మునుగోడు మార్కు ప్రజాస్వామ్యం!

ABN , First Publish Date - 2022-10-21T05:58:05+05:30 IST

మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లను కలవడానికి మానవ హక్కుల వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక సభ్యులతో కూడిన బృందం గతవారం మునుగోడు నియోజకవర్గ గ్రామాలలో పర్యటించి...

మునుగోడు మార్కు ప్రజాస్వామ్యం!

మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లను కలవడానికి మానవ హక్కుల వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక సభ్యులతో కూడిన బృందం గతవారం మునుగోడు నియోజకవర్గ గ్రామాలలో పర్యటించి విషయ సేకరణ చేసింది. 14 జిల్లాలకు చెందిన 43 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.


మేము వెళ్లిన 12 గ్రామాలలో ప్రజలంతా వచ్చే పోయే కార్లను, కొత్త వ్యక్తులను ఆశ్చర్యంగా చూస్తూ కనిపించారు. మాకు డజన్ల కొద్ది పెద్ద పెద్ద, చాలా విలువైన కొత్త కార్లు తిరుగుతూ కనిపించాయి. మేము కలసిన ప్రజలందరు కూడా తమ గ్రామాలకు వచ్చే రాజకీయ పార్టీల నాయకులుగాని, అభ్యర్థులకు సంబంధించిన ప్రచార కార్యకర్తలుగాని తమ సమస్యలు ఏంటి, తాము ఏమి కోరుకుంటున్నారు అనే విషయం అసలు అడగడం లేదు అని తెలిపారు. తమ గ్రామానికి చెందిన బుడ్డ నాయకుడు ఫలానా పార్టీవారు ఓటుకు ఇంత ఇస్తామన్నారు. మీరు ఎంత ఇస్తారు అనే చర్చ, సంప్రదింపులు చాలా బహిరంగంగా వాళ్లముందే జరుపుతున్నారని తెలిపారు. చాలా గ్రామాలలో మాకు తాగునీటి సమస్య ఉందని చెప్పారు. చదువుకున్న యువకులు హైదరాబాద్‌కు వెళ్ళి, ఏదైనా ఉద్యోగం దొరుకుతుందని ఆగమాగంగా తిరుగుతున్నారు. డిగ్రీ పాసైన వాళ్లు కూడా చాలా మంది కొరియర్‌ సర్వీస్‌ సంస్థల్లో, డెలివరీ బాయ్స్‌గా పని చేస్తూ ఉన్నారన్నారు. చౌటుప్పల్‌ లేబర్‌ అడ్డాలో 500 మంది దాకా పనికోసం నిరీక్షిస్తూ కూర్చుంటే సాయంత్రం వరకు 100 మందికి మాత్రమే పని దొరుకుతుందన్నారు. చౌటుప్పల్‌లో చిన్న చిన్న పరిశ్రమలు చాలానే ఉన్నాయి. కాని ఆ పరిశ్రమల యజమానులు వాళ్ల వాళ్ల రాష్ట్రాల వాళ్లకే పనులు ఇస్తున్నారన్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన కార్మికుల బ్రోకర్లు వాళ్ల రాష్ట్రం వారినే పనికి తీసుకెళ్తారు అని చెప్పారు. గత రెండు దశాబ్దాలుగా చౌటుప్పల్‌లో ఒక డిగ్రీ కళాశాల స్థాపించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో పడకల సంఖ్య పెంచి అభివృద్ధి చేయాలనే డిమాండ్‌ వ్యక్తమవుతుంది. డిండి ప్రాజెక్టులో ముంపు గ్రామాలైన చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం, లెంకెపల్లి, లక్ష్మిపురం గ్రామస్తులు గత కొన్ని మాసాలుగా తమ భూములకు నష్టపరిహారం, న్యాయబద్ధంగా రాలేదని మల్లన్నసాగర్‌ ముంపు రైతులకు ఇచ్చిన పద్ధతిలో ఇవ్వాలని కొరుతూ ధర్నాలు చేసారు. ఎన్నికలు ప్రకటించగానే ఈ గ్రామాల నుండి వంద మంది నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. పదిమంది వేసారు కూడా. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రచారానికి వచ్చినపుడు ఆందోళనలో ఉన్న ఈ రైతులను ఆయన దగ్గరికి తీసుకువెళ్లి, ఏదో నోటిమాటగా హామీ ఇప్పించి, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు వారి ధర్నాను విరమింప చేసారు. నామినేషన్‌ వేసిన పదిమందిలో, తొమ్మిదిమంది విరమించుకోగా, ఒకాయన నాకు ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుందనే నమ్మకం లేదని విరమించుకోలేదు. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి రెండురోజుల క్రితం బీజేపీలో చేరిన డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా ఉండగా రాచకొండ ఎత్తిపోతల పథకం ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని, చిన్న సాంకేతిక అంశాలపై అనుమతి రావలసి ఉందని పలుమార్లు ప్రకటనలు చేసారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హరీశ్‌రావు ఈ పథకం గురించి చాలానే మాట్లాడారు.


ఈ విషయాలు ఏవీ చర్చలోకి రావడంలేదు. అసలు ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నిక ప్రణాళిక ప్రకటించలేదు. అక్కడక్కడ కనపడ్డ కరప్రతాలలో మునుగోడు వెనకబడింది, అభివృద్ధి చేస్తాం అన్న గాలికబుర్లు ఉన్నాయి తప్ప, నిర్దిష్టమైన ప్రాంత, ప్రజల సమస్యల అంశాలు ఏవీ లేవు. చాలా చోట్ల రోడ్డు షోలు తారసపడ్డాయి. ప్రజలంతా, పాఠశాల విద్యార్థులలాగా రోడ్డుకు రెండు ప్రక్కల ఫర్లాంగుల దూరం కొద్ది క్రమశిక్షణతో బుద్ధిగా నిలబడి కనిపించారు. వాళ్లు అట్లాగే నిలబడి ఉంటే రాజకీయ వాహనాల కాన్వాయి వెళ్లిపోయిన తర్వాత వరుసగా క్రమశిక్షణతో డబ్బులు పంచుతారు అని తెలిసింది. మామూలుగా ఒకసారి నిలబడ్డ వాళ్లకు ఒక్కొక్కరికి రూ.300, నాయకుడికి ఆహ్వానంగా బతుకమ్మలు, బోనాల కుండలు తలపై పెట్టుకున్న మహిళలకు రూ.500 అందుతున్నాయి. వర్షం పడుతున్నా కూడా అట్లాగే నిలబడి ఉన్నారు. ఈ ప్రజలే అన్ని పార్టీలకు వాళ్లు పట్టుకున్న రాజకీయ పార్టీ జెండాలు మార్చుకుంటూ నిలబడుతున్నారు. ఈ ప్రక్రియ అన్ని గ్రామాలలో అన్ని ప్రధాన రోడ్లపై జరుగుతూనే ఉంది. సభ అయిపోగానే గ్రామంలో అందరికి మాంసం కూరలతో బాటు భోజనాలు ఏర్పటవుతున్నాయి. రాత్రి మందు అందరికి ఉంటుంది. సభకు రాలేకపోయిన వారికి కోడిమాంసంతో బాటు, మందు సీసాలు అందించే కార్యక్రమం జరుగుతుంది.


గ్రామ సర్పంచ్‌ దగ్గర గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏయే కులాల వాళ్లు ఉన్నారు, ఎందరు ఓటర్‌ గుర్తింపు కార్డుకు దరఖాస్తు పెట్టుకున్నారు అన్న గణాంకాలన్నీ ఉన్నాయి. అడిగితే టకీమని చెప్పేస్తున్నారు. ఈ గణాంకాల ప్రకారమే లెక్కలు చేసి ఏ గ్రామానికి ఎంత బడ్జెట్‌ కేటాయించుకోవాలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల ప్రతినిధులు సిద్ధపడుతున్నారు. మూడు డజన్ల చాలా ఖరీదైన ‘ఫ్యూచర్‌’ కార్లు ఒక అభ్యర్థితో తిరుగుతున్నాయని, వంద వరకు కొత్త ద్విచక్ర వాహనాలు కూడా ఆయన కోసం ఎవరో అందించారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒకాయన మాకు తెలిపాడు. చండూరు మండల కేంద్రంలో ఒక రాజకీయపార్టీ అభ్యర్థి లక్షలు వెచ్చించి పెద్దపెద్ద టెంట్ల గృహాలు నిర్మించారు. పాత ఇండ్లను, హాల్‌లను కిరాయికి తీసుకొని పార్టీ ఆఫీసుకోసం, అభ్యర్థుల కార్యకర్తలు ఉండటానికి బసలు ఏర్పాటు చేసారు. వెస్టర్న్‌ పద్ధతిలో మరుగుదొడ్డి కుండీలు కూడా అమర్చారట.


అక్కడక్కడ మండల శివార్లలో, ప్రధాన దారులలో పోలీసు అవుట్‌ పోస్టులు కనిపించాయి. కాని ఎక్కడ కూడా వాహనాలు ఆపి తనిఖీలు చేయడం మేము గమనించలేదు. ప్రతి గ్రామంలో ‘ఓటు చాలా పవిత్రమైంది. దాన్ని స్వేచ్ఛగా వినియోగించుకోండి’ అన్న బ్యానర్లు కనిపించాయి. ఎన్నికల కమిషన్‌ నిఘా అధికార్లకు సంబంధించిన వాహనాలు కూడా ఒక దగ్గర కనపడ్డాయి. వాళ్లు కూడా ప్రజలంతా రోడ్డు పక్కన రోడ్డు షోకు నిలబడి చేతులు, జెండాలు ఊపుతుంటే సంతోషం వ్యక్తం వ్యక్తపరుస్తూ పోతున్నారు. చాలా బిరియాని హోట్లళ్లు కొత్తగా వెలిసాయి. బ్రాందీ షాపులైతే సరేసరి.


ఇటువంటి వాతావరణంలో మంది, మార్బలం సమృద్ధిగా లేని చిన్న, చితకా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్లకు న్యాయపరంగా లభించవలసిన ప్రచార స్థలం కాని, వెసులుబాటు కాని లభించడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీల ప్రచార కార్యకర్తలందరు బయట ప్రాంతం నుంచి వచ్చినవారే. అధికారంలో ఉన్న పార్టీ పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు, అందరు మంత్రులు, నగరాలలోని అందరు వార్డు కౌన్సిలర్లు తప్పకుండా మునుగోడు దర్శించి అక్కడ హాజరు వేయించుకోవాలని ఆదేశాలు జారీ అయినాయని అధికారపక్షం వాళ్లే చెప్పుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్యలో దాదాపు సగంమంది బయట ప్రాంతాల నుంచి వచ్చినవారు కనబడుతున్నారు అని ఒక వ్యక్తి మాకు చెప్పాడు. ఎన్నికలనాడు ఏమవుతుందో అని భయం అవుతుంది అన్నాడు.


క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇట్లా ఉంటే జిల్లా అధికార్లు, రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తుంది అన్న ప్రశ్న అందరికి వస్తుంది. ఎన్నికల కమిషన్‌ అధికార్ల బృందం నిరంతరం అప్రమత్తంగా ఉండి, ప్రతిరోజూ అభ్యర్థి పెట్టే ఖర్చు, ప్రచారం నిర్వహిస్తున్న తీరు, ప్రదర్శిస్తున్న బ్యానర్ల వివరాలు, వాడుతున్న పెట్రోలు వివరాలు అన్ని నోట్‌ చేస్తూ ఉండాలని, కమిషన్‌ నిబంధనల్లో ఉంది. ఎన్నికల తర్వాత ప్రతి అభ్యర్థి రసీదులతో సహా తాను చేసిన ఖర్చు వివరాలు కమిషన్‌కు తెలపాలి. ఈ సంవత్సరం జనవరి నెలలో సడలింపు చేసిన దాని ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు నలుబది లక్షల లోపే ఉండాలి. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో ప్రవహిస్తున్న డబ్బు ఏ బ్యాంకుల్లోంచి వస్తుంది, ఎవరి అకౌంట్లలో ఉంది అన్న విషయం తేల్చాలి. ఎవరి అకౌంట్లలోనూ లేకుండా, ఏ బ్యాంకు నుండి డ్రా చేయకపోతే అదంతా ‘నల్లదనం’ ఉన్నట్లే. అయితే దాని సంగతి ఏమిటి?


ఇదీ పరిస్థితి. ప్రజలు డబ్బులకు అమ్ముడు పోతున్నారు అని సులభంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో హైదరాబాద్‌లో లక్షలు విలువగల అపార్ట్‌మెంట్లలో ఉండే వాళ్లు కూడా అభ్యర్థుల నుండి వాళ్ల వాళ్ల రెసిడెన్షియల్‌ అసోసియేషన్‌ కోసం కుర్చీలు, టేబుల్స్‌, పిల్లలకు క్రికెట్‌ కిట్‌లు, క్యారంబోర్డు లాంటి ఆట వస్తువులు తీసుకున్న విషయం మనకు తెలుసు. ప్రజలు అతిసులువైన తార్కికతను ముందు పెడుతున్నారు. ఆయన ఇస్తున్నాడు, సంపాదించుకుంటాడు కాబట్టి మేము తీసుకుంటున్నాం మాకు ఇచ్చిన దానికి రెండు రెట్లు పోగు చేసుకుంటాడు. అంటే రాజకీయం, ఎన్నికలు ఒక వ్యాపారం అని చెప్పుతున్నారు. ఇప్పడు పెడుతున్నదంతా పెట్టుబడి అని.


మునుగోడు ఉపఎన్నిక దేశంలోనే అతి ఖర్చుతో కూడుకున్న ఎన్నిక కాబోతోంది. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఈ ఎన్నికలను ఒక నమూనాగా రాజకీయ పార్టీలు తీసుకునే అవకాశం లేకపోలేదు.


ఎవరు గెలుస్తారు అన్నది కాదు ముఖ్యం. ‘సారం’లో ప్రజాస్వామ్యం ఇంతగా దిగజారిపోతే ఎట్లా అనేది ముఖ్యం. దాన్ని సంస్కరించడానికి, బుద్ధిజీవులుగా, పౌరులుగా, పౌరసంస్థలకు ఏమైనా బాధ్యత ఉందా ఆలోచిద్దాం. ఏమీ చేయలేము అనుకుంటే, నిశబ్దంగా, నిస్సహాయంగా ఉంటే మనం కూడా ఇందుకు బాధ్యులం కావచ్చు అనే ఆలోచన మన మనస్సులను తొలచివేస్తుందేమో? ఇది కూడా ఆలోచిద్దాం.

యస్‌. జీవన్‌కుమార్‌

మానవహక్కుల వేదిక

Updated Date - 2022-10-21T05:58:05+05:30 IST