కన్నడాంధ్ర మకరందం

ABN , First Publish Date - 2022-06-06T05:30:00+05:30 IST

కన్నడ, ఆంధ్ర భాషలలోని కావ్యాలను, నవలలను, కథలను పరస్పరం అనువదించటం కొత్తేమీ కాదు, అనాదిగా ఉన్నదే.

కన్నడాంధ్ర మకరందం

కన్నడ, ఆంధ్ర భాషలలోని కావ్యాలను, నవలలను, కథలను పరస్పరం అనువదించటం కొత్తేమీ కాదు, అనాదిగా ఉన్నదే. ‘‘కన్నడిగుల ఆదికవి తండ్రి తెలుగువాడు కాగా తల్లి కన్నడ ఆడబడుచు. నాచన సోమనాధుడు కన్నడ ధరిత్రి యందు జన్మించి తెలుగులో కొమ్ములు తిరిగిన కవీశ్వరుడైన ఉదంతం జగం ఎరిగి నదే’’ అంటారు కన్నడంలో శతావధానిగా పేరుగాంచిన ఆర్‌.గణేశ్‌. ఈ పరంపరలోనిదె ‘మంకు తిమ్మని మిణుకు’ కూడా. పద్మభూషణ్‌ డి.వి.గుండప్ప రాసిన ‘మంకు తిమ్మన కగ్గ’కు ఇది యథాతథ తెలుగు అనువాదం. యథాతథ తెలుగు అనువాదం చాలా క్లిష్ట మైంది. ఈ ప్రక్రియలో మూలంలో పద్యాలు ‘ఏ ఛందస్సులో ఉంటాయో అనువాద భాషలో పద్యాలు అదే ఛందస్సులో, అనువ దించగలిగి ఉండాలి. ఈ పద్ధతిలో భాషాంతరీకరణంలో అల్ప మైన లోపం ఉంటే అది బాషాంతరీకరణ పరిమితే అవుతుంది కానీ అనువాదకుడి లోపం కాదు. ఈ కన్నడాంధ్రానువాదం చూడండి: ‘‘పారిజాతవకందు నిడుసుయ్దు, పదగళిం, శౌరికథెయను హెణెదు తృప్తనహను కవి, ఊరినుద్యానకద తరిసి బెళసువ కార్య, ధీరనుల రాజ్యకను-మంకుతిమ్మ’’ (కన్నడ). దీని ఆంధ్రానువాదం: ‘‘పారిజాతము జూసి మెచ్చి పదములతోను, శౌరికథ నల్లుచును తృప్తిపడును కవి, ఊరి వనమునకు దానిని తెచ్చి పండించు, ధీరుడౌ రాజ్యకుడు- మంకుతిమ్మ’’ (తెలుగు).


అనువాదకుడు మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి సంస్కృత, కన్నడాంధ్రలలోను, ఆంగ్లంలోను అసామాన్య ప్రతిభకల రచయిత. ఈ భాషల్లో సహజ సిద్ధమైన రచనా వ్యాసంగమే గాక, అనువాద వ్యాసంగం కూడా చేస్తుంటారు. సి.నారాయణరెడ్డి ‘విశ్వంభర’ కావ్యాన్ని కన్నడంలోకి తొలిసారి అనువదించిన ఘనాపాటి ఈ చంద్రమౌళి. ప్రస్తుత రచన ‘మంకు తిమ్మన కగ్గ’ను పద్మభూషణ్‌ గుండప్ప ఎనిమిది దశాబ్దాల క్రితం రచించారు. కర్ణాటకలో దీనిని ‘కన్నడ భగవద్గీత’ అని కూడా పిలుస్తారు. అసలు భగవద్గీతను కన్నడిగులందరూ చదివి ఉండకపోవచ్చుకానీ, ‘మంకు తిమ్మన కగ్గ’ మటుకు ప్రతి కన్నడిగుడి నోట్లో నానుతూనే ఉంటుంది. రాజకీయ నాయకుల నుంచి, రచయితలు, పత్రికా సంపాదకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువత - ఇలా వీరు వారేమిటీ, యావత్‌ కన్నడ రాజ్యంలో ప్రతి రోజు ఏదో రూపంలో ‘మంకు తిమ్మనకగ్గ’ ప్రతిధ్వనిస్తుంది. ముఖ్యంగా దినపత్రికలు ఏదో ఒక శీర్షిక రూపంలో ఈ పద్యాలను తరచు ప్రచురిస్తూనే ఉంటాయి. ఇందుకు మరో కారణమూ ఉంది. అది: గుండప్ప గారి వ్యక్తిత్వం, బహుముఖ ప్రజ్ఞ, నిరాడంబర జీవనం, ఆచరణాత్మక తాత్విక జీవన వైఖరి, శైలి. ఆయన కేవలం కవి, మార్మికుడే కాదు; గొప్ప పత్రికా రచయిత, సంపాదకుడు కూడా. కన్నడంలోనేగాక, ఆంగ్లంలో కూడా పత్రికావ్యాసంగం నెరిపిన మహామేధావి. తెలుగు అద్భుతంగా మాట్లాడటమేగాక తెలుగులో హాస్యోక్తులు, చాటువులుగూడ చెప్పే వారు. ఒక రకంగా ఆయన తాత్విక చింతన, రచనలు, జీవన శైలి చూస్తే మన జిడ్డు కృష్ణమూర్తి జీవితం స్ఫురణకు వస్తుంది.


దురదృష్టమేమోగాని ఎనిమిది దశాబ్దాల క్రింద తొలిసారి అచ్చయి, అనతి కాలంలోనే బహుళ ప్రాచుర్యం, జనాదరణ పొందిన ఈ మహాకావ్యం ఇటీవల వరకు తెలుగు వారికి తెలీనే తెలీదు. కువెంపు భాషా భారతి ప్రాధికార సంస్థ కోర్కె మేరకు ఎం.ఆర్‌. చంద్రమౌళి ‘మంకు తిమ్మనికగ్గ’ను తొలి సారి తెలుగులోకి అనుదించారు. దీనిని కువెంపు భాషా భారతి వారే పోయిన ఏడాది అచ్చు వేశారు. 


‘మంకు తిమ్మనకగ్గ’ని కన్నడపు ‘భగవద్గీత’ అంటారంటే ఇదేదో అసలు భగవద్గీతలా జ్ఞాన, భక్తి, కర్మ, షట్కాలుగా విభజితమై ఉండవు. ఇవి వాటిని భోదించవు కూడా. ఇవి వేమన, సుమతి శతకాల్లా నీతినీ బోధించవు. కాని ఈ పద్యాలలో ఒక వైచిత్రి కనిపిస్తుంది. శైలి విషయంలో ఇంతకు ముందు తెలుగులో కానీ, ఏ ఇతర భాషల్లో కాని ఇటువంటి శైలిలో ఉన్న పద్యాలు ఎవ్వరూ రాసి ఉండలేదు. అందుకు అనేక కారణాలు లేకపోలేదు. ఒకటి, తెలుగునాట కవితా సరళి చందోబద్ధమైన సంప్రదాయ సాహిత్యం నుంచి వచన కవిత్వం వైపుకు దాదాపు ఒక శతాబ్దం కిందనే మారింది. ఇవాళ వచన కవితలు రాసేవారిలో నూటికి పదిమందికి కూడా పద్య ఛందస్సుపై పట్టు లేదు. భావమే ప్రధానంగా- కుందుర్తివారి వచన కవిత్వం నుంచి నేటి ‘నానీ’ల వరకు కవితా సామ్రాజ్యం పరిఢవిల్లుతోంది. గతంలో కూడా మనకు సాహిత్యంలో పరిచయంలో ఉన్న బహు ముఖ ప్రజ్ఞాశీలులైన రచయితలు, పత్రికా సంపాదకులు, రాజ కీయ వేత్తలు ఎందరో ఉన్నారు. కాని వారెవ్వరికీ గుండప్పగారిలా ఇలాంటి పద్యాలలో కవితా వ్యాసంగం చేయవచ్చునని ఎందుకు అనిపించలేదో అర్థం కాదు. గుండప్పగారి ఈ ‘మంకు తిమ్మన కగ్గ’లో పద్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ పద్యాలన్నీ గుండప్ప గారి స్వీయ చరిత్ర నుంచే ఉద్భవించినవి కావు. అలా అని అవి ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం ఆవలి వైపువీ కావు. తన చుట్టూ పరిభ్రమించే ప్రపంచంలో జరుగుతున్న వాటిని నిశితముగా గమనిస్తూనే, వాటిల్లోంచి ఆయన తన భావాలను, నూతనార్థాలను వెలికితీసినట్లు అవగతమవుతుంది. ఉదాహరణకు ఈ పద్యము చూడండి. ‘‘బొద్ధి ప్రకాశమున నంతర భవశోద, సిద్ధమా శోధనన్‌ సత్య సంవీక్ష, శుద్ధ సత్యము జీవిత ప్రశ్నకొదవంగ పద్ధతియె ధర్మముర - మంకుతిమ్మ’’. ఇలా ఒక బాహ్య ప్రపంచానికి, అంతఃప్రపంచానికి మధ్య ఇంటర్‌ఫేస్‌లో జరిగిన సంఘర్షణ నుంచి ఉద్భవించిన సామాజిక తాత్విక కవిత్వం ఇది. అలాగే ‘‘ఇంత బాహ్యాంతరములన్య లోకములు కావంతరం గము నందు సంతసందడిలా, సంతలోను యంతరంగమది విని పించు స్వాంతమిరువైపులవి - మంకుతిమ్మ’’. ఈ పద్యములోని ప్రతి పదానికి లౌకిక అర్థము, వ్యాఖ్యా నము ఉన్నది. అలానే పార మార్థిక అర్థం, వ్యాఖ్యానం ఉన్నది. ‘‘రాజ్యపాలన, పాలకుడి పాలన విశ్లేషణను చేయవలసివస్తే పరిశుద్ధమైన ప్రభుత్వం కానీ రాజ్య కారణము కాని సంభవం కాదు. ఎంతో కొంత లోటు పాట్లు ఉండి తీరతాయి’’ అంటారు గుండప్ప. ‘‘యుద్ధమైనను, రాజ విద్యయైు నను, శాస్త్ర వృద్ధియైునను, నరుని తలవ్రాత మిగులు, క్షుద్ర కార్పణ్యమన్యాయముల వంతింత, వద్దనుండును మనకు- మంకు తిమ్మ’’. జ్ఞాన, కార్పణ్యంల చాటున కొంత వంచన, స్వార్థము అనే క్షుద్రమైన భావాలు ఇంతో అంతో పాలకులలో మిగిలి ఉంటా యనే సత్యాన్ని గుర్తించాలన్నది దాని సారాంశం. అంటే ఏ పాల కుడు ఏనాడు, ఎప్పుడూ నూటికి నూరుశాతం న్యాయబద్ధంగా వ్యవహరించడన్నది ఆయన చెప్పకనే చెప్పారు. ఆనాటి రాష్ట్ర పాలకులు కొంతమంది తమకు తాము న్యాయమైన పాలకులుగా చెప్పుకొంటున్న సందర్భంలో రాసిన పద్యం ఇది. 


‘ఏ సమస్య అయినా సరే, పక్షపాత దృష్టిని వదిలి, ఉద్వేగ రహితంగా ఆ సమస్యకి సంబంధించి అన్ని కోణాల్ని పరిశీలించి జాతికి మేలు చేసే దృష్టిలో దానికి పరిష్కారం కొనుగొనడం గుండప్ప విలక్షణ పాత్రికేయ పాత్ర’ అని అంటారు చంద్రమౌళి. ఒకానొక సందర్భంలో గుండప్ప గారికి నాటి మైసూర్‌ దివానంలో మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపినా, మృదువుగా దానిని త్రోసిపుచ్చిన త్యాగశీలి ఆయన. ఆ సందర్భంలోనే నాటి రాజకీయ స్థితి గురించి వారొక అద్భుత పద్యం రాశారు. అది నేటి రాజకీయ వ్యవస్థకు కూడా అద్దం పడుతుంది. ‘‘దొరతనమే నావనిరుప్రక్క లును సుడితెరలు, సుధగ్రోలి కొందరోడను నడుపు చొరగ, ఒంపిడి తుఫాను లిడజనుల్లెలలేచిపడ, పొరలి పడదదె వింత - మంకు తిమ్మ’’. ఒకానొక సందర్భంలో గుండప్పకి నాటి కర్ణాటక ముఖ్య మంత్రి దేవరాజు అర్సు నెలవారి గౌరవ వేతనం ఇవ్వడానికై నిర్ణయం చేశారు. అయితే గుండప్ప దానిని సున్నితంగా తిరస్క రించారు. ఆ తిరస్కారం ఎలా ఉందో ఈ పద్యంలో చూడండి. ‘‘నూకలంబలి గుడిచి తృప్తిగా మను చున్న కాకి దొంగిలి తిండి చూసి మత్సారమా, నూకునాకలిని తినిన తిండదేమైనను నీకేల తల వంపు? - మంకుతిమ్మ’’. తలవంపు లేక కష్టపడి గడించి అంబలి త్రాగినా మేలే కాని మృష్టాన్నం కోసం ఆత్మాభిమానాన్ని చంపుకోకూడదు అన్నది ఈ పద్యం సారాంశం.


ప్రతి పద్యం చివర ‘మంకుతిమ్మ’ అనే సంతకాన్ని బట్టి ఈ ‘మంకు తిమ్మ’కు గుండప్పకు ఏదో సంబంధం ఉండి ఉంటుందనే తోస్తుంది. స్వయంగా గుండప్ప తన ‘మంకుతిమ్మనకగ్గ’లో ముందు భాగంలో ఒక కథ తెలిపారు. ఈ కథలోని ‘మంకుతిమ్మ’ అనే ఉపాధ్యా యుడు గుండప్పకు వరుసకు ‘మేనమామ’ అని 1943లో ప్రకటిం చారు. నిజానికి ఆయన మేనమామ అవునో కాదో తెలిసిన వారె వ్వరూ లేరు. ‘మంకు తిమ్మనకగ్గ’ కావ్యాన్ని ‘మనన కావ్యం’గా పేర్కొన్నారు గుండప్ప. ఇదో కొత్త రకం కావ్యం. ఇందులోనూ అలంకారాలు, శబ్ద ప్రయోగాలుంటాయి. పాఠకులకు సాధారణ లౌకిక జ్ఞానం ఉంటే చాలు సులువుగా బోధపడతాయి. పండితు లైన వారికి తత్వదర్శనం కూడా అవుతుంది. ఏ కవి లక్ష్యమైనా లోకాన్ని పామరులకు అర్థమయ్యే రీతిలో కావ్య దర్పణంలో చూప టమే కదా! ఆ పనే చేశారు గుండప్ప. అంతేగాదు, గుండప్ప తన దేహాన్ని చాలించే ముందు జీవన సాఫల్యంగా మరో వేయి పద్యాలు రాశారు. దీన్ని ‘మరుళమునియనకగ్గ’ అని ప్రచు రించారు. వీటిని కూడా చంద్రమౌళే ఆంధ్రీకరించారు. ‘మంకు తిమ్మనకగ్గ’లోని గుండప్ప కన్నడ పద్యాలు, అందులోని విషయం, వస్తువు, చెప్పిన తీరు, వాటిని చంద్రమౌళి యథాతఽథంగా తెలుగులోకి అనువదించిన విధానం అనువాద సాహిత్యంలోనూ, మనన సాహిత్యంలోనూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాయి. అనువాద సాహిత్యంలో ఇది చిరకాలం నిలిచిపోతుంది.


కొప్పరపు నారాయణమూర్తి

76719 09759

Updated Date - 2022-06-06T05:30:00+05:30 IST