‘అసత్యమే వారి ఇలవేలుపు’

ABN , First Publish Date - 2022-11-19T01:19:27+05:30 IST

మౌలిక భావుకత, శక్తిమంతమైన శైలి నిండుగా ఉన్న కథానికలు, ఇంకా ‘కుసుమబాలె’ అనే ఒక నవలిక ద్వారా కన్నడ సాహితీ జగత్తులో దేవనూర మహాదేవ తొలుత ప్రసిద్ధుడయ్యారు.

‘అసత్యమే వారి ఇలవేలుపు’

మౌలిక భావుకత, శక్తిమంతమైన శైలి నిండుగా ఉన్న కథానికలు, ఇంకా ‘కుసుమబాలె’ అనే ఒక నవలిక ద్వారా కన్నడ సాహితీ జగత్తులో దేవనూర మహాదేవ తొలుత ప్రసిద్ధుడయ్యారు. దరిమిలా తన రాజకీయ చిత్తశుద్ధి, నైతిక ధైర్యానికి ఆయన పేరుపొందారు. ప్రభుత్వ ప్రాపకానికి ఎన్నడూ ఆరాటపడలేదు. అన్ని వేళల తాడిత, పీడిత ప్రజల పక్షాన నిలబడడం ద్వారా దేవనూర మహాదేవ అశేష ప్రజల గౌరవాదరాలకు పాత్రుడయ్యారు. భిన్న మతాల మధ్య సామరస్యానికి ఆయన కృషి చేశారు. సమాజంలో అన్ని రంగాలలోనూ బహుళతా వాదం విలసిల్లాలన్న లక్ష్యానికి మహాదేవ నిబద్ధుడు. హలాల్ మాంసంపై నిషేధం విధింప చేయడానికి హిందూత్వ వాదులు ప్రయత్నించినప్పుడు దేవనూర మహాదేవ స్వయంగా మైసూర్ మార్కెట్‌కు వెళ్లి హలాల్ మాంసాన్ని కొనుగోలు చేసి హిందుత్వ శ్రేణులను ధిక్కరించారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై తన దృక్పథాన్ని వివరిస్తూ దేవనూర మహాదేవ ఈ ఏడాది జూలైలో కన్నడంలో ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించారు (ఆర్ఎస్ఎస్ : ఆలా మట్టు అగలా) అది వెలువడిన ఒక వారం రోజులకు ‘ది న్యూస్ మైన్యూట్’ అనే వెబ్‌సైట్ ఇలా పేర్కొంది: ‘ఆరెస్సెస్ భావాలు, సిద్ధాంతాలను నిశితంగా అధ్యయనం చేసిన ఈ చిన్న పుస్తకం ఆలోచనాపరులను విశేషంగా ఆకట్టుకొంటోంది. ఈ పరిణామంపై కలవరపడిన మిత, మతవాదులు ఆ పుస్తకాన్ని, దాని రచయితను అపఖ్యాతి పాలు చేసేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు.’ పాలక బీజేపీ ఎంపీలు, హిందూత్వ రాజకీయాలను సమర్థించే ‘మేధావులు’ రచయితపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మహాదేవను తిట్టిపోశారు. ఆయన పుస్తకాన్ని తీవ్ర ఖండన మండనలకు గురి చేశారు. అయినప్పటికీ ఆ పుస్తకం ప్రతులు అంతకంతకూ వేల సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి. కర్ణాటక నలువైపులా మార్మూల ప్రాంతాలలోనూ ఆరెస్సెస్‌పై మహాదేవ విమర్శలు అసంఖ్యాకుల మాటా మంతీలో భాగమయ్యాయి.

హిందూత్వ సిద్ధాంతవేత్తల్లో అగ్రగాములు అయిన ఎమ్ఎస్ గోళ్వల్కర్, విడి సావర్కర్ రచనల నుంచి ఉటంకింపులతో దేవనూర మహాదేవ పుస్తకం ప్రధాన పాఠం ప్రారంభమవుతుంది). కుల వ్యవస్థ, దాని సహజసిద్ధ సామాజిక హెచ్చు తగ్గులను హిందూ మత గ్రంథాలు అనుమతించాయనే వాదనతో వాటిని గోళ్వల్కర్ సమర్థిస్తాడు. కుల, జెండర్ అసమానతలను ఆమోదించిన, భారత రాజ్యాంగానికి ప్రతివాదమైన మనుస్మృతిని ఆరాధించాలని సావర్కర్ విజ్ఞప్తి చేస్తాడు. ముఖ్యంగా మహాదేవ ఎంపిక చేసిన సావర్కర్ ఉటంకింపు ప్రభావశీలమైనది: ‘మన హిందూ జాతికి వేదాల తరువాత అత్యంత ఆరాధనీయమైనది మనుస్మృతి. పురాతన కాలం నుంచీ అది మన సంస్కృతి–ఆచారాలు, ఆలోచన, ఆచరణ –కి మూలాధారంగా ఉన్నది. మన జాతి ఆధ్యాత్మిక అన్వేషణలను శతాబ్దాలుగా ఏకీకృతం చేస్తున్న గ్రంథమది. నేటికీ కోట్లాది హిందువులు తమ నిత్య జీవితాలలో అనుసరిస్తున్న నియమాలు మనుస్మతి నిర్దేశించినవే. మనుస్మృతి హిందూ ధర్మశాస్త్రం. అది ప్రాథమిక ధర్మం’. గోళ్వల్కర్ రచనల నుంచి చేసిన మరో ఉటంకింపు మన దేశ సమాఖ్య విధానం ‘విషపూరితమైనదని’ విమర్శించింది. సమాఖ్య విధానానికి బదులుగా ‘ఒక దేశం, ఒక రాష్ట్రం, ఒక చట్ట సభ, ఒక కార్యనిర్వాహక వర్గం’ అనే సూత్రం ప్రాతిపదికన యూనిటరీ (ఏక కేంద్రక) రాజకీయ వ్యవస్థను నెలకొల్పుకోవాలని గోళ్వల్కర్ విజ్ఞప్తి చేశాడు.

ఆరెస్సెస్ శ్రేణుల్లో ఆలోచనలుగా అంగీకృతమవుతున్న విషయాల మొరటుదనాన్ని మహాదేవ మన దృష్టికి తీసుకువచ్చారు. గోళ్వల్కర్ పుస్తకం ‘ఏ బంచ్ ఆఫ్ థాట్స్’ సంఘ్ బైబిల్‌గా ప్రఖ్యాతి పొందింది. అయితే మహాదేవ ఏమన్నారో చూడండి: ‘‘ ‘ఆలోచన’ లేదా ‘చింతన’గా భావించే దేనికోసమైనా ఆ పుస్తకంలో చూడండి. అందులో మీకు అలాంటిదేమీ కన్పించదు’’. అది కేవలం యాదృచ్ఛిక, ప్రమాదకరమైన విశ్వాసాలను, అవి కూడ గతించిన కాలానికి చెందిన వాటిని ప్రతిపాదిస్తుంది’ (ఏ బంచ్ ఆప్ థాట్స్‌ను పలుమార్లు చదవిన వాణ్ణి గనుక మహాదేవ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను).

భారత రాజ్యాంగాన్ని సమర్థించే, ఔదలదాలిచే వారి దృష్టి కోణం నుంచి మహాదేవ తన పుస్తకాన్ని రాశారు. ఆరెస్సెస్, బీజేపీ నాయకులు ఆ మౌలిక శాసనాన్ని ఎంతగా ప్రశంసిస్తున్నప్పటికీ వాస్తవానికి దాని ప్రాథమిక సూత్రాలయిన బహుళతావాదం, కుల, జెండర్ సమానత్వం, వాక్ స్వాతంత్ర్యం, సమాఖ్య విధానం మొదలైన వాటికి బద్ధ వ్యతిరేకులు. ‘భారత రాజ్యాంగానికి ఎంత ఎక్కువగా నష్టం చేస్తే అంత ఎక్కువగా విజయం సాధించినట్టుగా సంఘీయులు సంతృప్తి పొందుతారని’ ఆయన వ్యాఖ్యానించారు. మహాదేవ ఇంకా ఇలా అన్నారు: ‘రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలు చెప్పలేని చర్యలకు పాల్పడుతున్నాయి. రాజ్యాంగానికి గట్టి పునాది, కేంద్రం, రాష్ట్రాలను కలిపి ఉంచుతున్న సమాఖ్య విధానాన్ని ధ్వంసం చేసేందుకు సంఘీయులు ఒక ఎడతెగని యుద్ధాన్ని చేస్తున్నారు’. ఆయన ఇంకా చాలా కఠినంగా వ్యాఖ్యానించారు: ‘2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ గోళ్వల్కర్‌కు గురుదక్షిణగా సమాఖ్య విధానాన్ని భూ స్థాపితం చేస్తోంది’. సంఘీయులు సత్యాన్ని గౌరవించరు. చారిత్రక రికార్డులను వక్రీకరిస్తారని దేవనూర మహాదేవ విమర్శించారు నకిలీ వార్తలను ప్రచారంలో పెట్టడంలో హిందూత్వ వాదులు ఘనాపాటీలని ఆయన దుయ్యబట్టారు. ‘అసత్యం వారి కుటుంబ దేవత’ అని మహాదేవ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం వెలువరిస్తున్న పాఠ్యగ్రంథాలలో ప్రచారం చేస్తున్న పలు అసత్యాలను ఆయన నిశితంగా విశ్లేషించారు. ఆ అసత్యాలు బాలల మనసులను విషపూరితం చేస్తున్నాయని, హిందువులు కాని భారతీయుల పట్ల విద్వేషాన్ని పెంచుతున్నాయని మహాదేవ పేర్కొన్నారు.

ఆరెస్సెస్ యేతర రాజకీయ శక్తులు కూడా మన ప్రజాస్వామ్యం పతనమవడానికి ఎంతైనా దోహదం చేస్తున్నాయని మహాదేవ అంగీకరించారు. ఇందుకు ఆయన్ని అభినందించి తీరాలి. ‘భారతదేశ రాజకీయ పక్షాలను గమనిస్తే మీకు వాటిలో మూడు లక్షణాలు కనిపిస్తాయని’ ఆయన పేర్కొన్నారు. అవి: ‘(1) ఒక వ్యక్తి నాయకత్వంలోని రాజకీయ పార్టీ; (2) కుటుంబ నియంత్రణలో ఉన్న పార్టీ; (3) రాజ్యాంగ వ్యతిరేక సంస్థ నేతృత్వంలో ఉన్న పార్టీ . ఈ మూడు లక్షణాలూ ప్రజాస్వామ్యానికి నష్టదాయకమైనవే.’ ఆరెస్సెస్ ప్రచారక్ నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు– విదేశాల్లోని బ్యాంకుల్లో ఉన్న భారతీయుల నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం, రైతుల ఆదాయాలను ఐదేళ్లలో రెట్టింపు చేయడం, ఏటా కోటి ఉద్యోగాలు సృష్టించడం– గురించి కూడా మహాదేవ ప్రస్తావించాడు. ఈ హామీలలో ఏ ఒక్క దానినీ మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. పైగా ఆదాయాల్లో అసమానతలు పెరిగిపోయాయి. సంపదల్లో వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన ప్రధాన లబ్ధిదారులు గౌతమ్ అదానీ, ముఖేశ్ అంబానీ తదితరులు మాత్రమే. (ప్రస్తావిత ఇద్దరు పారిశ్రామికవేత్తలూ యాదృచ్ఛికంగా మోదీ సొంత రాష్ట్రం వారే).

ఆరెస్సెస్, బీజేపీ ఆర్థిక సిద్ధాంతాలను విమర్శిం చడం కంటే వాటి భావజాల విశ్లేషణకే మహాదేవ అధిక ప్రాధాన్యమిచ్చారు. సంఘ్ స్వతస్సిద్ధ నిరంకుశ తత్వాన్ని, కులతత్వాన్ని, దాని మెజారిటీ వాద ధోరణులను ఆయన నిశితంగా స్పష్టం చేశారు. ఇటీవల ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ ఆహ్వానంపై న్యూఢిల్లీలోని కులీన ముస్లింలు కొందరు ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం వారు మార్పులకు సంఘ్ సానుకూలమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ ముస్లిం పెద్దలు తప్పనిసరిగా మహాదేవ పుస్తకాన్ని చదవాలి. అలాగే ఏ మతానికి చెందినప్పటికీ ఆలోచనాపరుడైన ప్రతి భారతీయుడూ ఆ పుస్తకాన్ని చదివితీరాలి. హిందూత్వ సైద్ధాంతిక పుస్తకాలను ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కర్ణాటకలో సంఘ్ కార్యకలాపాలను ఆయన ప్రత్యక్షంగా చూశారు. బ్యూరాక్రసీ, న్యాయ వ్యవస్థ, పోలీసు విభాగాల్లోకి చొరబబడం ద్వారా, ఇంకా మతపరమైన ప్రదేశాలలో వివాదాలు రెచ్చగొట్టడం ఇత్యాది చర్యలతోనూ తమ ఉనికిని, ప్రాబల్యాన్ని విస్తరించుకునేందుకు ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్‌లు నిరంతరం చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా ఆయనకు బాగా తెలుసు.

కర్ణాటకలో సంఘ్ అంతిమ విజయాన్ని సాధిస్తే కన్నడ సమాజ సమున్నత బహుళత్వ, మానవతా సంప్రదాయాలు, ఉత్కృష్ట సాహిత్య, మేధా సంస్కృతి, ప్రజా జీవితంలో వివేచన, సభ్య మర్యాదలు పూర్తిగా మంటగలిసిపోయే సంభావ్యత మహాదేవను ఎంతైనా కలవరపెడుతోంది. కనుకనే భారత గణతంత్ర రాజ్య సమున్నత సంప్రదాయాలను పునరుద్ధరించేందుకు, మిత, మతవాదుల విధ్వంసాల నుంచి రిపబ్లిక్‌ను కాపాడేందుకు ఆరెస్సెస్, బీజేపీలను వ్యతిరేకించేవారందరూ సమైక్యమవ్వాలని, సమష్టి కార్యాచరణకు పూనుకోవాలని మహాదేవ విజ్ఞప్తి చేశారు. ఆయన ఇలా రాశారు: ‘ఇప్పటికైనా ప్రగతిశీల బృందాలు, సంస్థలు, పార్టీలు వేటికవే ఉండడం కాకుండా సమైక్యమై ఒక నదిలా ముందుకు సాగాలి. ఇది సాధ్యం కావాలంటే ముందు తమ స్వీయ ఆధిక్యతా ధోరణులు, అహాలను విడనాడాలి. ఒక లక్ష్య సాధనకు అనేకానేక మార్గాలు ఉంటాయనే సత్యాన్ని వినయపూర్వకంగా అంగీకరించాలి. నాయకత్వ వివాదాలకు స్వస్తి చెప్పాలి. తామే నాయకత్వం వహించాలన్న వైఖరిని విడనాడాలి. సమాఖ్య విధానాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారతీయ నాగరికతలోని వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు సమైక్యమవ్వాలి. పౌరులు, సమాజిక సముదాయాలు పాల్గొని, సకల అంతరాలను అధిగమించే సహనశీల సంస్కృతిని పెంపొందించే భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకునేందుకు కలసికట్టుగా కృషి చేయాలి’.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2022-11-19T01:19:29+05:30 IST