మునుగోడులో మునిగేది ప్రజాస్వామ్యమే!

ABN , First Publish Date - 2022-08-18T11:54:13+05:30 IST

కెసిఆర్ వికారాబాద్‌లో మాట్లాడినా, మేడ్చల్‌లో మాట్లాడినా, మునుగోడు కోసం మాట్లాడినట్లే ఉంటోంది. ఎవరో చెప్పిన మాటలు విని మోసపోతే గోసపడతారని, ఆదమరిస్తే నష్టపోతారని...

మునుగోడులో మునిగేది ప్రజాస్వామ్యమే!

కెసిఆర్ వికారాబాద్‌లో మాట్లాడినా, మేడ్చల్‌లో మాట్లాడినా, మునుగోడు కోసం మాట్లాడినట్లే ఉంటోంది. ఎవరో చెప్పిన మాటలు విని మోసపోతే గోసపడతారని, ఆదమరిస్తే నష్టపోతారని, ఆలోచన లేకపోతే దెబ్బతింటారని ప్రజలను హెచ్చరిస్తున్నారు. మతం పేరుతో కులం పేరుతో దేశాన్ని ముక్కలు చేయాలని చూసేవాళ్లు ఉన్నారని వారి వల్ల ప్రమాదం ఉన్నదని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితి మీద ప్రతి గ్రామంలో, బస్తీలో చర్చ జరగాలని పిలుపునిస్తున్నారు. ఎవరో ఏవో తప్పుడు మాటలు చెబుతారని నర్మగర్భంగా అంటున్నారు కానీ, ఆ ఎవరు ఎవరో చెప్పడానికి ఆయనకు దాపరికం లేదు. వికారాబాద్ సభలో చెప్పనేచెప్పారు, మోదీయే ప్రధానశత్రువు అని!


కొద్దికాలంగా ప్రధానమంత్రి మీదా, ఆయన పార్టీ మీదా కెసిఆర్ నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ తనకు ఏకైక ప్రత్యర్థిగా నిలబడకుండా, వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసమని ఆయన అట్లా బిజెపిపై గురిపెడుతున్నారని మొదట అనుకున్నారు. ఈ వైఖరి నమ్మదగినది కాదని, లోపాయికారీగా జాతీయ అధికారపార్టీతో అనుబంధం ఉన్నదని కూడా అనుమానించారు. కేవలం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందన్న కారణం చేతనో, మతతత్వాన్ని పెంచిపోషిస్తోందనో బిజెపితో వైరం పెట్టుకున్నారని మాత్రం పెద్దగా ఎవరూ నమ్మలేదు. ఎందువల్ల ఆ వ్యతిరేకత మొదలయినా, మునుగోడు పరిణామంతో, కెసిఆర్ ఇక అదే వైఖరిలో పూర్తిగా కూరుకుపోక తప్పనిసరిస్థితి ఏర్పడింది. వ్యతిరేక ఓట్లను చీల్చడం అనే లక్ష్యం పోయి, తానూ బీజేపీ అనే ముఖాముఖీ పోటీకే ఆయన సిద్ధపడిపోయారు.


మరి కాంగ్రెస్ ఏమవుతుంది? మహా అయితే మునుగోడు ఫలితం ప్రతికూలంగా వస్తే పీసీసీ అధ్యక్షుడి పదవికి గండం రావచ్చునుకానీ, టిఆర్ఎస్ విషయంలో మునుగోడు ఓటమి పదోనెంబర్ ప్రమాద సూచిక అవుతుంది. బిజెపి రథయాత్రకు ఇక పగ్గాలుండవు. అందుకే, ఇది కెసిఆర్‌కు అనివార్యంగా ఉనికి పోరాటంగా మారిపోతోంది. తనకు గడ్డురోజులు వచ్చే అవకాశం ఉన్నదన్న గుర్తింపు లేకపోతే, మోసపోతారు జాగ్రత్త అంటూ జనాన్ని హెచ్చరించరు. మేధావులు బుద్ధిజీవులు తెలంగాణను రక్షించుకోవాలంటూ పిలుపులివ్వరు.


మంచీ చెడ్డా మాట్లాడే వాతావరణం రాష్ట్రంలో ఉండి ఉంటే, ఇటువంటి సందర్భంలో మేధావులు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక శాసనసభ్యుడు, తన పార్టీ నాయకత్వం మీద నిరసనతో రాజీనామా చేస్తే, టిఆర్ఎస్ ప్రభుత్వానికి దాన్ని సవాల్‌గా చెబుతున్నారు. విచిత్రమైన సన్నివేశం! ఎవరి వాదనల్లో ఎంత హేతువు ఉన్నదన్నది పక్కన పెడితే, ఒక ఉపఎన్నిక, రాష్ట్రంలో రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేసి, పెద్దగా ప్రజల ప్రమేయం లేకుండానే, పెద్దగా పునాదీ నిర్మాణమూ లేని జాతీయ పార్టీకి అనుకూలతను సృష్టించబోతోంది! ఆ పార్టీ, తెలంగాణలో తనకు పరిమితంగా మాత్రమే బలం ఉన్నప్పటికీ, ఫిరాయింపుల సహాయంతో అధికారం చేజిక్కించుకోవచ్చునని వ్యూహరచన చేస్తున్నది. అందుకు ఉప ఎన్నికను వాడుకుంటున్నది! ఈ ఎన్నికలకు అయ్యే నిర్వహణ ఖర్చు, ఎన్నికలలో ప్రవహించే వేలకోట్ల ధనం అంతిమంగా ఎవరు భరిస్తారు? ఉప ఎన్నిక వస్తే, పథకాలు వస్తాయి, ఓట్లకు బదులుగా వేలకు వేలు డబ్బు వస్తుంది అని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల ప్రజలూ ఆశపడే పరిస్థితి వచ్చింది! అసలు ఈ ఆయారామ్ గయారామ్‌లకు ఏవైనా సిద్ధాంతాలో ఆదర్శాలో ఉన్నాయా? రాజీనామాలు లేకుండానే ఇతర పార్టీల శాసనసభ్యులను, ఎంపీలను ఫిరాయించుకున్నందుకు కెసిఆరే బోనులో నిలబడాలి కనుక, ఆయన ఈ విషయంలో ఏమీ మాట్లాడలేరు. అలాగని, పార్టీ ఫిరాయిస్తూ రాజీనామా చేసినంత మాత్రాన, అది నైతిక, ప్రజాస్వామిక చర్య కానక్కరలేదు. మునుగోడు ఫిరాయింపు అనేక భవిష్యత్ ఫిరాయింపులకు జరుగుతున్న సన్నాహం అని మరచిపోకూడదు. వారు గెలిచినా వీరు గెలిచినా విధానం కాదు గెలిచేది, ధనమే!


మొత్తం మీద ఇందులో గొప్ప ప్రజాస్వామిక అంశ లేదని చెప్పడానికి మేధావులు కానక్కరలేదు. ఎందుకు ఎవరూ చెప్పడం లేదంటే, పాలక పార్టీ కూడా తనను తాను నిలుపుకోవడానికి, ప్రతిపక్షం మీద గెలవడానికి పెద్దగా మెరుగైన పద్ధతులు అనుసరించడం లేదు మరి! బిజెపి ఈడీని ఉపయోగిస్తే, కెసిఆర్ పోలీసులను ప్రయోగిస్తారు! వరద ప్రాంతాలను చూడడానికయినా, ప్రాజెక్టులను పరిశీలించడానికయినా ప్రతిపక్షాల వారికి అనుమతులు ఉండవు. ఇక మునుగోడులో పోటాపోటీగా జరిగేవి, ఫిరాయింపులే! వాటికే, బిజెపి ‘చేరికలు’ అని ముద్దుపేరు పెట్టి, దానికో కమిటీ వేసి, కొందరు నాయకులకు ఆ బాధ్యత ఇచ్చింది. కెసిఆర్ సభలో ఎందరు చేరతారు, అమిత్ షా సభలో ఎందరు చేరతారు? మీడియాలో ఇవే కథనాలు! టిఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ చేరికలు, బిజెపిలోకి టిఆర్ఎస్, కాంగ్రెస్ చేరికలు! ఎడాపెడా చేర్చుకోబడేది కాంగ్రెస్ వారే!


ఈ సందర్భంగా ఒక ధర్మసందేహం రావాలి! ఒకప్పుడు సిపిఐ, కాంగ్రెస్ సీటు అయిన మునుగోడును 2014లో టిఆర్ఎస్ గెలుచుకుంది నిజమే. 2018లో అది కాంగ్రెస్ చేతిలోకి వెళ్లింది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇప్పుడు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి బిజెపి తరఫున అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. లెక్క ప్రకారం చూస్తే, మొదటగా, వేరే పార్టీ నుంచి పోటీ చేసి కూడా ప్రజల విశ్వాసాన్ని గెలవవలసిన బాధ్యత రాజగోపాలరెడ్డిది. తన సిటింగ్ అభ్యర్థి నిష్క్రమణ తరువాత కూడా ఆ స్థానంపై తన పట్టును నిలుపుకోవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అధికారంలో ఉన్న పార్టీగా ఉప ఎన్నికను తప్పనిసరిగా గెలవడమో, ఒకనాడు తన చేతిలో ఉన్న స్థానాన్ని తిరిగి చేజిక్కించుకోవడమో టిఆర్ఎస్‌కు నైతిక, రాజకీయ అవసరమై ఉండవచ్చును కానీ, తప్పనిసరిగా నెరవేర్చవలసిన సవాల్ కాదు. కానీ, రాజగోపాలరెడ్డి ఉదంతం కాంగ్రెస్పైకాక, టిఆర్ఎస్‌పై గురిపెట్టింది. అయినా, స్వీకరించనక్కరలేదు, మొత్తం వ్యవహారాన్ని తక్కువ చేసి ఉండవచ్చు, మా సిటింగ్ సీటు కాదు, అయినా హుజూర్‌నగర్ లాగా గెలవడానికి ప్రయత్నిస్తాం అని యథాలాపపు సమాధానం ఇచ్చి ఉండవచ్చు. కెసిఆర్ అట్లా చేయలేదు. హడావుడి చేయవద్దని సహచరులకు చెప్పినట్టు మొదట వార్తలొచ్చాయి కానీ, తరువాత ఆయనే హడావుడి మొదలుపెట్టారు. సవాళ్లు తీసుకోవడం కూడా ఒక వ్యసనం. ఇప్పుడిక యుద్ధరంగం సిద్ధమయింది.


కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లను, ఎవరో కొద్దిమందిని తప్ప, చాలామందిని కొనవచ్చునని కెసిఆర్ మునుపే నిరూపించారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ ఎవరైనా సరే తమ ఖాతాలో వేసుకోగలమని బిజెపి ధీమాగా ఉన్నది. పైగా, ఈటల రాజేందర్‌ను తరిమినట్టు తరిమి, తనవారిని బిజెపి శిబిరంలోకి నెట్టడంలో కెసిఆర్ దిట్ట. ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే కాదు, ప్రజాజీవితంలో ఉంటున్న పార్టీ నాయకులెవరైనా, లాభాల కోసం పదవుల కోసం ఫిరాయించడం అన్యాయం. దురదృష్టవశాత్తూ, తెలంగాణ రాజకీయవాదులలో అనేకులు ఏ సిద్ధాంతమూ లేకుండా పాదరసంలాగా ప్రవహించేవాళ్లు. తెలంగాణ ఉద్యమం ఈ రాష్ట్రాన్ని రాజకీయంగా ఎంతో చైతన్యీకరించిందని, నైతికంగాఎంతో ఉన్నతీకరించిందని భావించే వాళ్లు ఎవరైనా ఉంటే, వాళ్లు చాలా ఆశాభంగం చెందవలసిన వాస్తవికత ఇది! కమ్యూనిస్టులూ మజ్లిస్ వారూ అమ్ముడుపోవడంలో ఆరితేరినవాళ్లని బండి సంజయ్ అంటున్నారు. బిజెపి వారికి తెలంగాణలో ఒక షిండే దొరికితే, మజ్లిస్ కెసిఆర్‌తోనే ఉంటుందని చెప్పగలమా? 


మునుగోడులో ఒకవేళ బిజెపి గెలిస్తే, జాతీయస్థాయి అధికారమూ రాష్ట్రంలో చేరికలూ కలసి, ఉనికి లేని చోట కూడా ఉధృతమైన విజయాలను ఇస్తాయని చేస్తున్న ఊహలు మరీ అంత అసాధ్యమైనవేవీ కావు. ఈ ప్రమాదాన్ని చాలా ముందే కెసిఆర్ గుర్తించారా? పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులతో కలసి ప్రభుత్వ వ్యతిరేక కార్యాచరణలో పాల్గొనమని సూచించినప్పుడే, ఒక సుదూర సంభావ్యతకు తెరలేపారా? తన విమర్శలలో కాంగ్రెస్ మీద కనికరం చూపడంలో ఏమైనా మతలబు ఉన్నదా? జాతీయగీతాలాపనకు నెహ్రూ విగ్రహాన్ని వేదిక చేసుకోవడంలో కాంగ్రెస్‌కు సందేశం పంపిస్తున్నారా? రాష్ట్రం బాగుపడాలంటే, కేంద్రంలో మంచి ప్రభుత్వం ఉండాలని పదే పదే అంటున్న మాటల వెనుక, అంతరార్థం ఏమిటో?


గోవు లాంటి కాంగ్రెస్‌ను చంపి, పులి లాంటి బిజెపిని మీదికి తెచ్చుకున్నాడని కెసిఆర్ గురించి రాజగోపాలరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు దేశానికీ, తనకీ ఎదురవుతున్న ప్రమాదం గురించి కలవరం చెందుతున్న కెసిఆర్, ఈ పరిణామంలో స్వయంకృతం ఉన్నదని తెలుసుకున్నారో లేదో? ప్రజాస్వామ్యాన్ని పార్టీలూ ప్రభుత్వాలూ రక్షిస్తే, ప్రజాస్వామ్యం వాటిని రక్షిస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించి, కెసిఆర్ తన వైఖరులను, వ్యవహార సరళిని మార్చుకుంటే, మునుగోడులో కానీ, ఆ తరువాత కానీ రాజకీయ అలజడులను తట్టుకునే స్థైర్యం కలగవచ్చు. తన పార్టీని ఎంత బలంగా స్థిరంగా నిలుపుకుంటారన్నదే ఇక నుంచి ఆయన ప్రయాణంలో ముఖ్యమైన భాగం. బంగారు, వజ్రాల తెలంగాణ బృందంలో తనతో నిలబడేవారెవరో, జారుకునేవారెవరో గ్రహించి జాగ్రత్తపడితే, నిజమైన నమ్మకమైన సహచరులను గౌరవించి విశ్వాసం కలిగించగలిగితే, చేరికల కమిటీలకు పెద్ద పని ఉండదు!


కె. శ్రీనివాస్

Updated Date - 2022-08-18T11:54:13+05:30 IST