‘తెలంగాణ’ ఎంత ప్రాచీనం?

ABN , First Publish Date - 2022-12-05T00:25:03+05:30 IST

‘తెలంగాణ’ అనే పదం ఇప్పుడు ఒక ప్రత్యేక భౌగోళిక వ్యక్తిత్వంగా, రాష్ట్రంగా, అస్తిత్వ కేతనంగా, ఒక జాతి ప్రతీకగా ఉంది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘తెలంగాణ’ అనే పదం...

‘తెలంగాణ’ ఎంత ప్రాచీనం?

‘తెలంగాణ’ అనే పదం ఇప్పుడు ఒక ప్రత్యేక భౌగోళిక వ్యక్తిత్వంగా, రాష్ట్రంగా, అస్తిత్వ కేతనంగా, ఒక జాతి ప్రతీకగా ఉంది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘తెలంగాణ’ అనే పదం సామూహిక శక్తి సంకేతంగా, సింగిల్‌ లైన్‌ ఎజెండాగా, సకలజనులనూ ఉద్దీపింప చేయగలిగింది. 1905లో భారతదేశంలో ‘వందేమాతరం’ నినాదం ఎంత బలమైన ఐక్యతా స్పూర్తిని ప్రజల్లో కలిగించగలిగిందో, ‘జైతెలంగాణ’ నినాదం అంతే సంఘటితవైఖరిని తెలంగాణ ప్రజలందరిలో పాదుకొల్పింది. ఇంతటి ప్రభావశీలమైన ‘తెలంగాణ’ పదం భాషా పరంగా ఎప్పుడు పుట్టింది? దీని ఆవిర్భావం ఎలా జరిగింది? ఈ పదానికి ఉన్న ప్రాచీనత ఏమిటి? అనేవి ఎంతో ఆసక్తిని కలిగించే అంశాలు.

భాషలోని పదాలు, వాటి పుట్టుక, పరిణామాలు గురించి అధ్యయనం చేసే పదోత్పత్తి శాస్త్రం (Etymology) నియమాలను అనుసరించి ‘తెలంగాణ’ పదోత్పత్తిని పరిశీలిస్తే ఎన్నో విషయాలు వెల్లడి అవుతాయి. వాటిలో ప్రముఖ చరిత్రకారుడు ఆదిరాజు వీరభద్రరావు తెలుగు నేల అంతటినీ త్రిలింగాల మధ్య విస్తరించిన దేశంగా భావించి కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం అనే త్రిలింగశైవ పుణ్యక్షేత్రాల మధ్య ఉండే భాగంగా చెపుతూ, ఈ ప్రాంతం త్రిలింగ దేశంగా, ఆ తర్వాత క్రమంగా ‘తెలంగాణ’గా మారిందని అభిప్రాయపడ్డారు.

అలాగే తెలంగాణం అనే పదం ‘‘తిలింగ’’ లేదా ‘‘తెలింగా’’ మరియు ‘‘ఆనము’’ (అంటే ప్రదేశం) అనే పదాల కలయికతో వచ్చిందని చెప్పడానికి భాషాపరంగా యుక్తత (Suitability), ఔచిత్యం (Propriety)కనిపిస్తుంది. అలా ‘త్రిలింగాన’ శబ్దమే క్రమంగా ‘తిలింగాన’గా మారి ‘తెలంగాణ’గా వ్యవహారంలోకి వచ్చిందని అనిపిస్తుంది. ఈ కోణం నుంచి ఆలోచిస్తే త్రిలింగ + ఆనము (ప్రదేశము) = త్రిలింగానము అనే భావన నుంచి తెలంగాణా పేరు క్రమంగా రూపాంతరం చెంది ఉండవచ్చు అనేది ఒక వాదన.

ద్రావిడ భాషలో ‘‘తెలుగు’’ అంటే ‘‘దక్షిణం’’ అనే అర్థం ఉంది. తెలుగు ప్రాంతం అనగానే దక్షిణ ప్రాంతం అనీ, ‘ఆనం’ అంటే ప్రదేశం అనీ, తెలుగు + ఆనం అంటే దక్షిణ ప్రాంతంలోని భూభాగము అని కూడా తెలుస్తుంది.

మహమ్మదీయ చరిత్రకారులు ఈ భూభాగాన్ని ‘తిలింగ్‌’ అని వ్యవహరించారు. అంటే తిలింగ్‌ ప్రాంతవాసులు తైలంగులుగా, తెలంగాణులుగా క్రమంగా పిలువబడ్డారు అనేది మరొక వాదన.

ఇలా ‘త్రిలింగ’, ‘తిలింగ’, ‘తెలింగ’, ‘తెలంగు’; తెనుంగు, తెనుగు పదాల నుండీ ‘తెలంగాణ’ పదం ఆవిర్భవించిందనేది నిరూపణ అవుతున్నప్పటికీ సాహిత్యపరంగా ఈ పదాల ప్రస్తావన మనకు పురాణాల కాలం నుండే కనిపించడం విశేషం.

అష్టాదశ పురాణాలలో ప్రముఖ పురాణం ‘స్కందపురాణం’. ఇందులో త్రిలింగ దేశం ప్రస్తావన మనకు కనిపిస్తుంది. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం మహేంద్రగిరి ప్రాకారంగా ఉన్న దేశం త్రిలింగ దేశమని ఈ పురాణంలో ఉటంకించగా, వాయు పురాణంలో ‘‘తిలింగుల జనపదం’’ అనే పేరుతో ప్రస్తావించారు. ఇది భారతదేశ మధ్య భాగంలో ఉన్న జనపదాలలో ఒకటిగా ఈ పురాణం పేర్కొంది. ప్రస్తుత భౌగోళిక విస్తరణను అనుసరించి చూసినా ఇది సరిగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. నన్నయ రాసిన శ్రీ మదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో కూడా త్రిలింగ ప్రాంత ప్రస్తావన మనకు కనిపిస్తుంది.

దేవగిరిని పాలించిన యాదవ రాజుల మంత్రి హేమాద్రి తాను రాసిన ‘‘వ్రత ఖండం’’ అనే గ్రంథంలో ఈ త్రిలింగ పదాన్ని ప్రయోగించారు. ఆయన కాకతీయ ప్రభువు రుద్ర దేవున్ని ‘‘త్రిలింగ అధిపతి’’గా వర్ణించాడు. త్రిలింగములకు ఆలయాలను నిర్మించిన ప్రదేశాన్ని పరిపాలించే కాకతీయ ప్రభువుని త్రిలింగ అధిపతిగా ఇక్కడ చెప్పారు.

త్రిలింగ, తిలింగకు రూపాంతరంగా భాషావేత్తలు చెప్పిన తెనుంగు, తెనుగు, తెలుగు, పదాలను 13వ శతాబ్దికి చెందిన పాల్కురికి సోమన కూడా తన రచనలలో ఉదహరించాడు. శివకవిగా ప్రజాసాహిత్యానికి, దేశి సంప్రదాయానికి ప్రాధాన్యత ఇచ్చిన పాల్కురికి తన ‘బసవపురాణం’లో రాసిన ఈ ద్విపదలో ‘తెనుంగు’ ‘తెలుగు’ పదాలను భాషగా ప్రస్తావించారు:

‘‘ఉరుతర గద్య పద్యోక్తుల కంటె - సరసమై బరగిన జాను

తెనుంగు

చర్చింపగా సర్వసామున్యమగుట - గూర్చెద ద్విపదుల

గోర్కీ దైవార

తెలుగు మాటలనంగ వలదు వేదముల - కొలది యగా

జూడుడిలనెట్టులనిన’’

అదే విధంగా ఆయనే రాసిన ‘పండితారాధ్య చరిత్ర’లో కూడా/ ‘‘ఆరూఢ గద్య పద్యాది ప్రబంధ - పూరిత సంస్కృత భూయిష్ట రచన మానుగా / సర్వ సామాన్యంబు గామి - జాను తెనుగు విశేషము ప్రసన్నతకు’’ అని ప్రస్తుతించారు. ఇక్కడ ‘తెనుంగు’, ‘తెనుగు’ పదాలను భాషగా వ్యక్తీకరించినప్పటికీ ఈ పదాలను ప్రదేశముకు సమానార్థకమైన ‘ఆనము’ ‘ఆనెము’ లను జత పరిస్తే (తెనుంగు + అనము లేదా తెనుగు + ఆనము లేదా తెలుంగా + ఆనము) ‘తెలంగానము’ అనే ప్రాంత వ్యక్తీకృత పదం ఏర్పడుతున్నది.

ఈ విధంగా ‘త్రిలింగ దేశ’ భావన నుంచి అలాగే ‘త్రిలింగ్‌’, ‘తెలింగ్‌’, ‘తెలుగు’ వంటి పదాల నుంచి కూడా ‘తెలంగాణం’ అనే పదము రూపాంతరం చెందిందని చెప్పడానికి కావలసిన సాహిత్య ఆధారాలు, చారిత్రక ఆధారాలు మనకు లభిస్తున్నాయి.

గోండ్వానా భూమిలో భాగంగా తెలంగాణా ప్రాంతం మొదటి నుంచీ ప్రత్యేక భౌగోళిక, నైసర్గిక విశిష్టతలను కలిగి ఉన్నప్పటికీ, ఆ ప్రాంతానికి మాత్రం తెలంగాణా అనే పేరు మాత్రం ఏర్పడలేదు. షోడష మహా జనపదాలు రూపొందిన క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికే తెలంగాణా ప్రాంతం ‘‘అస్మక రాజ్యం’గా ఒక మహాజనపదంగా గుర్తింపు పొందినప్పటికీ తెలంగాణగా దానికి గుర్తింపు రూపొందలేదు.

అయితే భౌగోళికంగా ఉనికిలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి గుర్తింపు పరంగా, పేరు పరంగా ‘తెలంగాణ’గా ఎప్పటి నుంచి ఉనికి ఏర్పడింది? - అనేది చాలా కాలంగా చరిత్రకారులను, పరిశోధకులను వేధిస్తున్న ప్రశ్న. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మనకు లభిస్తున్న సాహిత్య, చారిత్రక, శాసన ఆధారాలను అనుసరించి ‘తెలంగాణ’ ప్రాంతంగా ఏ కాలం నుంచి ఉనికిలో ఉంది? రాజ్యంగానో, ప్రదేశంగానో ఎప్పటి నుంచి వాడుకలో ఉంది? అనే ప్రశ్నలు ఎంతో ఉత్సుకతను కలిగిస్తాయి.

ఆమాటకొస్తే భాషాపరంగా, ‘తెలంగాణ’ అనే పదానికి ఉండే ప్రాచీనత గురించి ఎన్ని చారిత్రక, సాహిత్య పరిశోధనలు జరిగాయో, ప్రాంత పరంగా ‘తెలంగాణ’ అనే అంశంపై కూడ అన్నే చారిత్రక సాహిత్య పరిశోధనలు జరిగాయి. వాటిలో సాహిత్య ఆధారాల ప్రాతిపదికగా జరిగిన పరిశోధనలు, శాసనపరమైన ఆధారాల ప్రాతిపదికగా జరిగిన పరిశోధనలు ప్రధానమైనవి.

సాహిత్య ఆధారాల విషయానికొస్తే ‘తెలంగాణ’ అని కాక పోయినా, తెలంగాణాలోని ఇతర ప్రాంతాల ప్రస్తావన మొదటిసారిగా చేసినది ఓ విదేశీ యాత్రికుడు కావడం విశేషం! అతనే మెగస్తనీస్‌. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో భారతదేశానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీసు ‘‘ఇండికా’’ అనే గ్రంథాన్ని రాశాడు. అలాగే ఆ తర్వాత 3వ శతాబ్దిలో వచ్చిన ప్లినీ అనే మరో విదేశీ యాత్రికుడు కూడా తన యాత్ర విశేషాలను గ్రంథస్థం చేసారు. వీరు వారి గ్రంథాలలో భారత దేశానికి సంబంధించిన ఆకాలంనాటి ఎన్నో విశేషాలని చెపుతూ, దక్షిణ భారతదేశంలో ఒక శక్తివంతమైన ప్రాంతం ఉందని, దాని పరిధిలో అనేక గ్రామాలు, 30 పైగా పట్టణాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలా వారు పేర్కొన్న పట్టణాలలో బోధన్‌, కోటిలింగాల, ధూళికట్ట, కొండాపురం, ఫణిగిరి, గాజుల బండ్ల మొదలైన ప్రాంతాలన్నీ ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో ఉన్నవే. యాదృచ్ఛికంగా ఈ ప్రాంతాలన్నీ బౌద్ధ, జైన మత పరమైన అంశాలకు ఆవాసాలుగా ఉండడం విశేషం!

అలాగే క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో భారతదేశాన్ని టాలమీ అనే గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు సందర్శించాడు. టాలమీ తన గ్రంథంలో ‘‘త్రిలింగాన్‌’’ అనే ప్రస్తావన చేశాడు. దీనిని కొంతమంది చరిత్రకారులు తెలంగాణకు సంబంధించింది అని భావించారు. అయితే ఆ గ్రంథాన్ని పరిష్కరించిన మరికొంతమంది చరిత్రకారులు ఈ పదం ఒక ప్రాంతానికి సంబంధించిన పేరు కాదని అది గంగా నది పరివాహక ప్రాంతంలోని ఒక నగరం పేరు అని వెల్లడించారు. కనుక టాలమీ ప్రస్తావించిన ‘త్రిలింగాన్‌’కు దక్షిణ భారత దేశంలో నెలవైన తెలంగాణకు సంబంధం ఉందా అనే విషయంపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది.

ఇక 1870 ప్రాంతంలో బ్రిటిష్‌ లైబ్రరీలో పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా తన వాదానికి, సిద్ధాంతానికి పదును పెట్టుకున్న వారిలో గొప్ప తత్వవేత్త కార్ల్‌ మార్క్స్‌ కూడా ఒకరు. ఆయన ఆ లైబ్రరీలో అధ్యయనం చేస్తున్న కాలంలో తాను రాసుకున్న ‘నోట్స్‌ ఆన్‌ ఇండియన్‌ హిస్టరీ’ అనే చిత్తుప్రతిలో తెలంగాణ అనే పదాన్ని ఐదుచోట్ల వాడాడు. 1857లో భారత దేశంలో సంభవించిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామంపై ఎంతో ఆసక్తిగా ఎన్నో విషయాలను అధ్యయనం చేస్తున్న క్రమంలో కార్ల్‌ మార్క్స్‌ ఈ అంశాలను ప్రస్తావించాడు అని తెలుస్తోంది.

ఇక క్రీస్తుశకం 1310 ప్రాంతంలో ఢిల్లీ సుల్తానుల కాలము నాటి చరిత్రకారుడు, కవి అమీర్‌ ఖుస్రో రచనల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పదాల ప్రస్తావన కనిపిస్తుంది. కాకతీయ సామ్రాజ్యం మీదికి ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు 1310-1312లో ఆ తర్వాత 1320-1323 ప్రాంతాలలో జరిగాయి. అందులో అల్లాఉద్దీన్‌ ఖిల్జీ కాలంలో అంటే 1310-1312 మధ్యకాలంలో దక్షిణ భారతదేశంపై జరిగిన దండయాత్రలలో సేనాధిపతి మాలిక్‌ కాఫర్‌ సైన్యం దక్షిణభారతం వైపు దండయాత్రకు వచ్చిన సమయంలో వారితో పాటు వచ్చిన చరిత్రకారుడు అమీర్‌ ఖుస్రో. ఆయన తన రచనల్లో తమ దండయాత్ర లక్ష్యం ‘‘తిలింగ్‌’’ అని, దాని రాజధాని ‘‘ఆరంగల్‌’’ కోట (ఆనాటి ఓరుగల్లు, నేటి వరంగల్‌) ఎంతో గొప్పగా ఉందని ప్రస్తావించాడు. ఆయన తన రచనల్లో ఆరంగల్‌ కోట వంటి కోటను తాను అంతకుముందు ఎక్కడా చూడలేదని కూడా ప్రశంసించాడు.

అలాగే 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత ప్రతాపరుద్రుడిని బందీగా తీసుకెళ్లినపుడు అతని సైన్యాధ్యక్షుడు గన్నమ నాయుడు (అతనికి యుగంధరుడు అనే మరొక పేరు కూడా ఉంది) ఇస్లాం మతం పుచ్చుకుని తన పేరును ‘మాలిక్‌ మక్బూల్‌’గా మార్చుకున్నాడు అని తెలుస్తోంది. దీనికిగాను ఆనాటి ఢిల్లీ సుల్తానులు గన్నమ నాయుడు/ యుగంధరుడు/ మాలిక్‌ మక్బూల్‌ కు ఒక బిరుదును ప్రదానం చేశారు. ఆ బిరుదు పేరు ‘ఖాన్‌-ఏ-తెలంగాణ’! ఈ ప్రస్తావనను అనుసరించి తెలంగాణ పేరుకి చారిత్రకంగా ఒక నిర్దిష్ట ప్రామాణికత 13వ శతాబ్ది నాటికి వచ్చిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

ఇక, శాసనపరమైన ఆధారాల విషయానికొస్తే, ప్రాంతంగా తెలంగాణ పద ప్రస్తావన మొదటిసారి పూర్వ మెదక్‌ జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్‌ గ్రామంలో బయల్ప డింది. అక్కడ నిర్మించిన దిగుడుబావి ముందర ఒక శాసనం వెలుగు చూసింది. ఆ శాసనం తెల్లాపూర్‌ శాసనంగా పురావస్తు శాఖ వారు నిర్ధారించి, ఇది క్రీస్తుశకం 1417లో వేసినట్లుగా ధ్రువీకరణ చేసారు. భారతీయ కాలమానం ప్రకారం హేవిళంబి నామ సంవత్సరం మాఘ శుద్ధ దశమి నాడు వేసిన ఈ శాసనంలో స్తంభానికి ఒకవైపు మొత్తం ఇరవై నాలుగు పంక్తులలో ఉన్న వ్యాఖ్యానంలో ఒకచోట ‘‘తెలంగాణ’’ అనే పదం ఉండటం విశేషం! ఇలా ప్రస్తుత కాలపు పిలుపుతో సంపూర్ణంగా ‘తెలంగాణ’ను ప్రస్తావించిన తొలి శాసనంగా తెల్లాపూర్‌ శాసనం ప్రత్యేకతని సంతరించుకుంది.

అలాగే ఈ శాసన కాలానికి దాదాపు 90ఏళ్ల తర్వాత వేయబడిన మరొక శాసనం వెలిచెర్ల శాసనం. దీనిని క్రీస్తుశకం 1516లో ప్రతాపరుద్ర గణపతి వేయించారు. ఈ శాసనంలో తెలంగాణ అనే పదం ప్రయోగించబడినట్లుగా ఆధారాలున్నాయి.

అలాగే క్రీస్తుశకం 1358వ సంవత్సరంలో వేసిన శ్రీరంగం తామ్ర శాసనంలో కూడా ‘‘తెలింగ దేశ’’ అనే పదాలతో తెలంగాణ ప్రాంత ప్రస్తావన ఉందని తెలుస్తోంది. ఇక శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా తెలంగాణ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లుగా పురావస్తు ఆధారాలు మనకు నిరూపిస్తున్నాయి. రాయలు వేసిన శాసనాలలో తిరుమల లోని 1517 శాసనంలో ‘‘తెలంగాన్యపు దుర్గాలు’’ అనే మాట ప్రస్తావించబడింది.

ఇలా ‘తెలంగాణ’ పదం ప్రాచీనత సాహిత్య ఆధారాలను అనుసరించి పురాణాల కాలం నుంచి, శాసన ఆధారాలను అనుసరించి 13వ శతాబ్దం నుంచి అమలులో ఉన్నదని తేటతెల్లం అవుతున్నది. ఈ దిశగా మరింత పరిశోధన, పరిశీలన జరగాల్సిన అవసరం కూడా ఉన్నది.

మామిడి హరికృష్ణ

80080 05231

Updated Date - 2022-12-05T00:25:03+05:30 IST

Read more