‘ప్రజాబడ్జెట్‌’కు మరెంతో చేయాలి!

ABN , First Publish Date - 2022-03-18T06:22:18+05:30 IST

రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెడుతూ చేసిన ప్రసంగంలో– బడ్జెట్‌ అంటే అంకెల సముదాయం కాదు; ప్రజల ఆశల ఆకాంక్షల వ్యక్తీకరణ అని పేర్కొన్నారు....

‘ప్రజాబడ్జెట్‌’కు మరెంతో చేయాలి!

రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెడుతూ చేసిన ప్రసంగంలో– బడ్జెట్‌ అంటే అంకెల సముదాయం కాదు; ప్రజల ఆశల ఆకాంక్షల వ్యక్తీకరణ అని పేర్కొన్నారు. కానీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకూ చేరుతున్నాయా అనే అంశంపై సమగ్ర విశ్లేషణ చేసినప్పుడు అందుకు మరిన్ని చర్యలు అవసరమని తెలుస్తుంది. మున్ముందు బడ్జెట్ కూర్పుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలను తీసుకొని వెళ్ళవచ్చు.  


ముందుగా పేదరికాన్ని పరిగణనలోకి తీసుకుంటే– నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 13.74శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. రంగరాజన్‌ కమిటీ సూచనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ.32లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.33లోపు ఆదాయం ఉన్నవారిని పేదలుగా గుర్తిస్తున్నారు. అంటే రోజుకు ఆదాయం రూ.33 పైన ఉంటే వారు పేదల శ్రేణిలోకి రారన్నమాట! తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి అవాస్తవిక, హాస్యాస్పద లెక్కల జోలికి వెళ్ళకుండా బడ్జెట్టును తయారుచేసుకొనివుంటే అది వాస్తవానికి దగ్గరగా ఉండేది. పేదరిక నిర్మూలనలో భాగంగా శ్రద్ధ పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి: గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాలను 100 నుంచి 200రోజులకు పెంచాలి. పట్టణాల్లోని పేదల కోసం కూడా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలి. రేషన్‌ కార్డులు అర్హులందరికీ ఇవ్వాలి. వృద్ధాప్య పెన్షన్లు, భార్యాభర్తలు ఇరువురికీ ఇవ్వాలి. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను రెట్టింపు చేస్తే వృద్ధుల జీవితాలకు భరోసా ఉంటుంది. ప్రస్తుత బడ్జెట్‌లో వృద్ధాప్య పెన్షన్లకు రూ.11,728కోట్లు కేటాయించారు. భవిష్యత్తు బడ్జెట్లలో అయినా దీన్ని రెట్టింపు చేస్తే పేదరికం తగ్గింపులో గణనీయమైన ప్రగతి సాధించవచ్చు.


వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని మరో రకంగా మారిస్తే ఉభయతారకంగా ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం కోటిమంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. అందులో 50లక్షల మంది వ్యవసాయ కూలీలు, మిగిలిన 50లక్షల మందిలో భవన నిర్మాణ, బీడీ, చేనేత, ఫిషింగ్, గీత తదితర వృత్తులవారు ఉన్నారు. వీరుగాక కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌, హోమ్‌ గార్డులు, అంగన్‌వాడీ వర్కర్స్‌, విద్యావాలంటీర్స్‌, మిడ్ డే మీల్ వర్కర్స్‌, కాంట్రాక్టు లెక్చరర్స్‌, టీచర్స్‌, హమాలీ, వీధి వ్యాపారులు, ఆటోలు క్యాబ్స్ నడిపేవారు... ఇలా మరో 50లక్షలమంది ఉంటారు. వీరందరికీ ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే ప్రావిడెంటు ఫండ్‌ను ప్రభుత్వంగాని, వారి యజమాన్యాలుగాని సమకూర్చినట్లయితే 61ఏళ్ల తర్వాత వారికి కూడా, వారికి వచ్చే వేతనాన్ని బట్టి నెలకు బతికున్నంత వరకు రూ.10వేలకు పైగా పెన్షన్ లభిస్తుంది. పెన్షన్‌ సౌకర్యం పొందినవారికి వృద్ధాప్య పెన్షన్‌ అవసరం ఉండదు.


ఇప్పటివరకు రైతాంగానికి, ఇక నుంచి చేనేత వర్గానికి 57ఏళ్ల లోపు వయస్సున్నవారికి రూ.5లక్షల జీవిత బీమా కల్పిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకు రూ.6లక్షల ప్రమాద బీమా ఇస్తున్నారు. ఇదే నమూనాలో మొత్తం రాష్ట్రంలోని 1.5కోట్ల అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కార్మికులు, స్కీమ్‌ వర్కర్స్‌కు గ్రూప్‌ ఇన్సూరెన్సు కింద ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రూ.5లక్షల బీమా పథకాన్ని వర్తింపచేయవచ్చును. ప్రీమియంకు ప్రభుత్వానికి నిధులు పెద్దగా అవసరపడవు. 


మన వ్యవస్థలో పేదరికానికి ప్రధాన కారణం విద్యా, వైద్యం వంటి అంశాలు. ఆరోగ్యశాఖకు తాజా బడ్జెట్టులో రూ.11.237కోట్లు కేటాయించారు. ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పించినా ప్రభుత్వ వైద్యరంగ ప్రమాణాలు, నిర్వహణ సామర్థ్యం పెరగటం ముఖ్యం. ఆరోగ్యశ్రీలో భాగంగా ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి గరిష్ఠ పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచడం శుభపరిణామమే. కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి ప్రాణాంతకమైన జబ్బు ఉన్నప్పుడు పూర్తి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తే పేదవారికి కొండంత భరోసా లభిస్తుంది.


విద్యారంగంలో ‘మన ఊరు–మన బడి’ కింద రూ.7,289కోట్లు కేటాయించి మూడేళ్లల్లో ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు 20శాతం ఉండాలనే సాధారణ డిమాండు ఉన్నప్పటికి 6.2శాతం మాత్రమే కేటాయించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలంటే 12వ తరగతి వరకు కామన్‌ విద్యావిధానం ప్రవేశపెట్టాలి. 12వ తరగతి వరకు ప్రతి ఒక్కరికి ఉచిత విద్యా సౌకర్యం కల్పించాలి.


వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖల కింద ప్రస్తుత బడ్జెట్‌లో రూ.24,254కోట్లు కేటాయించారు. ఇందులో రైతుబంధు పథకానికి రూ.14,800కోట్లు,  రైతు బీమాకు రూ.1,466కోట్లు కేటాయించారు. రైతుబంధు పథకం నుంచి భూస్వాములను, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను మినహాయించాలి. పంటల బీమా పథకం అత్యంత లోపభూయిష్టంగా ఉన్నది. ఈ పథకం రైతుల ప్రయోజనాలను కాపాడేవిధంగా ఇన్సూరెన్సు కంపెనీలతో మాట్లాడి నియమ నిబంధనలు మార్చాలి. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాల నేపథ్యంలో రైతుల పంటల కొనుగోలు బాధ్యతను పూర్తిగా వదిలివేసింది. ఆ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై పడినట్లుగా ఉన్నది. అందువల్లనే ‘మార్కెట్‌ జోక్య నిధి’కి గత బడ్జెట్‌లో రూ.500కోట్లు ఇవ్వగా ఈ ఏడాది రూ.100కోట్లు మాత్రమే కేటాయించారు. రాష్ట్రంలో దాదాపు 18లక్షలమంది కౌలురైతులకు రైతు బీమా, రైతు బంధు, ఋణాలు లేవు. దాదాపు 1.25కోట్ల ఎకరాల భూమిని సాగుచేస్తున్న కౌలు రైతులకు న్యాయం చేయకపోతే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమే. 


ముఖ్యమంత్రి 91వేల ఉద్యోగాల భర్తీని, క్రమబద్ధీకరణను ప్రకటించటం ఊరటనిచ్చే విషయం. కానీ ఇంకా సుమారు 20లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వారికి స్కిల్‌ డెవలప్మెంటు కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో నియామకాలు జరిగేలా ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకోవాలి. అప్పటివరకు నిరుద్యోగభృతి రూ.3,016కు బదులు రూ.5వేలకు పెంచి చెల్లించాలి.


2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 3శాతం మంది ప్రజలకు స్వంత ఇళ్లు లేవు. గతంలో వాగ్దానం చేసిన విధంగా స్వంత జాగాలో ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలి. స్వంత స్థలం లేనివారికి ప్రభుత్వమే గతంలోలాగా భూముల్ని కొని ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలి.


రాష్ట్రంలో దళితబంధు పథకానికి 13లక్షల కుటుంబాలకు అర్హత ఉంది. అదేవిధంగా మైనార్టీలు, గిరిజనుల్లో వేలాది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం గతంలో ప్రకటించిన దళితులకు మూడెకరాల భూమి పథకం నీరుగారిపోయింది. దానిని దృష్టిలోపెట్టుకొని దళితబంధులాగానే ఆయా వర్గాల్లోని నిరుపేదలకు ప్రత్యక్షంగా ఆర్థిక సాయాన్ని అందించాలి. 


ఈ విధంగా అన్ని వర్గాలవారికి, చివరి వ్యక్తి వరకు, ప్రయోజనం చేకూరాలంటే భారీ నిధులు కావాలి. రాష్ట్రం కొత్తగా చేయబోయే రూ.59వేల కోట్ల ఋణంతో కలిపితే మొత్తం అప్పు రూ.3.29లక్షల కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుల ఋణాలతో కలిపి రాష్ట్ర ఋణం మొత్తం దాదాపు రూ.4.75లక్షల కోట్లు అవుతుంది. ఈ స్థితిలో నిధుల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి, కేంద్రం ద్వారా సంపద పన్ను, స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారం తదితర అదనపు వనరుల సమీకరణ, ఆదాయం పెంపుదలకు మార్గాలపై వివిధ వర్గాల ఆర్థికవేత్తలతో చర్చించి సరైన దిశగా నడవాల్సి ఉంటుంది.

కూనంనేని సాంబశివరావు

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి

Updated Date - 2022-03-18T06:22:18+05:30 IST