సెల్యూట్‌ అందుకోవలసిన ‘కథల సిపాయి’!

ABN , First Publish Date - 2022-09-26T06:23:05+05:30 IST

ఇప్పటి పిల్లలు సాహిత్య పఠనంలోకి ఎట్లా వస్తున్నారో తెలియదు కానీ, నాలుగైదు దశాబ్దాల కిందట కొత్త పాఠకుల కోసం ఒక గైడెడ్‌ టూర్‌ మ్యాప్‌ అందు బాటులో ఉండేది....

సెల్యూట్‌ అందుకోవలసిన ‘కథల సిపాయి’!

ఇప్పటి పిల్లలు సాహిత్య పఠనంలోకి ఎట్లా వస్తున్నారో తెలియదు కానీ, నాలుగైదు దశాబ్దాల కిందట కొత్త పాఠకుల కోసం ఒక గైడెడ్‌ టూర్‌ మ్యాప్‌ అందు బాటులో ఉండేది. ఎవరూ అప్పటికి ఏ ఆధునిక సాహిత్య చరిత్రా రాయకపోయినా, కొన్ని కొండగుర్తు లతో బలీయమైన ప్రాచుర్యకథనాలు కనీసం రెండు మూడైనా చెలామణిలో ఉండేవి. బహుశా వేరువేరు బృందాలకు, స్థలాలకు, కథనాలకు వేరువేరు పటాలు కూడా ఉండి ఉండవచ్చు. ఈ ప్రయాణం విచిత్రమైనది, ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు. కొత్తగా వస్తున్నవి చదు వుతూనే, గత సాహిత్యాన్ని వేగంగా అందుకునే ప్రయత్నం. 


ఆధునికం, ప్రగతిశీలం, ప్రతిభావంతమైన సృజనాత్మకం అయిన సాహిత్యాన్ని ఇష్టపడే పఠన మార్గం గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాను. అటువంటి దారిలో కొనసాగిన పాఠకుడు, పాఠకురాలు, నాలుగైదు దశాబ్దాల తరువాత, మళ్లీ ఒకసారి వెనక్కి నడిస్తే, తాను నడచివచ్చిన ఆ సాహిత్యపటంలో, గీతలకు ఎడంగా ఉండిపోయినవి, గీతలు గుర్తించనవి అనేకం కనిపిస్తాయి. అంతేకాదు, అట్లా తప్పిపోయినవాటిని కలుపుతూ కొత్తగీతలు గీయవచ్చుననిపిస్తుంది. సాహిత్య చరిత్ర గురించిన ఈ ప్రాచుర్య కథనమే అసమగ్రం అని తెలుస్తుంది. ఈ గైడెడ్‌ ప్రయాణపటాలను తిరిగి గీయాలనిపిస్తుంది. 


అట్లూరి పిచ్చేశ్వరరావు అనే రచయిత రచనలు కూడా అనంతర కాలపు పాఠకుల ఎంపికలో లేకుండా పోయా యేమో అనిపిస్తుంది. అట్లా లేకుండా పోవడం పాఠకులకు మాత్రమే కాదు, సాహిత్యానికి, సాహిత్యచరిత్రకు కూడా అన్యాయం చేసింది. ఈయనను చదివిన తరువాత, ఈయన సమకాలికులందరినీ కొత్తగా చదవాలన్న కోరిక కలుగుతుంది. ఈయన రచనల్లో నిలిచిన కాలం గురించి మరొకసారి అంచనా వేయాలనిపిస్తుంది. ఈ రచయిత సోషలిస్టు ఆదర్శాల గురించి గట్టి పట్టింపు, ఆ నాటి ప్రపంచ సాహిత్యంపై అభిరుచి, అంతర్జాతీయ పరిణామాలమీద ఆసక్తి, జీవితాన్ని నిశితంగా పరిశీలించే శక్తి, శైలీశిల్పాల విషయంలో ఆధునిక పద్ధతుల నైపుణ్యం కలిగినవాడు. కథారచయిత. అనువాదకుడు. కవి. సినీరచయిత, వెండితెర నవలాకారుడు. ఆ కాలంలో ఈయన ఒక్కడే కాదు. ఈయన వంటివారు, కొంచెం తక్కువ వారు, కొంచెం ఎక్కువ వారు అనేకులున్న తరం అది, కాలం అది. అటువంటి కాలం, తెలుగు సాహిత్యంలో స్తబ్ద కాలం ఎందుకవుతుంది? 


అనిల్‌ అట్లూరి సంపాదకత్వం వహించిన ‘అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు’ (2021) రచయితను చాలామందికి మొదటిసారిగా పరిచయం చేశాయి, కొందరికైనా కొత్తగా పరిచయం చేశాయి. ఇందులో 26 కథలు, కొన్ని సమీక్షలూ, తండ్రి గురించి సంపాదకుడు అనిల్‌ చెప్పిన విశేషాలూ, ఈ పుస్తకం 1967నాటి ముద్రణకు కొడవటిగంటి కుటుంబరావు, 1994నాటి ముద్రణకు ఆరుద్ర, ఈ ముద్రణకి కొత్తగా వోల్గా రాసిన ముందుమాటలు ఉన్నాయి. ఇందులోని కథలు 1940-60 మధ్య కాలంలో వెలువడినవని సంపాదకుడు స్థూలంగా చెప్పారు కానీ, 1950 కంటె ముందు రెండు కథలు మాత్రమే ఉన్నాయి. కొన్ని కథలు 1960 తరువాత రాసినవి కూడా ఉండవచ్చు. ఈ రచయిత ఉధృతంగా రాసిన కాలం 1950లు. తెలుగు సాహిత్యంలో అనేకమంది వచన రచయి తలు, ముఖ్యంగా అభ్యుదయ వచన రచయితలు సృజనాత్మక వచనం విరివిగా రాస్తున్న కాలం అది. కవిత్వం లేదా కవిత్వో ద్యమాల ఆధారంగానే ఆధునిక సాహిత్యచరిత్రలో యుగ విభజన చేసి, 1950ల నుంచి దిగంబర కవిత్వం వచ్చే దాకా స్తబ్దంగా ఉండిన కాలం అని చెప్పుకుంటూ వస్తున్నాము. బహుశా, కవిత్వం తగ్గుముఖంలో ఉన్నదేమో, లేదా, ఇతర మార్గం పట్టిందేమో తెలియదు కానీ, అనేక గొప్ప తెలుగు కథలు, నవలలు 1950 దశాబ్దంలోనే వచ్చాయి. 1960లలో కూడా తెలుగు కథకు కొరత లేదు. కాకపోతే, కొత్త ప్రయాణపటాలు గీసుకోవాలి. 


గురజాడ వారసత్వాన్ని రెండు దశాబ్దాల తరువాత కానీ తెలుగు సాహిత్యం అందుకోలేదని అంటుంటారు. ఆ పరిశీ లన కూడా కవిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే. వచన రచయితలు అతిత్వరలోనే ఆయనను అందుకున్నారు. కవిత్వంలో కాల్పనిక స్వేచ్ఛావాదం బలంగా ఉన్న కాలంలో, కాల్పనిక వచనం వాస్తవికతని, రాడికల్‌ కాల్పనికతను ప్రకటించింది. 1930 దశాబ్దంలో భావ కవిత్వం నవ్య కవిత్వమై, 1940 మలుపు తిరిగేసరికి అభ్యుదయ స్వరం స్పష్టమైపోయింది. భావకవిత్వం సంప్రదాయవాదులకే కాక, అనంతర తరానికి కూడా పరిహాసాస్పదం అయింది. ఈ పుస్తకం ప్రకారం, అట్లూరి మొదటి కథ 1945లో ప్రచురితమైంది. ఆ కథ పేరు ‘శాస్త్రి’. కథనంలో ఆరంభదశనే సూచిస్తున్న ఈ కథ, వస్తువులో మాత్రం శుష్క కాల్పనిక కవిత్వాన్ని నిరసిస్తుంది. శాస్త్రి, ఏ భావకవికి నామవాచకమో, సర్వనామమో అనిపిస్తుంది. 


నేవీ నేపథ్య కథలను అట్లూరి, సర్వీసు నుంచి బయటకు వచ్చాకనే రాసి ఉండాలి. కొత్తగా వచ్చిన స్వాతంత్య్రం మీద రాసిన ఆగ్రహకథలు కూడా 1950 తరువాతనే అయి ఉండాలి. తెలంగాణలో ఆళ్వారుస్వామి కూడా రైతాంగ పోరాటఘట్టం ముగిసిన తరువాత, ఉద్యమ కథారచన కొనసాగించారు, నవలారచన ప్రారంభించారు. అభ్యుదయోద్యమం సడలి పోయిందని అనుకుంటున్న కాలంలో, ఆ కోవ రచయితల రచనలేమీ తగ్గలేదు. అనేకమంది కమ్యూనిస్టుల కంటె కొద్ది ఆలస్యంగా సినిమారంగానికి వెళ్లినా, పిచ్చేశ్వరరావు కథా రచన కొనసాగించారు, 1966లో మరణించేదాకా ఆయన రచనల్లోని నైతికావేశం, శైలిలోని ప్రత్యేకత తగ్గలేదు. 


పిచ్చేశ్వరరావు కథలు చదివినప్పుడు తెలుగు కథ వెడల్పు, లోతు పెరిగినట్టు అనిపించింది. యుద్ధంలోకి, మిలిటెంట్‌ స్వాతంత్ర్యోద్యమంలోకి, నావికాదళ ఉద్యోగం అందించే ఒక బహుజాతీయ మిశ్ర జీవితవిధానంలోకి తెలుగు కథ ద్వారా ప్రయాణించడం కొత్త అనుభవం. 1990లలో పునర్ముద్రణ పొందిన పిచ్చేశ్వరరావుగారి కథలకు ముందు మాట రాసిన ఆరుద్ర, తెలుగు సాహిత్యంలో సాయుధదళాల ఇతివృత్తాల గురించి ఎవరైనా పరిశోధన చేయాలని సూచించారు. శిష్ట్లా ‘సిపాయి కథలు’, ఆరుద్ర ‘దండు కథలు’ సరే, అంగర వెంకట కృష్ణారావు సైనిక జీవితంపై ఒక నవలే రాశారు, అనేక కథలూ రాశారు. కల్యాణ సుందరీ జగన్నాథ్‌ కూడా ఒక సైనిక కథ రాశారు. ఈ కథలన్నీ, తెలుగు కథను దాని ప్రాదేశిక సరి హద్దులు దాటించాయి, ఒక అంతర్జాతీయ అనుభవంలో భాగం చేశాయి. ఈ అందరి కథలకూ పిచ్చేశ్వరరావు కథలకూ ఉన్న తేడా ఏమిటంటే, ఆయన సైన్యంలో తిరుగుబాటును రాశారు. అది 1946నాటి నావికాదళం తిరుగుబాటు. నావికాదళ జీవితం, దానిచుట్టూ ఉన్న అంశాలకు సంబంధించి, ఆయన మొత్తం ఐదు కథలు రాశారు. ‘చిరంజీవి’ అన్న కథ, నావికాదళం తిరుగుబాటు ఇతివృత్తంగా నడుస్తుంది. ఇతివృ త్తమే ఈ కథకు ఒక ప్రత్యేకతను సమకూ ర్చింది. బర్మా నుంచి పారిపోయి వచ్చి, జపాన్‌ వాడిని చావగొట్టడానికి రాయల్‌ ఇండియన్‌ నేవీలో చేరిన చిరంజీవి, చివరకు బ్రిటిష్‌ వాడి మీదకే తోటివాళ్లను కూడగట్టాడు. దొడ్లు కడిగే పని ఇచ్చినా, ఆఫీసర్లకుకూడా నాయకత్వం వహించాడు. రష్యా ఎర్రసైన్యం నుంచి, చైనా ప్రజాసైన్యం నుంచి, యుగొస్లావియా గెరిల్లాల నుంచి తాను స్ఫూర్తి పొందుతున్నానని చెప్పాడు. గుండు దెబ్బతిని చిరం జీవి అయ్యాడు. అతను తెలుగువాడో కాదో కానీ, అసలు అతడు ఒకే ఒక్క వ్యక్తి అవునో కాదో కానీ, అక్కడ ప్రత్యక్షంగా ఉన్న తెలుగు కథకుడు, ఒక గొప్ప ధిక్కార ఉదంతాన్ని తెలుగు సాహిత్యంలో భాగం చేశాడు. నేవీ జీవితం చుట్టూ జీవి తాన్నికూడా పిచ్చేశ్వరరావు వర్ణించాడు. నావికులకు చపాతీలు వండిపెట్టే చౌరమ్మను, దేశదేశాల నావికులకు లైంగిక సేవలు అందించే విన్నీని కూడా కథనం చేశాడు. 


పిచ్చేశ్వరరావుకు సన్నివేశాల, పాత్రల వాస్తవిక, సహజ చిత్రణ వచ్చు. కానీ, క్రమానుగతంగా కథను నడపడం మీద ఆయనకు పెద్ద ఆసక్తి లేదు. వచనం మరీ సూటిగా ఉండడం మీదా ఆయనకు పెద్ద గౌరవం లేదు. రెగ్యులర్‌ కథలనదగ్గ కథలు కూడా ఆయన రాశాడు. కానీ, అత్యధిక భాగం కథల్లో, కాలంలో ముందుకూ వెనుకకూ నడిచే కథనం, రకరకాల వ్యంగ్యంతో నిండిన శైలి కనిపిస్తాయి. వ్యంగ్యం ఒక్కోసారి కోపంగా ఉంటుంది, ఒక్కోసారి ‘టంగ్‌ ఇన్‌ చీక్‌’గా ఉంటుంది. ఒక్కోసారి కవన కుతూహలంతో సాగుతుంది. స్వాతంత్య్రపు ఆశాభంగాన్ని చిత్రించిన ‘నెత్తురు కథ’, ఆగస్టు 15’ కథలు ఒకటి కవితాత్మకంగా, మరొకటి అధివాస్తవికంగా సాగుతాయి. కీలకమైన మౌలికమయిన ప్రశ్నలతో కొన్ని కథలు తాత్వికంగా అనిపిస్తాయి. యుద్ధమెందుకు వచ్చిందో ప్రశ్నించే సహప్రయాణికుడు, భర్త కంటె ముందే చనిపోవాలన్న కోరిక తనకెందుకు అన్న ప్రశ్నకు సమాధానం వెదికే భార్యా, చైతన్యస్రవంతిలో దేశభక్తినీ, వ్యక్తీ స్వాతంత్ర్యాన్ని చర్చించే ఖైదీ ఎంతో ఆసక్తికరంగా కనిపిస్తారు. వాటిల్లో కథ, కథనం కంటె ఆలోచనలు, ప్రకటనలు, కవితాత్మక వర్ణనలు పాఠకు లను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ‘‘చావటం చేతకానివాళ్లకి బ్రత కటం అంటే యేమిటో తెలియటం కష్టమేమో’’ అన్న అను మానం కలుగుతుంది ఒక పాత్రకి. మరో కథలో ఒక పాత్ర అడుగుతుంది, ‘‘ఆయమ్మాయి ‘మనవాళ్లే’నంటావు గదా సుబ్బీ అనిపిలుస్తావేమిటిరా?’’. మరో కథలో మాలవాళ్లతో సహ పంక్తిచేసిన ఒక సంస్కర్త పాత్ర ఎదుర్కొన్న చిక్కు గురించి ఇట్లా రాస్తాడు. ‘‘...ఎనభైయేళ్ల వెంకడు పాపారావుని ‘చిన్న దొరగారూ’ అని పిలుస్తుంటే, వేలెడులేని సుబ్బడొచ్చి ‘పాపా రావ్‌! గోళీలాడుకుందాం రావోయ్‌!!’ అని అంటూంటం చూస్తే ఆయనక్కూడా మండింది.’’


సామాజికమైన, రాజకీయమైన తీవ్ర అభిప్రాయాలున్న పిచ్చేశ్వరరావు, మానవసంబంధాల కథలు కూడా సున్నితత్వంతో రాశారు. హిందీలో తానే రాసి, తిరిగి అనువదించి 1947లో ప్రచురించిన ‘చిత్రాతిచిత్రమైన ఒక గాథ’ సన్నిహిత సంబంధా లున్న స్నేహితుల మధ్య ఆకర్షణలు, అసూయలను, ఆధిపత్య భావనలను చర్చించింది. భార్యాభర్తల మధ్య ఎడబాటు కలయికల చట్రాన్ని కూడా ఎటువంటి తీర్పులూ లేకుండా మరో కథలో చర్చించారు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రాసిన రెండు కథలు కూడా ఆర్ద్రతతో ఆశతో రాసినవి. గ్రామప్రభుత్వం ఎవరివి వాళ్లకిస్తుందన్న మాటతో ‘విముక్తి’ కథలో సుబ్బమ్మ ఉప్పొంగిపోతే, కోల్పోయినవి తిరిగి ఇవ్వడంలో స్వతంత్ర భారత ప్రభుత్వం విఫలం కావడం కొన్ని కథలలో బాధితులను కుంగదీస్తుంది. ‘‘తుపాకి పేల్చేవాళ్లమీద తుపాకి పేల్చేందుకు జంకని వాళ్లు చాలామంది తయారయ్యారు’’ అని ‘బ్రతకడం తెలియనివాడు’ కథ చివరిలో కథకుడు రాసిన వాక్యం కథాకాలాన్ని దాటి అన్వయిస్తుంది. 


భావకవిత్వ కాలంలో వచ్చిన కథాసాహిత్యం లోని మంచి లక్షణాలను కొనసాగిస్తూనే, అభ్యుదయ కథారచన, అనేక రాజకీయ అంశాలను వస్తువు లుగా తీసుకున్నది. పిచ్చేశ్వరరావు కథావస్తువులన్నీ ఆయన జీవనానుభవం నుంచి, రాజకీయానుభవం నుంచి వచ్చినవే. వస్తువుతో మాత్రమే ఆయన ఆగలేదు. చెప్పడం మీద ప్రధానంగా దృష్టిపెట్టారు. ‘వసుంధర’ కథలో జీవులు, నిర్జీవులు కూడా కథను చెబుతాయి. అటువంటి శైలితో కథ తెలుగులో మరొకటి వచ్చి ఉండదు. 


పిచ్చేశ్వరరావు ఇష్టాలు, ఆసక్తుల గురించిన మరింత అవగాహనను ఆయన అలభ్య ప్రచురణ ‘విన్నవి-కన్నవి’లో తెలుసుకోవచ్చు. మెకార్తీయిజం పరిణామాలను ఆయన ఆసక్తిగా గమనిస్తూ, వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే, బ్రెహ్ట్‌ నాటకకళ గురించి ఆయన పరిచయం కూడా. 


ఈ కథలను ఇంత కాలం తరువాత చదువుతున్నప్పుడు, ఇప్పటి కాలమూ కథాకాలమూ లేదా రచనాకాలమూ కూడా పాఠకులలో ఏకకాలంలో ఉనికిలోకి వస్తాయి. చారిత్రకమైన ఈ పఠనం, ఆ కాలపు చరిత్ర గురించి, నడుస్తున్న చరిత్ర ప్రాధాన్యాల నుంచి అర్థం చేసుకుంటూ సాగుతుంది. పిచ్చేశ్వరరావు కథలు, ఆయన గురించి, ఆయన సాహిత్య సమకాలికుల గురించి, కథాసాహిత్య చరిత్ర గురించి కొత్త ఆలోచనలకు ఆస్కారం ఇస్తాయి.

కె. శ్రీనివాస్‌

Read more