కాకానిని ఎందుకు గుర్తు పెట్టుకోవాలి?

ABN , First Publish Date - 2022-12-24T01:32:29+05:30 IST

కాకానివెంకటరత్నం చనిపోయి 50 సంవత్సరాలయింది. అయినా ఆయన గురించి గుర్తుచేసుకునేవాళ్లు ఎంతో మంది;

కాకానిని ఎందుకు గుర్తు పెట్టుకోవాలి?

కాకానివెంకటరత్నం చనిపోయి 50 సంవత్సరాలయింది. అయినా ఆయన గురించి గుర్తుచేసుకునేవాళ్లు ఎంతో మంది; ఆలోచించేవాళ్లు మరెంతో మంది; రాయాలనుకునే వాళ్లూ తక్కువేమీ కాదు. నేనూ ఇంతకుముందు ఎన్నోసార్లు రాశాను. అయినా కాకాని గురించి ఇంకా రాయవల్సింది ఉందనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాల దృష్ట్యా ఆయన నాయకత్వాన్ని, వ్యక్తిత్వాన్ని గుర్తుచేసుకోవాలి. కాకానిని ఇప్పటివాళ్లు స్ఫూర్తిగా తీసుకుంటే రాజకీయాల్లో మార్పుకు మార్గమేర్పడుతుంది.

కాకాని పేరు మీదుగా ఏ ప్రభుత్వ పథకాలు, ప్రదేశాలు అప్పుడూ లేవు ఇప్పుడూ లేవు. వ్యక్తి ఆరాధనను ఆయన ప్రోత్సహించలేదు. అసలు ఆయన తన రాజకీయ జీవితంలో పదవులకు అతీతంగా ప్రవర్తించటమేగాక, ప్రభుత్వంలో ఉన్న సొంత పార్టీ నాయకులనూ సూత్రప్రాయంగా వ్యతిరేకించారు. ప్రజా సమస్యల పరిష్కారం మీదే ఆయన దృష్టి. పదవులకి ఎగబడలేదు, పాకులాడలేదు. స్థానిక సమస్యలు, అభివృద్ధి మీదే ఆయన ఆలోచన. అందుకు పదవుల్లో లేకుండానే ఎక్కువ మందికి సహాయపడవచ్చు అని నమ్మటమేకాక నిరూపించిన ఉదాత్తుడు కాకాని. ఇంతకన్నా గొప్ప ప్రత్యేకత ఏమి కావాలి ఆయన్ని గుర్తుపెట్టుకోవడానికి?

ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఊళ్లో ఉన్న స్కూల్లో చదువుని కూడా పూర్తిచేయని కాకాని, స్వశక్తితో ఎన్నో వేల మంది చదువులకి కారణమయ్యాడు. ఆయన దూరదృష్టికి ప్రజల మీద ఉన్న విశ్వాసమే కారణం. 1949–52 సంవత్సరాల మధ్య కృష్ణా జిల్లా బోర్డు అధ్యక్షుడిగా ఆయన ఎన్నో పాఠశాలలను స్థాపించారు. అంతకు ముందు, ఆ తర్వాత అన్ని పాఠశాలలను ఎవరూ ప్రారంభించలేదు. ఆ పాఠశాలలను ఉత్తమ విద్యాసంస్థలుగా అభివృద్ధిపరిచారు. వాటిలో పని చేసే ఉపాధ్యాయులకి ఆయన ఇచ్చిన గౌరవం, ప్రాధాన్యమే అందుకు కారణం. కృష్ణా జిల్లాలో పాఠశాల విద్యారంగం పార్టీ రాజకీయాలకు అతీతంగా 20 సంవత్సరాలపాటు వర్థిల్లిందంటే అందుకు కాకాని దీక్షాదక్షతలే కారణం.

నాకేం తెచ్చారు, నాకేమి ఇస్తారు అనేది కాకుండా, నేనేమి చేయగలను, చేయాలి అనే దృష్టితోనే కాకాని జీవితాంతం ఉన్నారు. ఏది చేసినా ప్రతిఫలాన్ని ఆశించలేదు. అందుకనే ఆయన అంతమందికి సహాయపడగలిగారు. పేదలకు అండదండలుగా ఉండి వాళ్ల భవిష్యత్‌ గురించి ఆలోచించటమే కాకుండా దాన్ని భవ్యంగా నిర్మించేందుకు ప్రత్యక్షంగా కృషి చేశాడు. కులమతాల అంతరాలను పాటించేవాడుకాదు.

కాకాని వెంకటరత్నం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నది 30 సంవత్సరాల లోపే. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. రెండుసార్లు ఓడిపోయాడు కూడా. అయితే గెలుపోటములకు, నాయకత్వానికి సంబంధం లేదని ఆయన చాటి చెప్పారు. అది ఇప్పుడు నమ్మలేని విషయం. ఎట్లాగైనా గెలవాలనే ఆలోచన ఆయనకు ఉండేది కాదు. ఆ భావనకి కూడా ఆయన వ్యతిరేకే. ఎన్నికల కోసం ఆయన డబ్బు పోగు చేయలేదు. విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్లడం, తిరిగి రావడం ఎక్కువగా ఆర్టీసీ బస్సులోనే. ఎమ్మెల్యేగా ఉన్నపుడు కూడా అదే ఆనవాయితీ.

నన్ను ప్రభావితం చేసిన మహానుభావుడు కాకాని. ఆయనతో నా పరిచయం రెండు దశాబ్దాల పాటు కొనసాగింది. నేను మొట్టమొదట ఢిల్లీ వెళ్లింది (1960లో) కాకానితోనే. కొన్ని ఆదర్శాలకి కట్టుబడి ఉండే విధంగా యువతను ఆయన పురిగొలిపేవారు. 1960వ దశకంలో కృష్ణా జిల్లా నుంచి ఇతర దేశాలకు వెళ్లి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన డాక్టర్లు, ఇంజనీర్ల అభ్యున్నతికి కాకానే కారణం అంటే అతిశయోక్తికాదు. వాళ్లలో చాలా మంది ఈ రోజుకీ ఆ విషయాన్ని చెబుతారు. విద్యాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తుల్లో కాకానిది ప్రత్యేక స్థానం.

రాజకీయాల్లో కాకాని పురోగతిని అడ్డుకోవడానికి ధనస్వాములే కాకుండా అధికారంలో ఉన్న నాయకులూ ప్రయత్నించారు. ప్రజా సమస్యల విషయంలో కాకాని ఎప్పుడూ రాజీపడలేదు. రాజకీయం అంటే ప్రజా సమస్యల పరిష్కారమని ఆయన విశ్వసించారు. అందరికీ అవకాశం కల్పించాలని ఆయన అభిలషించారు. ముఖ్యంగా బడుగువర్గాల పిల్లల భవిష్యత్‌ విషయంలో ఆయన ఎంతకైనా సిద్ధమే. పోరాటాన్ని నమ్మిన నాయకుడు. అందుకే ఆయన అధికారంలో ఉన్న పెద్ద నాయకులని తట్టుకుని తనకంటూ ప్రత్యేకతని తెచ్చుకోగలిగాడు. ప్రత్యర్థులను ఎప్పుడూ కించపరచలేదు. వ్యక్తిగతంగా విమర్శించలేదు. తన పని చేసుకుపోవడంలోనే సదా నిమగ్నమయ్యేవాడు. కావాలని కలహాల్లోకి వెళ్లలేదు. కుతంత్రాలు చేయలేదు. నేను, నాది, మాది అని ఆలోచించలేదు. అందరినీ కలుపుకుపోవడానికే కృషి చేసేవారు. అహంకారాన్ని ప్రదర్శించిన దాఖలాలు అసలే లేవు. మంచి చెడులను ఎన్నికల దృష్టితో బేరీజు వేసుకోలేదు.

విడిపోయి స్నేహితులుగా ఉండిపోవడం, తెలంగాణ, ఆంధ్ర జిల్లాలకి మంచిదని, రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని కాకాని నమ్మాడు. అదే ధోరణిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించాడు. గన్నవరం విమానాశ్రయంలో యువకుల మీద పోలీసు జులుం, కాల్పులు తట్టుకోలేక డిసెంబర్‌ 24–25 రాత్రి గుండె ఆగి మరణించిన మహానుభావుడు కాకాని. 1972లోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఉంటే ఈ రోజు ఆంధ్ర జిల్లాల పరిస్థితి ఎట్లా ఉండేదో ఊహించవచ్చు. జపాన్‌కి తీసిపోని విధంగా అభివృద్ధి చెంది ఉండేది. అదే కాకాని దూరదృష్టి కూడా.

మరి ఆయన చనిపోయిన యాభై ఏళ్ల తర్వాత కూడా ఎంతో మంది ఆయన్ని గుర్తు పెట్టుకుంటున్నారు. ఆయన ఆదర్శాలు, దూరదృష్టి అంత గొప్పవి అని చెప్పకనే చెప్పవచ్చు. ఎన్నో ఉదాహరణలు. క్లుప్తంగా కొన్ని : 1) విలువలు లేని పార్టీ రాజకీయాలు అనర్థాలన్నిటికీ మూలం అనే భావన. 2) ప్రజా సేవలో ఉన్నవాళ్లు కొన్ని నియమాలు పాటించాలి.

3) ఎన్నికల్లో గెలుపోటములకు అతీతంగా ఆలోచించడం. 4) వ్యక్తి ఆరాధన కన్నా వ్యక్తిత్వం ముఖ్యం అని నమ్మడం. 5) స్థానిక సమస్యలు, సంస్థల మీద ధ్యాస. 6) ఏ పదవిలో ఉన్నాం అనేదానికంటే తర్వాత ఆ పదవిలోకి వచ్చే వాళ్లకి ఏ విలువలు తెలియజేశాం అనేది ముఖ్యమని భావించడం. 7) ఆలోచనలు పది మందితో పంచుకుంటూ పెంచుకోవడమే ప్రజాస్వామ్యం అని నమ్మడం. 8) అధికార వికేంద్రీకరణే గ్రామాలకు శ్రీరామ రక్ష అని పదే పదే చెప్పాడు. 9) కులమతాలకి అతీతంగా ఆలోచించటమేగాక అందరితో కలిసి పనిచేయటం, అందరికి అవకాశాలు కలుగజేశాడు. 10) అడగకుండానే బడుగువర్గాలకు అండగా ఉండడం. 11) పిల్లలు, యువకుల భవిష్యత్‌ గురించి ఆలోచించటం, కార్యక్రమాలు చేపట్టటం. 12) వ్యాపార లావాదేవీలు పార్టీ రాజకీయాలతో ముడిపెట్టలేదు. 13) ప్రత్యర్థులమీద వ్యక్తిగత దూషణలకి దూరంగా ఉంటే అందరికీ మంచిది అని నమ్మడం.

రాజకీయ నాయకుడిగానే కాదు. రూపులో కూడా కాకాని ఆజానుబాహుడే. అందమైన వర్చస్సు. ఉదయం నుంచీ రాత్రి వరకూ అదే తేజస్సు. తెలుగుతేజం అంటే ఎట్లా ఉంటుందో ఆయనను చూసినవారికి తెలుసు. ఇట్లాంటి రాజకీయ నాయకుడిని గత 50 సంవత్సరాల్లో చూశామా?

డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు

మీడియా విశ్లేషకులు, న్యూఢిల్లీ

(డిసెంబర్ 25: కాకాని 50వ వర్ధంతి)

Updated Date - 2022-12-24T01:32:36+05:30 IST