మర్యాద పురుషోత్తములకు ఇది తగునా?

ABN , First Publish Date - 2022-04-20T06:22:04+05:30 IST

శ్రీరాముడు భారతీయుల ఆరాధ్య దైవం. మర్యాద మన్ననలకు మార్గదర్శకుడు. మహాపురుషుడు. ప్రజాపాలకుడు. సత్యధర్మపరాయణుడు...

మర్యాద పురుషోత్తములకు ఇది తగునా?

శ్రీరాముడు భారతీయుల ఆరాధ్య దైవం. మర్యాద మన్ననలకు మార్గదర్శకుడు. మహాపురుషుడు. ప్రజాపాలకుడు. సత్యధర్మపరాయణుడు. 


ఖతర్‌లోని ఇస్లామిక్ మ్యూజియంలో భద్రపరచబడిన (అరబ్బీ భాషలోకి అనువదితమైన) రామాయణ మహాకావ్య ప్రతి పురాతన పుస్తకాలలో ఒకటి. మొగల్ చక్రవర్తుల కాలంలో 16వ శతాబ్దంలో తొలుత వెలుగు చూసిన ఈ అరబ్బీ రామాయణ ప్రతిని చూసేందుకు మ్యూజియం సందర్శకులు విశేష ఆసక్తిని చూపడం కద్దు. అక్బర్ చక్రవర్తి హయాంలో రామాయణాన్ని తొలుత పారశీక భాషలోకి అనువదించారు. హిందూ సంస్కృతిని అవగతం చేసుకుని స్ధానిక ప్రజలతో మమేకమయ్యేందుకు మొగల్స్‌కు ఆ మహాకావ్యం విశేషంగా తోడ్పడింది. తద్వారా వారు భారతదేశంలో తమ పరిపాలనను పటిష్ఠపరచుకున్నారు. పారశీక అనువాదానికి ఆదరణ లభించడంతో ఆ తర్వాత అరబ్బి భాషలోకి రామాయణాన్ని అనువదించారు. ప్రస్తుతం ఖతర్ మ్యూజియంలో ఉన్నది అదే అరబ్బీ అనువాదమని అనేకుల భావన. దుబాయిలో నిర్మాణంలో ఉన్న హిందూ దేవాలయంలో శ్రీరాముడి ప్రతిమను ప్రతిష్ఠించే నెలవు పేరు ‘రామ్ దర్బార్’.


సత్యధర్మపరాయణుడైన శ్రీరామచంద్రమూర్తి గురించి రామాయణం ద్వారా అంతర్జాతీయ సమాజానికి ప్రత్యేకించి అరబ్బు ప్రపంచానికి తెలియజేయాలని గత కొన్నాళ్ళుగా భారతదేశం ప్రయత్నిస్తోంది. ఈ దిశగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారతీయ సాంస్కృతిక మండలి కృషి చేస్తోంది. దుబాయి, ఆబుధాబి రాజకుటుంబీకులు ప్రొత్సహించే ‘కలీమా’ అనే అరబ్బీ అనువాద ప్రాజెక్టులలో రామాయణ అనువాదానికి సముచిత ప్రాధాన్యం లభిస్తోంది.


భారత స్వాతంత్ర్య సమరంలో కీలక ఘట్టంగా భావించే జలియన్‌వాలా బాగ్ మారణకాండతో శ్రీరామ నవమికి, మత సామరస్యానికి విడదీయలేని సంబంధం ఉంది. నాటి బ్రిటిష్ ఇండియాలో కీలక రాష్ట్రమైన పంజాబ్‌లో విభజించి పాలించు అనే వలస పాలకుల విధానంలో భాగంగా అమృత్‌సర్ నగరంలో హిందువులు, ముస్లింలకు రోడ్లపై వేర్వేరుగా తాగు నీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. 1919లో అమృత్ సర్‌లో శ్రీరామనవమి పర్వదినాన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అశేష ప్రజలు నిరసన నిర్వహించారు. ఆ సందర్భంగా సైఫుద్దీన్, సత్పాల్ అనే ఇద్దరు నాయకులు కలిసి నీటి కుళాయిలపై హిందూ, ముస్లిం అనే పట్టలు తొలగించి, అందరూ ఒకే కుళాయిని ఉపయోగించే విధంగా ప్రజలను ప్రోత్సహించారు. ఆ శ్రీరామ నవమి ఉరేగింపులో ముస్లింలు, సిక్కులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఈ విధంగా భారతీయులు సఖ్యతగా ఉండడం బ్రిటిష్ సైనిక జనరల్ డయ్యర్‌కు రుచించలేదు. ఆ నాయకులు ఇరువురినీ అరెస్ట్ చేశారు. ఆ అరెస్టులకు నిరసనగా, శ్రీరామ నవమి అనంతరం నాలుగు రోజులకు మతాలకు అతీతంగా పంజాబీలు ఉత్సాహంగా నిర్వహించుకునే ‘వైశాఖి’ పండుగ సందర్భంగా జలియన్‌వాలా బాగ్‌లో అపూర్వ జాతీయ స్ఫూర్తిని ప్రదర్శించారు. ఆ చైతన్యం అలాగే కొనసాగితే రౌలత్ చట్టం నిరర్థకమవుతుందని వలస పాలకులు భయపడ్డారు. తమ పాలన అంతమయ్యే ప్రమాదముందనే ఆందోళనతోనే డయ్యర్ ఒక క్రూర నిర్ణయం తీసుకున్నాడు. జలియన్‌వాలా బాగ్‌లో శాంతియుతంగా సమావేశమైన ప్రజలపై కాల్పులకు ఆదేశించాడు. డయ్యర్ క్రౌర్యం, స్వాతంత్ర్య సమరయోధుల విషాదం గురించి మరి ప్రత్యేకంగా చెప్పాలా?


భోపాల్ చివరి నవాబు హామీదుల్లా ఖాన్ (బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ముత్తాత) శ్రీరామ నవమి పర్వదిన వేడుకలను తన దివాన్ రాజ్ అవధ్ నారాయణ్ బిసరియాతో కలిసి ఘనంగా జరుపుకునేవారు. తెలుగు నాట గోల్కొండ ఖుతుబ్ షాహీల నుంచి నిజాం నవాబుల దాకా భద్రాదిలోని శ్రీ సీతారామచంద్రుల పట్ల చూపిన ఆదరణ, గౌరవ భక్తి భావం అందరికి తెలిసిందే. శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టు చీరలు, ముత్యాల తలంబ్రాలను రాజు పక్షాన పంపించే ఆనవాయితీకి ఖుతుబ్ షాహీలు శ్రీకారం చుట్టారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇలా మత సామరస్యాన్ని ప్రతిబింబించిన శ్రీరామనవమి ఇప్పుడు కొన్నిచోట్ల మతపరమైన విద్వేషం, హింసకు దారి తీయడం దిగ్ర్భాంతి కలిగిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కొరకు మసీదుల ముందు ముస్లిం మతస్తులను అసభ్యపదజాలంతో దూషిస్తూ కత్తులు, కటార్లతో ప్రదర్శనలు నిర్వహించడం ఏ రకమైన భక్తి? ఇది మర్యాద పురుషోత్తములు, ప్రజాస్వామ్య పౌరులు చేసే పనేనా?

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Read more