హిందీ వస్తేనే ఎదుగుదల

ABN , First Publish Date - 2022-09-29T06:06:34+05:30 IST

కేంద్రహోంమంత్రిత్వ శాఖ అంతర్భాగమైన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అఫిషియల్‌ లాంగ్వేజ్‌ నిర్వహిస్తున్న హిందీ పఖ్వాడా (పక్షోత్సవాలు) నేటితో ముగుస్తాయి....

హిందీ వస్తేనే ఎదుగుదల

కేంద్రహోంమంత్రిత్వ శాఖ అంతర్భాగమైన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అఫిషియల్‌ లాంగ్వేజ్‌ నిర్వహిస్తున్న హిందీ పఖ్వాడా (పక్షోత్సవాలు) నేటితో ముగుస్తాయి. అధికార భాషా చట్టం–1963 హిందీని, ఇంగ్లీష్‌ భాషతో పాటు అధికార భాషగా గుర్తించింది. ఇది కేవలం అధికార భాష మాత్రమే. జాతీయ భాష కాదు. స్వాతంత్ర్యానంతర కాలంలో ప్రధానమంత్రులు, ఇతర ముఖ్య నాయకులు విదేశాల్లో చదివి వచ్చినవారు అవడం వల్ల, ఇంగ్లీష్‌ పరిజ్ఞానం బాగా ఉండడం వల్ల అధికారిక, పరిపాలన వ్యవహారాల్లో ఆంగ్లం వాడుక ఎక్కువగా ఉండేది. ఆ క్రమంలోనే ఓపి మత్తాయ్‌, పిసి అలెగ్జాండర్‌ వంటివారు ప్రధానులకు కార్యదర్శులుగా పనిచేసే అవకాశం దొరికింది. కాలక్రమంలో మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో అనగా ప్రభుత్వాలు రైట్‌ వింగ్స్‌ ఆధ్వర్యంలో జాతీయవాద ప్రభుత్వాలుగా ఉన్న తరుణంలో అధికార వ్యవహారాల్లో హిందీ వాడకం విపరీతంగా పెరిగింది. ఇంగ్లీషు కేవలం ఫైల్స్‌కు మాత్రమే పరిమితమవుతోంది. సివిల్‌ సర్వెంట్స్‌ సైతం ఇద్దరు దక్షిణాది రాష్ట్రాల అధికారులు కలిసినప్పుడు తప్పించి, మిగతా అన్నివేళలా హిందీలో మాట్లాడుకునే సంస్కృతి ప్రబలుతోంది.


దీనికి ముఖ్యకారణం ఉత్తరాది అధికారులు తమ మాతృభాష లేదా మాతృభాషకు దగ్గరగా ఉండే హిందీలో మాట్లాడుకోవడాన్ని సౌకర్యవంతంగా భావించడమే. వారి విద్యావిధానం, సివిల్‌ సర్వీసులకు వారు ఎంపిక అయిన విధానం అలాంటిది మరి. హిందీ పూర్తిగా అర్థం కాని దక్షిణాది రాష్ట్రాల అధికారులు అధికంగా ఉన్న సమావేశాల్లో సైతం, 30–35 ఏళ్ల సర్వీస్‌ ఉన్న ఉత్తరాది అధికారులు హిందీలోనే మాట్లాడడం, అలాంటి సందర్భాల్లో హిందీ మీద సరైన పట్టు లేకపోతే, ఒకవేళ కొన్ని పదాలు, కీలకమైన భావనలు అర్థం కాకపోతే ఉన్నతాధికారులకు మళ్లీ రిపీట్‌ చెయ్యమనే ధైర్యం లేక ‘కక్కలేక మింగలేక’ అన్న పరిస్థితులు దక్షిణాది అధికారులు ఎదుర్కొంటున్నారు.


హిందీ భాషా ప్రావీణ్యం, వాక్చాతుర్యత ఉండడం వల్లనే పివి నరసింహారావు, ఇందిరాగాంధీ ప్రాపకం సంపాదించి సుదీర్ఘకాలం కేంద్రంలో మంత్రిగా వెలుగొంది, తదనంతర కాలంలో అనుకోకుండా కలిసి వచ్చిన అనుకూల పరిస్థితుల వల్ల ప్రధానమంత్రి కాగలిగారు. 1991–96 మధ్యకాలంలో ప్రధానమంత్రిగా కూడా హిందీ భాషలోని అంతరార్థాలు, పదబంధాలు, సామెతలు వంటబట్టి ఉండడం మూలాన ఢిల్లీ కేంద్రంగా అన్నిరకాల ప్రజలను కలుపుకోగలిగారు.


తెలుగువాడైన పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో టిఆర్‌ ప్రసాద్‌కి కేబినెట్‌ సెక్రటరీగా పనిచేసే అవకాశం దొరికింది. తదనంతరం నాకున్న పరిజ్ఞానం మేరకు, ఇప్పటివరకు మరొక తెలుగువాడికి ఆ అవకాశం దొరకలేదు. కనీసం కీలకమైన హోం, ఆర్థిక, రక్షణ శాఖల సెక్రటరీలుగా కూడా తెలుగువారెవరూ ఈ మధ్యకాలంలో పనిచేయలేదు. ఈ పరిణామాలను పరిశీలిస్తే ఇలాంటి పదవులు పొందలేకపోవడానికి, హిందీ క్షుణ్ణంగా రాకపోవడానికి కీలక సంబంధం ఉన్నట్లుగా తోస్తోంది. అదేవిధంగా ఆయా రాజ్యాంగ సంస్థల, కమిషన్ల చైర్మన్‌ పదవులు కూడా హిందీ మీద పట్టులేని వారికి అందని ద్రాక్షగానే ఉన్నాయనిపిస్తోంది.


నాకు తెలిసిన ఎంతోమంది తెలుగువారు సాధారణ గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ అధికారులుగా ఉత్తరాదిలో పోస్టింగ్‌ పొందినవారు హిందీ భాషతో ఇబ్బందులు పడుతూ, వారి సంస్కృతిలో ఇమడలేక తమకున్న సీనియారిటీని వదులుకుని రీజినల్‌ ట్రాన్స్‌ఫర్‌ అర్జీలు పెట్టుకుని స్వరాష్ట్రంలో, బాధతో– దుఃఖంతో జూనియర్‌ అధికారులుగా సెటిల్‌ అవుతున్నారు. మరికొంతమంది హిందీతో ఇక్కడ బాధపడడం కన్నా ఇంగ్లీషు నేర్చుకోవడమే నయమని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ నిమిత్తమై విదేశాలకు వెడుతున్నారు. బొటాబొటీ ఇంగ్లీషు ముక్కలతో పూర్తి సాఫ్ట్‌వేర్‌ స్కిల్స్‌ లేకపోవడం వల్ల రెంటికీ చెడ్డ రేవడిలా అవుతున్నారు. స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌, బ్యాంకింగ్‌, రైల్వే, ఇన్సూరెన్స్‌ తదితర నియామక సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షలు ఎదుర్కొనే తెలుగు అభ్యర్థుల ఇంగ్లీషు పరిజ్ఞానం అంతంత మాత్రమే. దేశవ్యాప్తంగా హిందీ వారు సైతం ఏదో ఒక ప్రాంతీయ భాషను నేర్చుకోవాలి అనే సూత్రం కేవలం ఆదర్శప్రాయంగానే మిగిలిపోయింది. సమీప భవిష్యత్‌లో సైతం దేశవ్యాప్తంగా జరిగే విద్య, ఉద్యోగ పోటీ పరీక్షలు కేవలం ఇంగ్లీషు, హిందీలలో మాత్రమే జరుగుతాయి. అందువల్ల హిందీని కూడా క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే పోటీపరీక్షలలో అద్భుత ఫలితాలను సాధించవచ్చు.


హిందీ భాషా పరిజ్ఞానం, వాడకం విషయంలో చారిత్రాత్మకంగా, సాంస్కృతిక పరంగా తెలంగాణ ప్రాంత వాసులకు కొంత వెసులుబాటు ఉన్నది. కానీ ఆంధ్రావాసులకు అదే కారణాల రీత్యా హిందీలో ప్రవేశం, పట్టు సహజంగా ఉండదు. అందువల్లనే ఆంధ్ర అధికారులు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎదుర్కొనే భాష, సాంస్కృతిక సమస్యలతో పోలిస్తే తెలంగాణ వారికి సమస్యలు తక్కువ. ఏదేమైనా నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బాలల బంగారు భవిత కోసం ఒకటవ తరగతి నుంచే హిందీని సబ్జెక్ట్‌గా ఉంచి, హిందీ ఉపాధ్యాయులను విస్తృతంగా నియమించి హిందీ రాష్ట్ర ప్రజలకు తగిన పోటీ ఇచ్చే విధంగా మాట్లాడడంలో తీర్చిదిద్దాలి. కేవలం మార్కుల కోసం ఇంటర్మీడియట్‌లో సంస్కృతాన్ని సబ్జెక్ట్‌గా తీసుకునే బదులు హిందీని రెండవ భాషగా తీసుకోవడం ద్వారా భవిష్యత్‌లో జీవనోన్నతికి మార్గం సుగమం చేసుకోవచ్చు. 


ఈ పవిత్ర భారతదేశంలోనే ఉండి ఉన్నత స్థానాలకు ఎదగాలంటే మాత్రం కచ్చితంగా హిందీ నేర్చుకుని, మరీ ముఖ్యంగా చక్కగా మాట్లాడగలిగిన నేర్పరితనం కలిగివుండాలి. ఈ సూత్రం కేవలం రాజకీయ, ఉద్యోగ రంగాలకు మాత్రమే కాదు, వ్యాపార/వర్తక రంగానికి కూడా వర్తిస్తుంది. ఒక కేంద్ర మంత్రితోనో లేదా కేంద్రంలో ఉన్న ఉన్నతాధికారులతోనే వ్యక్తిగతంగా గోప్యంగా మాట్లాడాలంటే హిందీ స్పష్టంగా వచ్చినవారికి ఉండే ప్రయోజనం కేవలం ఇంగ్లీషు మాత్రమే మాట్లాడే వారికి ఉండదు.

నేలపట్ల అశోక్‌బాబు (ఐఆర్‌ఎస్‌)

Read more