోసం, ప్రజల దగ్గరకు ప్రాథమిక వైద్యం నడిచి వస్తుంది. అన్ని వయసుల వారిని, అన్ని రకాల వ్యాధులని, ఆడ మగ తేడా లేకుండా చూడగలిగిన వైద్యులు ఈ ఫ్యామిలీ డాక్టర్లు. ప్రతి ఇంటిని, ప్రతి మనిషిని అక్కున చేర్చుకోగల ఆరోగ్య వ్యవస్థ రూపొందితే, మన దేశంలో మెజారిటీ ప్రజలు సుఖశాంతులతో జీవించగలుగుతారు.


డాక్టర్‌ శ్రీనివాస్‌

డాక్టర్‌ నళిని

(నేడు వైద్యుల దినోత్సవం)

Updated Date - 2022-07-01T07:08:43+05:30 IST