గాలి వాసన

ABN , First Publish Date - 2022-10-17T07:37:48+05:30 IST

తిన్నదేదో పొట్లంకట్టి కిటికీలోంచి బలంగా విసిరేసినట్టు ఎవరికి ఏమౌతామో ఎరుగని కాళ్ళు తేలిన ప్రయాణం కొన్నాళ్లుగా...

గాలి వాసన

తిన్నదేదో పొట్లంకట్టి

కిటికీలోంచి

బలంగా విసిరేసినట్టు

ఎవరికి ఏమౌతామో

ఎరుగని

కాళ్ళు తేలిన ప్రయాణం

కొన్నాళ్లుగా-


వచ్చి ఇన్నాళ్లైనా

ఇంకెన్నాళ్లో...?

సందేహం వీడని జంజాటం

కుడి భుజం ఎక్కి

అదేపనిగా లాగేస్తూ వుంటుంది

ఎంతకీ పాతబడని గాలి వాసన

ఇంకా కాళ్ళకింద

పచ్చి పచ్చిగానే

మెదులుతుంటుంది


కుక్కలు చీల్చిన

ఎముక పగుళ్ల మధ్య

విరిగిపడే

నిశ్శబ్ద మూలుగులు

ఏరుకుంటూ

ఎలాగోలా కుదురుకోవాలనుకుంటాను

అనుకున్నదే తడవు

నది ఒరుసు దారులలో

నను ఒంటరి చేసి

నా నీడ


రాత్రి కురిసిన జోరువానలో మాయమైపోతుంది

ఆశ చావక

రక్తసంచుల అల్మారాలు

వున్నాయో లేదోనని

గడియ గడియకు

తడుముతుంటుంటాను

ఎంతకీ దొరకని

ఉగ్గుగిన్నె ఎంగిలి కోసం

మలుపు మలుపులోనూ

దేవులాడుతుంటాను

మేడక యుగంధర రావు

90320 56738


Updated Date - 2022-10-17T07:37:48+05:30 IST