కౌలురైతు పట్ల కనికరం లేని విధానాలు!

ABN , First Publish Date - 2022-04-27T09:24:25+05:30 IST

బ్రిటిష్ ప్రభుత్వ వ్యవసాయ విధానం వల్ల దిగజారిన కౌలు రైతుల దయనీయమైన పరిస్థితులనూ, పేదరికాన్ని చూసి 1786 ప్రాంతంలో భారతదేశంలో గవర్నరు జనరలుగా పనిచేసిన లార్డ్ కార్న్ వాలిస్ ‘కంపెనీకి ఉన్న భూభాగంలో...

కౌలురైతు పట్ల కనికరం లేని విధానాలు!

బ్రిటిష్ ప్రభుత్వ వ్యవసాయ విధానం వల్ల దిగజారిన కౌలు రైతుల దయనీయమైన పరిస్థితులనూ, పేదరికాన్ని చూసి 1786 ప్రాంతంలో భారతదేశంలో గవర్నరు జనరలుగా పనిచేసిన లార్డ్ కార్న్ వాలిస్ ‘కంపెనీకి ఉన్న భూభాగంలో మూడింట ఒక వంతు ప్రస్తుతం క్రూరమృగాలు సంచరించే అరణ్యంగా మారింది. ఈ ప్రాంతం ఒకప్పుడు రైతులతో కళకళలాడుతుండేది’ అని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు జగన్‌రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని కౌలు రైతుల పరిస్థితి చూస్తే ఆయన ఎలా స్పందించేవారో?


స్వాతంత్ర్యానంతరం తొలినాళ్లలో కౌలుదారులకు రక్షణ కల్పించడానికి దేశవ్యాప్తంగా కౌలు చట్టాలను తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఋణ అర్హత కార్డుల (ఎల్.ఇ.సి) చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం పంట ఋణాలు కౌలుదార్లకే ఇవ్వాలి. కానీ అది ఎక్కడా అమలు కావడం లేదు. 2015లో కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ కౌలు సంస్కరణలపై ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ 2016లో ఇచ్చిన నివేదిక ప్రకారం ఎవరు సాగుదారులుగా ఉంటారో వారికి ఋణ అర్హత కార్డులు ఇచ్చి ప్రభుత్వ పథకాలైన ఇన్‌ఫుట్ సబ్సిడీ, పంటల బీమా వంటివి వర్తింపచేయాలని సూచించింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం, ఎల్.ఇ.సి చట్టాన్ని రద్దు చేసి కొత్తగా ‘పంట సాగుదారు హక్కు చట్టం’ (సి.సి.ఆర్.సి) అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం భూమి స్వంతదారుడికి, కౌలుదారుడికి మధ్య 11 నెలల ఒప్పందం ఉంటేనే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వర్తిస్తాయని, భూమి యజమాని రెవెన్యూ అధికారుల సమక్షంలో సంతకం చేస్తేనే సి.సి.ఆర్.సి గుర్తింపు కార్డు ఇస్తారని మెలికపెట్టింది. దీంతో ఈ నూతన చట్టం కౌలు రైతులకు మేలు చేయలేదు. సరికదా ఉన్న కొద్దిపాటి సౌకర్యాలను సైతం వారికి దూరం చేస్తుందన్న భయాందోళనలు ఆచరణలో నిజమయ్యాయి. కౌలురైతులకు ఋణాలిచ్చేందుకు బ్యాంకులు గతంలో మాదిరిగానే పలు అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. సి.సి.ఆర్.సి.లపై బ్యాంకులతో ఋణాలిప్పించేలా చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం, సి.సి.ఆర్.సి హోల్డర్లతో జాయింట్ లయబిలిటీ గ్రూపులను (జె.ఎల్.జి) నెలకొల్పేందుకు ప్రయత్నించింది. వాటికి స్వయం సహాయక సాగుదారుల సంఘాలు (ఎస్.ఎస్.ఎస్.ఎస్) అని పేరుపెట్టింది. అటు సి.సి.ఆర్.సి, ఇటు ఎస్.ఎస్.ఎస్.ఎస్ రెండూ కలిపినా కౌలురైతులకు ఇచ్చిన ఋణాలు చాలా తక్కువ. ఫలితంగా పెరుగుతున్న అప్పులు, ఎదురవుతున్న సమస్యలతో దిక్కుతోచని స్థితిలో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.


రాష్ట్రంలో 86 లక్షల మంది రైతులు ఉంటే, వారిలో మూడు వంతులు కౌలు రైతులే ఉన్నారు. రాష్ట్రంలో 32 లక్షలమంది కౌలు రైతులు ఉన్నారని, వీరిలో సగం మంది భూమిలేని రైతులే ఉన్నారని కౌలురైతుల సంఘ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో 16లక్షలమంది కౌలుదారులన్నట్టు అంచనా వేస్తోంది. ఈ 16 లక్షల మందికైనా గుర్తింపు కార్డులు మంజూరు చేశారా అంటే అదీ లేదు. 2019 చట్టం ప్రకారం 11 నెలల అగ్రిమెంట్లు లేవని చేతులు దులుపుకొంటోంది. దాంతో, 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కౌలురైతుల పరిస్థితి మరీ దిగజారింది. బ్యాంకుల నిరాదరణకు గురై, సొంత ఆర్థిక వనరులు లేక, అధిక వడ్డీలకు ప్రవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి, పంటలు పండించినా గిట్టుబాటు ధరలేకపోవడం వల్ల, మిల్లర్ల మోసాల వల్ల, ప్రభుత్వ చిన్నచూపు వల్ల రైతాంగం పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యింది. రైతు స్వరాజ్య వేదిక అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన నివేదిక, జనసేన నాయకులు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం 2019–20 సంవత్సరంలో 1019 మంది, 2020–21లో 889 మంది, ఈ ఏడాది దాదాపు వెయ్యిమంది కౌలురైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 87మంది, అనంతపురం జిల్లాలో 170 మంది, కర్నూలు జిల్లాలో 373 మంది రైతులు ఈ ఏడాది బలవన్మరణాలకు పాల్పడ్డారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదీ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల దుస్థితి.


తాను అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరుతో ప్రతీ రైతుకి ఏటా రూ.12,500 ఇస్తానని చెప్పిన జగన్‌రెడ్డి, తీరా పదవిలోకి వచ్చాక ఇచ్చిన హామీ ప్రకారం రూ.12,500లకు గాను కేంద్రం ఇచ్చే రూ.6000లు కలుపుకుని మొత్తం రూ.18,500 ఇవ్వాల్సింది, పోయి రూ.13,500 మాత్రమే ఇస్తూ నమ్మిన రైతులను మోసం చేశారు. పైగా రైతుల్లోనే కులవిభజన తీసుకొచ్చి రికార్డు సృష్టించారు. 2019 మొదటి బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతులకు, 15 లక్షల మంది కౌలురైతులకు రైతు భరోసా అమలు చేస్తామని చెప్పి చివరికి కౌలు రైతులకు అన్యాయం చేశారు. పంట రావడానికి ముందే కస్టం మిల్డ్ రైస్ (సి.ఎం.ఆర్) ప్రకటించి, ధాన్యం ఇచ్చిన మూడు రోజులకే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చి, దాన్ని కూడా తుంగలో తొక్కారు. ఏతావాతా రాష్ట్రంలోని రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది.


ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. సి.సి.ఆర్.సి కార్డులు పొందిన కౌలు రైతులందరికీ డబుల్ ఫైనాన్స్‌తో సంబంధం లేకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట ఋణాలు ఇవ్వాలి. ఆలయాల భూములు సాగుచేస్తున్న కౌలు రైతులకు కూడా పంట ఋణాలు ఇవ్వాలి. ఎలాంటి తనఖా లేకుండా కౌలు రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా రూ.50 వేల వరకూ ఋణాలు ఇవ్వవచ్చని 2008 ఆగస్టులో రిజర్వు బ్యాంకు ప్రకటించింది. దాన్ని అమలు చేసేవిధంగా బ్యాంకులపై ఒత్తిడి తీసుకురావాలి. కౌలు రైతులందరికీ అధికారిక గుర్తింపు కార్డులు ఇవ్వడం, వారికి క్రెడిట్ కార్డులు జారీ చేయడం లాంటి చర్యలు అమలు చేయాలి. ప్రతిపక్షాలపై విమర్శలు, వ్యక్తిగత దూషణలు మాని ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవాలి. న్యాయబద్ధంగా వారికి ఇవ్వాల్సిన రూ.7లక్షల పరిహారాన్ని ప్రతీ బాధిత కుటుంబానికి తక్షణం విడుదల చేయాలి. జగన్‌రెడ్డి ప్రభుత్వం కబుర్లు ఆపి, కౌలు రైతుల శ్రేయస్సుకు అవసరమైన చర్యలు వెంటనే ప్రారంభించాలి.

కూసంపూడి శ్రీనివాస్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి

Updated Date - 2022-04-27T09:24:25+05:30 IST