పాకిస్థాన్‌ను ముంచిన మతమౌఢ్యం

ABN , First Publish Date - 2022-09-21T06:01:05+05:30 IST

మతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తే ఒక దేశం ఏ విధంగా వెనుకబడిపోతుందనేది పాకిస్థాన్‌ను పరిశీలిస్తే అవగతమవుతుంది. మత ప్రాతిపదికన ఏర్పడిన దేశమది...

పాకిస్థాన్‌ను ముంచిన మతమౌఢ్యం

మతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తే ఒక దేశం ఏ విధంగా వెనుకబడిపోతుందనేది పాకిస్థాన్‌ను పరిశీలిస్తే అవగతమవుతుంది. మత ప్రాతిపదికన ఏర్పడిన దేశమది. తొలి నుంచీ అనుసరించిన మత ప్రేరిత విధానాల వల్ల పాకిస్థాన్ అన్ని రంగాలలో వెనుకబడి పోయింది. ఇటీవల ఖతర్ పర్యటన నుంచి స్వదేశానికి తిరిగి వెళ్ళిన పాకిస్థాన్ ప్రధాని షహేబాజ్ షరీఫ్ ‘తాము 75 ఏళ్ళుగా బిక్షాటన చేస్తున్నట్లు’ వాపోయారు! 


1947లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పుడు పాకిస్థాన్‌కు వ్యవసాయమే ప్రధాన ఆదాయవనరు. పాకిస్థాన్ భౌగోళికంగా భారత్ కంటే చిన్న దేశమే అయినప్పటికీ సమృద్ధ జలవనరులు, సారవంతమైన సాగు భూములకు నెలవైన పంజాబ్ కారణాన పాక్ ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉండేవి. అవిభక్త భారత్ విభజన నాటికి ఉన్న 921 ప్రధాన పరిశ్రమలలో కేవలం 34 మాత్రమే పాక్‌కు దక్కాయి. అవి కూడా ప్రధానంగా బెంగాల్‌లోని జనపనార పరిశ్రమలు మాత్రమే. 1950లో పాకిస్థాన్ తలసరి ఆదాయం 1268 డాలర్లు. ఇది అప్పట్లో భారత్ తలసరి ఆదాయం కంటే దాదాపు రెండు రెట్లు అధికం. 


అయితే కశ్మీర్‌ను స్వాయత్తం చేసుకోవడమే పాక్ జాతీయ రాజకీయాల ప్రధాన లక్ష్యమయింది. ఆ లక్ష్య సాధనకై భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధాలకు తెగబడింది. ఈ యుద్ధాలు, రాజకీయాల వల్ల పౌర, సైనిక పాలకులు పలు విధాల ప్రయోజనాలు పొందారు. అయితే దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమయ్యారు. దేశాన్ని అత్యధిక కాలం ఏలిన సైనికాధికారులు ఇస్లామిక్ భావజాలంతో కశ్మీర్‌ను బూచిగా చూపి పంజాబీలు, సింధీలు, బలూచీలు, పఠాన్లు, మహాజీర్లుగా విడిపోయిన దేశాన్ని ఒక్కటిగా నిలబెట్టారు. అయితే దానితో పాటు దేశ బడ్జెట్ కేటాయింపుల్లో సింహభాగాన్ని రక్షణ శాఖకు దక్కించుకోవడంలో సఫలీకృతులయ్యారు. 


సోవియట్ యూనియన్, అమెరికా మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో పొరుగున ఉన్న అఫ్ఘానిస్థాన్ ఒక పావుగా మారింది. పాక్ సైన్యంలో స్వతహాగా అత్యధికులుగా ఉన్న పఠాన్ల అంశం, అఫ్ఘాన్ లోని పరిణామాలు సహజంగా ఇస్లామాబాద్‌కు అంతర్జాతీయంగా ఒక సముచిత పాత్రను కల్పించాయి. సోవియట్ ఎర్రసేనలను దెబ్బతీయడానికి అమెరికా జిహాద్‌ను ప్రొత్సహించి పాకిస్థాన్‌కు అన్ని రకాలుగా అండగా నిలిచింది. జనరల్ జియా ఉల్ హఖ్ హయాంలో ఈ జిహాద్ ఉగ్రవాదం పరాకాష్ఠకు చేరుకుంది. అమెరికా మద్దతుతో ఇస్లామాబాద్ పాలకులు ఆడింది ఆట పాడింది పాట అయింది. ఇదే సమయంలో పాక్ పాలకులు తాము అనుసరిస్తున్న మత ప్రేరిత భావజాలానికే మరింతగా నిబద్ధమయ్యారు. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత జిహాద్ నుంచి అమెరికా వైదొలిగినా ఆ భావజాలం మాత్రం అదే విధంగా పాక్ రాజకీయాలు, సమాజంలోనూ దృఢంగా ఉండిపోయింది. 


విద్య, మౌలిక వసతుల అభివృద్ధిలోనే కాదు అన్నింటా దేశ పురోగతి క్రమేణా కుంటుపడిపోయింది. విద్యార్థులకు నవీన, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే అంశాల కంటే మధ్య యుగం నాటి ముస్లిం రాజుల యుద్ధాలు వగైరా గూర్చి ఎక్కువగా బోధిస్తారు. నాణ్యమైన విద్యాలేమి కారణాన అక్కడి యువత విదేశీ ఉద్యోగ విపణిలో అవకాశాలను అందుకోలేకపోతోంది. పాకిస్థానీ ప్రవాసుల సంఖ్య 80 లక్షలు కాగా, అదే భారతీయ ప్రవాసుల సంఖ్య ఒక కోటీ 80 లక్షలు (విదేశాలలో పౌరసత్వం కలిగి ఉన్నవారి సంఖ్య దీనికి అదనం). విదేశాలలో భారతీయులు అన్ని రంగాలలో నిపుణులుగా ఉండగా పాకిస్థానీయులు నిమిత్తమాత్ర కార్మికులుగా ఉన్నారు, లేదా చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తున్నారు. 


అవిభక్త భారత్ విభజన అనంతరం భారతదేశం అనతికాలంలోనే శరవేగంగా పురోగమనం వైపు పయనించగా పాకిస్థాన్ మాత్రం మతమౌఢ్యంలోకి జారిపోయింది. ఈ వాస్తవాన్ని గ్రహించే సరికి పాకిస్థాన్‌కు పుణ్యకాలం దాటిపోయింది. దేశం పూర్తిగా దివాలా తీసి ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి పాకిస్థాన్ దిగజారిపోయింది. తాము 75 ఏళ్ళుగా బిచ్చమడుక్కుంటున్నామన్న ప్రధానమంత్రి షహేబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలో వాస్తవం ఉంది. పాకిస్థాన్‌కు 200 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం చేయడానికి ఖతర్ ముందుకు వచ్చింది. సౌదీ అరేబియా, కువైత్ దేశాలు కూడ పాక్‌ను అన్ని విధాల ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాయి.


ఇస్లాం అధికారిక మతమైన గల్ఫ్ దేశాలు వివేకంతో మతానికి, పరిపాలన మధ్య స్పష్టమైన విభజన రేఖ గీయడం వలన అన్ని రంగాలలో పురోగమిస్తున్నాయి. సామరస్యం, సహనశీలత భారత పుణ్యభూమిలో స్వతస్సిద్ధంగా ఉంది. ఇది ఒక పార్టీ లేదా ప్రభుత్వం చట్టం చేయడంతో వచ్చింది కాదు. వసుధైక కుటుంబంగా తరతరాలుగా అన్ని సమూహాలను మమేకం చేసుకుని ప్రగతిశీలంగా ముందుకు సాగుతోంది. అలాంటి మనం ఇప్పుడు ధార్మిక భావోద్వేగాలను మాత్రమే కేంద్రంగా చేసుకోని రాజకీయాలు నడపడం, పాలన చేయాలనుకోవడం నిస్సందేహాంగా తిరోగమనమే..

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2022-09-21T06:01:05+05:30 IST