లౌకికవాదాన్ని రక్షించుకుందాం

ABN , First Publish Date - 2022-07-05T06:19:53+05:30 IST

భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు కలిగిన మనదేశానికి రాజ్యాంగంలో రాసుకున్న లౌకికవాదం ఒక్కటే సరి అయిన పరిష్కారం....

లౌకికవాదాన్ని రక్షించుకుందాం

భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు కలిగిన మనదేశానికి రాజ్యాంగంలో రాసుకున్న లౌకికవాదం ఒక్కటే సరి అయిన పరిష్కారం. దేవుడు, మతం వ్యక్తిగతంగానే ఉంచుకోవాలి. పాలనలో మతం జోక్యం ఉండరాదు. అదే నిజమయిన లౌకికవాదం. అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ లౌకికవాదానికి ఒక తప్పుడు ప్రతిపాదన చేశారు. అన్ని మతాలను సమానంగా చూడటమనే అర్థాన్ని ముందుకు తెచ్చారు. లౌకికవాదమంటే మత రహితం. ప్రస్తుత కేంద్రప్రభుత్వం లౌకికవాదం అనే పదాన్ని తొలగించి ఈ దేశాన్ని హిందూదేశంగా చెయ్యాలని చూస్తోంది.


మొదట్లో మన రాజ్యాంగంలో కేవలం ‘సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణరాజ్యం’గా మాత్రమే ఉంది. తరువాత ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక అనే పదాలను చేర్చింది. అంతేకాదు ఆర్టికల్ 51A(h)లో ప్రశ్నించేతత్వం, శాస్త్రీయ ఆలోచన, మానవవాదాన్ని పెంచటం ప్రతి పౌరుని బాధ్యత అని రాసి ఉంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న నాయకులకు, ఐఏఎస్‌లకు ఈ విషయం తెలియదా? భారత తొలిప్రధాని నెహ్రు 1955లో నాగార్జునసాగర్ డ్యామ్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు ముహూర్తం లేదు, పూజలు, టెంకాయలు కొట్టడాలు లేవు. ఒక దీపం వెలిగించి ఈ ఆధునిక దేవాలయాన్ని జాతికి అంకితం చేస్తున్నానన్నారు. నిజమయిన సెక్యులరిస్టు అలా ఉండాలి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మంత్రులు రాజ్యాంగబద్ధంగా ఉండాలి.

నార్నె వెంకటసుబ్బయ్య

Updated Date - 2022-07-05T06:19:53+05:30 IST