అస్తిత్వవాదంలో ఇమడని ‘కళింగ’ వాస్తవం

ABN , First Publish Date - 2022-04-04T06:55:49+05:30 IST

కథకునిగా, నవలా రచయతగా అట్టాడ అప్పలనాయుడుకు తెలుగు సాహిత్యంలో సముచిత స్థానమున్నది. ‘బహుళ’ అతని తాజా నవల...

అస్తిత్వవాదంలో ఇమడని ‘కళింగ’ వాస్తవం

కథకునిగా, నవలా రచయతగా అట్టాడ అప్పలనాయుడుకు తెలుగు సాహిత్యంలో సముచిత స్థానమున్నది. ‘బహుళ’ అతని తాజా నవల. ఆర్థిక అసమానతలు పోరాట రూపంగా మారిన నేల నుంచి వచ్చిన రచయతగా ఆయన ఈ నవలలో తన ప్రాంత జీవితాన్ని చిత్రించే ప్రయత్నం చేశాడు. రచయిత జీవిత నేపథ్యం నుంచి వచ్చిన నవల పూర్తిగా తన చుట్టూ వున్న జీవితాన్ని చిత్రించిందా? బహుళ అస్తిత్వాల తలంపై నిలబడి అన్నిటినీ ఎంతవరకు నమోదు చేయగలిగాడు. ముఖ్యంగా రచయత నిజాయితీ మాటేమిటి?


‘బహుళ’ ఆకలి గురించి మాట్లాడింది. ఆకలిని చల్లార్చే భూమి గురించి మాట్లాడింది. భూమిని సాగు చేసే రైతు గురించి మాట్లాడింది. రైతుపై ఆధారపడిన కూలీల, చేతి వృత్తులపై మాట్లాడింది. అంతిమంగా మనుషుల చలనంలో దాగిన కన్నీటిని ఒడిసిపట్టింది. నవల కళింగాంధ్రకు సంబంధించినది మాత్రమే కాదు. ఇందులో భారత సమాజ, మరీ ముఖ్యంగా గ్రామీణ జీవన విధ్వంసం ఇమిడి వుంది. భారత దేశంలో భూస్వామ్యం పునాది అంశంగా వుంది. ఇక్కడ భూమి మనిషి విలువను నిర్ణయిస్తుంది. మనుషుల రాగద్వేషాలు ఊహలు, స్వప్నాలు, ఉద్వేగాలు, పోరాటాలు భూమి పునాదిగా ఆధారపడి ఉన్నాయి.  


వెనుకుబాటుతనం నుంచి కనీస జీవిక కోసం వెతుకులాట ఈ నవలలో కనిపిస్తుంది. మానసిక సంక్షోభాల నుంచి దాటివచ్చిన పరా జితులు, విజేతలు ఈ నవలలో కనబడతారు. కళింగాంధ్ర గ్రామీణ జీవితం, సంస్కృతి, సంప్ర దాయాలు, పండుగలు, పెళ్లిళ్లు, చివరకు మృత్యువు... ఈ అన్నిటి వెనుక సామాజిక విషాదాలు వున్నాయి. అధికార మార్పిడి అనంతరం కళింగాంధ్ర వలసల భూమిగా మారింది. నిజానికి అధికార మార్పిడి అనేది కొండ గుర్తు మాత్రమే గాని- నూరేళ్ళ కాలంలో ఈ వలసలు ఎక్కడ మొదలయినాయో సాధికారంగా చెప్పలేం. ఇక్కడ జీవనదులు లేకున్నా, భూమి దాహార్తి తీర్చే ఏటి పాయలకు కొదవ లేదు. శ్రామిక సంస్కృతికి అద్దం పట్టిన నేల ఇది. వ్యవసాయం ఇక్కడి ప్రధాన వ్యాపకం. భూమిని పొదివిపట్టుకొనే మట్టి మనుషులకు ఇక్కడ లోటు లేదు. అయినా కరువు సీమగా, వెనుకబడిన ప్రాంతంగా ఎందుకు కునారిల్లింది? భూమి ఎక్కడ, ఎవరి దగ్గర కేంద్రీకృతమై వున్నది? కనబడని శత్రువు మాటేమిటి? ‘బహుళ’ నవల ఈ నేల జీవస్మరణను, ఆ నేల ఉత్థాన పతనాలను పరిచయం చేసింది. ఇది సకల అసమానతల నేల. కులం వర్గం.. ఇంకా ముందుకు పోతే భూస్వామ్య అరాచకత్వం పరిఢవిల్లిన నేల. వీటి చుట్టూ అల్లుకున్న విష సంస్కృతి మనుషుల సకల జీవన లాలసను హరించి వేసింది. నవలలోని పాత్రలు కేవలం కల్పిత పాత్రలు కావు. మన చుట్టూ సంచరించిన మానవ సంచారులు. వాస్తవికతను రచనలో నిలపడం లేదా వాస్తవిక జీవన ఘర్షణను చిత్రించడం, గడిచిన కాలాన్ని, వర్త మాన కాలాన్ని అంచనా వేయడం రచయతకు నవలా వస్తువుతో వున్న మమేకంతో సాధ్యపడుతుంది. వాస్తవికత కేవలం కుటుంబ సంబం ధాలకే పరిమితం కాలేదు. కాస్త ముందుకు వెళితే- ‘బహుళ’ రాజకీ యార్థిక నవల కూడా. ఈ సూత్రీకరణ ఎందుకంటే- ప్రపంచ చరిత్ర లోనే భూమికోసం, భుక్తికోసం, నూతన ప్రజాస్వామ్య కోసం రక్తంతో కల్లాపు జల్లుకున్న నేల కళింగాంధ్ర. ఇదేదో ఉద్యమాన్ని రొమాంటిసైజ్‌ చేయడం కాదు. కుల, వర్గ ఆధిపత్య సామాజిక దొంతర్లలో నలిగిన మట్టి మనుషుల చివరి ఆయుధం విప్లవం. ప్రజల ధిక్కారం సాయుధ పోరాట రూపంగా మారే క్రమానికి రాజకీయ భావజాలం మాత్రమే పునాది అంశంగా వుండదు. ఆ నేలకు వుండే స్వభావం కూడా చోదక శక్తిగా ఉంటుంది. ‘బహుళ’ నవల అనేక జీవన విధ్వంసాలకు రాజకీయార్థిక పరిష్కారాలను వెతికింది. అంతిమంగా అస్తిత్వ ధోరణి వరకు కొనసాగింది. 


అప్పల నాయుడు ప్రజా ఉద్యమాలనుంచి రచయతగా రూపొందినవాడు. ఆయన ఉద్యమాలలో భాగం అయిన వాడు. వాటి తీవ్రతను గుర్తించి ప్రజలపక్షాన నిలబడినవాడు. రచయతగా ఉద్యమ స్వభావాన్ని దాని నడకను విమర్శనా త్మకంగా గమనించినవాడు. ఎక్కడయితే విప్లవ ఆకాంక్ష బయలు దేరిందో, ఎక్కడ మనుషులు మానవీయ ప్రపంచం కోసం ప్రాణ త్యాగం చేసినారో ఆ నేల నుంచి మాట్లాడు తున్న రచయతకు మరింత బాధ్యత ఉంటుంది. నక్సల్‌బరీ పోరాట రూపాన్ని అతివాదమని అనడం, పూర్తిగా నిరాక రించడం ఇది అవగాహనకు సంబంధించినది మాత్రమే కాదు. వాస్తవాన్ని చూడ నిరాకరించడమే. భారత దేశంలో విప్లవ అవసరం ఇంకా అలాగే ఉంది. ఎందుకంటే ఈ దేశం భూస్వామ్య అవశేషాన్ని కోల్పోలేదు. ఇంకా ముందుకుపోతే, భూస్వామ్యం బ్రాహ్మణీయ హిందూత్వగా చెలామణి అవుతుంది.


విప్లవోద్యమం భారత దేశానికి సంబంధించినంత వరకు అనేక అప్రజాస్వామిక ధోరణులకు సమాధానంగా నిలిచింది. తాజాగా హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది. విప్లవాన్ని కేవలం ఆయుధ పోరాట తలంపై నుంచి అంచనా వేయలేం. ఒక ఏభైఏళ్ల కాలంలో భారత సమాజం పట్ల అది ఎలాంటి బాధ్యతను నిర్వహించింది, ప్రజల్లో ఎలా భాగం కాగలిగింది, ఈనాటికీ స్థిరంగా ఎలా కొనసాగుతున్నది. ఇది సాధారణ అంచనా మాత్రమే. బహుళ నవల దళిత, బహుజన అస్తిత్వాలలోని అణచివేత గురించి మాట్లాడింది. అగ్ర కులాధిపత్యం ఎలా పరిఢవిల్లుతున్నదో చెప్పింది. అయితే అణచివేయబడుతున్న సమూహాలని దళిత బహుజన ఐక్యత విముక్తి చేయలేదు. వర్గ దృక్పథం పునాది నుంచి అంచనా వేయకపోతే ‘బహుళ’ చర్చకుపెట్టిన చాలా సమస్యలకు పరిస్కారం కనబడదు. శివారెడ్డి ముందుమాట కూడా వర్గ దృక్పథం ఆకాంక్షల నుంచి అస్తిత్వవాదం వైపు మొగ్గింది. 


భారత దేశం కుల వర్గ సమాజమే. ఈ రెండూ అంతిమంగా పరిష్కారం కావాల్సిందే. ఈ అసమానతల నుంచి భారత సమాజం బయటపడాల్సిందే. కానీ కుల వర్గ నిర్మూలన రెండూ వేర్వేరు అంశాలు కాదు. ఈ రెండు పోరాటాల సారమూ అంతిమంగా ప్రజలను విముక్తి చేయడమే. ప్రజా పోరాటాల నేల నుంచి వచ్చిన రచయత బహుజనవాదం వైపు మొగ్గుచూపడం నాణేన్ని ఒక వైపు అంచనా వేయడమే. 

అరసవిల్లి కృష్ణ

92472 53884


Updated Date - 2022-04-04T06:55:49+05:30 IST