శబ్దకాలుష్యం లేని పూజలు చేసుకుందాం!

ABN , First Publish Date - 2022-08-31T07:47:19+05:30 IST

గణపతి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. వీధికి రెండు మూడు వేదికలు, దేశవ్యాప్తంగా లక్షలాది విగ్రహాలు కొలువుతీరి పూజలు అందుకుంటున్నాయి...

శబ్దకాలుష్యం లేని పూజలు చేసుకుందాం!

గణపతి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. వీధికి రెండు మూడు వేదికలు, దేశవ్యాప్తంగా లక్షలాది విగ్రహాలు కొలువుతీరి పూజలు అందుకుంటున్నాయి. డీజీపీ అనురాగ్ శర్మ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 95 వేల విగ్రహాలు ఏర్పాటయ్యాయి. అనుమతి పొందని చిన్నాచితకా వేదికలు మరో పదివేల వరకు ఉంటాయి. ఒక రాష్ట్రంలోనే లక్ష దాటితే దేశవ్యాప్త విగ్రహాల సంఖ్య ఎంతుంటుందో అంచనా వేయొచ్చు. 


‘ఎకో ఫ్రెండ్లీ’ నినాదం ఏడాదికేడాది బలపడటంతో గణపతి ఉత్సవాల్లో మట్టి విగ్రహాల వినియోగం అధికమైంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పిఓపి) ప్రతిమల స్థానంలో మట్టి విగ్రహాలను ప్రతిష్టించే విషయంలో అవగాహన గతం కన్నా హెచ్చింది. యువత భాగస్వామ్యం వల్లనే ఈ విప్లవాత్మక మార్పు సంభవించింది. గణేష్ ఉత్సవాల నిర్వహణలో యువత పాత్రే కీలకం. ఊర్లలో ఉత్సవ నిర్వహణ కమిటీలు వేయటం, వీధిలో ఒకరిని మించి ఒకరు ఎత్తయిన విగ్రహాలు ఏర్పాటు చేయటం, ఇందుకోసం చందాలు సేకరించటం... ఈ పనుల్లో యువత సందడి అంతా ఇంతా కాదు. ఒక వైపు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల విషయంలో వైఖరి మార్చుకుని ఆదర్శంగా నిలుస్తున్న యువత శబ్ద కాలుష్యం విషయంలో మాత్రం ఇంకా జాగృతం అవటం లేదు. పండుగల సమయంలో డీజే సౌండ్‍ల మోత మోగుతోంది. తీన్‌మార్ డప్పులతో వీధులు దద్దరిల్లుతున్నాయి. శబ్ద కాలుష్యంతో ప్రశాంతత పారిపోతోంది. 


శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం శబ్దం సెకనుకు 1130 అడుగుల (గంటకు 770 మైళ్ళ) వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణంగా మనం మాట్లాడే సమయంలో శబ్ద ధ్వని 60 డెసిబల్సుగా ఉంటుంది. 80 డెసిబిల్స్ దాటే ఏ ధ్వని అయినా చెవులకు హాని చేస్తుంది. ఒక నిమిషం కన్నా ఎక్కువసేపు అతిపెద్ద ధ్వనికి గురైతే మన చెవులు వినికిడి శక్తిని వీధుల్లో ఏర్పాటుచేస్తున్న డీజేల్లో ఒక సౌండ్ బాక్స్ నుండే 180 డెసిబల్స్ శబ్దం విడుదల అవుతుంది. పాతకు భిన్నంగా వ్యవహరించటం కొత్తగా ఆలోచించటం యువతకే సాధ్యం. మట్టివినాయకులమీద శ్రద్ధపెడుతున్న తరుణంలో, శబ్దకాలుష్యంపై కూడా ప్రకృతిహిత పర్యావరణసహిత కొత్త సంతకం చేయాల్సిన బాధ్యత యువతపై ఉంది. అధిక శబ్దంపై నిశ్శబ్దం వద్దు.

కంచర్ల శ్రీనివాస్

Read more