కశ్మీర్ ఫైల్స్ : విజయమూ వివాదమూ

ABN , First Publish Date - 2022-03-23T06:07:08+05:30 IST

‘మేరాజూతా హై జపానీ, యే పత్లూన్ ఇంగ్లీస్తానీ, సిర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ బీ దిల్ హై హిందుస్తానీ’ -బాలీవుడ్ సినిమా ‘శ్రీ 420’లోని ఈ పాటలో జాతీయతా భావం ఉట్టిపడుతుంది....

కశ్మీర్ ఫైల్స్ : విజయమూ వివాదమూ

‘మేరాజూతా హై జపానీ, యే పత్లూన్ ఇంగ్లీస్తానీ, సిర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ బీ దిల్ హై హిందుస్తానీ’ -బాలీవుడ్ సినిమా ‘శ్రీ 420’లోని ఈ పాటలో జాతీయతా భావం ఉట్టిపడుతుంది. ఇటీవల గల్ఫ్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆబుధాబిలో తనను సన్మానించిన ప్రవాసులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ పాట చరణాలను ఉటంకించడంలో ఆశ్చర్యమేముంది? 67 సంవత్సరాల క్రితం రాజ్‌కపూర్ నిర్మించి, నటించిన ‘శ్రీ 420’లోని ఆ అజరామర పాటను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తావించడాన్ని బట్టి, అది ఇప్పటికీ భారతీయుల హృదయాలలో ఎంతగా నిలిచిపోయిందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ అభిమానాన్ని, సామాజిక ధర్మాన్ని ప్రబోధించే సినిమాలకు సహజంగానే ఆదరణ లభించడం కద్దు. ఉపకార్, సత్యం శివం సుందరం, బార్డర్ మొదలైన బాలీవుడ్ సినిమాలకు ప్రేక్షకాదరణతో పాటు ఆర్థిక విజయం కూడా లభించింది. ఇటీవలి దశాబ్దాలలో పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదం నేపథ్యంగా నిర్మించిన సందేశాత్మక సినిమాలూ విజయవంతమయ్యాయి. కశ్మీర్ లోయలో ఉగ్రవాద ఆరంభ దశలో విడుదలయిన ‘కర్మ’ (1986)కు ప్రజలు నీరాజనం పట్టారు. ఉగ్రవాదం ఊపు మీద ఉండగా ఒక ఇంజనీర్ అపహరణ ఉదంతంపై నిర్మించిన ‘‍రోజా’ (1992)నూ విశేషంగా ఆదరించారు. కర్మ, రోజా సినిమాల వీడియో క్యాసెట్లను గల్ఫ్ దేశాలలో బ్లాకులో విక్రయించి సంపాదించిన వారు ఉన్నారు! అదే విధంగా, ఫనా (2006) కూడ బాక్సాఫీసును బద్దలు కొట్టింది. ఉగ్రవాదుల అణిచివేత క్రమంలో భద్రతా బలగాల కారణంగా సర్వం కోల్పోయిన ఒక సామాన్య కుటుంబ గాథ ఇతివృత్తంగా, హృతిక్ రోషన్ నటించిన ‘మిషన్ కశ్మీర్’ (2000) కూడా జయకేతనం ఎగురవేసింది.


మరి, కశ్మీర్ లోయలో ఉగ్రవాదంపై నిర్మించిన వివిధ సినిమాల విషయంలో లేని వివాదం ఇప్పుడు ‘కశ్మీర్ ఫైల్స్’పై ఎందుకు తలెత్తుతోంది? ఒక్క పాకిస్థానీ ఇస్లామిక్ సంకుచితవాదులే కాకుండ, ప్రత్యామ్నాయ సైద్ధాంతిక దృక్పథాలు గల భారత రాజకీయ, మేధావి వర్గాలు కూడ ఉగ్రవాద మద్దతుదారులని భాష్యం చెప్పేందుకు ‘కశ్మీర్ ఫైల్స్’ ప్రయత్నించింది. ఇదే, ఆ సినిమాపై వివాదాల వెల్లువకు కారణం. రాజకీయ పక్షాల విమర్శలు ఎలా ఉన్నా ‘కశ్మీర్ ఫైల్స్’ ఒక ప్రచార ఎత్తుగడ అని అత్యున్నత నిఘా సంస్ధ ‘రా’ అధిపతిగా సుదీర్ఘ కాలం పని చేసి కశ్మీర్‌లో ఉగ్రవాదం అణచివేయడంలో కీలక పాత్ర వహించిన ఎ.యస్.దులాత్ వ్యాఖ్య ఈ సందర్భంగా గమనార్హమైనది. సామాజిక మాధ్యమాలు కీలకపాత్ర వహిస్తున్న ప్రస్తుత తరుణంలో భారతీయ జనతా పార్టీ తన వాదనతో ప్రత్యర్ధులకు అందనంత దూరంలో అగ్రగామిగా ఉంది. తమ రాజకీయ పన్నాగంలో భాగంగా వాస్తవ గాయాలకు వక్రభాష్యం చెబుతూ ఇప్పటికే సాంస్కృతిక దాడులు చేస్తున్న ఆ పార్టీ ఇక సినిమా మాధ్యమం ద్వారా భావోద్వేగ రాజకీయాలు చేస్తే తట్టుకోవడం కష్టమని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఏ సినిమానైనా వివాదస్పదం చేసి రచ్చకీడ్చితె ప్రాచుర్యం పొందుతుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘కశ్మీర్ ఫైల్స్’ను ప్రశంసించడాన్ని వివిధ వర్గాలు విమర్శిన్నాయి. అయితే దేశంలోనూ, విదేశాలలోనూ ఆ సినిమాపై విశేష ఆసక్తి వ్యక్తమవుతోంది. అమెరికా మొదలు ఆఫ్రికా వరకు ‘కశ్మీర్ ఫైల్స్’ జోరుగా ఆడుతున్నా దుబాయి సహా గల్ఫ్ దేశాలలో మాత్రం ఈ సినిమాను ప్రదర్శించడం లేదు. న్యూజీలాండ్‌లో అనుమతి లేకపోగా ఆస్ట్రేలియాలోని చిన్న పట్టణాలలో కూడ దీనికి డిమాండ్ పెరుగుతుంది. తొమ్మిది దేశాలలో 100 సినిమా హాళ్ళలో మొదలయిన ఈ సినిమా ఇప్పుడు 25 దేశాలలో 350కు పైగా హాళ్ళలో ప్రదర్శితమవుతోంది. సినీ వర్గాల అంచనా ప్రకారం, 10 కోట్ల రూపాయలకు మించని వ్యయంతో, మామూలు నటులతో నిర్మితమైన ‘కశ్మీర్ ఫైల్స్’ రూ. 300 కోట్లతో నిర్మించిన ‘రాధేశ్యాం’ను బాక్సాఫీస్ వద్ద వెనక్కి నెట్టింది.


ఇక సినిమా విషయానికి వస్తే, కశ్మీర్ పండితుల విషాదాలు ఇతివృత్తంగా ఈ సినిమాను నిర్మించారు. కశ్మీర్ బిడ్డలుగా అక్కడి ముస్లింలకు ఎంత హక్కు ఉందో, పండితులకు కూడ అంతే హక్కు ఉంది. వారు కూడ అసలు సిసలు భూమిపుత్రులు. లోయలో ఒక్క పండితులనే కాదు ఉగ్రవాదులను వ్యతిరేకించిన ముస్లింలను సైతం పెద్ద సంఖ్యలో హతమార్చారనేది ఎవరూ విస్మరించలేని, విస్మరించరాని సత్యం. కశ్మీర్ లోయ నుంచి భయంతో ఇతర ప్రాంతాలకు శరణార్ధులుగా వెళ్ళిన వారిలో అత్యధికులు కశ్మీరీ పండితులనేది కూడ వాస్తవం. సినిమాలో పుష్కర్‌నాథ్ పండిత్‌గా నటించిన అనుపమ్ ఖేర్ స్వయాన కశ్మీరీ పండితుడు కాగా ఆయన భార్య కాజోల్ బిజెపి లోక్‌సభ సభ్యురాలు. కుల, మత, ప్రాంతీయ సంకుచితత్వాలకు దూరంగా భారతీయులుగా కలిసిమెలిసి ఉంటూ పురోగతి సాధించాలని దుబాయిలో తనను సన్మానించిన తెలుగు ప్రవాసులకు జస్టిస్ రమణ చేసిన హితబోధనను మనసా వాచా కర్మణా పాటించడం స్వదేశంలోనూ, విశాల ప్రపంచంలోనూ ప్రతి భారతీయుని విధ్యుక్త ధర్మం. అందుకు సత్య నిష్ఠ, సహన భావం ఎంతైనా అవసరం, మరి ‘కశ్మీర్ ఫైల్స్’ ఆ సుగుణాలకు ప్రేరణగా ఉన్నదా? కళ, వాస్తవ జీవితం ఇప్పుడు మన ముందుంచుతున్న ప్రశ్న అది.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2022-03-23T06:07:08+05:30 IST