సీమకు కృష్ణమ్మ రాదు, గోదావరిపైనే దృష్టిపెట్టాలి!

ABN , First Publish Date - 2022-04-21T06:07:24+05:30 IST

కొద్దిరోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వాధినేత ఒక సభలో ‘తెలంగాణా సాధించి నీళ్లూ నిధులూ సమకూర్చుకున్నాం, ఇక నియామకాలు చేపడ్తాం’ అని చెప్పారు....

సీమకు కృష్ణమ్మ రాదు, గోదావరిపైనే దృష్టిపెట్టాలి!

కొద్దిరోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వాధినేత ఒక సభలో ‘తెలంగాణా సాధించి నీళ్లూ నిధులూ సమకూర్చుకున్నాం, ఇక నియామకాలు చేపడ్తాం’ అని చెప్పారు. తెలంగాణ ఉద్యమమంతా కృష్ణా జలాల పరంగా అన్యాయం జరిగిందనే ప్రాతిపదికన జరిగింది. నీరు అంటే కృష్ణా జలాలే అన్న భావన ప్రజలలో ప్రబలింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్ళు అవుతున్నా ఆంధ్రా తెలంగాణ ప్రాజెక్టులకున్న కృష్ణా జలాల కేటాయింపులలో మార్పు లేదు. మరి ఏ నీరు వారు సాధించుకున్నది?


సాధించుకున్నది గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే. ఇది ఒక విధంగా వాస్తవ పరిస్థితులను గ్రహించి, సాగునీటి జలాలంటూ తెచ్చుకోవాలంటే  గోదావరి నది మీద దృష్టి పెట్టడం వల్లనే జరుగుతుందని, ఆ విధంగా పథక రచనలో మార్పులు చేసుకోవడమే. ఏమిటి వాస్తవ పరిస్థితులు? ఒకటి– కృష్ణా జలాల కేటాయింపుల్లో మార్పులు చట్టపరంగా సాధ్యం కాదు. రెండు– ఆ నదిలో ఇంకా నీటి లభ్యత కొత్త ప్రాజెక్టులకు గానీ పాత ప్రాజెక్టుల పరిధి పెంచడానికి మిగిలి లేవు. అంత పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం నడిపినవారే వాస్తవాలు ఆకళింపు చేసుకుని వ్యూహాలు మార్చుకుంటే, ఈ మధ్య కొంతమంది రాజకీయ నాయకులు రాయలసీమకి కృష్ణా నికర జలాలు సాధిస్తాం అని బాకాలూదుతున్నారు. రాయలసీమకి చెందిన కొంతమంది మేధావులు కూడా ఇది సాధ్యమన్నట్లు మాట్లాడుతున్నారు. అసలు నికర జలాలు అంటే ఏ అర్థంలో చెపుతున్నారో వారికే తెలియాలి.


ఈ నికర జలాలు అన్న పదం బచావత్ ట్రైబ్యునల్ తమ తుది నివేదికను 1976లో ఖరారు చేసి ప్రకటించినప్పుడు  ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ ట్రైబ్యునల్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన ప్రాజెక్టులు నిర్మించే ప్రదేశంలో వాటికి కావలిసిన నీరు 75శాతం లభ్యత ఉండాలి అని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా అప్పటి మూడు రాష్ట్రాలకు నదిలో 75 శాతం లభ్యత లెక్కగట్టి పంచింది. అంతేగాక, దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి 75శాతం లభ్యతకు అదనంగా లభించే నీటిని మిగులు జలాలుగా నిర్దేశించి హక్కు సంపాయించకుండా  వినియోగించుకోవడానికి స్వేచ్ఛని ఇచ్చారు. ఈ సందర్భంలోనే మిగులు జలాలు అనే పదం కూడా విరివిగా ఉపయోగంలోకి వచ్చింది. తర్వాత రెండవ ట్రైబ్యునల్ 2010లో ప్రథమ నివేదికను, 2013లో తుది నివేదికను సమర్పించింది. ఈ ట్రైబ్యునల్ తమ పరిశీలనలో 75శాతం నీటి లభ్యతని మరొకసారి లెక్క కట్టింది. మొదటి ట్రైబ్యునల్ అంచనాలకి వారి అంచనాలకి మధ్య తేడా స్వల్పమని గ్రహించింది. కానీ వారి ముందు అన్ని రాష్ట్రాలు బహు అవసరాలను సమర్పించడంతో ట్రైబ్యునల్ 1 చేసిన 75 శాతం కేటాయింపులని భంగపరచకుండా అదనంగా 65శాతం లభ్యతగల జలాలను, సగటు లభ్యతగల జలాలను కూడా రాష్టాల మధ్య పంచింది. ఈ నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో ఇంతవరకు అమలు సాధ్యం కాలేదు. సాధారణంగా ట్రైబ్యునల్ నివేదికని సుప్రీంకోర్టులో పెద్దగా మార్పులు చేయగల అవకాశాలుండవు. కనుక వాస్తవ పరిస్థితి ఏమిటంటే రెండు ట్రైబ్యునల్స్ రాష్ట్రాలకి పంచేసిన నీటి కేటాయింపుల తర్వాత ఇంకా కేటాయింపులకు నీరు మిగిలి లేవు. ఇది గ్రహింపు కలిగిన వారెవరైనా మేము రాయలసీమకి కృష్ణా నది నికర జలాలు (ఏ విశ్వసనీయతగలవైనా) తేగలం అని చెప్తే అది భ్రమ కలిగించడమే. రాయలసీమ అదనపు నీటి అవసరాలను తీర్చాలంటే వేరే ప్రత్యామ్నాయాలు శోధించాలి. ఇదే విధంగా మిగులు జలాలపై ఆధారపడి మొదలుపెట్టి పాక్షికంగా అమలులో ఉన్న ఆంధ్రా తెలంగాణా ప్రాజెక్టులకు కూడా కృష్ణాజలాల లభ్యత ఉండదు. ఈ మధ్యే ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి, దిండి, రాయలసీమ ఎత్తిపోతల మొదలుగువాటికి  కూడా ఇదే పరిస్థితి.


మరి రాయలసీమకి సాగునీటి వనరులు ఇంకా కల్పించాలంటే తెలంగాణాలాగ  గోదావరి జలాలు మళ్ళించడమే గత్యంతరం. ఈ సందర్భంగా 2019లో చర్చలు జరిగాయి. కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా తయారు చేసారు. ఆ తర్వాత ప్రతిపాదనలు ముందుకు కదలలేదు. అప్పటి చర్చలలో గోదావరి జలాలను కృష్ణాజలాల ఆధారంగా సాగు అవుతున్న ఆయకట్టుకు మళ్ళించి, అందుమూలంగా మిగిలిన కృష్ణాజలాలను రాయలసీమ ప్రాజెక్టులకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మళ్ళించడమనే ప్రతిపాదనకంటే– గోదావరి జలాలు సరాసరి బనకచెర్ల రెగ్యులేటర్ల సముదాయానికి మళ్ళించడమే ఉత్తమమని ఒక ఏకాభిప్రాయం వ్యక్తమయింది. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాలు రెండూ ఉమ్మడి కావటం, తెలంగాణ అవలంబిస్తున్న నిరంతర ఘర్షణ వైఖరి దీనికి ముఖ్య కారణం.


ఇక్కడ నికరజలాలు గురించి చెప్పేటప్పుడు– పోలవరం నుంచి కృష్ణాడెల్టాకి 80 టీఎంసీలని పోలవరం కుడికాలువ ద్వారా మళ్ళింపగా మిగిలిన జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటాలో ఏ ప్రాజెక్టుకి కేటాయింపు జరగకుండా ఉన్న  45టీఎంసీల గురించి ప్రస్తావించాలి. ఈ మొత్తం తెలంగాణకే చెందాలని ఆ రాష్ట్రం ట్రైబ్యునల్ ముందు వాదిస్తోంది. దీనిని సహజంగానే ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తోంది. పోలవరం రిజర్వాయరు, కుడికాలువ మొదలూ చివరా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. పైగా జలాలు మిగిలింది పూర్తి ఆంధ్రా ప్రాజెక్టయిన కృష్ణా డెల్టాది. కనుక తెలంగాణ వాదన అసమంజసం. ఏదయినా మొత్తం 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌వే అనుకుంటే ఆ మేరకు కృష్ణా జలాలు గాలేరు నగరి, హంద్రి నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు పంచవచ్చు. ఈ మూడింటికి  కలిపి 121.50టీఎంసీలు అవసరం. కృష్ణా జలాల ద్వారా 45టీఎంసీలు లభిస్తే, మిగిలిన 76.50 టీఎంసీలు గోదావరి జలాలుగా ఇవ్వాలి. ఒకవేళ మున్ముందు తెలంగాణకి ఇందులో వాటా లభిస్తే ఆమేరకు గోదావరి జలాల సరఫరా పెరుగుతుంది. దీనికి కీలకం బొల్లేపల్లి రిజర్వాయర్ నిర్మాణం, అందులోకి గోదావరి జలాల మళ్ళింపు ద్వారా తొలిగా 150టీఎంసీల నీటి నిలువతో అనుకుంటే, ఆ మూడింటికి కావల్సిన 77టీఎంసీల సరఫరా సుగమం అవుతుంది. ఎక్కువయినా సర్దవచ్చు.


అలాగే మిగిలిన జలాలను తెలుగు గంగకి, నాగార్జునసాగర్ కుడికాలువకి కూడా అందించవచ్చు. ఇక్కడ ఈ సందర్భంగా ఎదురయ్యే సాంకేతిక సమస్యని గమనించాలి. గోదావరి నీళ్ళు బనకచెర్ల రెగ్యులేటర్ వెనుక పడవేస్తే శ్రీశైలం రిజర్వాయర్ నిలువ నీటి మట్టం రెగ్యులేటర్ వెనుక ఏర్పడే నీటి మట్టం కంటే తక్కువ ఉంటే గోదావరి జలాలు వెనుకకి ప్రవహించి రిజర్వాయరులోకి చేరతాయి. కనుక పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ గేట్లు మూసి ఉంచాలి. కానీ నీటి మట్టం సుముఖంగా ఉంటే శ్రీశైలం కుడి కాలువకి, చెన్నై తాగు నీటికి, తెలుగు గంగ కోసం గేట్లు తెరవాలి. మూసిఉంచడం కుదరదు. పైగా పోతిరెడ్డిపాడు, బనకచెర్ల రెగ్యులేటర్ల సముదాయాలు కృష్ణా బోర్డు పరిధిలోకి చేరుతాయి. ఆంధ్రప్రదేశ్ నియంత్రణ పోతుంది. ఈ సమస్యలను అధిగమించాలంటే గోదావరి జలాలను బనకచెర్ల కాంప్లెక్స్ దాటించి కుడి కాలువలోకి సరాసరి వదలాలి. ఈ కాలువ ప్రవాహ సామర్థ్యం 40వేల క్యూసెక్కులకు పెంచాలని అనుకున్నందున ఈ ప్రతిపాదనకి అభ్యంతరం ఉండకూడదు. ఆ కాలువ ద్వారా గాలేరు నగరి శ్రీశైలం కుడి కాలువ ప్రాజెక్టుల రిజర్వాయర్ల సముదాయాలని గోదావరి నీటితో నింపవచ్చు. గాలేరు నగరి కాలువ నుంచి హంద్రి–నీవా మెయిన్ కాలువకి పుంగనూరు బ్రాంచ్ కాలువకి పంపేందుకు ఎత్తిపోతలను (కాలేటివాగు రిజర్వాయరు నుంచి) నిర్మిస్తున్నారు. వెలిగొండకి విడిగా ఒక ప్రత్యామ్నాయ మళ్ళింపు అవసరం. తెలుగు గంగకి విడిగా ఒక మార్గం ద్వారా బనకచెర్ల దిగువన పడవేయవచ్చు. లేదంటే కుడి కాలువ నుంచి ఎస్కేప్ ద్వారా నిప్పులవాగుకి పంపవచ్చు. గోదావరి నుంచి పంపింగ్ జూలై నెలలోనే మొదలు సాధ్యమవుతుంది. కనుక బొల్లేపల్లి నుంచి సరఫరా ఆ నెలలోనే మొదలు కావచ్చు. శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం పెరగాలంటే ఆగష్టుదాకా వేచి ఉండాల్సి రావచ్చు. కనుక ఈ రెండు రిజర్వాయర్ల నిలువలని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ రాయలసీమ ప్రాజెక్టుల నీటి అవసరాలను గమనిస్తూ నిర్వహణ పద్ధతులు రూపొందించి అమలుపర్చాలి. ఈ వాస్తవాలని గుర్తించి గోదావరి జలాల మళ్ళింపు మీద రాయలసీమ శ్రేయోభిలాషులు దృష్టి సారించి ఆ దిశగా ప్రాజెక్టుల నిర్మాణానికి నడుముకట్టాలి. కృష్ణా జలాలు ఎక్కణ్ణించో ఊడిపడే అవకాశమే లేదని గ్రహించాలి.

కురుమద్దాలి వెంకట సుబ్బారావు

రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ (ఇరిగేషన్)

Updated Date - 2022-04-21T06:07:24+05:30 IST