కాకతీయుల యుద్ధ పాఠాలు!

ABN , First Publish Date - 2022-03-06T06:02:11+05:30 IST

ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో భారతదేశంలోని రాజరిక వంశాల్లో ప్రముఖులైన కాకతీయుల యుద్ధ వ్యూహాలు, రక్షణ చర్యలు ప్రస్తావనార్హం. అవసరమైతే ప్రతీ పౌరుడు యుద్ధ రంగంలో పాల్గొనేలా చేయడం...

కాకతీయుల యుద్ధ పాఠాలు!

ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో భారతదేశంలోని రాజరిక వంశాల్లో ప్రముఖులైన కాకతీయుల యుద్ధ వ్యూహాలు, రక్షణ చర్యలు ప్రస్తావనార్హం. అవసరమైతే ప్రతీ పౌరుడు యుద్ధ రంగంలో పాల్గొనేలా చేయడం, సామంత రాజుల మాదిరిగా నాయంకర వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం, పటిష్టమైన గూఢచారి వ్యవస్థ, రాజ్యం చుట్టూ రక్షణగోడల్లా గిరి దుర్గాల ఏర్పాటు... ఇలా కాకతీయులు అవలంబించిన భద్రతాచర్యలు పటిష్ఠమైనవి. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కృష్ణ, బీమా పరీవాహక ప్రాంతాలైన సుబ్బినాడు, గంగాపూర్, పిఠాపురం, రాజమహేంద్రవరం, కోనసీమ, మోటుపల్లి, కంచి, పుష్పగిరి, కడప, గండికోట, ఆదోని, కర్నూలు, ఆలంపూర్, బీదర్ సరిహద్దులుగా విశాల భూభాగాన్ని దాదాపు రెండువందల యాభై ఏళ్ల పాటు (1150 నుండి 1300 వరకు) కాకతీయులు పాలించారు.


విదేశీయుల దండయాత్రలను, ఉత్తర భారతం నుంచి తురుష్కుల సామ్రాజ్య విస్తరణ కాంక్షను, పొరుగు రాజ్యాల దురాక్రమణలను ఎన్నింటినో కాకతీయులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వీటన్నింటినీ తట్టుకొని కాకతీయులు నిలబడటానికి–పౌరులలో దేశభక్తి భావన పెంపొందించటం, బలమైన మిత్ర దేశాలను కలిగి ఉండడం, వాటితో వియ్యం అందుకోవడం వంటి చర్యలు దోహదపడ్డాయి. ప్రతాపరుద్రీయం గ్రంథంలో ‘నవ లక్ష ధనుష్క చక్రవర్తి’ అని ప్రతాపరుద్రుడిని కొనియాడటాన్ని చూస్తాం. తొమ్మిది లక్షల మంది యుద్ధ సైనికులను కలిగినవాడు అని దాని అర్థం. ఆనాడు తొమ్మిది లక్షల మంది సైనికులు ఉండడం గొప్పవిషయం. బహుమనీలు, మొఘల్ చక్రవర్తులకు కూడా ఇంత పెద్దసంఖ్యలో యుద్ధ సైనికులు లేరు. మరి, కాకతీయులకు అంత సైన్యం ఎక్కడిది? ప్రస్తుత రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు తొమ్మిది లక్షలు, ఉక్రెయిన్‌కు రెండు లక్షల సైనిక బలగం ఉంది. మిత్రదేశాలు అనుకున్నవి అండనిలవని కారణంగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు తన పౌరులకు ఆయుధాలు ఇస్తాను యుద్ధానికి సిద్ధం కమ్మని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.


కాకతీయుల కాలంలో పౌరులందరికీ అవసరమైతే వారు దేశ రక్షణలో పాల్గొనేలా యుద్ధ విద్యలో ముందే శిక్షణ ఇప్పించారు, వారిలో దేశభక్తి పెంపొందించారు. అందుకే కాకతీయ సామ్రాజ్యం విస్తరించిన ప్రతీ ప్రాంతంలోనూ వీరగల్లుల విగ్రహాలు ఇప్పటికీ దొరుకుతున్నాయి. అప్పటివారికి విలువిద్య, మల్ల యుద్ధం తదితర విద్యల్లో ప్రావీణ్యత కల్పించేవారు. సమయమొస్తే ప్రతీ ఒక్కరు సామ్రాజ్య రక్షణకు కదిలేవారు. ఈ అర్థంలోనే– ప్రతాపరుద్రుడికి 9 లక్షల సైనికులున్నారు అని ప్రతాపరుద్రీయంలో పేర్కొన్నారు. తమకు ఎప్పటికైనా ముప్పు అని భావించిన పొరుగు రాజ్యాలతో కాకతీయులు వైవాహిక సంబంధాలనూ ఏర్పాటు చేసుకునేవారు. ఒక విశాల రాజ్యానికి అధ్యక్షురాలిగా ఒక మహిళను, రాణి రుద్రమదేవిని ప్రకటించిన ఘనత కాకతీయులకే దక్కింది. అదే సమయంలో ఢిల్లీ సుల్తనత్ రాణిగా రజియా సుల్తానా కూడా కొద్దికాలం ఉన్నప్పటికీ ఆమె అంతర్గత కుట్రలకు బలయ్యింది. రుద్రమకు కూడా భర్త వీరభద్రుడి నుంచి ప్రతికూలత ఎదురైనప్పటికీ ఆమె దానిని సమర్థంగా ఎదుర్కొంది. రాణి రుద్రమకు ముగ్గురు కూతుళ్లు. వీరిలో పెద్ద కుమార్తెలు ఇద్దరినీ పొరుగు రాజ్యాల రాజరికాలకు ఇచ్చి పెళ్ళి చేసింది. మూడవ కూతురు ముమ్మడమ్మను కాకతీయ వంశస్థులకే ఇచ్చింది. ముమ్మడమ్మ కొడుకే ప్రతాప రుద్రుడు. దీనితోపాటు, నెల్లూరులో మనుమసిద్ధి పాలకులతోనూ, ఉత్తరాదికి చెందిన కాయస్తులతోనూ కాకతీయులు స్నేహబంధాన్ని కొనసాగించారు. ఈ కాయస్తులలో అంబదేవుడు మినహా మిగిలిన రాజులందరూ వీరితో సఖ్యంగానే ఉన్నారు.


కాకతీయులు తమ రాజ్యంపై శత్రు రాజులు దండెత్తినా వారిని రాజ్యం ప్రధాన కేంద్రానికి వెలుపలనే అడ్డుకోగలిగేవారు. ఇందుకుగాను ఓరుగల్లు చుట్టూ ఉప రాజ్యాలను ఏర్పాటు చేసి, వాటికి నాయంకరులనే పేరుతో సామంతరాజులను అధిపతులుగా నియమించారు. ఈ సమర్థులైన, విశ్వాసపాత్రులైన నాయంకరులు ఏ శత్రురాజులు దాడి చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేవారు. రాణి రుద్రమ కాలంలో దాదాపు 77మంది నాయంకరులు ఉండేవారని ప్రముఖ చరిత్రకారుడు డా. రేచర్ల గణపతి పేర్కొన్నారు. ఈ నాయంకరులనే దండనాయకులు అని వ్యవహరించేవారు. వీరు పాక్షికంగా స్వయం పాలకులుగా ఉంటూనే కాకతీయుల అజమాయిషీలో పనిచేసేవారు. ఈ దండనాయక వ్యవస్థను ప్రతాపరుద్రుడు మరింత పటిష్టం చేశాడు. అంటే, ఓరుగల్లు చుట్టూ దాదాపు 70కి పైగా చిన్న కోటలు ఉండేవన్నమాట. అంతేగాక, రాజ్యం చుట్టుపక్కల చీమ చిటుక్కుమన్నా తమకు సమాచారం తెలిసేలా వేగుల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.


కాకతీయుల ప్రధాన స్థావరమైన ఓరుగల్లు కోటను శత్రు దుర్భేద్యంగా రూపుదిద్దారు. కోట చుట్టూ ప్రధానంగా మూడు కోటలు నిర్మించారు. మొదటిది మట్టి కోట, రెండవది రాతి కోట, మూడవది కంప కోట. రాతి కోట చుట్టూ కందకాలు ఏర్పాటు చేసి మొసళ్లను వదిలేవారు. కంపకోట దేశంలో మరే ఇతర రాజ్యాల చరిత్రలోనూ కానరాదు. శత్రుసైన్యాలు ఒకవేళ మట్టి, రాతి కోటలను దాటుకొని వచ్చినా కంపకోటను దాటడం అంత సులభం కాదు. కంప, వెదురు, కలప దూలాలతో కలిపి చుట్టూ కోట లాగా తయారు చేసి ఉండేది. ఈ కంప కోట దగ్గరికి శత్రువులు రాగానే వాటిని తగులపెట్టేవారు. దాంతో బడబాగ్నిలా విస్తరించే మంటలు శత్రువును కబళించేవి. కాకతీయులు తమ రాజ్యాన్ని ఆర్థికపరంగా పటిష్ఠం చేసే విధానాలనూ అవలంబించారు. దీనిలో భాగంగానే ‘త్రీ టీస్’– టెంపుల్, ట్యాంక్, టౌన్ విధానాన్ని అవలంబించారు. రామప్ప, గణపురం లాంటి తటాకాలను నిర్మించి అక్కడే గ్రామాన్ని, ఆలయాలను కట్టించేవారు. దీనితో, నీటి లభ్యత ఉండి పౌరులు వ్యవసాయంలోను, అనుబంధ రంగాలలోను నిమగ్నమయ్యేవారు. ఇలా, బహుముఖ వ్యూహాలను అవలంబించినందునే కాకతీయులు రెండున్నర శతాబ్దాల పాటు విజయవంతంగా పరిపాలించారు. కాలం మారినా, యుద్ధరీతులు మారినా ఈ మౌలిక యుద్ధతంత్రాలు ఇప్పటికీ విస్మరించలేనివే.

కన్నెకంటి వెంకటరమణ

జాయింట్ డైరెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్

Updated Date - 2022-03-06T06:02:11+05:30 IST