బడులు బాగైతేనే బంగారు తెలంగాణ!

ABN , First Publish Date - 2022-06-17T06:17:14+05:30 IST

లోకల్‌ క్యాడరైజేషన్‌ అమలులో భాగంగా 317 ఉత్తర్వుతో చెల్లాచెదురైన ఉపాధ్యాయుల ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నించి చతికిలబడిన ప్రభుత్వం, ఆ వెంటనే ప్రభుత్వ పాఠశాలలన్నింటిని ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్చబోతున్నామని...

బడులు బాగైతేనే బంగారు తెలంగాణ!

లోకల్‌ క్యాడరైజేషన్‌ అమలులో భాగంగా 317 ఉత్తర్వుతో చెల్లాచెదురైన ఉపాధ్యాయుల ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నించి చతికిలబడిన ప్రభుత్వం, ఆ వెంటనే ప్రభుత్వ పాఠశాలలన్నింటిని ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్చబోతున్నామని ప్రకటించింది. పాఠశాలల నవీకరణకు ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో 50శాతం పాఠశాలలు మూసివేత అంచున ఉన్న సమయంలో ప్రభుత్వం మేల్కొనడం మంచిదే.


గ్లోబలైజేషన్‌ విసిరిన సవాళ్లల్లో మొదటిది భాషకు సంబంధించింది. ముప్పై ఏళ్ళ క్రితమే ప్రైవేటులో ఆంగ్లమాధ్యమ పాఠశాలలకు అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్చడంలో విఫలమైంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలుగా మార్చడం విప్లవాత్మక నిర్ణయం. రెండో సవాలు అడ్మిషన్‌ వయస్సు. ముప్పై ఏళ్ళ క్రితమే ప్రైవేటులో నర్సరీ, ఎల్‌.కె.జి, యు.కె.జి లాంటి ప్రీ ప్రైమరీ విద్యకు అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆ పద్ధతి ప్రారంభించి ఉంటే ఇవ్వాళ ఈ దుస్థితి ఉండేది కాదు. మూడో సవాలు కంప్యూటర్‌ విద్య. దశాబ్దంన్నర క్రితమే ప్రైవేటు పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పరిచిన కంప్యూటర్‌ ల్యాబులన్ని బోధకులను తొలగించడంతో మూతపడ్డాయి. గ్లోబలైజేషన్‌లో కంప్యూటర్‌ విద్యకు ఉన్న ప్రాముఖ్యత గుర్తించి కూడా కంప్యూటర్‌ స్కూల్‌ అసిస్టెంటు పోస్టులను ఇప్పటికీ సృష్టించకపోవడం శోచనీయం. నాలుగో సవాలు– ప్రతిభావంతులైన విద్యార్థులకు ఐ.ఐ.టి, మెడికల్‌లాంటి ఎంట్రెన్స్‌ పరీక్షలను ఎదుర్కొనే విధంగా ఇ–టెక్నో స్కూల్స్‌, కాన్సెప్ట్‌ స్కూల్స్‌, ఒలంపియాడ్‌ స్కూల్స్‌ వంటివాటిని పోలిన పాఠశాలలు ప్రభుత్వ రంగంలో నేటికీ ప్రారంభం కాలేదు. అలాగే ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల తల్లిదండ్రులకే వర్తింపచేయాలనే డిమాండుకు అనుగుణంగా ఒక చట్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తించలేదు. ఒక్క ఉద్యోగుల, ఉపాధ్యాయుల పిల్లలే కాదు, గ్రామ వార్డు మెంబరు నుంచి రాష్ట్రపతి వరకు ఎవరి పిల్లలైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారో వారికి మాత్రమే పై పదవులకు పోటీచేసే అవకాశం ఉండేట్టు చట్టం రూపొందించాలి. వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయి. ఇవన్నీ జరిగి ఉంటే ప్రభుత్వ పాఠశాలలు నేడు ఈ స్థితికి చేరేవి కావు.


ఇక, కులాల, మతాల, జాతుల వారి పాఠశాల విద్యావ్యవస్థ ఉండదని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిన వారే తిరిగి అటువంటి రెసిడెన్షియల్‌ పాఠశాలల వ్యవస్థను తీసుకొని వచ్చి, ప్రవేశ పరీక్షలు పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరినీ తీసుకుపోతూ, ఉపాధ్యాయులు చదువు చెప్పడంలేదని, వారికి చదవడం రాయడం రావడంలేదని బదనాం చేయడం విచిత్రం. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేకుండా చేసి మూసివేత దశకు తీసుకురావడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. రాష్ట్రంలోని బడులు జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలు అటుంచి కనీస ప్రమాణాలకు నిలబడవు. తరగతి గదులు సక్కగా లేవు. మూత్రశాలలు లేవు. లైబ్రరీ లేదు. కూలిపోయే గదులతో కునారిల్లుతున్న పాఠశాలలకు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఎలా పంపిస్తారు? ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న స్కావెంజరును కూడా ఊడబెరికి పరిశుభ్రత బాధ్యత గ్రామపంచాయితీలకు అప్పగించడం సమంజసమా? రాష్ట్రంలోని చాలా పాఠశాలలకు కరెంటు సౌకర్యంలేదు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు ఉచిత కరెంట్‌ ఇచ్చే నిర్ణయం తీసుకోవాలి. అన్ని పాఠశాలలకు ఉచితంగా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలి. రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థుల మెనూకు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మెనూకు జమీన్ ఆస్మాన్‌ ఫరక్‌ ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను రెండో తరగతి పౌరులుగా ఎందుకు చూస్తున్నారు? ఉన్నత, మధ్యతరగతి వర్గాల తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు మొగ్గుచూపకపోవడానికి కనీస సౌకర్యాలు లేకపోవడమే!


కొత్త పోస్టులను సృష్టించటం మాట అటుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అటెండరు, స్వీపరు, జూనియర్‌ అసిస్టెంటు పోస్టులతో సహా వేటిని నింపడం మీద ఇప్పటివరకు దృష్టిపెట్టలేదు. 21 జిల్లాలకు డి.ఇ.ఓ పోస్టుల మంజూరు లేదు. జిల్లాల ఏర్పాటు వరకు రాష్ట్రంలో కొనసాగిన డివిజన్‌ విద్యావ్యవస్థ త్రిశంకు స్వర్గంలో ఉంది. 600కు పైబడి మండల విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉంటే పర్యవేక్షణకు అర్థమేముంది? 30వేలకు పైబడి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ పీటముడిని 25 ఏళ్ళుగా విడదీయలేని స్థితిలో ప్రభుత్వాలు ఉంటే ప్రమోషన్ల పరిస్థితి ఎట్లా?


ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాల పాడు కాలం నడుస్తున్నది. ఎపెప్‌, డిపెప్‌, క్యూఐపి, ఎల్‌.ఇ.పి, ఇప్పుడు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సి.సి.ఇ). ఈ ప్రయోగాలు ప్రజల్లో పాఠశాల విద్యావ్యవస్థ పట్ల ఉండే విశ్వాసాన్ని దెబ్బతీసాయి. పాఠశాలల్లో ఈ మధ్య కాలంలో జరిగిన సర్వేలన్ని పిల్లలకు చదవడం, రాయడం రావడం లేదని చెబుతుంటే ఏసీ గదుల్లో కూర్చున్న  ఈ మేధావులు మాత్రం పరీక్షలలో లోపం ఉందని సూత్రీకరించారు. సి.సి.ఇని ప్రవేశపెట్టిన సి.బి.ఎస్‌.ఇ, ఇంకా 21 రాష్ట్రాలు దాని దుష్ఫలితాలను సమీక్షించుకొని, వెంటనే రద్దు చేసుకొని పాత పద్ధతిని ప్రవేశపెట్టుకున్నాయి. కాని మన రాష్ట్రంలో మాత్రం ఇది తప్పుడు విధానమని, రద్దు చేయమని ఉపాధ్యాయులు, సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేసినా విద్యాశాఖలో తిష్టవేసుకున్న మేధావులు మాత్రం దానిని వదిలిపెట్టడకుండా కొనసాగించడానికి వీలుగా వాళ్ళకు వాళ్ళే ఓ వర్క్‌షాప్‌ పెట్టుకొని నిర్ణయం తీసుకున్నారు. ఇకనైనా ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజలు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కళ్ళు తెరిచి గ్లోబలైజేషన్‌ విసిరిన సవాల్‌కు తగ్గట్టుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చాలన్న డిమాండును ప్రభుత్వం ముందు ఉంచాలి. మడికట్టుకొని కూర్చుంటే పతనం అంచున నిలబడి ఉన్న విద్యావ్యవస్థ పతనం కావడం, పాఠశాలలు మూతబడటం ఖాయం!

ఏరుకొండ నరసింహుడు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌ (టి.టి.యు)

Updated Date - 2022-06-17T06:17:14+05:30 IST