నడివీధుల్లో... ‘నక్షత్రాల క్రింద’

ABN , First Publish Date - 2022-10-01T07:31:39+05:30 IST

జీవనోపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి, పని దొరికినా దొరకకపోయినా పట్టణంలో ఉండి ఫుట్‌పాత్‌లపై, దుకాణాల అరుగులపై...

నడివీధుల్లో... ‘నక్షత్రాల క్రింద’

జీవనోపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి, పని దొరికినా దొరకకపోయినా పట్టణంలో ఉండి ఫుట్‌పాత్‌లపై, దుకాణాల అరుగులపై, బస్టాండ్ దగ్గర, ఆకాశమే గూడుగా బ్రతుకుతున్న పౌరులని అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న భారతదేశ చిత్రంలో ఎక్కడ ఉంచి చూడాలి? నక్షత్రాల కింద వీధుల్లో అరుగులపై, పేవ్‌మెంట్‌లపై జీవితాలు గడిపే వీరిని 2001 జనాభా లెక్కలలో ప్రత్యేకంగా లెక్కించారు. దేశంలోని నగరాలలో దాదాపు 40 లక్షల మంది ఇలా జీవిస్తున్నారని అన్నారు. ఈ అంచనాలు సరైనవి కావని చాలా స్వచ్ఛంద సంస్థలు వెంటనే ప్రకటించాయి. 2003లో యాక్షన్ ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థ వీరి లెక్క తేల్చిచెప్పడమే కాక, వీరు ఈ దేశ పౌరులు, వారి సంక్షేమం ఎవరు చూస్తున్నారు? అని సుప్రీంకోర్టులో ఒక వాజ్యం వేసింది. వీధుల్లో పడుకుంటూ ఏటా చలికి, వర్షానికి, అనారోగ్యానికి ఎంత మంది చనిపోతున్నారన్న లెక్కలూ ఈ కేసులో చెప్పింది. అన్ని అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ పౌరుల బాధ్యత నగరపాలక సంస్థలు తీసుకోవాలని, ప్రతి లక్ష మంది జనాభాకు సకల సౌకర్యాలతో ఒక షెల్టర్ హోమ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి లక్ష మందికి ఒక చోటు ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించాయి. దేశంలోని 790 నగరాలను అధ్యయనం చేసి కొన్ని సామాజిక సంస్థలు సుప్రీంకోర్టు సూచించిన ప్రకారం దేశంలో మొత్తం 2,18,750 షెల్టర్లు ఏర్పాటు చేయవలసి ఉంటుందని చెప్పాయి.


అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో 60 షెల్టర్లు ప్రతి జిల్లాలో కనీసం రెండు షెల్టర్లు ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. హైదరాబాద్ నగరంతో కలిపి తెలంగాణలో 35 షెల్టర్ గృహాలు ఉన్నాయి. 60 హోమ్స్ హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. కానీ హైదరాబాద్ సికింద్రాబాద్‌లో పురుషులకు 9, స్త్రీల కోసం నాలుగు హోమ్స్ మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి. ఒక్కొక్క బస ఒక్కొక్క స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో ఉంది. వీటన్నిటినీ C4CS (Campaign for Citizen Shelters) అనే సామాజిక సంస్థ పర్యవేక్షిస్తుంది.


ఈ సంస్థలు జిహెచ్ఎంసిపై పెట్టిన ఒత్తిడి కారణంగా ఇప్పుడు ఈ బసల నిర్వహణకు కొంత బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఆ బడ్జెట్ అంతా హోమ్ ఇన్‌ఛార్జికి, అందులో పనిచేసే వారికి సరిపోతుంది. నగరపాలక సంస్థ ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు మాత్రమే అందిస్తుంది. భోజనానికి కావలసిన బియ్యం కూరగాయలు స్వచ్ఛంద సంస్థ సమకూర్చుకుంటుంది. ఇక్కడ ఉండేవాళ్లంతా చిన్నా చితకా పనులు చేసుకునేవారు. వారికి గుర్తింపు కార్డులు ఇప్పించడానికి స్వచ్ఛంద సంస్థలు చాలా కృషి చేయవలసి వచ్చింది. జిహెచ్ఎంసి వసతి మాత్రమే కల్పించింది కానీ జీవనోపాధి కోసం నగరానికి వచ్చే వీరికి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమం గురించి పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్‌లో నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించే అంశం కూడా ఉంది. మరణించిన వారికి ఖననం/ దహనం విషయంలోనూ సమస్య తలెత్తింది. స్మశానవాటిక నిర్వహణ స్థానిక కమిటీ ఆధ్వర్యంలో ఉంటుంది. ఎక్కడా కూడా ఉచితంగా దహనం /ఖననం చేసే అవకాశం ఉండదు. అందువల్ల, సంఘటన జరిగినప్పుడల్లా అధికారుల దగ్గరకు పరుగెత్తి ఉత్తర్వులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. 


ఈ విషయంపై ప్రభుత్వమే ఒక శాశ్వత ఆదేశం జారీ చేస్తే మంచిది. వీళ్లకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు ఇంకా సమస్యగానే ఉన్నాయి. ఈ హోమ్స్ దగ్గరలో ఉన్న రేషన్ షాపుతో అనుసంధానం చేసి బియ్యం సరఫరా ఏర్పాటు పెద్ద విషయం కాదు. ఈ విషయంలో ఎన్నిమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పౌరసరఫరాల శాఖ శ్రద్ధ చూపడం లేదు. ఈ హోమ్స్ నడిపించే సిబ్బంది వేతనాలు చాలా తక్కువ. వాటిని కనీస వేతన స్థాయికి పెంచే విషయం నగరపాలక సంస్థ ఆలోచించాలి. నగరపాలక సంస్థకు సంబంధించిన ఒక అధికారికి వీటి నిర్వహణ పర్యవేక్షణ ఒక అదనపు బాధ్యతగానే ఉన్నందున ఈ అధికారులకు ఈ హోమ్‌లను సందర్శించే సమయం దొరకడం లేదు. ఈ విషయం కూడా ప్రభుత్వం ఆలోచించాలి. దేశంలో ఇంకా ఎన్నో బసలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంటులో ఈ పౌరులకు సంబంధించిన అన్ని అవసరాలూ నెరవేరే రీతిలో ఒక చట్టం తేవాలి. చట్టం వస్తే ఈ అభాగ్య జీవులు తమ అవసరాలను హక్కుగా పొంది గౌరవప్రదమైన జీవితం జీవించగలరు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమాన్ని పట్టణ పేదలకు కూడా విస్తరింప చేయాలని డిమాండ్ ఎంతోకాలంగా ఉంది. పేద ప్రజల ఉపాధి ప్రణాళిక పట్టణాలకూ విస్తరించినప్పుడు మిగతా పేదలతో పాటు వీధి బతుకులు సాగిస్తున్న ఈ పౌరులకు కూడా జీవనోపాధి లభిస్తుంది. ప్రతి సంవత్సరం గాంధీ జయంతి ముందు రోజు రాత్రి, అంటే 1 అక్టోబర్ రాత్రి దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో ‘నక్షత్రాల క్రింద’ (Under the stars) అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాత్రి బసలు నడుపుతున్న సంస్థలు, వాటి సిబ్బంది, సామాజిక సంస్థల కార్యకర్తలు స్థానిక పోలీసు, మున్సిపల్ సిబ్బంది సహకారంతో వీధుల్లో నిద్రపోతున్న వారిని పలకరించి బసలకు తీసుకువెళ్తారు. ఈ కార్యక్రమం నేడు హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్ లాట్‌లో జరుగుతుంది. దానిలో అందరం పాల్గొని, ఈ పౌరుల హక్కుల గురించి పట్టించుకుందాం.


– నిరాశ్రయుల ప్రచారవేదిక, హైదరాబాద్

Read more