పేరు+కులం=బ్రాండ్ వాల్యూ

ABN , First Publish Date - 2022-04-17T07:13:08+05:30 IST

‘బూరనర్సయ్య ఎవరు, ఎక్కడ’ అంటూ 44ఏళ్ల క్రితం మా బయోకెమిస్ట్రీ లెక్చరర్ వసంతవల్లిగారు నాకోసం వెదకడం ఇంకా నా చెవుల్లో వినిపిస్తూనే ఉంది. అది ఎంబీబీఎస్ బయోకెమిస్ట్రీ ఫైనల్ పరీక్ష అయిపోయి...

పేరు+కులం=బ్రాండ్ వాల్యూ

‘బూరనర్సయ్య ఎవరు, ఎక్కడ’ అంటూ 44ఏళ్ల క్రితం మా బయోకెమిస్ట్రీ లెక్చరర్ వసంతవల్లిగారు నాకోసం వెదకడం ఇంకా నా చెవుల్లో వినిపిస్తూనే ఉంది. అది ఎంబీబీఎస్ బయోకెమిస్ట్రీ ఫైనల్ పరీక్ష అయిపోయి ప్రాక్టికల్ పరీక్ష జరుగుతున్న సమయం. మా క్లాసులోని వందమంది విద్యార్థుల్లో నన్నే లెక్చరర్ గారు వెతకటానికి కారణం- ఆ ఫైనల్ రాత పరీక్షను నేను అద్భుతంగా రాయటం. బూర నర్సయ్య అనే పేరున్న విద్యార్థి కూడా ఇంత బాగా పరీక్ష రాయటం వారిని ఆశ్చర్యపరిచింది. నన్ను చూసి, ఫైనల్ పేపర్ బాగా రాశావు, ప్రాక్టికల్ కూడా బాగా చెయ్యి అని చెప్పి వెళ్లిపోయారు. బూర నర్సయ్య అనే పేరు పాత తరాన్ని, పేదరికాన్ని, వెనకబాటుతనాన్ని సూచించటమే దీనికి కారణం. నర్సయ్య అనే పేరుకు ఉన్న బ్రాండ్ వాల్యూ అన్నమాట. చివరకు బయో కెమిస్ట్రీలో డిస్టింక్షన్ సాధించాను.


ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో నర్సయ్య లాంటి పేరు ఉన్న గ్రామీణ విద్యార్థులు ఆరేడుమంది ఉండేవారు. సత్తయ్య, నర్సయ్య, వెంకట్‌నర్సు ఇలా. కానీ మొదటి ఏడాది పూర్తయ్యేలోపే అందరూ నర్సింహారావు, సత్యం, నవీన్ ఇలా బ్రాండ్ వాల్యూ ఉన్న పేర్లకు మారిపోయారు. నేను ఒక్కడినే నా అసలు పేరుతో మిగిలిపోయాను.


ఎంబీబీఎస్ మూడో సంవత్సరం. క్లాస్ రిప్రజెంటేటివ్ ఎన్నికలు. మొదట నన్ను ఏకగీవ్ర అభ్యర్థిగా అందరూ ప్రతిపాదించి నిలబెట్టారు. కారణం మంచి విద్యార్థి, మెతక విద్యార్థి, అందరు చెప్పినట్లు వింటాడు అని. కానీ తర్వాత నిలబెట్టినవారే తప్పుకోమన్నారు. ఆత్మగౌరవం దెబ్బతిన్న అవమానంతో, బరిలో దిగాక ఓడినా గెలిచినా తగ్గేదిలే అనుకున్న. ఒకవైపు కేంద్రమంత్రి కొడుకు, ఇంకోవైపు కొండపల్లి సీతారామయ్య గ్రూప్ అభ్యర్థి, మధ్యలో బూర నర్సయ్య! ఏ గ్రూపుకూ చెందని అభ్యర్థి, గాలికి కొట్టుకుపోతాడు అనుకున్నారు. నేనంటే ఇష్టపడే మా మైక్రోబయాలజీ ప్రొఫెసర్ పిలిచి ‘నర్సయ్యా మీ అమ్మా నాన్న కష్టపడి చదివిస్తున్నారు. ఎందుకు నీకు ఎన్నికలు?’ అని వారించాడు. కనీసం ‘మీ అమ్మ నాన్న ఏమి చేస్తున్నారు’ అని కూడా అడగలేదు, ఆర్థిక స్థితిగతులూ అడగలేదు. అంటే పేరును బట్టి పేదవాడని నిర్ణయించుకున్నారు. కానీ ఏ బ్రాండ్ వేల్యూ లేని అదే పేరుతో ఆ ఎన్నికల్లో క్లాస్ రిప్రజెంటేటివ్‌గా అఖండ విజయం సాధించాను. మా ప్రొఫెసర్ ఆశ్చర్యపోయారు. నాపై ఉన్న జాలి గౌరవంగా మారింది. మైక్రోబయాలజీ సబ్జెక్టులో కూడా డిస్టింక్షన్ సాధించాను. చండశాసనుడిగా పేరున్న ఆయన నా టర్ములో అడిగినవన్నీ చేశాడు.


పీజీ చదువుతున్న సమయంలో నేను అసోసియేషన్ ప్రెసిడెంటుగా ఉండె. మిగతా సభ్యులు అందరూ ఆప్త మిత్రులు. అప్పుడే రిజర్వేషన్ అనుకూల, ప్రతికూల ఉద్యమాలు మొదలైనవి. అవి మా మెడికల్ కాలేజీకి కూడా పాకినవి. పీజీ అసోసియేషన్ ఏ వర్గానికి మద్దతివ్వాలనే అంశంపై పెద్ద చర్చ జరిగింది. నేను ఒక్కడిని తప్ప అందరు ఓసీలు. దాంతో నా మీద ఒత్తిడి పెరిగింది. ‘ఎలాగూ నువ్వు మెరిట్ స్టూడెంటువు, నీకు రిజర్వేషన్ అక్కరలేదు కదా, పీజీ అసోసియేషన్ రిజర్వేషన్ వ్యతిరేకంగా తీర్మానం చెయ్య’ మంటూ ఒత్తిడి తెచ్చారు. నేను ససేమిరా అన్నాను. ‘రిజర్వేషన్ అనుకూలమా, వ్యతిరేకమా అనేది వ్యక్తిగత నిర్ణయం, వర్గ నిర్ణయం కానీ నా ఒక్కడి మెరిట్‌తో దానికి సంబంధం లేదు’ అని కచ్చితంగా చెప్పాను. ఆ సమయంలోనే నేనంటే బాగా నచ్చే ఒక మిత్రుడు నా పేరు నరసింహారెడ్డిగా మార్చుకుంటే వారి సమీప బంధువుల అమ్మాయిని ఇవ్వటానికి సిద్ధమని నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. నవ్వి, నర్సయ్యగా పుట్టాను, నర్సయ్యగా చస్తాను అన్నాను. నర్సయ్య పేరుకే ఒక బ్రాండ్ వాల్యూ తెస్తా అని మనసులో అనుకున్నాను.


చదువు తర్వాత ప్రభుత్వ డాక్టరుగా అమనగల్‍లో నా వైద్య జీవితం మొదలైంది. కొద్దిరోజులకే మంచి డాక్టరు అని పేరు తెచ్చుకున్న. హాస్పిటలుకు వచ్చిన ప్రతి పేషెంటు కొత్తలో నా దగ్గరకు వచ్చి డాక్టర్ నర్సయ్య కావాలని అడిగేవారు. నేనే అంటే, నమ్మక, మీరు కాదు పెద్ద డాక్టరు కావాలని అడిగేవారు. అంటే డాక్టర్ నర్సయ్య అంటే పెద్ద వయస్సు ఉన్నవాడన్నమాట.


నేను హైదరాబాదులో ప్రాక్టీసు మొదలుపెట్టిన తర్వాత లాపరోస్కోపీలో బాగా పేరుతెచ్చుకున్న. అప్పటికి కార్పొరేట్ హాస్పిటల్స్‌కి పరిమితమైన లాపరోస్కోపీ చాల ఖరీదైనది. కానీ నేను దాన్ని అతితక్కువ ధరకు మధ్యతరగతి వారికి అందుబాటులోకి తెచ్చాను. చాలమంది నన్ను పాపులర్ లాపరోస్కోపిక్ సర్జనుగా గుర్తించారు. కానీ ప్రముఖ వ్యక్తులు, ధనికులు రావటానికి సంకోచించేవారు. కారణం నా పేరులో బ్రాండ్ వాల్యూ లేకపోవడం. అదే నా పేరులో నరసింహారెడ్డి, నరసింహశాస్త్రి లేదా నరసింహరావు ఉండి ఉంటే ఇంకా ఎక్కువ పాపులర్ అయ్యేవాడిని. మన సమాజంలో ప్రతిభతో పాటు పేరుకు ఉన్న బ్రాండ్ వాల్యూ కూడా ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఈ మధ్య బీసీ కులాలు ప్రత్యేకించి రాజకీయాల్లో తమ కుల తోకను పెట్టుకోవడం చూస్తున్నాము. గౌడ్, యాదవ్, ముదిరాజు, నేత, పటేల్, రజక, ప్రజాపతి ఇలా ఎన్నో. ఆ వర్గాల్లో ఒక ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరగడమే దీనికి కారణం. కానీ అదే బీసీ కులాలు ఉద్యోగాల్లోను, వ్యాపారాల్లోను కులం పేరు దాచుకుంటున్నాయి. వారికి రాజకీయ అండదండలు లేనందున, రాజ్యాంగ రక్షణ లేనందున, నష్టపోతామనే భయమే అందుకు కారణం.


ఒక్క పేరు లేదా తోక కొన్ని కులాలను సంపూర్ణంగా మార్చాయి. ఉదాహరణకు 40–50 ఏండ్ల క్రితం రెడ్డి అనే తోక కేవలం కొందరికే ఉండేది. ముఖ్యంగా భూస్వాములు, దేశముఖ్‌లు, సంపన్నులు. గ్రామాల్లో ఉండేవారు, కాపుదనం మీద బ్రతికేవారి పేర్లు ఎల్లయ్య, రాంచంద్రయ్య, నర్సయ్య ఇలా ఉండేవి. కాలక్రమేణా కొందరి పెద్దల ప్రోద్బలంతో ఆ సామాజిక వర్గంలో రెడ్డి అనే తోక ఆనవాయితీగా మారింది. ఆ ఒక్క పేరు ఒక ఐక్యతకు, రాజకీయ విద్యా ఆర్థిక ప్రగతికి దోహదపడింది. అలానే కమ్మ వర్గంలో చౌదరి, బ్రాహ్మణ వర్గంలో శాస్త్రి, శర్మ లాంటి తోకలు ఆ వర్గాల ప్రగతికి ఎంతో దోహదపడ్డాయి. ఉత్తర భారతదేశంలో పలు బీసీ కులాల వారు వివక్షకు గురికాకుండా ఉండటానికి శాస్త్రి, శర్మ, ఠాకూర్, తివారి అనే తోకలు పెట్టుకుంటారు.


నేను డాక్టర్ వృత్తిలో ఉన్నప్పుడూ, తెలంగాణ ఉద్యమంలోనూ నా పేరు డాక్టర్ బూర నర్సయ్య మాత్రమే. కానీ కేసీఆర్ గారు నాకు ఎంపీగా పోటీచేసే అవకాశం ఇచ్చినప్పుడు, ‘డాక్టర్ గారూ మీరు మీ పేరులో గౌడ్ పెట్టుకోండి. రాజకీయాలలో ఉపయోగపడుతుంది’ అని సలహా ఇచ్చారు. కారణం వారికి ఈ అంశంలో పూర్తి అవగాహన ఉంది.


ఇందిరా గాంధీ అసలు పేరు ఇందిరా ప్రియదర్శిని. ఆమెకు ఫిరోజ్ జహంగీర్ ఘండీతో ప్రేమ వివాహం జరిగాక, నెహ్రూ ఒత్తిడి మేరకు, మహాత్మాగాంధీలోని ‘గాంధీ’ని ఇందిరకు జోడించి వారి రాజకీయ వారసత్వానికి పునాది వేశారు. అందుకు గాంధీజీ ఫిరోజ్‌ను దత్తు తీసుకుని ఆయన పేరును ఫిరోజ్ గాంధీగా మార్చారు. గాంధీ నెహ్రూల మధ్య రక్త సంబంధాలు కానీ, కులసంబంధాలు కానీ లేవు. కానీ ఒక్క గాంధీ అనే పేరు భారతదేశ రాజకీయాలను శాసిస్తుంది. గాంధీ అనే తోకకు బ్రాండ్ వాల్యూ ఉంది. ఇది నెహ్రూ ముందు చూపు.


తల్లిదండ్రులకు నా సూచన ఏమిటంటే– మీరు మీ పిల్లలకు పేరు పెట్టేటప్పుడు ఏదో ఒక పేరు పెట్టేయకుండా, మంచి శబ్ద బలం ఉన్న పేరు పెట్టండి. ప్రతిభతో పాటు పేరు కూడా అవకాశాలకు, అభివృద్ధికి దోహదపడుతుంది. కేసీఆర్ పేరు కేవలం కల్వకుంట్ల చంద్రశేఖర్ అని, నరేంద్ర మోదీ పేరు కేవలం నరేంద్ర అని, ఎన్టీ రామారావు పేరు కేవలం రాము అని ఉంటే అంత బ్రాండ్ వాల్యూ ఉండేది కాదు.


అసలు ఈ బ్రాండ్ వాల్యూ ఎలా వస్తుంది? ఒక కులం లేదా వర్గంలో ఉన్న వ్యక్తులు మహోన్నత వ్యక్తులుగా ఎదిగినప్పుడు, లేదా ఒక జాతిలో ఎక్కువమంది విద్య, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎదిగినప్పుడు, ఆ కులానికి లేదా వర్గానికి ఒక బ్రాండ్ వాల్యూ వస్తది. ఒక వర్గంలో ఒకరిద్దరు ఎదిగి చంకలు కొట్టుకోవడం కాదు. అత్యధిక మంది ప్రగతి సాధించినప్పుడే ఆ వర్గానికి, రాష్ట్రానికి లేదా దేశానికి బ్రాండ్ వాల్యూ వస్తది.

డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ 

మాజీ ఎంపీ, బోనగిరి

Updated Date - 2022-04-17T07:13:08+05:30 IST