అసమానతలు ‘నాగరికత’కు సోపానాలా?

ABN , First Publish Date - 2022-09-11T05:58:28+05:30 IST

ఇదినయా ఉదారవాద కాలం. ‘అత్యాశ మంచిదే’ అన్నది ఒక జీవన సూత్రంగా వర్ధిల్లుతున్న యుగంలో మనం జీవిస్తున్నాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రపంచ కుబేరుల జాబితా విడుదలవుతుంటుంది...

అసమానతలు ‘నాగరికత’కు సోపానాలా?

ఇదినయా ఉదారవాద కాలం. ‘అత్యాశ మంచిదే’ అన్నది ఒక జీవన సూత్రంగా వర్ధిల్లుతున్న యుగంలో మనం జీవిస్తున్నాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రపంచ కుబేరుల జాబితా విడుదలవుతుంటుంది. అందులో పెరుగుతున్న భారతీయుల సంఖ్య చూసి గర్వపడాలని ఆశించేవాళ్ళు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు ఎలా దిగజారుతున్నాయో గమనిస్తున్నారా? సమానత అనే నైతిక విలువను అత్యాధునికవాదం ఒక బ్రహ్మ పదార్థంగా మార్చిన తర్వాత అసమానతల మీద చర్చ అవసరం లేదనే ఏకాభిప్రాయానికి నోరున్న సమాజం వచ్చినట్టుంది. సంక్లిష్ట నాగరికత పెరిగే క్రమంలో అసమానతలు అనివార్యమేమీ కాదని సరికొత్త పురావస్తు శాస్త్ర పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వాటి ఆధారంగా ‘Dawn of Everything’ అనే ఆసక్తిదాయక, కొత్త ఆలోచనలను పురిగొల్పే గ్రంథం ఇటీవల విడుదలయ్యింది. డేవిడ్ గ్రెబెర్ అనే మానవ శాస్త్రవేత్త, డేవిడ్ వెన్గ్రో అనే పురావస్తు శాస్త్రవేత్త ఒక దశాబ్దం పాటు చేసిన కృషి ఫలితమే ఈ పుస్తకం.


వేలాది ఏళ్ల క్రితం మొదటగా మన పూర్వీకులు వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవడంతో వాటి పరిణామాలు ప్రపంచాన్ని ఒకానొక గమ్యం వైపు మాత్రమే నడిపించాయని మనకు గత రెండు వందల యాభై ఏళ్ళ నుంచి బోధిస్తున్నారు. వ్యవసాయం ప్రారంభం కావడంతో, భూమితో అనుబంధం పెరిగి, వ్యక్తిగత ఆస్తి అన్న భావన వచ్చిందని, మిగులు పెరగడంతో జనాభా పెరిగిందని, గ్రామాలు నగరాలు అయ్యాయని, ఈ వ్యవస్థను రక్షించుకోడానికి స్వేచ్ఛ గల కులీన వర్గం, రాజ్యం ఏర్పడిందని, ఇలా వచ్చిన నాగరికతకు అసమానతలు అనేది మనం చెల్లించే మూల్యం అని సమాజానికి నూరిపోశారు. చిన్న గుంపులైన ఆటవికులు మాత్రమే సమానులుగా ఉండగలరని, కానీ వారి సమానత్వం దారిద్య్రంలో మాత్రమేనని, కానీ సంపద సృష్టిలో అసమానత అనివార్యమనే సిద్ధాంతాన్ని చాలా ఏళ్లుగా బోధించారు (చాలా తెలివితేటలున్న విద్యార్థులైతే ఈ సామాజిక పరిణామాన్ని లోకజ్ఞానం కింద పరిగణించి సునాయాసంగా వల్లె వేస్తారు). ఇది చాలా కాలంగా సత్యంగా చలామణి అవుతూ ఉంది. ఇది నిజమేనా, ఈ వాదనకు ఆధారాలు ఉన్నాయా అనే ప్రశ్న మనం ఎప్పుడు వేసుకోలేదు. ఈ విశ్వాసాన్ని పురావస్తు శాస్త్రం బలపరచడం లేదనేది ఈ రచయితల వాదన.


పదివేల ఏళ్ల ముందు వ్యవసాయాన్ని కనుగొన్న తర్వాత నాలుగువేల సంవత్సరాల సుదీర్ఘ కాలం గ్రామాలు గ్రామాలుగానే ఉండిపోయాయి. ఆ కాలంలో స్థిరమైన సామాజిక వర్గాలు ఏర్పడ్డాయనే దానికి ఆధారాలు లేవు. అంటే ఆ సమాజంలో ఏ మార్పులు జరగలేదని కాదు. గణిత జ్ఞానం, లోహ విజ్ఞానం పెరిగింది. సాంకేతిక, సామాజిక ఆవిష్కరణలు చాలా జరిగాయి. కానీ ఆ సమాజంలో రాజులు లేరు, పురోహిత వర్గం లేదు, ఉద్యోగ వర్గం లేదు, సైన్యం లేదు. ఇది మినహాయింపుగా అక్కడక్కడా జరిగిన పరిణామం కాదు. ఇలాంటి సమాజాలు మధ్యధరా సముద్రం నుంచి నల్ల సముద్రం వరకు, పర్షియన్ గల్ఫ్ నుంచి టర్కీ వరకు వ్యాపించి ఉండినాయి.


కానీ, కులీన వర్గాలు ఏర్పడి, అంతిమంగా అసమానతలు స్థిరపడడానికి చాలా కాలం పట్టిందని ఎవరైనా వాదించవచ్చు. నగరాలు ఏర్పడడంతో వర్గాలు వచ్చాయని, లేకుంటే పిరమిడ్ల ఈజిప్టు, షాంగ్ చైనా, మాయా నాగరికతలు వచ్చేవి కావని వాదించవచ్చు. కానీ ఈ ‘నాగరికతలు’ ఆవిర్భావానికి వేల ఏళ్ల ముందే నగరాలు ఉన్నాయనే విషయాన్ని ఆధునిక పురావస్తు శాస్త్రం నిరూపిస్తూ ఉంది. పెరులోని రియో సూపే ప్రాంతంలో ‘ఇంకా’ నాగరికతకు నాలుగు వేల ఏళ్ల ముందు పెద్ద నగరాలు ఏర్పడ్డాయనే విషయాన్ని పురావస్తు శాస్త్ర పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. మొహెంజోదారో, హరప్పా తవ్వకాలు ఇదే విషయాన్ని చెప్తున్నాయి. సాధారణ ప్రజలు నాణ్యమైన ఇళ్లలో, అద్భుతమైన మురుగునీటి వ్యవస్థతో జీవించారని తెలుస్తుంది. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ దేశంలో ఆరువేల ఏళ్ల ముందు నుండి కూడా నగరాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. కానీ వాటిలో ఎక్కడా గుడులు లేవు, ధనవంతుల సౌధాలు లేవు. పై నుంచి కిందకి ఆదేశాలు ఇచ్చే నిరంకుశ ఉద్యోగ వర్గం లేదు. చెట్టు కాండంలో ఉండే వృత్తాల (Concentric Circles) లాగా ప్రజా సమావేశ మందిరాలు ఉన్నాయి. ఈ ఉక్రెయిన్ నాగరికత 800 ఏళ్ళు కొనసాగింది.


అదే విధంగా మెక్సికో లోయలో టియోటిహుక్యాన్ అనే నగరంలో క్రీ.శ. 250లో లక్ష మంది జనాభా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. అక్కడ బయటపడిన విశాలమైన ఇళ్ళు చూసి అవి రాజగృహాలని పురావస్తు శాస్త్రవేత్తలు భావించారు. కానీ అవి సామాన్యులు నివసించిన ఇళ్ళుగా చివరకు తేల్చారు. విశాలమైన వసారాలు, గోడలపై అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. దీని అర్థం ఏమంటే ప్రాచీన గ్రీస్‌లో ప్రజాస్వామ్యం పుట్టడానికి వేల ఏళ్ల మునుపే ప్రపంచంలోని చాలా ఖండాలలో వ్యవస్థీకృతమైన నగరాలు ఉన్నాయి. రాజులు, పురోహితులు, యుద్ధోన్మాదులైన రాజకీయులు లేకుండా అవి మనగలిగాయి. కానీ ఈ సమాజాలలో పరిపూర్ణమైన సమానత్వం –వనరులలో, అవకాశాలతో, గౌరవంలో– ఉన్న సమాజాలుగా పరిగణించే పొరబాటు చేయకూడదు. కానీ అప్పటికే సైనికీకరణ జరిగిన, బానిసత్వాన్ని సృష్టించిన గ్రీకు సమాజం మనుగడలో ఉన్నప్పటికీ, మెక్సికో సమాజం అసమానత్వ భూతాన్ని బంధించే ప్రయత్నం చేసింది అనుకోవాలి. Tlaxcala అనే ఆదివాసీల గణతంత్ర రాజ్యంలోనైతే కాబోయే రాజకీయుల పట్ల ఒక విచిత్ర విధానం అనుసరించేవారు: వారి అహంకారాన్ని అదుపులో ఉంచడానికి, నిజంగా ఎవరి చేతుల్లో అధికారం ఉందో గుర్తు చేయడానికి ప్రజలు అప్పుడప్పుడు వారిని కొరడాలతో కొట్టేవారు, బహిరంగంగా తిట్టే వాళ్ళు! ఇవాళ మన పరిస్థితి తిరగబడిందనుకోవచ్చు. విచిత్రంగా ఈ పరిణామాలకు నాగరికత అని నామకరణం చేయలేదు. వేల ఏళ్ల తర్వాత వచ్చిన, కఠిన అసమానతలకు చిహ్నమైన రాజరికపు మెసపుటేమియాకు, ఫారోల ఈజిప్టుకు, రోమ్ సామ్రాజ్యానికి నాగరికతగా గుర్తింపు వచ్చింది.


పురావస్తు శాస్త్రం నగరాల ఆవిర్భావం మీద మనకున్న అవగాహనను మాత్రమే తలకిందులు చేయలేదు. వ్యవసాయం కనుగొనడానికి ముందున్న సమాజం స్వభావం మీద కూడా మనకున్న అవగాహనను మార్చే ఆధారాలను వెల్లడిస్తూ ఉంది. వేట–ఆహార సేకరణ దశలో ఉండే చిన్న గుంపులు కూడా చాలా సామాజిక ప్రయోగాలు చేశారనడానికి ఆధారాలు ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో 50 వేల ఏళ్ల ముందు ప్రజలు విస్తృతమైన సామాజిక సంబంధాలను (social network) ఏర్పరుచుకున్నారు. 25వేల ఏళ్ల ముందు సమాజం కొంతమందికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చిందని తెలుస్తుంది. వారి సమాధులను ప్రత్యేకంగా అలంకరించారని తెలుస్తుంది. ఏనుగు దంతాలతో ప్రజా భవనాలను నిర్మించినట్టు ఆధారాలు దొరికాయి. 11 వేల ఏళ్ల కిందట టర్కీలో రాళ్లతో ప్రార్థనా స్థలాలను నిర్మించారు. ఉత్తర అమెరికాలో మొక్కజొన్న పండించడానికి చాలా కాలం ముందు లూసియానాలో వేల మందికి ఒకే చోట ఆహారం పంచగలిగే సామూహిక స్థలాలను ఆదివాసీలు సృష్టించినట్లు గుర్తించారు. వరి పంట కనుగొనడానికి చాలాకాలం ముందే జపాన్‌లోని సన్నాయ్ మఱుయమాలో మొక్కల నుంచి సేకరించిన ఆహారాన్ని రక్షించడానికి గిడ్డంగులను నిర్మించినట్లు తెలుస్తోంది.


ఈ కొత్త పురావస్తు ఆధారాలు వెల్లడించే సారాంశం ఏమిటి? వ్యవసాయం కనుగొనడంతోనే మనం సమానత్వానికి వీడ్కోలు పలికాము అనుకోవడం కానీ, సంఖ్యాపరంగా చిన్న సమాజాలలో మాత్రమే సమానత్వం సాధ్యమౌతుంది అని వాదించడం కానీ ఇక మీదట కుదరదు. పెద్ద సమాజాలలో రాజులు, ఉద్యోగ వర్గం, వృత్తి రాజకీయులు, తద్వారా అసమానత్వం అనివార్యం అనేవారు చిన్న సమాజాలలో మాత్రమే ప్రజలు పరిపాలనలో ప్రత్యక్షంగా పాల్గొనగలరు అనే సూత్రీకరణ చేస్తున్నారు. ఇది కూడా నిజం కాదని పురావస్తు శాస్త్రం నిరూపిస్తుంది. పెద్ద నగరాలు, ప్రాంతీయ సమూహాలు ఏకాభిప్రాయంతో, ప్రజల సహకారంతో వేల ఏళ్ళు ఉనికిలో ఉండినాయని తెలుస్తుంది. గతానికి చెందిన ఈ ఆధారాల నుంచి మనం నేర్చుకోవల్సింది చాలా ఉంది. కళ్ళముందున్న ఆధారాలను చూడగలిగే సంసిద్ధతే ఉంటే, ఇప్పటివరకు సృష్టించిన అమానవీయమైన అసమానతల సమాజం మాత్రమే సాధ్యం అనుకోనక్కరలేదు. సమానతల సమాజం కలలలో మాత్రమే సాధ్యమని నిట్టూర్చాల్సిన అవసరమూ లేదు.

మురళి కర్ణం

నల్సార్ విశ్వవిద్యాలయం

Read more