పార్టీ చింత సరే, ప్రత్యామ్నాయ ‘చింతన్’ చేయండి

ABN , First Publish Date - 2022-05-19T06:00:27+05:30 IST

ప్రాంతీయ పార్టీ అయితే నేమి, ఒక్కడే అయితేనేమి ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పనకు సిద్ధం అయ్యారు కెసిఆర్.

పార్టీ చింత సరే, ప్రత్యామ్నాయ ‘చింతన్’ చేయండి

ప్రాంతీయ పార్టీ అయితే నేమి, ఒక్కడే అయితేనేమి ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పనకు సిద్ధం అయ్యారు కెసిఆర్. నీటి పారుదలకు, ఆర్థికరంగానికి, విద్యావైద్యాలకు ఈయన చెప్పే కొత్త తారకమంత్రాలను ఎవరు ఆలకిస్తారు, ఎందరు ఆదరిస్తారు, ఏ పార్టీలు జట్టుకడతాయి అన్న ప్రశ్నలు రావడం సహజం. కెసిఆర్ విషయంలో మరింత సహజం. జనాభిమానం ఎంత ఉన్నా విశ్వసనీయత అంతంత మాత్రంగానే ఉండే నాయకుడాయన. బిజెపి మీద ఎంతగా భగ్గుమంటున్నా, పాపం, ఇంకా వెటకారాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆయన నిబద్ధత ఏమయినప్పటికీ, దేశానికి కావలసింది ప్రత్యామ్నాయ ఫ్రంటూ తృతీయ ఫ్రంటూ కాదని, ప్రత్యామ్నాయ ఎజెండా అని గుర్తించినందుకు మాత్రం ఆయనను మెచ్చుకోవచ్చు. సమీకరణాలూ, కూటముల నిర్మాణాలూ బాహుబలి వంటి భారతీయ జనతాపార్టీకి పోటీ ఇవ్వలేవని ఆయన అనుకోవడంలో సొంత సమస్యలు ఉండవచ్చు కానీ, అందులో కొంత సత్యం లేకపోలేదు. శుష్కమైన ప్రతిపక్ష ఐక్యతా ప్రయత్నాల వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్నది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు. ఒక సాంస్కృతిక, సామాజిక శక్తి కూడా. అధికారాన్ని నిలుపుకోవడానికి, విస్తరించుకోవడానికి బిజెపి ఝళిపిస్తున్న ఆ మహా ఆయుధానికి విరుగుడు అస్త్రం కావాలి. పోటీ ఎజెండా కావాలి. అప్పుడు మాత్రమే ఐక్యత సార్థకమవుతుంది.


విడతలు విడతలుగా రానున్న పది అసెంబ్లీల ఎన్నికలలోను, ఆ తరువాత సాధారణ ఎన్నికలలోను భారతీయ జనతాపార్టీ ఓడిపోవాలని కానీ, బలహీనపడాలని కానీ ఎవరైనా ఎందుకు కోరుకోవాలి? అకారణంగా ఎవరూ అట్లా కోరుకోనక్కరలేదు. ఒక పార్టీగా బిజెపి గెలుపు ఓటములు పెద్దగా చర్చించదగ్గవి కాకపోవచ్చు. పరిపాలన, ప్రజల హక్కులు, సహజీవన విలువలు, ఆర్థికవిధానాలు వంటివి మాత్రం పట్టించుకోదగ్గవి. గత ఎనిమిదేళ్లుగా భారతదేశంలో ప్రతిపక్షం అత్యంత దీనస్థితిలో ఉన్నది. ప్రజల పక్షం నుంచి మాట్లాడవలసిన వ్యవస్థలన్నీ అతి బలహీనంగా మారిపోయాయి. ప్రజా ఉద్యమకారులంతా జైలు నిర్బంధంలోనో, అణచివేతలోనో ఉన్నారు. న్యాయస్థానాలు అప్పుడప్పుడు కల్పించుకుని చేసే న్యాయాలు, ఉపశమనాలు తప్ప, తక్కిన మార్గాలన్నీ దౌర్జన్యంతోనో, ప్రలోభాలతోనో మూసుకుపోయాయి. అసాధారణమైన జనామోదాల వల్ల లభించిన అపారమైన అధికారాన్ని సమతుల్యతలో నిగ్రహించగలిగే పరిస్థితి కావాలి. ప్రజావ్యతిరేకత పెరిగిపోయి, ఎన్నికలలో ప్రభుత్వాలు ఓడిపోవడం ప్రజాస్వామ్యంలో సహజం. అది ప్రజల సంకల్ప తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. కనీసంగా, ప్రభుత్వానికి విశృంఖలాధికారాన్ని తగ్గించగలిగే విధంగా ఎన్నికల ఫలితాన్ని కోరుకోవడం ప్రజాస్వామిక విజ్ఞత. వరుసగా రెండుసార్లు దేశాన్ని పాలించిన ప్రభుత్వానికి మూడోసారి కూడా అనుమతి లభిస్తే, సమతూకం కొరవడిన అధికారంలో పాలన ఏ స్థాయికి వెడుతుంది అన్న ఆందోళన కలగడం సహజం.


దేశంలో గత ఎనిమిదేళ్లలో మతతత్వం తీవ్రస్థాయికి చేరిందని, సమాజంలో ద్వేషం, విభజన విపరీతంగా పెరిగాయని బిజెపి విమర్శకులు అంటుంటారు. గతంలో ఆ పార్టీ జాతీయ స్థాయిలోను, అనేక రాష్ట్రాలలోను అధికారంలో ఉన్నప్పుడు, ఇంతటి తీవ్ర విమర్శకు ఆస్కారం ఉండేది కాదు. పైగా, బిజెపి కేంద్రంలో అధికారంలో ఉంటే పాకిస్థాన్‌తో సత్సంబంధాలు ఉంటాయని, రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే మతకలహాలు జరగవని ఒక పేరుండేది. అప్పట్లో ఆ పార్టీ తన పూర్తి అజెండాను అమలులో పెట్టలేదని, 2014 తరువాతనే పూర్తిస్థాయి విజృంభణ మొదలయిందని విశ్లేషకులు చెబుతారు. ఎనిమిదేళ్ల కిందట మొదలయిన ప్రయాణం ఇప్పుడు ఏ స్థాయికి చేరిందంటే, ప్రభుత్వ వ్యవస్థ ఇప్పుడు ఏమాత్రం తటస్థతతో లేదు. ఇరవయ్యేళ్ల కిందట గుజరాత్‌లో జరిగిన హింసాకాండ సందర్భంలో ప్రభుత్వ తటస్థత ప్రశ్నార్థకమయింది. అది ఇప్పుడు జాతీయస్థాయికి విస్తరించింది. సమాజంలో రెండు వర్గాల మధ్య వైముఖ్యం, వైరభావం పెరిగిపోతున్నాయనుకోండి, ఒకరి మతాచారాలను మరొకరు బాధించడంతో పాటు, జీవనాధారాలను కూడా లక్ష్యంగా పెట్టుకునే స్థితి వచ్చిందనుకోండి, అప్పుడు ప్రభుత్వం ఏమి చేయాలి? ఆ వాతావరణాన్ని చక్కదిద్దే పనిచేయాలి. ఆ రెండు జన సమూహాల మధ్య సంభాషణకు, సామరస్యానికి అవకాశం ఇవ్వాలి. అట్లా కాక, ప్రభుత్వం ఒక పక్షం తీసుకుని, ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా పక్షపాత న్యాయానికి వాడుకుంటే, దానిని ఏమి పరిపాలన అనగలము? దీన్ని ప్రశ్నించేవారు లేకపోతే, ప్రశ్నించినా ఫలితం దక్కకపోతే, న్యాయం అన్నిసార్లూ తక్షణస్పందనలు ఇవ్వకపోతే, ఆ నిస్సహాయతను, అందులోని నిశ్శబ్ద ఉద్రిక్తతను ఏ సమాజమైనా ఎంతకాలం భరించగలదు? ఇదంతా ఇంత యథేచ్ఛగా సాగడానికి కారణం, ఏకపక్ష రాజకీయాధికారమే కదా?


ప్రతిపక్షం నామమాత్రం కావడం ప్రజల తప్పేమీ కాదు. మునుపటి అధికారపక్షం స్వయంకృతం. అడుగంటిపోయిన రాజకీయ నైతికత, మతతత్వంతో సహా సమస్త చెడుగులతోనూ రాజీపడిపోయిన అవకాశవాదం. ఒక తార్కికమైన వాదన కానీ, ఒక నమ్మదగిన ఆశ కానీ లేని దుస్థితిలోకి కాంగ్రెస్ జారిపోయింది. కాంగ్రెస్‌తో పాటు, ఉదారవాదులను, హేతువాదులను, సామ్యవాదులను, చివరకు విప్లవవాదులను కూడా కట్టగట్టి ఒకే శత్రుకూటమిగా కొత్త కథనాన్ని రచించాయి బిజెపి, దాని నేపథ్యసంఘమూ. వీరందరినీ భారతదేశ శత్రువులు, చైనా తొత్తులు, ఔరంగజేబు ఆరాధకులు అని నిర్ధారించి, సామాజిక మాధ్యమాల కోటానుకోట్ల గొంతులలో చాటింపు వేశారు, వేస్తున్నారు. సంస్థలూ వ్యక్తులూ సమస్థ ప్రతిపక్షాలూ అన్నీ ప్రతివాదన ఏదో తెలియని అయోమయంలోకి పడిపోయాయి. తమకు అలవాటయిన వాదనలన్నీ తమకే పీలగా బేలగా వినిపిస్తుండడంతో మరింతగా కుంగిపోయాయి.


‘చింతా కరో, చింతన్ నహీ’ అన్నాడు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతూ సునీల్ జాకఢ్. ఇప్పుడీ మేథోమథనం ఎందుకు, భవిష్యత్తు గురించి కలవరపడండి ముందు అన్నది ఆయన హితవు. కాంగ్రెస్ గురించి తలచుకున్నప్పుడు మొదట కలిగే సందేహం, అసలు ఆ పార్టీకి తాను అంతరించిపోతున్నానని తెలుసునా? తన భవిష్యత్తు గురించి తనకు ఏ మాత్రమైనా భయమున్నదా? పోనీ, గతంలో ఎప్పుడన్నా ఆ పార్టీ దేశానికి అవసరమైందో లేదో కానీ, ఇప్పుడు దేశంలో విస్తరించిన వడగాలి ఉక్కబోతలో, కాంగ్రెస్ పునరుత్థానం ఒక అవసరంగా కనిపిస్తోందని ఎరుక ఉన్నదా? కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని ప్రాంతీయ పార్టీలూ, ప్రాంతీయపార్టీలు కులాల కుంపట్లు అని రాహుల్ గాంధీ నిందించుకోవచ్చును కానీ, ఒకే దేశం, ఒకే పార్టీ నినాదంలో ప్రాంతీయ పార్టీలకయినా, కాంగ్రెస్‌కయినా చోటెక్కడ? వైవిధ్యం, బాహుళ్యం మిగిలితే కదా, ప్రాంతీయ, సామాజిక, భాషా, సాంస్కృతిక ప్రాతినిధ్యాలు‌‌! చివరకు తప్పేదేముంది అనుకుని, చింతనా శిబిరంలో ఏదో కార్యాచరణ, ఏవేవో వైఖరులు ప్రకటించారు కానీ, విభజన ఎజెండాకు కాంగ్రెస్ వద్ద ప్రత్యామ్నాయం ఏది? ఏది ప్రత్యామ్నాయ ఎజెండా?


మతతత్వం కానీ, మరే విభజన కానీ, భావాలుగా వ్యాపిస్తున్నప్పుడు, వాటి సంవాదంలోనే మొదట సమస్య ఏర్పడుతుంది. పరమ అజ్ఞానంతోనో, మూర్ఖత్వంతోనో, ఆవేశంతోనో ఒక వ్యాఖ్య ముందుకు వస్తుంది. దానికి సమాధానం చెప్పడం అనివార్యమై, ఆ పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఎంతగా చర్చ జరిగితే, మన సమాజంలో అంతగా సమీకరణ జరుగుతుంది అంటూ మితవాద మేధావి మిత్రుడొకరు తమ అవగాహనను వివరించారు. ఎజెండాను ఎవరు నిర్ణయిస్తారు, ఎవరు కొనసాగిస్తారు, ఎవరు ప్రతిపాదకులు, ఎవరు ప్రతిస్పందన ఇచ్చేవారు అన్నవి రాజకీయ సంవాదంలో కీలకమయిన అంశాలని, తమ మీద విసిరే ఉచ్చులను సెక్యులరిస్టులు ప్రేమగా బిగించుకుంటారని ఆ మిత్రుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడు అయోధ్యతో ఒక ఘట్టం ముగిసింది, ఇక శాంతే అని చాలామంది ఆశించారు కానీ, అది మధుర, కాశీ, తాజ్‌మహల్, కుతుబ్ మినార్ అట్లా వివాదం విస్తరిస్తూనే ఉన్నది. జనవర్గాల మధ్య దూరాన్ని పెంచే పరిణామాలేవో జరుగుతూనే ఉన్నాయి. వాటిని విస్మరించగలమా? అట్లాగని, వాటినే ప్రధాన ఎజెండాగా మార్చి ప్రతిపాదకులకే మరోసారి విజయం ఇవ్వడమా?


బహుశా, ఎజెండా మార్చాలి. మతపరమైన వివాదాలు వాస్తవ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే పుట్టిస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మళ్లిన దృష్టిని తిరిగి మళ్లించలేమా? ఆ విద్య వాళ్లకు మాత్రమే వస్తుందా? ప్రత్యామ్నాయం కోరుకునేవాళ్లకు ఎందుకు రాదు? మతవిభజన నినాదాలకు పోటీగా వాస్తవ సమస్యల నినాదాలను ఎందుకు రూపొందించలేరు? పరాజయంతో, నైతికంగా స్థైర్యం లేని స్థితిలో సమస్త ప్రజాస్వామిక రాజకీయ శక్తులూ చొరవే కరువయ్యే స్థితిలోకి జారుకున్నాయి. ప్రత్యామ్నాయ ఎజెండాలో, శాంతి సామరస్యాలు ఉండాలి. మత విభజనను సహించబోమనే సందేశమూ ఉండాలి. కానీ, దేశాన్ని ముంచెత్తుతున్న కేంద్రీకరణ, ఆర్థిక సంక్షోభం, భాషా దాష్టీకం, రాష్ట్రాలపై పెత్తనం, ధరలు, నిరుద్యోగం... వీటినే కదా, ప్రధానంగా రాజకీయ వేదిక మీదకు తేవాలి?


ఇతర పట్టింపులు పెట్టుకోకుండా, ఒకే ఒక్క అంశం మీద జనం ఓటు వేసిన సందర్భంగా 1977ను చెప్పుకుంటారు. తెలుగునాట ఫలితం ఇవ్వలేదు కానీ, దేశమంతా, జనం ఇందిరను ఓడించడమే లక్ష్యంగా ఓటు చేశారు. అత్యవసర పరిస్థితికీ దేశంలో ఇప్పుడున్న పరిస్థితికీ పోలిక తెస్తారు కొందరు. పోలిక లేదని, ఇప్పటితో పోలిస్తే, అప్పటిది పెద్ద నిర్బంధమే కాదనీ అనేవాళ్లు కూడా ఉన్నారు. అట్లా అనుకునేవాళ్లు, 2024లో 1977ని ఆశిస్తున్నారా?


కె. శ్రీనివాస్

Updated Date - 2022-05-19T06:00:27+05:30 IST