తెలంగాణ సాధనలో అగ్రగణ్యుడు
ABN , First Publish Date - 2022-11-05T00:55:38+05:30 IST
తెలంగాణ ఉద్యమకారుడు, కరుడుగట్టిన కాంగ్రెస్‌వాది వెలిచాల జగపతిరావు మన మధ్య నుంచి నిష్ర్కమించడం జీర్ణించుకోలేనిది.
తెలంగాణ ఉద్యమకారుడు, కరుడుగట్టిన కాంగ్రెస్‌వాది వెలిచాల జగపతిరావు మన మధ్య నుంచి నిష్ర్కమించడం జీర్ణించుకోలేనిది. జగపతిరావుతో నా అనుబంధం మూడున్నర దశాబ్దాల కింద మొదలై ఆయన తదిశ్వాస వరకు కొనసాగింది. ఆయన ఏ పదవి చేపట్టినా కార్యాచరణ, క్రమశిక్షణతో ఆ పదవికి వన్నె తెచ్చేవారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా, స్వతంత్ర శాసనసభ్యుడిగా సభలో అడుగుపెట్టినా ముఖ్యమంత్రులు, మంత్రులతో ఆయన సాన్నిహిత్యం ఎప్పటికీ మరువలేనిది.
నేను 1974లో రాజకీయ ఆరంగేట్రం గావించే కన్నా నాలుగేళ్ల ముందు నుంచే అంటే 1970లోనే ఆయన ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. గుడి గ్రామ సహకార సంఘం చైర్మన్‌గా, గంగాధర సమితి అధ్యక్షుడిగా ఎన్నికై రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. చలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను, కరీంనగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర శాసనసభ్యుడిగా జగపతిరావు 1989లో తిరిగి ఏకకాలంలో అసెంబ్లీలో అడుగుపెట్టాం. ఆ సమయంలోనే తెలంగాణ శాసనసభ్యుల ఫోరానికి అంకురార్పణ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జగపతిరావు సీనియర్ లీడర్‌గా ఉన్నప్పటికీ టికెట్ దక్కని కారణంగా ఇండిపెండెంట్‌గా గెలుపొంది సత్తా చాటుకున్నారు. దాంతో అందరి దృష్టి ఒక్కసారిగా జగపతిరావు మీద పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివక్ష, అవమానం, అణచివేతకు తెలంగాణ ప్రాంతం గురవుతున్నదనే భావన మాలో రోజురోజుకు రూఢీపడ సాగింది. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ స్టేట్‌ను కలిపే ముందు రాసుకున్న ఒప్పందాలు అమలుకు నోచుకోకపోవడంతో జగపతిరావు రగిలిపోయేవారు. పెద్ద మనుషుల ఒప్పందం, ఆరుసూత్రాలు, అష్ట సూత్రాలు వంటి ఒప్పందాలు అమలు కావాలంటే తెలంగాణ శాసనసభ్యులందరం ఒకే వేదిక మీదకు రావాలని నిశ్చయించుకున్నాం. తెలంగాణ శాసనసభ్యుల ఫోరం 1991లో ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఫోరం ఏర్పాటులో జగపతిరావు పాత్ర అమోఘం. జువ్వాడి చొక్కారావు, పి.నర్సారెడ్డి, చిట్టెం నర్సిరెడ్డి, ఎం. బాగారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఎం నారాయణరెడ్డి, ఎం. సత్యనారాయణరావు, ఎన్.ఇంద్రసేనారెడ్డి, సిహెచ్.విద్యాసాగర్‌రావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వంటి భిన్న పార్టీల సభ్యులు తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ఏర్పాటులో కీలక పాత్ర నిర్వహించారు. ఫోరం అధ్యక్షుడిగా నన్ను, కన్వీనర్‌గా జగపతిరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రాంత హక్కులు, రక్షణలు, నీళ్లు నిధులలో వాటాల కోసం శాసనసభ లోపల, బయటా సమష్టిగా పోరాడాలని తీర్మానించాం. అధికార పార్టీ సభ్యులు మంత్రులుగా ఉంటే మంత్రివర్గ సమావేశాల్లోనూ తెలంగాణ వాటాల గురించి దెబ్బలాడాలని నిర్ణయించి ఆచరణలో చూపెట్టినాం.
బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య తొలిదశ తెలంగాణ ఉద్యమం 1969లో విఫలమైన తర్వాత తెలంగాణవాదం బలహీనపడకుండా చేయడంలో తెలంగాణ శాసనసభ్యుల ఫోరం చేసిన కృషి ఎనలేనిది. నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ శాసనసభ్యుల ఫోరాన్ని కన్వీనర్ జగపతిరావు ముందుండి నడిపించారు. సాగునీటి పంపకంలో తెలంగాణ పట్ల వివక్షను తెలంగాణ శాసనసభ్యుల ఫోరం తీవ్రంగా నిరసించింది. నాడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం తెలంగాణ శాసనసభ్యుల ఫోరం చేసిన పోరాట ఫలితమే దేవాదుల, నెట్టెంపాడు, తుపాకులగూడెం, కల్వకుర్తి ఎత్తిపోతల, శ్రీశైలం ఎడమకాలువ, కరీంనగర్ వరద కాలువ పథకాలు మొదలైనాయి. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగా అనేకమార్లు తెలంగాణ వాటాలో వివక్షపై ఆయనకు వివరించి, కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించగలిగాం. నా రాజకీయ అనుబంధం రానునాను జగపతిరావుతో అనుంగు మిత్రునిగా మార్చింది. జగపతిరావు కవి, సాహితీవేత్త. లోతైన అధ్యయనం చేసి, తన కవిత్వం నిరంతర రచనా వ్యాసంగం తెలంగాణ సమస్యలపై చైతన్యాన్ని ద్వారా ప్రజల్లో రగిలించారు.
అధికారంలో ఉన్నా, వెలుపల ఉన్నా మాలాంటి వారికి ఎందరికో జగపతిరావు స్ఫూర్తిదాయకం. ఆయన పట్టుదల పలువురికి విస్మయం కలిగించేది. దీర్ఘకాలం ప్రజల మధ్య పాటుపడిన ఒక ఆత్మీయుడిని కోల్పోయిన వెలితి నన్ను బాధిస్తున్నది. జగపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలని కన్నీటితో నివాళులు అర్పిస్తున్నాను. జగపతిరావు ఆశయాలు నెరవేరి, తెలంగాణ నలుదిక్కులా దీపకాంతులు వెదజల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
కుందూరు జానారెడ్డి మాజీమంత్రి
(నేడు హైదరాబాద్‌లో వెలిచాల జగపతిరావు సంస్మరణ సభ)