సమాఖ్య స్ఫూర్తికి ‘గుజరాత్’ గండం

ABN , First Publish Date - 2022-09-23T07:14:37+05:30 IST

రాజకీయ పలుకుబడిలోనూ, ఆర్థిక బలంలోనూ గుజరాత్‌కు సాటి రాగల భారతీయ రాష్ట్రం మరేదయినా ఉందా? రాజకీయ పలుకుబడిలోనూ, ఆర్థిక బలంలోనూ గుజరాతే అగ్రగామిగా...

సమాఖ్య స్ఫూర్తికి ‘గుజరాత్’ గండం

రాజకీయ పలుకుబడిలోనూ, ఆర్థిక బలంలోనూ గుజరాత్‌కు సాటి రాగల భారతీయ రాష్ట్రం మరేదయినా ఉందా? రాజకీయ పలుకుబడిలోనూ, ఆర్థిక బలంలోనూ గుజరాతే అగ్రగామిగా ఉంది. గత దశాబ్దంలో చోటుచేసుకున్న రాజకీయ, ఆర్థిక పరిణామాలే అందుకు నిదర్శనం. భారతదేశ అత్యంత శక్తిమంతుడు అయిన రాజకీయవేత్త, ప్రపంచ కుబేరులలో ఒకరు గుజరాతీలే కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ రాజకీయాలలో ప్రధానశక్తిగా ఆవిర్భవించిన నాటి నుంచీ సమస్త రహదారులూ గాంధీనగర్ నుంచే ప్రారంభమవుతున్నాయి; అక్కడికే చేరుతున్నాయి మరి.


ఈ పరిస్థితి ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది: కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల రూపకల్పనలో గుజరాత్ నుంచి ప్రభవించిన నాయకులు, అధికారులే ముఖ్యపాత్ర వహిస్తూ, స్వరాష్ట్రం పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నందున ఇతర రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగడం లేదా? 22 బిలియన్ డాలర్ల ఫాక్స్‌కాన్–వేదాంత సెమీ–కాండక్టర్ ప్రాజెక్టు వివాదంలో ఆ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. తొలుత మహారాష్ట్రలో ఏర్పాటు చేయదలిచిన ఆ సెమీ–కాండక్టర్ ప్రాజెక్ట్ అంతిమంగా గుజరాత్‌కు వెళ్ళిపోయింది! వేలాది ఉద్యోగాలను సృష్టించగల ఆ ప్రాజెక్టు మహారాష్ట్రకు రానున్నదని గత జూలై ఆఖరి వారంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రాష్ట్ర శాసనసభకు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన అన్ని లాంఛనాలూ దాదాపుగా పూర్తయ్యాయని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ సెప్టెంబర్ మొదటి వారంలో ఫాక్స్‌కాన్–వేదాంత ప్రాజెక్టు అధికారులు ప్రధానమంత్రితో సమావేశమయిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. మరి కొద్ది నెలల్లో గుజరాత్ శాసనసభకు ఎన్నికలు జరగనుండడమే ఆ మార్పుకు కారణమయిందా?


అంతిమంగా గుజరాత్ వైపు మొగ్గు చూపడం వెనుక ఇన్వెస్టర్లకు బలమైన కారణాలు లేవని సూచించేందుకే నేను ఆ ప్రశ్నను అడిగానని మీరు భావించకూడదు. ‘వైజ్ఞానిక’, ‘ఆర్థిక’ ప్రక్రియల ద్వారా అన్ని అంశాలను నిశితంగా పరిశీలించి, వివిధ రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుని ఆఖరుకు గుజరాత్‌లో ఆ సెమీ–కాండక్టర్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు నిర్ణయం తీసుకున్నామని వేదాంత చైర్‌పర్సన్ అనీల్ అగర్వాల్ స్పష్టం చేశారు. గుజరాత్ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్‌కు ఎర్ర తివాచీ పరిచింది. అనేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో కాకుండా గుజరాత్‌లో ఏర్పాటు చేయాలని హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కొన్ని అవాంఛనీయ పరిణామాలకు దారితీసే ప్రమాదం లేక పోలేదు. ఏమిటది? ఒకప్పుడు సమైక్యరాష్ట్రంగా ఉండి, ఆ తరువాత వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయిన గుజరాత్, మహారాష్ట్రల మధ్య సంబంధాలు సంక్లిష్టమైనవి. ఉభయ రాష్ట్రాల మధ్య మనస్పర్థలు, వివాదాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మళ్లీ తమ ప్రభావాన్ని చూపడం అనివార్యమని చెప్పక తప్పదు. పాత బొంబాయి రాష్ట్ర భౌగోళిక విభజనపై సంభవించిన ఘర్షణల నుంచి ఈ రెండు పశ్చిమ భారత రాష్ట్రాలు 1960లో ప్రత్యేక అస్తిత్వాన్ని సంతరించుకున్నాయి. వ్యవస్థా నిర్మాణదక్షులైన గుజరాతీలు ముంబై మహానగరాన్ని సంపద్వంతం చేయడంలో అనితర సాధ్యమైన పాత్ర నిర్వహించారు. ఆ సిరిసంపదలు తమ సొంతం చేసుకునేందుకు ఉభయ రాష్ట్రాల నాయకత్వాలు పోటీపడ్డాయి. ఇది ఒక విధంగా అన్నదమ్ముల మధ్య వైరంగా గుజరాతీల, మహారాష్ట్రియన్ల మనస్సుల్లో నిలిచిపోయింది. మహారాష్ట్ర ‘ప్రాంతీయ పెద్దన్న’గా వ్యవహరించేందుకు ఆరాటపడింది. ఇది తొలుత సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలోనూ, ఆ తరువాత శివసేన ‘భూమి పుత్రుల’ పోరాటంలోనూ పూర్తిగా ప్రతిబింబించింది.


గత దశాబ్దంలో ఉభయ రాష్ట్రాల మధ్య పరిస్థితులు అటు రాజకీయ రంగంలోనూ, ఇటు ఆర్థిక రంగంలోనూ నిర్ణయాత్మకంగా మారిపోయాయి. ఈ నెల మొదటి వారంలో ముంబైను సందర్శించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, శివసేనను దాని సొంత గడ్డపై ఓడించాలని ఆ నగర వాసులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో శివసేనను ఓడించాలని ఆయన ఇచ్చిన పిలుపు గాయపడిన పులి దేహంలోకి బాకును దించిన చందంగా శివ సైనికులను కలవరపరిచింది. ఠాక్రే కుటుంబానికి వ్యతిరేకంగా శాసనసభ్యుల్లో తిరుగుబాటును ప్రోత్సహించి, శివసేన నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చివేసిన వైనం శివ సైనికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. నరేంద్ర మోదీ –అమిత్ షాల నాయకత్వంలోని బీజేపీ, మహారాష్ట్రపై ఆధిపత్యాన్ని సాధించేందుకు ఉపక్రమించిందని వారు విశ్వసిస్తున్నారు. గుజరాతీల రాజకీయ అధికారం, పలుకుబడి మహారాష్ట్ర అస్మిత (ఆత్మగౌరవం)ను నిర్లక్ష్యం చేస్తోందని మహారాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారు. కొత్త కేబినెట్ ఏర్పాటు చేసేందుకై అనుమతి కోసం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ పదేపదే న్యూఢిల్లీని సందర్శించడం మహారాష్ట్రియన్ల అనుమానాలను మరింతగా దృఢపరిచింది. మహారాష్ట్రపై పరోక్ష పెత్తనం చెలాయించేందుకు గుజరాత్ నాయక ద్వయం ప్రయత్నిస్తోందన్న భావన మహారాష్ట్రియన్లలో పాదుకుపోయింది. ఇటువంటి రాజకీయ వాతావరణంలో ఫాక్స్‌కాన్–వేదాంత సెమీ–కాండక్టర్ ప్రాజెక్టును గుజరాత్‌కు తరలించాలన్న నిర్ణయంపై మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత అనేక దశాబ్దాల పాటు మహారాష్ట్ర అన్ని రంగాలలోనూ ముఖ్యంగా ఆర్థికరంగంలో తన అగ్రగణ్యతను నిలబెట్టుకుంటూ వచ్చింది. అయితే గుజరాత్ ఇటీవలి సంవత్సరాలలో శక్తిమంతమైన తన పొరుగు రాష్ట్రాన్ని సవాల్ చేసి పెట్టుబడుల ప్రథమ గమ్యంగా ప్రభవించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మరే రాష్ట్రం కంటే గుజరాతే అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందింది. ఈ విషయంలో మహారాష్ట్ర ద్వితీయ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో గుజరాత్ ఆరవ స్థానానికి పడిపోగా కర్ణాటక అగ్ర స్థానాన్ని అందుకుంది. గతంలో చాలావరకు దేశీయ పెట్టుబడులపైనే ఆధారపడిన గుజరాత్‌కు ఇది ఒక తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమే అని భావించవచ్చు.


దేశ రాజకీయాలలో గుజరాత్ సాధించుకున్న ప్రభవ ప్రాభవాలు ఆ రాష్ట్ర ఆర్థికోన్నతికి విశేషంగా తోడ్పడ్డాయనడంలో సందేహం లేదు. అభివృద్ధి సాధనలో తాను వెనకబడిపోవడంపై మహారాష్ట్ర తప్పక ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. 1990 దశకంలో ఎన్రాన్ విద్యుత్ ప్రాజెక్టు – నాడు కొత్తగా ప్రారంభమయిన ఆర్థిక సరళీకరణ ప్రక్రియకు ఒక ఉదాహరణగా సుప్రసిద్ధమయింది– పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆర్థిక వనరులు, సాంకేతికతలు అందించే విదేశీ కంపెనీలతో మళ్లీ మళ్లీ సంప్రదింపులు జరిపి ఒప్పందాలు కుదుర్చుకోవల్సివచ్చింది. ఈ పరిణామాలు అటు మహారాష్ట్ర సర్కార్, ఇటు ఆ రాష్ట్ర పారిశ్రామికవేత్తల విశ్వసనీయతను బాగా దెబ్బతీసింది. అప్పుడేకాదు, ఇటీవలి కాలంలో కూడా, శివసేన, బీజేపీల మధ్య పోటా పోటీ రాజకీయాల వల్ల అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకొంది. ముంబైలో ఆరే మెట్రో కార్ షెడ్ అభివృద్ధి పథకమే అందుకొక ఉదాహరణ. నాయకుల మధ్య అహాల ఘర్షణలతో పాటు పర్యావరణ పరమైన కారణాలు కూడా ఆ ప్రాజెక్టు అమలులో జాప్యం చోటు చేసుకోవడంతో పాటు నిర్మాణ వ్యయాలు భారీగా పెరిగిపోయాయి. ఇక గుజరాత్‌లో గత పాతికేళ్లుగా సుస్థిర ఏకపార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున విధాన నిర్ణయాలు వేగంగా, విశ్వసనీయంగా తీసుకోవడం సాధ్యమయింది. నిర్ణయాల అమలు కూడా వడిగా జరిగేందుకు రాజకీయ వాతావరణం దోహదం చేసింది. సంకీర్ణ ప్రభుత్వాల పాలనలో ఉన్న మహారాష్ట్ర అనేక సందర్భాలలో రాజీపడడం అనివార్యమయింది. ఇది ఆ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని గణనీయంగా కుంటుపరిచింది.


నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సాధించిన ఆర్థికాభివృద్ధి గుజరాత్‌కు గర్వకారణం అనడంలో సందేహం లేదు. అయితే బీజేపీ శ్రేణులు గొప్పగా చెప్పే ‘గుజరాత్ అభివృద్ధి నమూనా’ అనేది మితిమీరిన కేంద్రీకృత విధానాలపై ఆధారపడింది. అది బహుళత్వ స్వభావంగల భారతీయ సమాఖ్య విధానానికి పూర్తిగా అనుగుణమైనది కాదు. గత నెల స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో ‘సహకార పోటీదాయక సమాఖ్య విధానం’ను అనుసరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు అభివృద్ధిరంగంలో రాష్ట్రాలు పరస్పరం పోటీపడాలని, తాము అభివృద్ధి సాధిస్తూ దేశ పురోభివృద్ధికి దోహదం చేయాలని ఆయన కోరారు. అయితే ఇటువంటి సహకార పోటీదాయక సమాఖ్య విధానం ఎలా సాధ్యమవుతుంది? కేంద్రం అన్ని రాష్ట్రాల పట్ల పారదర్శకంగా, ఏ ఒక్క రాష్ట్రం పట్ల పక్షపాతం లేకుండా వ్యవహరించినప్పుడు మాత్రమే రాష్ట్రాలు అటువంటి సహకార స్ఫూర్తితో పోటీపడతాయి. మరి మోదీ ప్రభుత్వం అలా వ్యవహరిస్తుందా? లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనుకూలంగా వ్యవహరించడం లేదూ? ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం విషయమై ప్రచార హోరే ఆ పక్షపాత వైఖరిని బహిర్గతం చేస్తోంది.


ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ దృష్టిని కేంద్రీకరించాయి. ఆ ప్రభుత్వాలను అస్థిరపరిచే లక్ష్యంతో అవి వ్యవహరిస్తున్నాయని ప్రజలు భావించడం సత్యదూరమేమీ కాదు. యావద్భారతదేశంపై తన ఆధిపత్యాన్ని సుదీర్ఘకాలం పాటు నెలకొలుపుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. ఇందులో భాగంగానే ‘అపోజిషన్ –ముక్త్ భారత్’ అనే రాజకీయ లక్ష్యాన్ని మోదీ సర్కార్ నిర్దేశించుకుంది. అయితే ఇది కేంద్ర–రాష్ట్రాల మధ్య ఘర్షణలకు, అనుమానాలకు తావిస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ‘సహకార సమాఖ్య విధానం’ ఎలా వర్ధిల్లుతుంది? ఇతర రాష్ట్రాల రాజధానుల కంటే గాంధీనగర్‌నే సందర్శించేలా ప్రపంచ నాయకులను మోదీ సర్కార్ ఎందుకు ప్రోత్సహిస్తోంది? ఇది, ఇతర రాష్ట్రాలను ఉపేక్షించి గుజరాత్ పట్ల పక్షపాతం చూపడం కాదా? నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా తన రాష్ట్రానికి సీఈఓ; ప్రధానమంత్రిగా టీమ్ ఇండియాకు కెప్టెన్. ఏ రాష్ట్రమూ తాను అనాథ అనే భావానికి లోనుకాని విధంగా ఆయన నాయకత్వం అందించితీరాలి. రాజకీయ పక్షపాతానికి తావివ్వకుండా వాస్తవిక ఆర్థిక అంశాల ప్రాతిపదికన పెట్టుబడులను ఆకర్షించడంలో అవి పోటీపడేలా చేయాలి.


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2022-09-23T07:14:37+05:30 IST