ఇసుకను పట్టు–కోట్లు కొల్లగొట్టు

ABN , First Publish Date - 2022-05-18T09:26:29+05:30 IST

అదంతా ఇసుక / దాని చరిత్రంతా మసక / అది నశించిన గ్రామం / నిక్వసించే ఒక శ్మశానం అని బాలగంగాధర్‌ తిలక్‌ 1940లోనే హెచ్చరించాడు. నీరు వెంట నాగరికతను పండించిన మనిషి, నాగరికం మీరి నీటిని బంధించి...

ఇసుకను పట్టు–కోట్లు కొల్లగొట్టు

అదంతా ఇసుక / దాని చరిత్రంతా మసక / అది నశించిన గ్రామం / నిక్వసించే ఒక శ్మశానం అని బాలగంగాధర్‌ తిలక్‌ 1940లోనే హెచ్చరించాడు. 


నీరు వెంట నాగరికతను పండించిన మనిషి, నాగరికం మీరి నీటిని బంధించి అమ్ముకుంటారొకరు, ఇసుకను చెరబట్టి చేదుకుంటారొకరు. శక్తికి మించి పిండుకొంటారు. ఇలా ల్యాండ్‌ మాఫియా, శాండ్‌ మాఫియా, లిక్కర్‌ మాఫియా, మైనింగ్‌ మాఫియాలు అనకొండలుగా మారి ఊర్లు, ఇళ్ళు, వీధులే కాదు. జీవితాలను కూడా దోచుకుంటున్నారు. తరతరాలుగా మానవులు నిర్మించుకున్న సంపద – సంస్కృతిని నేలమట్టం చేశారు. అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా ‘ఇసుక అంతమే వాళ్ళ పంతం’గా తెరాస నాయకులు ఇసుకను తోడేస్తున్న తోడేళ్లుగా మారారు. ప్రశ్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బిక్కేరు వాగు గులాబీ ఇసుక మాఫియా అడ్డాగా, దందాసురులకు కల్పతరువుగా మారింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేసినట్లు 111 జీవో, ఇసుక అక్రమాలతో విధ్వంసం సృష్టిస్తున్నారు.


అది ఉమ్మడి నల్గొండ జిల్లా మూసీ పరివాహక ప్రాంతం బిక్కేరు వాగు, ఆ వాగును నమ్ముకున్న 13 గ్రామాలు, 40 వేల కుటుంబాలకు బోర్లే జీవనాధారం. ఇసుకతోనే త్రాగునీరు, సాగునీరు, స్థానిక అవసరాలకు తప్ప ఇక్కడి ఇసుక రవాణా చేయకూడదు. ఇక్కడ 1.5 నుంచి 3 మీటర్లు మందం మాత్రమే ఇసుక ఉంది. ఇసుక రీచ్‌లు, స్టాక్‌ యార్డ్స్‌ లేవు. గ్రామపంచాయతీ, యం.ఆర్‌.ఓ తీర్మానాలు లేవు. అయినా ఇసుక రవాణా ఇష్టారాజ్యంగా ఎలా సాగుతుంది? బిక్కేరు వాగుపై ఏకశిలా సదృశులైన అధికార సర్వాంతర్యామి స్థానిక ప్రజా శాసనకర్తల దృష్టి పడింది. పథకం ప్రకారం దోపిడీ ప్రారంభమైంది. నది మునక భూములు ప్రభుత్వానివే, అయినా పట్టాలు సృష్టించి, కాళేశ్వరం–బస్వాపురం రిజర్వాయర్‌ పేరు చెప్పి అనుమతులు లేకుండానే రోజుకు 500 లారీలు, వందలాది ట్రాక్టర్ల ఇసుకను గోకి గోకి వందల కోట్ల సహజ సంపదను తోడేస్తున్నారు.


దేశ వ్యాప్తంగా సమగ్ర ఇసుక నియంత్రణ రూల్స్‌ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి కలెక్టర్‌ చైర్మన్‌. ఏ జిల్లాలో ఎంత ఇసుక ఉందో, ఎన్ని మీటర్ల మందం ఉందో నివేదికను సమర్పించాలి. అది కూడా టిఎస్‌ఎండిసి పర్యవేక్షణలోనే తోడెయ్యాలి. అక్కడ సిమెంట్‌ పోల్స్‌ పర్మినెంట్‌గా నాటాలి. అన్ని నిబంధనలు ఉల్లంఘించి, దొంగపట్టాలు సృష్టించి ఒక్కటి లేదా రెండు ఎకరాల అనుమతి పేరుతో 16 నెలలుగా బిక్కేరు వాగు మొత్తంగా తరలిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు నోరు మెదపరు. ఓవర్‌ లోడ్‌లు, పని చేయని వేయింగ్‌ మిషన్లు, రోడ్లు నాశనమవుతున్నా, పంట పొలాలన్నీ ఇసుకతో నిండినా, ఇండ్లలోకి దుమ్ము ధూళీ శబ్దాలు వచ్చినా, నీరు, భూములు, భూసారం, వృక్ష సమూహం, పర్యావరణం నాశనమవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. పాలకుల ప్రవర్తనకు సమాధానంగా గత మూడు నెలలుగా ‘ఇసుక పరిరక్షణ కమిటీ’గా ఏర్పడి అనేక పోరాటాలు, వినతులు ఇచ్చినా, ప్రజాప్రతినిధులు, అధికారుల మౌనానికి కారణాలు ఏమిటి  అనుకున్నప్పుడు ఆర్థిక ప్రయోజనాలు వారి వ్యక్తిగత లారీలు, బంధుమిత్రుల భాగస్వామ్యం మూలంగానే వారి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నవని అర్థమవుతుంది. ‘రౌతు మెత్తనైతే గుర్రం, మూడు కాళ్ళతో పరిగెడుతుంది’ అన్నట్లుగా పాలకుల అసమర్థత, అంతులేని అవినీతి, ధనదాహం, అధికార అహంకారం, హైకోర్టు ఆర్డర్లను, చట్టాలను కూడా లెక్కచేయని తత్వం ఇవన్నీ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్షణాలు.


కేజీఎఫ్‌ సినిమాలా ఇసుక మాఫియాను నడిపిస్తున్న డాన్‌ ఒకరున్నారు. అతనిది ఆంధ్రా ప్రాంతం. టిఎస్‌ఎండిసిని ఒక ప్రయివేటు కంపెనీగా మార్చి అడ్డగూడూర్‌ పోలీసులను అడ్డం పెట్టుకుని నిలువునా దోచుకుంటున్నారు. వాళ్ళ లారీలకు అద్దాలు పగిలినా.. టైర్లకు పంచర్లు అయినా.. రైతులపై అక్రమ కేసులు పెడతారు. ప్రాణం లేని లారీలకు ఇచ్చిన విలువ, మనిషి ప్రాణాలకు లేదిక్కడ. వీరికి అభివృద్ధి అంటే– ఇసుక మాఫియా, సంక్షేమం అంటే– అధికార నేతలు, సర్వం సహాధికార రాజ్యంలో అధికారులంతా కీలుబొమ్మలు.


లాభాల కోసం ఎంతటి మానవ హననానికైనా సిద్ధపడగల దౌర్జన్యం ఇక్కడ సంతరించుకుంది. గ్రామాలలో కొత్త రకమైన ‘బుల్డోజింగ్‌ సంస్కృతి’ నెలకొల్పారు. ఎక్కడ ఇసుక, మైనింగ్‌, ప్రభుత్వ ఖాళీ జాగా వాసనొచ్చినా దందాసురులు అక్కడ వాలిపోతారు. పవర్‌ మాదే, పాలిటిక్స్‌ మావే ఎదిరించి బతికి బట్టకట్టలేరు, బలుసాకు తినలేరు అంటూ బెదిరింపులు, లేదంటే కేసులు, జైళ్లు. ఇక్కడ మాముళ్ళు ముట్టినవాళ్లంతా ఒక మత్తులో ఉండడం, మౌనంగా ఉండడం ఆనవాయితీ. ఒక కొత్త రకమైన ఫాసిజం. పెచ్చరిల్లిన నిరంకుశత్వం ఒకరి మీదికి మరొకరిని ఉన్మాదంగా ఊసిగొల్పడం లాంటి అకృత్యాలు నిత్యం జరుగుతున్నాయి. ఇలా బిక్కేరువాగు వెంట ఇసుకాసురుల దందా ఊడలు దిగిపోయింది. పోలీస్‌ స్టేషన్లు బజారున పడి దందాసురుల చేతుల్లోకి వెళ్లాయి. వ్యవస్థలన్నీ అక్రమార్కుల అధీనంలోకి వచ్చాయి. న్యాయం దిక్కులేనిదయింది. దిక్కుమొక్కు లేని రైతాంగం బతకలేక పట్టణాలకు వలసెల్లిపోతున్నారు. బిక్కేరువాగు బిక్కుబిక్కుమంటూ విలపిస్తున్నది.


తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం, వంగమర్తి, చిర్ర గూడూర్‌, తాటిపాముల, జానకీపురం, వస్తాకొండూర్‌ గ్రామాల్లో దందాసురులు తగ్గేదేలే... అంటున్నారు. ఇక్కడి రైతులకు ఇసుక బతుకుదెరువు పోరాటమైతే.. వాళ్ళకేమో దోపిడీ సాధనంగా మారింది. నిప్పులాంటి నిజాలు కూడా ఇక్కడ కనిపించడం లేదు. ప్రభుత్వాలకు రావలసిన ఆదాయం కూడా ప్రైవేటు వ్యక్తులకు చెందుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. అధికారులు నోరు మెదపట్లేదు. పైగా గ్రామాలను శ్మశానాలుగా మార్చి వాళ్ల ఆవిర్భావ జెండాలెగరేస్తున్నారు. ఊర్లను వల్లకాడుగా మార్చి గులాబీ రేకులు పోసి చేతులు జోడించి దండం పెడుతున్నారు. రేపటికి ఏమీ మిగలని గ్రామాలలో బంగారు తెలంగాణ పునాదులు లేపుతారట.


ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే మరెవ్వరు ఈ విషయాలపై ఆలోచించాలి. సమాజానికి చెందవలసిన సహజ సంపద భావితరాలకు అందాలని పోరాడుతున్న ప్రజలకు అండగా పౌరసమాజం నిలబడకపోతే మానవ మనుగడే ప్రమాదంలో పడుతుంది.

భూపతి వెంకటేశ్వర్లు

రాష్ట్ర అధ్యక్షులు, ఇసుక పరిరక్షణ కమిటీ

Updated Date - 2022-05-18T09:26:29+05:30 IST