అమెరికా మిత్రులను ఆకర్షిస్తున్న రష్యా

ABN , First Publish Date - 2022-03-09T07:02:35+05:30 IST

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆ ఇరు దేశాలకు లేదా ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. రష్యా దురాక్రమణ ప్రపంచంలో అనేక కీలక రాజకీయ, సైనిక, ఆర్థిక, దౌత్య సమీకరణలకు...

అమెరికా మిత్రులను ఆకర్షిస్తున్న రష్యా

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆ ఇరు దేశాలకు లేదా ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. రష్యా దురాక్రమణ ప్రపంచంలో అనేక కీలక రాజకీయ, సైనిక, ఆర్థిక, దౌత్య సమీకరణలకు దారితీస్తోంది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ, భద్రతా మండలిలో రష్యాపై జరిగిన ఓటింగ్‌లోని వ్యత్యాసం, ఆయా దేశాలు ద్వైపాక్షికంగా అనుసరిస్తున్న దౌత్యనీతి మారుతున్న సమీకరణలకు దర్పణం పడుతోంది. ఒక దేశం మరో దేశంపై చేసిన దండయాత్రను ఖండించడానికి బదులుగా తమ దేశానికి సంభవించే లాభనష్టాల అంచనాలతో వివిధ దేశాలు ముందుకు వెళ్తున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు ఇప్పటికే రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. అయితే ఆ ఆంక్షల నుంచి రష్యా చమురు, గ్యాస్ ఎగుమతులకు మినహాయింపు ఇవ్వడం ఆ దేశాల ద్వంద్వ నీతిని తెలియజేస్తుంది.


చమురు సరఫరా ద్వారా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కీలక పాత్రపోషిస్తున్న గల్ఫ్ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. తమపై విధిస్తున్న ఆంక్షల కారణాన పెరిగే ఇంధన ధరలపై ఐరోపా దేశాల ప్రభుత్వాలు తమ ప్రజలకు సంజాయిషీ చెప్పుకోడానికి సంసిద్ధం కావాలంటూ రష్యా హెచ్చరించింది. ఈ హెచ్చరికతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోయాయి. రష్యా కారణాన సరాఫరాలో అంతరాయం ఏర్పడి ఐరోపాలో సంక్షోభం తలెత్తకుండా గల్ఫ్ దేశాలు ఆదుకునేలా అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించడం లేదు. 


చమురు ఉత్పాదక గల్ఫ్ రాజ్యాలన్నీ కూడ తమ రక్షణావసరాల కొరకు మొదటి నుంచీ అమెరికాపై ఆధారపడివున్నాయి. అయితే గత ఆరేళ్ళుగా ప్రపంచ చమురు నిక్షేపాలపై పట్టుకొరకు గల్ఫ్ దేశాలు, రష్యా సంఘటిమతమయ్యాయి. సౌదీ అరేబియా ఆధిపత్యంలో ఉన్న ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య) తనతో రష్యాను కలుపుకుని ఒపెక్ ప్లస్ గా మారిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ధరల పై అవి పూర్తి పట్టును సాధించాయి. 


సున్నీ గల్ఫ్ దేశాలకు, షియా ఇరాన్‌కు ఏ మాత్రం పడదు. దీనికి తోడుగా ఐరోపాకు తమ చమురు, ఇంధనాన్ని చౌకగా రవాణా చేసేందుకు ఈ దాయాది దేశాలు చేస్తున్న ప్రయత్నాలలో సిరియా, లిబియాల పాత్ర అత్యంత కీలకమైనది. మధ్యధరా సముద్రం మీదుగా నల్ల సముద్రం ద్వారా ఐరోపాకు చేరుకోవడం సులభం. సిరియా, లిబియాలలో జరుగుతున్న పోరాటం ఇందులో భాగమే. ఈ రెండు దేశాలలో కూడ రష్యా సైనిక స్ధావరాలు ఉన్నాయి. తనకు అండగా నిలుస్తున్న రష్యాకు అనుకూలంగా సిరియా ఓటు వేసింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో సిరియా, ఇరిట్రియాతో సహా కేవలం అయిదు దేశాలు మాత్రమే రష్యాకు అనుకూలంగా ఓటు వేశాయి. ఈ రెండు దేశాలకు అమెరికా మిత్ర దేశాలైన అరబ్ రాజ్యాలతో వివాదాలు ఉన్నాయి. ఇరాక్ ఓటింగుకు దూరంగా ఉంది. ఇరాన్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్, అల్జీరియా, మొరాకో కూడ భారత్ తరహా తటస్థ విధానంలో భాగంగా ఓటింగులో పాల్గొనలేదు. భారత్‌తో పాటు చైనా, పాకిస్థాన్‌లు కూడా రష్యాకు పరోక్ష మద్దతుగా ఓటింగ్‌లో పాల్గొనలేదనేది ఇక్కడ గమనార్హం. ఈ దేశాలేవీ కూడా రష్యాను ఖండించలేదు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష స్ధానంలో ఉన్న యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ కూడ రష్యా వైపు మొగ్గుచూపుతోంది. ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇదే వైఖరిని అవలంబిస్తున్నాయి. అటు ఇరాన్‌ను ఇటు గల్ఫ్ దేశాలను, ఒక వైపు చైనా, పాకిస్థాన్‌లను మరో వైపు భారతదేశాన్ని ఇలా పరస్పర వైరుధ్యం కల్గిన దేశాలను ఎలాంటి ఆర్భాటం, ప్రచారం లేకుండా రష్యా తన పక్షాన నిలుపుకోవడం దాని నిగూఢ దౌత్యనీతికి నిదర్శనం. మాస్కో దౌత్య ప్రజ్ఞను మెచ్చుకోక తప్పదు. ఇక భారత్ విషయానికి వస్తే, ప్రతిపక్షాల అరోపణలు ఏమైనా సరే, దేశ ప్రయోజనాల దృష్ట్యా నరేంద్ర మోదీ అవలంబిస్తున్న వైఖరి పూర్తిగా సమర్ధనీయమైనది.


అరబ్బు ప్రపంచంలోని ఇతర పెద్ద దేశాలైన ఈజిప్టు, ఇరాక్‌, ట్యూనిసియా, లెబనాన్, యమన్ దేశాలలో రష్యా, ఉక్రెయిన్‌ల గోధుమ పిండితో తయారయ్యే రొట్టెలు ప్రధాన ఆహారం. ధనిక గల్ఫ్ దేశాలతో పాటు యమన్, ట్యూనిసియా మొదలగు పేద అరబ్బు దేశాలలో కూడా ప్రజలందరికీ అవసరమైన రొట్టె పిండిని ప్రభుత్వాలే రాయితీపై సరఫరా చేస్తాయి. గతంలో రొట్టె పిండి రాయితీ తగ్గింపు అనంతరం ట్యూనిసియాలో పెల్లుబికిన ప్రజాగ్రహావేశాలు అరబ్బు ప్రపంచానికి సోకి దాన్ని కుదిపివేశాయి. అమెరికాకు విశ్వసనీయ మిత్రులుగా ఉన్న కొందరు దేశాధినేతలు అధికారాన్ని కోల్పోగా మిగిలిన వారు అప్రమత్తమయ్యారు. తమకు గిట్టని ఇరాన్‌కు అన్నింటా బాసటగా నిలిచే రష్యాను అమెరికా సంప్రదాయయక మిత్ర రాజ్యాలైన గల్ఫ్ దేశాలు ఎందుకు సమర్థిస్తున్నాయి? మార్కెట్ ప్రయోజనాల కంటే ఎక్కువగా అమెరికా విశ్వసనీయతను కోల్పోవడమే అని చెప్పక తప్పదు. ఇది నిష్ఠుర సత్యం. లిబియా మొదలు అప్ఘానిస్తాన్ వరకు అమెరికా తమను మోసం చేసిందని అరబ్బులు భావిస్తున్నారు. అలా అరబ్బులు అనుభవపూర్వకంగా దూరమవుతున్న అమెరికాకు భారత్ ఎంత వరకు దగ్గరవుతుందనేది వేచి చూడాలి.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2022-03-09T07:02:35+05:30 IST