కుదేలవుతున్న సాగును చక్కదిద్దేదెలా?

ABN , First Publish Date - 2022-04-28T09:43:39+05:30 IST

అమృతోత్సవ భారత చరిత్రలో, ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే, మన వ్యవసాయ రంగంలో ఎన్ని మెరుపులు ఉన్నాయో అన్నే చీకట్లు ముసిరి ఉన్నాయి. సాగు పద్ధతులు, మేలైన వంగడాలు, నూతన సాంకేతిక...

కుదేలవుతున్న సాగును చక్కదిద్దేదెలా?

అమృతోత్సవ భారత చరిత్రలో, ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే, మన వ్యవసాయ రంగంలో ఎన్ని మెరుపులు ఉన్నాయో అన్నే చీకట్లు ముసిరి ఉన్నాయి. సాగు పద్ధతులు, మేలైన వంగడాలు, నూతన సాంకేతిక ఆవిష్కరణలపరంగా ఎంత అభివృద్ధి సాధించామో, రైతు ఆత్మహత్యలు, గిట్టుబాటుకాని ధరలు, నిస్సారమైన నేలల విషయంలో అంతే వెనుకబాటుతనం కనిపిస్తుంది. మొత్తంగా సాగు ప్రస్థానాన్ని సమీక్షించుకుంటే మిశ్రమ ఫలితాలే గోచరిస్తాయి.


స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో వ్యవసాయ వృద్ధిరేటు చాలా తక్కువగా ఉండేది. పంటల దిగుబడి కూడా అంతంత మాత్రమే. అప్పట్లో తిండి గింజల కోసం ఇతర దేశాల మీద ఆధారపడవలసి వచ్చేది. అనంతర కాలంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత, భూ సంస్కరణలు, సహకార వ్యవస్థ ద్వారా ఋణ పరపతి పెంపు, హరిత విప్లవం, భారీ నీటిపారుదల రంగ ప్రాజెక్టుల నిర్మాణం, పంచవర్ష ప్రణాళికల్లో వ్యవసాయ రంగానికి నిధుల సహకారం వంటివి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మన దేశం స్వయం సమృద్ధి సాధించేలా చేశాయి. బంగారానికి తావి అద్దినట్లు... మన దేశంలో అన్ని రకాల పంటల సాగుకి అనుకూలమైన వైవిధ్యమైన నేలలు ఉండడం, సుమారు 20కోట్ల హెక్టార్లలో విభిన్న పంటలు సాగవడం, 45శాతం సాగు భూమికి నీటి వసతి ఉండడంవల్ల మనం అనేక పంటల ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాం. సుగంధ ద్రవ్యాలు, జనుము, జీడిపప్పు, మామిడి, అరటి, సపోట, దానిమ్మ, పశుసంపద, కోళ్ల పెంపకం, పాల ఉత్పత్తిలో మనది ప్రథమ స్థానం. వరి, గోధుమ, చెరకు, వేరుశనగ, వంకాయ, క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్‌, ఉల్లి ఉత్పత్తుల్లో రెండో స్థానంలో ఉన్నాం, టమోట, బంగాళదుంప ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉన్నాం. ఉపాధిపరంగా చైనా, అమెరికా తరవాత మూడో అతిపెద్ద జీవనోపాధి అందించే దేశం మనదే.


ముఖ్యంగా మన దేశం వ్యవసాయ పరిశోధన, నూతన సాంకేతిక విజ్ఞానంలో అద్భుత విజయాలు నమోదు చేసింది. ఆహారం రంగంలో పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సౌకర్యాలే నిచ్చెనగా స్వయంసమృద్ధి దశని దాటి ఈనాడు 135కోట్ల జనాభాకి 30కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తూ మిగులును ఎగుమతి చేస్తోంది. అలాగే ఆధునిక సాగు పద్ధతులు అందిపుచ్చుకొని రైతులు ముందడుగు వేస్తున్నారు. అందుబాటులోకి వస్తున్న సరికొత్త యంత్రాలు, పరికరాలను ఉపయోగిస్తూ సూక్ష్మ సేద్యం ద్వారా నీటిని ఆదా చేసి నూతన పంటలు సాగు చేస్తూ దేశాన్ని సాగులో అగ్ర పథాన నిలుపుతున్నారు.


ఇలా ఎన్నెన్నో ఘనతలు సాధించిన మన వ్యవసాయరంగం నేడు సంక్షోభాగ్నుల్లో చిక్కుకుంది. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నా ప్రధాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడం లేదు. పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటల విత్తనోత్పత్తిలో ప్రైవేటు కంపెనీలదే గుత్తాధిపత్యం. ఆహార ధాన్యాల విషయంలో స్వావలంబన సాధించిన మనం... అపరాలు, నూనె గింజల పంటల్లో కనీస ఉత్పత్తిని అందుకోలేకపోతున్నాం. కందిపప్పు, పామాయిల్‌ వంటి ఉత్పత్తుల కోసం ఏటా వేల కోట్లు విదేశాలకు ధారపోస్తున్నాం. దిగుబడి పెంచుకునే సలహాలు, సూచనలు, యంత్రీకరణ సహకారం అందరి రైతులకు అందడం లేదు. ముఖ్యంగా నిరంతర పరిశోధనలు, నిర్విరామ కృషితో సేద్యాన్ని సులభతరం చేసే నూతన యంత్రాలు అందుబాటులోకి వచ్చినా, సరికొత్త విత్తన రకాలు వాడుకలోకి వచ్చినా, విస్తరణ సేవా లోపాలతో పొలం వరకు అవి చేరడం లేదు. పంటలు కీలక దశలో ఉన్నప్పుడు చీడపీడలు, తెగుళ్లు, వైరస్‌ల బారినపడిన వేళ నివారణోపాయాలు చెప్పేవారు లేక కర్షకులు దిగుబడులు కోల్పోతున్నారు. గోరుచుట్టుపై రోకటిపోటులా ఏటికేడు సాగు ఖర్చులు, ప్రకృతి విపత్తుల ముప్పు పెరుగుతోంది. ఏటేటా ఎరువుల భారం అధికమవుతోంది. ఏటా సగటున 90వేల కోట్ల రూపాయలు ఎరువుల పద్దు కింద ఖర్చైపోతున్నాయి. ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసి వ్యయం చేస్తున్నా, ఆశించిన దిగుబడులు రాకపోగా ఆరోగ్యవంతమైన నేలలు నిస్సార భూములుగా మారిపోతూ వాతావరణం కలుషితమైపోతుంది. ఇలా మన దేశంలో రెండున్నర కోట్ల హెక్టార్లలోని నేలలు దెబ్బతిన్నాయి. పుండుమీద కారంలా నింగినంటుతున్న డీజిల్‌ ధరలతో దుక్కి దున్నకం, పంట కోత, నూర్పిడి ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఋతువులు గతి తప్పి, పంట కాలాలు మారిపోయి వైపరీత్యాలకు ఎదురీది చేస్తున్న సాగులో, తెగుళ్ల బెడద పెరిగి ఏడాదికో కొత్త రోగం రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వీటి నియంత్రణ కోసం రైతులు విచ్చలవిడిగా పురుగు మందులు వాడుతున్నారు. ఇలా అవసరానికి మించి పిచికారీ చేస్తున్న రసాయన క్రిమిసంహారకాలతో పంటల్లో పోషకాలు తగ్గిపోవడమే కాకుండా ఆ విష అవశేషాల ఆహారం తింటున్న ప్రజలు రోగాలబారిన పడుతున్నారు.


ఇక కూలీల కొరత అయితే తారస్థాయికి చేరింది. కూలీలు దొరికినా అధికంగా డిమాండ్‌ చేస్తున్నారు. సహస్ర సమస్యల మధ్య ఆరుగాలం కష్టిస్తున్న రైతులకి చివరికి అప్పులే యమపాశాలవుతున్నాయి. వ్యవసాయ రంగంమీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన ఎన్నో అనుబంధ పరిశ్రమలు లాభాల్లో పయనిస్తుంటే... కాడిని నమ్ముకున్న పాపానికి కర్షకులు నష్టాలతో చితికిపోతున్నారు. వరుస నష్టాలు, ఎదురుదెబ్బలతో ఋణాల ఊబి నుంచి బయటపడే మార్గం లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రాణ త్యాగాలకు సిద్ధపడుతున్నారు. ఇలా గత రెండున్నర దశాబ్దాల్లో 3.5 లక్షల మంది రైతులు ఆత్మ బలిదానం చేశారు. వ్యవసాయాన్ని కరతలామలకంగా చేసిన రైతులే కాడిని వదిలేస్తుంటే యువకులు సేద్యమంటే భయపడుతున్నారు. మొత్తంగా సాగు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వ్యవసాయం కంటే కూలి చేసుకోవడం మేలనే భావన రైతుల్లో బలపడుతోంది.


దేశంలో వందకి పైగా పంటలు పండిస్తుంటే మద్దతు ధరలు అందుతోంది పాతిక పంటలకే. అది కూడా సాగు ఖర్చులతో సంబంధం లేకుండా కంటి తుడుపుగా ధరలు ప్రకటిస్తున్నారు. ఫలితంగా తాను పండించిన పంటకి ధర నిర్ణయించలేని రైతులు ఈ అరకొర మద్దతు ధరలతో కనీసం పెట్టుబడి చేతికందక అప్పుల్లోనే మగ్గిపోతున్నారు. పండించిన పంటని సర్కారు కొనుగోలు చేస్తుందన్న గ్యారంటీ లేక చివరికి వ్యాపారులు, దళారులే దిక్కవుతున్నారు. వారేమో ఆడిందే ఆటగా ధర నిర్ణయిస్తూ రైతులని నిలువు దోపిడీ చేస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండులా నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, నాసిరకం పురుగు మందులు రైతులను ముంచుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా అన్నదాతలకి ఆదాయ భరోసా మాత్రం కల్పించలేకపోతున్నాయి.


ఇప్పటికైనా సాగు రంగ సంక్షోభాల్ని నివారించడానికి సమగ్ర విధానాలు రూపుదాల్చాలి. హేతుబద్ధంగా బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి. రైతుల సంఖ్య, అవసరాలకి అనుగుణంగా వ్యవసాయ, ఉద్యాన, పశువైద్యుల నియామకాలు జరగాలి. ప్రస్తుతం 41శాతం మంది రైతులకే అందుతున్న సాంకేతిక, విస్తరణ సేవలు 90శాతానికి అందితే పంటల దిగుబడి పెరుగుతుంది. దేశమంతటా ఎదుర్కొంటున్న కూలీల కొరతకి పరిష్కారంగా ఉపాధి హామీ పథకాన్ని సాగుకి అనుసంధానించాలి. రైతులు పంటలు పండిస్తోంది దేశంకోసమే కాబట్టి పంట నూర్పిళ్ల ఖర్చు ప్రభుత్వాలే భరించాలి. ఇందుకు అవసరమైన యంత్రాలను ప్రతి గ్రామానికి సమకూర్చాలి. ఇక పంచభూతాల కాలుష్యం, భూసార క్షీణత, పర్యావరణ వినాశనానికి హేతువుగా నిలుస్తున్న రసాయన ఎరువులు–పురుగుమందుల వినియోగం తగ్గించి సేంద్రియ, ప్రకృతి సేద్యానికి పెద్దపీట వేయాలి. ప్రాంతీయ అవసరాలు, గిరాకీ ఆధారంగా పంటల సాగుని ప్రోత్సహించి ప్రతి పంటని గిట్టుబాటు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇవన్నీ సాకారమైన నాడు మన సేద్యానికి పూర్వవైభవం వస్తుంది. 

యడ్లపల్లి వేంకటేశ్వరరావు

చైర్మన్‌, రైతునేస్తం ఫౌండేషన్‌

Updated Date - 2022-04-28T09:43:39+05:30 IST