ఉద్యమ ఆకాంక్షలను సాధించుకుందాం

ABN , First Publish Date - 2022-03-05T06:57:05+05:30 IST

దశాబ్దాల పాటు కొట్లాడినం. సకల జనులమేకమైనం. వందలాది మంది విద్యార్థి, యువజనుల ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కోటి రతనాల వీణ తెలంగాణను సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణగా నిర్మించుకోవాలని కలలు గన్నాం... మనమంతా ఆశపడ్డాం... అడుగులు వేద్దామనుకున్నాం...

ఉద్యమ ఆకాంక్షలను సాధించుకుందాం

దశాబ్దాల పాటు కొట్లాడినం. సకల జనులమేకమైనం. వందలాది మంది విద్యార్థి, యువజనుల ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కోటి రతనాల వీణ తెలంగాణను సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణగా నిర్మించుకోవాలని కలలు గన్నాం... మనమంతా ఆశపడ్డాం... అడుగులు వేద్దామనుకున్నాం. తెలంగాణ తొలి ప్రభుత్వం మన కలలను వమ్ము చేసింది.
తెలంగాణ ఉద్యమ ప్రజా ఆకాంక్షలను నీరు గార్చే కుట్రలు చేస్తున్నది. నియంతృత్వ కుటుంబ పాలనకు తెర తీసింది.

అన్ని ప్రభుత్వ వ్యవస్థలను బలహీనం చేసింది. అవినీతిని వ్యవస్థీకృతం చేసింది. నీళ్ల పేరుతో నిధులను దుర్వినియోగం చేసింది. కమీషన్ల కోసం ప్రాజెక్టులన్నీ సీమాంధ్ర కాంట్రాక్టర్లకు అప్పజెప్పింది కేసీఆర్‌ ప్రభుత్వం. తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్లు పెట్టి గుప్పెడు మంది నాయకులు ఆస్తులను పెంచుకున్నారు. నియామకాల ఊసెత్తకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగుల మరణ మృదంగానికి కారణమైంది. ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నది. ఏ పార్టీలో ఎవరు గెలిచినా నా పార్టీలోనే చేరాలని జులుం చేసి తన పక్షంలో చేర్చుకుంటూ... భారత రాజ్యాంగ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్‌.


రాచరిక గడీ వ్యవస్థను పునరుద్ధరించే ప్రక్రియకు పునాదులు వేసే ప్రయత్నం మొదలుపెట్టిండు. తన నియంతృత్వ, అవినీతి, అప్రజాస్వామిక విధానాలకు అడ్డం వస్తున్నదనే కుట్రతో ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక రాజ్యాంగమైన మన భారత రాజ్యాంగంపై విషం కక్కుతున్నాడు. తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినట్లు ఏ రాజ్యాంగం అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెసులుబాటు కల్పించిందో... ఆ రాజ్యాంగాన్నే తిరిగి రాస్తామంటూ కేసీఆర్‌ అహంకార పూరిత ప్రకటనలు చేస్తున్నాడు. అశాస్ర్తీయమైన తప్పుడు విధానాలతో ఉద్యోగ ఉపాధ్యాయులను వేధిస్తున్నాడు. బాధ్యతా రాహిత్య 317 జీఓ మూలంగా ఉపాధ్యాయులు సైతం బలవన్మరణాలకు గురైన విషయం అందరికీ తెలిసిందే.


వరి ధాన్యం కొనుగోళ్లు గందరగోళం, సమగ్ర వ్యవసాయ విధానం లేనే లేదు. యువజన, ఉద్యోగ, ఉపాధి కల్పన విధానం రూపొందించలేదు. విద్య వైద్య రంగంలో ప్రణాళికలు లేవు. పోడు రైతులను భూమికి దూరం చేస్తున్నారు. రికార్డుల ప్రక్షాళన, ధరణి పేరుతో భూములు, దస్ర్తాలు మాయం చేశారు. వేలాది ఎకరాల వ్యవసాయ భూములను తమ వందిమాగద బినామీలకు ధారాదత్తం చేస్తున్నారు.ఎంఎల్‌ఏలు, వాళ్ల అనుచరులు బహిరంగంగా ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు కబ్జా చేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర పేద వర్గాల భూములను పారిశ్రామిక వాడల పేరుతో బలవంతంగా గుంజుకుంటున్నారు. యథేచ్ఛగా అక్రమంగా ఇసుక దందాలు నడుపుతున్నారు. ప్రజల మధ్య ముఠా తగాదాలు రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 6న ఉదయం 10 గం.ల నుండి పిఎస్‌ఆర్‌ గార్డెన్స్‌, పోతిరెడ్డిపల్లి క్రాస్‌ రోడ్స్‌, సంగారెడ్డిలో జరిగే రెండవ ప్లీనరీలో జాతీయ పరిస్థితులను, రాష్ట్ర రాజకీయాలను మరింతగా విశ్లేషించుకొని తెలంగాణ జాతిపిత జయశంకర్‌ ఆలోచనల సాక్షిగా తెలంగాణలో ‘మరో ఉదయం’ కోసం తెలంగాణ జన సమితి అడుగులు వేస్తున్నది.
– తెలంగాణ జనసమితి

Updated Date - 2022-03-05T06:57:05+05:30 IST