సంక్షేమ రంగంలో వినూత్న అధ్యాయం

ABN , First Publish Date - 2022-06-07T06:15:08+05:30 IST

ఒకప్పుడు భారతదేశంలో అన్ని రంగాల్లో కొరత తాండవించేది. గ్యాస్ సిలిండర్లు, టెలిఫోన్ కనెక్షన్ల కోసం ప్రజలు పెద్ద పెద్ద క్యూల్లో నిలుచునేవారు.

సంక్షేమ రంగంలో వినూత్న అధ్యాయం

ఒకప్పుడు భారతదేశంలో అన్ని రంగాల్లో కొరత తాండవించేది. గ్యాస్ సిలిండర్లు, టెలిఫోన్ కనెక్షన్ల కోసం ప్రజలు పెద్ద పెద్ద క్యూల్లో నిలుచునేవారు. ప్రజాప్రతినిధులతో పైరవీ చేయించుకునేవారు. దానివల్ల అధికార దుర్వినియోగం, అవినీతి జరిగేవి. ప్రతి పనికీ మధ్య దళారులు ముందుకువచ్చేవారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలనలో మధ్యదళారులు తోకముడిచే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం అమలుచేసే ప్రతిపథకంలో సార్వజనిక భాగస్వామ్యం అధికమయింది. నిరుపేదలకు సాధికారిత లభిస్తోంది. పక్కాఇళ్లు, విద్యుత్, గ్యాస్, నీరు, ఉచిత చికిత్స వంటి సౌకర్యాలు, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు పేదల గౌరవాన్ని పెంచడంతో పాటు సదుపాయాలను కూడా మెరుగుపరిచాయి. ఉచిత ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ మూలంగా ప్రజలు ఆకలి భయం నుంచి విముక్తి చెందారు.


ఒకప్పుడు సంక్షేమ పథకాల తాలూకు ప్రయోజనాన్ని పొందేందుకు ప్రజలు ప్రభుత్వం వద్దకు, వేర్వేరు శాఖల అధికారుల వద్దకు పరుగులు తీయాల్సివచ్చేది. ఇప్పుడు ప్రజలు ఇంటి నుంచే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ‘జన సమర్థ్’ పోర్టల్ ఈ దిశలో ఒక విప్లవాత్మకమైన ముందడుగు. ఇవాళ పై చదువులు చదివేందుకు రుణం కావాలన్నా, వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాలకోసం డబ్బు అవసరమైనా, కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అప్పు చేయాలన్నా, గ్రామీణ, పట్టణ పేదలు తమకు బతుకు తెరువు లభించకపోయినా ఎక్కడికీ వెళ్లనవసరం లేదు. జన సమర్థ్ పోర్టల్ ద్వారానే ఇవాళ ఈ నాలుగు రంగాలకు సంబంధించి 13 ప్రభుత్వ పథకాల ద్వారా కేంద్రం నుంచి సహాయం పొందవచ్చు. విద్యార్థులు, రైతులు, వ్యాపారస్తులు, కొత్త పారిశ్రామిక వేత్తలు, చిన్న, సూక్ష్మ మధ్యతరగతి సంస్థలను ప్రారంభించినవారు తమ జీవితాలను మెరుగుపరుచుకుని తమ కలలను సాకారం చేసుకునేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది.


వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఇవాళ ఆరు పథకాల ద్వారా కేంద్రం నుంచి సహాయం లభిస్తోందని ఎంతమందికి తెలుసు? చేనేత కార్మికులకైనా, పారిశుధ్య కార్మికులకైనా, వీథుల్లో చిన్న చిన్న అంగళ్లు నడుపుకునేవారికైనా, ఇతర చిన్న చిన్న వ్యాపారులకైనా కేంద్రం నుంచి ఇవాళ మోదీ ప్రభుత్వం సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నది. ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం, చేనేత కార్మికుల ముద్రా పథకం, ప్రధానమంత్రి ముద్రా యోజన, భౌతిక పాకీ పని నుంచి విముక్తి కలిగించేందుకు ఏర్పర్చిన స్వయం ఉపాధి పథకం, స్టాండ్ అప్ ఇండియా పథకం ద్వారా ఈ రుణాలు లభిస్తాయి. ఇవాళ లక్షలాది మంది పై చదువులు చదువుకోవడానికి ఆర్థిక వనరులు లేక చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడిపోతున్నారు. భారతదేశంలో కానీ, విదేశాల్లోకానీ చదువుకోవాలన్నా, గ్రాడ్యుయేషన్ నుంచి పిహెచ్‌డి వరకు పై చదువులు చదువుకోవాలన్నా రుణాలు లభించేందుకు మోదీ ప్రభుత్వం దోహదం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ వడ్డీ సబ్సిడీ, పడో పరదేశ్, డాక్టర్ అంబేడ్కర్ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా విద్యార్థులకు చేయూత లభిస్తుంది. బలహీన వర్గాలు, దళితులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక ఉన్నత సాంకేతిక విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందినవారు నిరాటంకంగా చదువుకునేందుకు ఈ పథకాలు దోహదం చేస్తాయి. ‘జనసమ్మర్థ్’ పోర్టల్ ద్వారా వివరాలు, డాక్యుమెంట్లను నమోదు చేస్తే రకరకాల బ్యాంకులు, సంస్థలు సహాయం చేసేందుకు ముందుకువస్తాయి.


ఏ సంస్కరణ అయినా, ఏ సంక్షేమ పథకం అయినా వాటి లక్ష్యాలు స్పష్టంగా ఉంటే సత్ఫలితాలు లభిస్తాయని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. గతంలో లాగా సామాన్యుడికి పథకం ప్రయోజనాల్లో కనీసం పదిశాతం కూడా లభించని దుస్థితి ఇప్పుడు లేదు. పైగా గడచిన ఎనిమిదిసంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం తన పథకాల్లో కేంద్ర స్థానంలో యువతను నిలబెట్టింది. యువతీ యువకులు ఏ వ్యాపార సంస్థనైనా సులభంగా ప్రారంభించి నిర్వహించేందుకు ఆస్కారం కలిగించింది. అభివృద్ధికి, వ్యాపార నిర్వహణకు అడ్డంకిగా ఉన్న 30 వేల నియమ నిబంధనలను ప్రభుత్వం తొలగించింది. 1500 పనికిరాని చట్టాలను రద్దు చేసింది. కంపెనీల చట్టంలో అనేక నిబంధనలకు సంబంధించి క్రిమినల్ చర్యలను తొలగించింది. దీనివల్ల భారతదేశంలో స్టార్ట్అప్‌ల నుంచి పెద్ద కంపెనీల వరకు సరికొత్త శిఖరాలను అందుకునేందుకు మోదీ ప్రభుత్వం వీలు కల్పించింది. స్టార్ట్అప్‌ల నిర్వహణకు పూర్తిగా సానుకూల వాతావరణం ఏర్పర్చినందువల్లే ఇవాళ దేశంలో 330 బిలియన్ డాలర్ల విలువైన యూనీకార్న్ సంస్థలు దిగ్విజయంగా నడుస్తున్నాయి. సరళమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం, దేశమంతటా అనేక పన్నుల స్థానంలో జీఎస్టీని ప్రవేశపెట్టడం, జీఇఎం పోర్టల్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లకు సులభంగా వీలు కల్పించడం వంటి వినూత్న మార్పులకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ జీఇఏం పోర్టల్ ద్వారా ప్రజలు, వివిధ వ్యాపార సంస్థలు ఏ దళారీ ప్రమేయం లేకుండా దాదాపు రూ. లక్షకోట్ల విలువైన సామాగ్రిని ప్రభుత్వానికి విక్రయిస్తున్నాయి. ఇవే కాదు, పెట్టుబడి అవకాశాలకు సంబంధించి ఇన్వెస్ట్ ఇండియా పోర్టల్, వ్యాపార వ్యవహారాలకు సింగిల్ విండో క్లియరెన్స్ పోర్టల్ ఉన్నాయి. ఇప్పుడు ‘జనసమ్మర్థ్’ పోర్టల్‌తో సామాన్యప్రజలు, యువత, చిన్న వ్యాపారులు, మహిళలు, విద్యార్థులు, రైతులు సంక్షేమ పథకాల రంగంలో వినూత్న అధ్యాయాన్ని లిఖించబోతున్నారనడంలో సందేహం లేదు.


ప్రజలకు టెక్నాలజీ అంటే తెలియదు, వారిని మోసగించడం సులభం అనుకునే ప్రభుత్వాలు, వ్యక్తుల ఆటకట్టు అయ్యే రోజులు వచ్చాయి. ఇవాళ సామాన్యుడి చేతిలో మొబైల్ ఒక ప్రజా ఆయుధంగా మారింది. అతి చిన్న వ్యాపారి కూడా డిజిటల్ విప్లవంలో భాగస్వామి అయ్యారు. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలన్న ధైర్యంతో మోదీ ప్రభుత్వం తాను ప్రారంభించిన సాంకేతిక విప్లవంలో ప్రజలను భాగస్వాములను చేసింది. సామాన్యుల పరిజ్ఞానంపై మోదీ ప్రభుత్వం విశ్వాసం ఉంచినందువల్లే ఇది సాధ్యపడింది. దానివల్లే సుపరిపాలన కోసం ఉపయోగించే సాంకేతిక విజ్ఞానం ఏది అయినప్పటికీ దానిని ప్రజలు కేవలం ఆమోదించడమే కాదు, హృదయానికి హత్తుకుంటారన్న విషయం కూడా నూటికి నూరు శాతం నిరూపితమైంది. ఈ సాంకేతిక విప్లవం భారతదేశ ప్రజల సామూహిక నిర్ణయం. దానివల్లే ఇవాళ మనం ప్రపంచానికి ఒక కొత్త ఆశాకిరణంగా మారగలుగుతున్నామని నిరూపించామని, ప్రపంచంలో అతి పెద్ద వినియోగ మార్కెట్‌గా భారతదేశాన్ని అన్ని దేశాలు చూడగలుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన సమర్థ్ పోర్టల్ ఆవిష్కరణ సందర్భంగా అన్నారు. ప్రజల కలలను శీఘ్రగతిన సాకారం చేస్తున్నందునే ఇవాళ ప్రజలకూ ఆయనకూ మధ్య అన్ని హద్దులూ చెరిగిపోతున్నాయనడంలో సందేహం లేదు. జన సమర్థ్ పోర్టల్ మోదీకి లభిస్తున్న జన సమర్థనకు తిరుగులేని సాక్ష్యం.వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-06-07T06:15:08+05:30 IST