ఉద్యమస్థాయిలో కులాంతర వివాహాలు!

ABN , First Publish Date - 2022-04-23T06:14:00+05:30 IST

మత ప్రమేయం లేని, కులరహిత సామాజిక వ్యవస్థ మన భారతదేశంలో సాధ్యమా? మరీ ముఖ్యంగా కులజాడ్యం, మతతత్వం విస్తరిస్తున్న ఈ వర్తమాన కాలాన కుల నిర్మూలన ఉద్యమం కొనసాగగలదా? నిస్సందేహంగా సాధ్యమేనని మన చరిత్ర నిరూపిస్తున్నది. జాతీయోద్యమ కాలానికి పూర్వం, ఆ తర్వాత సామాజిక సంస్కరణల కోసం ఉద్యమించిన బ్రహ్మసమాజం, ఆర్యసమాజ్‌, ఫూలే, అంబేడ్కర్‌, నారాయణగురు లాంటి సంస్కర్తల కృషి కొంతమేర ఫలించింది...

ఉద్యమస్థాయిలో కులాంతర వివాహాలు!

మత ప్రమేయం లేని, కులరహిత సామాజిక వ్యవస్థ మన భారతదేశంలో సాధ్యమా? మరీ ముఖ్యంగా కులజాడ్యం, మతతత్వం విస్తరిస్తున్న ఈ వర్తమాన కాలాన కుల నిర్మూలన ఉద్యమం కొనసాగగలదా? నిస్సందేహంగా సాధ్యమేనని మన చరిత్ర నిరూపిస్తున్నది. జాతీయోద్యమ కాలానికి పూర్వం, ఆ తర్వాత సామాజిక సంస్కరణల కోసం ఉద్యమించిన బ్రహ్మసమాజం, ఆర్యసమాజ్‌, ఫూలే, అంబేడ్కర్‌, నారాయణగురు లాంటి సంస్కర్తల కృషి కొంతమేర ఫలించింది. కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీల ప్రజా ఉద్యమాల్లో భాగంగా, కులాంతర, మతాంతర వివాహాలకు ప్రోత్సాహం లభించింది– కొంత సాంఘిక భద్రత కలిగింది– నూతన తరాలలో అవగాహన పెరిగింది. గతంలో కులాంతర వివాహాలనేవి కేవలం ఆదర్శమని భావించిన ఈ సమాజంలోనే ఇప్పుడు అవసరమైన (సర్దుబాటు) వివాహాలుగా మారిన మాట కూడా వాస్తవం.


కులాల అంతరాలతో కునారిల్లిన ఈ భారతీయ సామాజిక చట్రాన్ని సంస్కరించాలనే ఉద్యమం ఆశించినంతగా ఊపు అందుకోలేదు. ప్రస్తుతం ఓట్ల రాజనీతితో ముడిపడిన మన ప్రజాస్వామిక రంగంలో, కులాల ఓటుబ్యాంకు రాజకీయాలను అన్నివిధాలా ప్రోత్సహిస్తున్న రాజకీయవేత్తల ఆత్మవంచనను విస్మరించలేం. హోదాతో పాటు కులాన్ని ఒక బ్రాండ్‌ నేమ్‌గా వాడుకోవాలనే మేధావుల, విద్యాధికుల వర్గం ఒకటి ఈ కుల చట్రాన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది. మరోవైపు రాజ్యాధికార దిశలో పోటీపడుతున్న ఆయా కులసంఘాలు చీలికవాదాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇలాంటి తిరోగామి నిరాశాజనిత నేపథ్యంలోనే ఒక ప్రత్యామ్నాయ ప్రజాసంస్కృతిని, వర్ణాంతర (మతాంతర) వివాహాలను ఉద్యమస్థాయిలో నిర్వహించవలసిన అవసరం ఉంది. 


అనేక రకాల ప్రతికూల పరిస్థితుల్లో కూడా గత 50 సంవత్సరాలుగా తెలుగునాట (ఆం.ప్ర.) కులనిర్మూలన సంఘం తన పరిధిలో నిరంతరంగా కులనిర్మూలనకు పాటుపడుతున్నది. కులాంతర–మతాంతర వివాహాలకు చేదోడువాదోడుగా ఉన్నది. గతంలో చట్టపరంగా, ప్రతికూల శక్తుల పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఈ సంఘంలో మేము కూడా క్రియాశీలంగా ఉన్న వాళ్లమే. వ్యక్తిగతంగా నేను, మిత్రులు జ్వాలముఖితో పాటు ఇతర ప్రజాసంఘాల కార్యకర్తల ఉమ్మడి కృషితో, పౌరహక్కుల (ప్రజాస్వామిక హక్కుల) సంఘాలు, వామపక్ష రచయితల సంఘాల తోడ్పాటుతో ఎన్నో కులాంతర, మతాంతర వివాహాలు చేయగలిగాము. స్వయంగా నేను, మా పిల్లలు కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లమే. జ్వాలాముఖి కుటుంబంలో ఒక మతాంతరతో పాటు కులాంతర వివాహాలు జరిగాయి. ఆచార్య కె.కె. రంగనాథాచార్యులు, వారి పిల్లలు కూడా ఈ కులరహిత మార్గంలోనే జీవిస్తున్నారు. డా. యన్‌. గోపి, నాళేశ్వరం శంకరంతో పాటు మరెందరో ఆదర్శంగా ఉన్నారు. 


ఇక కుల నిర్మూలన సంఘం ఆనాటి సంస్థాపకులైన సురమౌళి, లవణం, నాగేశ్వర్‌, జి. వీరాస్వామి, జస్టిస్‌ పున్నయ్య, డిజె రామారావు లాంటి పెద్దలు ఈ సామాజిక సంస్కరణల చరిత్రలో నిలిచిపోయారు. ఈనాటికీ అదే సంఘం తన స్థాయిలో నిరుత్సాహపడకుండా కులరహిత సమాజ ఆశయాన్ని ఆచరణలో నిజం చేస్తున్నది. మిత్రులు దేవదత్‌, లక్ష్మీనాగేశ్వర్‌, వహీద్‌ జ్యోతి, గాంధీ, బాబూరావు తదితరులను నేను మనసారా అభినందిస్తున్నాను.


చివరగా ఈ కులరహిత సామాజిక నిర్మాణంలో ఆచరణరీత్యా ఆత్మపరిశీలన చేసుకోవలసిన అంశాలు (యదార్థాలు)– కాలదోషం పట్టిన అగ్రకుల బ్రాహ్మణీయ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ఆధిపత్యానికి బదులుగా వామపక్ష ఉద్యమకారులు, ప్రజాసంఘాల సభ్యులు నిరాడంబరంగా వివాహ తదితర సామాజిక కార్యకలాపాలలో ప్రత్యామ్నాయ సంస్కృతిని ఆచరించగలుగుతున్నారా? కుల నిర్మూలన ఆదర్శ వివాహాలు చాలావరకు తిరిగి భార్యాభర్తల వైపు కులాలలోనే జరుగుతున్నాయి తప్ప, బిసి, ఎస్సీ, ఎస్టీలను అంగీకరించడం లేదు. అయితే కొత్తతరంలోని యువతీయువకుల కెరీర్‌ దృష్టి, సహజమైన ప్రేమబంధాలు (లేదా వ్యామోహాలు), ఆడంబరాల ప్రలోభాలు, ధనికస్వామ్య మానసికతను (వ్యాపార మనస్తత్వాన్ని) అంత సులువుగా అధిగమించలేము. హేతువాద దృష్టిని, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని, సామాజిక బాధ్యతను, విద్యాబోధనలో భాగం చేయగలిగితేనే ఇది సాధ్యం!


– నిఖిలేశ్వర్‌

(రేపు హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో   

కులనిర్మూలన సంఘం స్వర్ణోత్సవాలు)

Updated Date - 2022-04-23T06:14:00+05:30 IST