ఇథనాల్‌తో ఇంధన భద్రత భ్రమే!

ABN , First Publish Date - 2022-09-28T10:19:25+05:30 IST

భూతాపం అదుపు తప్పుతోంది. క్షామం, వరదలూ, కార్చిచ్చులూ, వడగాడ్పులూ ఒకేసారిగా ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. సెప్టెంబరు 23న జేమ్స్ హాన్సెన్ విడుదల చేసిన పరిశోధనా పత్రం...

ఇథనాల్‌తో ఇంధన భద్రత భ్రమే!

భూతాపం అదుపు తప్పుతోంది. క్షామం, వరదలూ, కార్చిచ్చులూ, వడగాడ్పులూ ఒకేసారిగా ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. సెప్టెంబరు 23న జేమ్స్ హాన్సెన్ విడుదల చేసిన పరిశోధనా పత్రం 2024 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 1.4సి కి  చేరుతుందని తెలిపింది. ఈ దుస్థితిని నివారించడానికి 2015 డిసెంబరులో చేసుకున్న పారిస్ ఒప్పందం అమలు జరగడం లేదు. ఏ దేశమూ చిత్తశుద్ధితో భూతాప నిరోధానికి శిలాజ ఇంధన వాడుక తగ్గించడం లేదు. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం 2030 నాటికి కర్బన ఉద్గారాలను 50శాతం తగ్గించాలి. ఏడేళ్ళు గడిచినా ఒక్క శాతం కూడా తగ్గించలేదు. శిలాజ ఇంధనాలకు ముగింపు పలకడానికి బదులుగా పర్యావరణహితమనే పట్టీ తగిల్చి వాటి కొనసాగింపుకి అనువైన ఇంధనాలను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగమే పెట్రోలులో ఇథనాలును కలిపి వాడడం. అది భూతాపాన్ని తగ్గించదు, పెంచుతుందనే శాస్త్రీయ వివరణను వెల్లడించే ప్రయత్నమిది.


భారత ప్రభుత్వం జూన్ 2021లో ప్రకటించిన ఇథనాల్ కలిపిన పెట్రోలు విధాన నివేదిక మార్గదర్శకంగా మిశ్రమ ఇంధనానికి అమిత ప్రోతాహం ఇస్తున్నది. అందుకోసం ఇథనాల్ ప్లాంట్లకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులిస్తున్నది. పర్యావరణ నిబంధనలను సడలించి మొత్తం ఉత్పత్తి అయిన ఇథనాలుని చమురు కంపెనీలకు అమ్మే ఒప్పదం చేసుకుంటే ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా తిన్నగా పర్యావరణ అనుమతి పొందే వీలు కల్పించింది ప్రభుత్వం. నాగర్ కర్నూలు జిల్లా చిత్తనూరు గ్రామ ప్రజలు తమకు తెలియకుండా గ్రామంలో ఇథనాల్ ప్లాంటు వస్తోందనీ, తమ నీటి వనరులు తమకు దక్కవనీ, ఆందోళన చెంది నిరసనలు తెలియజేస్తున్నారు.


మనం 85శాతం ముడి చమురు దిగుమతిపై ఆధారపడుతున్నాం. దేశీయ చమురు ఉత్పత్తులు తరగడమే కాని పెరిగే అవకాశం లేదు. ఈ విధానాలు చమురుపై ఆధారపడటాన్ని పెంచుతున్నాయి కాని తగ్గించడం లేదు. చమురు వాడుక 2030 నాటికి 50శాతం పెరుతుందని అంచనాలు ఉన్నాయి. ఇథనాలుని పెట్రోలులో మాత్రమే కలపగలం. డీజిలులో కలిపి వాడలేము. అది ప్రమాదకరం. భారీ వాహనాలన్నీ డీజిలుతో నడుస్తాయి. అందువల్ల పెట్రోలు వాహనాల్లో వాడే ఇంధనం మాత్రమే ఇథనాల్ కలిపిన మేరకు ఆదా అవుతుంది. వాహనరంగం ఇంధన వాడుకలో 65 శాతం భారీ వాహనాలది. కేవలం 35 శాతం ఇంధనం వాడే కార్లలో 20శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు వాడితే ఇంధన భద్రత రాదు. ఏటా కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. మొత్తం వాహనాల సంఖ్య పెరుగుతోంది. దానితో పాటు ఇంధన డిమాండ్ పెరుతుంది. మిశ్రమ ఇంధనంలో 80శాతం పెట్రోలు గనుక ఇథనాల్ కలిపినందువల్ల పెట్రోలు వాడకం తగ్గదు. ఇంధన దిగుమతి ఖర్చు తగ్గదు. భూతాపం నిరోధించడానికి ఇథనాల్ కలపడం ప్రత్యామ్నాయం కాదు.


నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2025 నాటికి 1016 కోట్ల లీటర్ల ఇథనాల్ కావాలి. దీనితో పాటు ఇతర అవసరాల కోసం 760 కోట్ల లీటర్లు చెరుకు నుండీ, 740 కోట్ల లీటర్లు తిండి గింజలు, ప్రధానంగా మొక్కజొన్నల నుండి ఉత్పత్తి చేయాలని ప్రతిపాదన. దానికి 30 లక్షల హెక్టార్ల పంట భూమి కావాలని ఈఫా అంచనా. అంత విస్తీర్ణంలో సౌరశక్తి వనరులను పెంచితే 2050 నాటి దేశ అవసరాలకు రెట్టింపు శుభ్ర విద్యుత్తునిస్తుంది. ఒక హెక్టారులో ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్తుతో విద్యుత్ వాహనం నడిచే దూరానికి సమానమైన శక్తినివ్వడానికి 187 హెక్టార్ల మొక్కజొన్న పంట కావాలని అమెరికా సంస్థ ఈఫా అంచనా. ఆకలి సూచికలో ఎక్కడో దిగువనున్న భారత్, జనాభా ప్రాతిపదికన 2.2శాతం కార్ల ఇంధనం కొరకు ఆహార భద్రతకు ప్రాముఖ్యత నివ్వకపోవడం శోచనీయం. భూతాపం ప్రజ్వరిల్లుతున్న నేపథ్యంలో పంటల దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదాన్ని ఈ వేసవిలో చవి చూశాం. 


ఇథనాల్ కలపడం వల్ల కర్బన ఉద్గారాలూ, కాలుష్యం తగ్గవు. ఇథనాల్ ఉత్పత్తి క్రమంలో కార్బన్‌డయాక్సైడ్ విడుదలవుతుంది. దానిని సేకరించి భద్రపరచాలి. దానిని సోడాలకు వాడితే తిరిగి వాతావరణంలోకి చేరుతుంది. 2025 నాటికి ఏటా దాదాపు 60 లక్షల టన్నుల కార్బన్‌డయాక్సైడ్ ఇథనాల్ ఉపఉత్పత్తిగా వస్తుంది. దానిని అమెరికాలో చమురు బావులలో ఉత్పత్తి పెంచడానికి వాడతారు. అధిక పీడనంలో గొట్టాల ద్వారా తరలిస్తారు. ఇక్కడ ఆ అవకాశం తక్కువ. ఏటా 60 లక్షల టన్నుల కార్బన్‌డయాక్సైడ్ గాలిలో చేరకుండా నిరోధించలేకపొతే భూతాపానికి దోహదకారవుతుంది.


మిశ్రమ ఇంధనంపై జరిపిన సమగ్ర అధ్యయనం ప్రకారం కర్బన ఉద్గారాలు 24 శాతం పెరుగుతాయని అమెరికా జాతీయ అకాడెమీ పత్రికలో ప్రచురణైన టైలర్ లార్క్ తదితరుల పరిశోధన నిర్ధారించింది. శక్తిపరంగా ఒక లీటరు పెట్రోలు 1.7లీటర్ల ఇథనాలుకు సమానం. పది శాతం, 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు కాన్సర్ కారక ఫార్మాల్డిహైడ్, ఎసెటాల్డిహైడ్‌లను పొగ గొట్టం నుండి విడుదల చేస్తాయి. ఇథనాల్ కలిపి పెట్రోలు వాడుక కొంత తగ్గించగలిగనా, కర్బన ఇంధనంపై ఆధారత కొనసాగటం భూతాప నిరోధానికి చేటు. పారిస్ ఒప్పందాన్ని నిజాయితీగా అమలు పరచాలంటే మిశ్రమ ఇంధనం సరికాదు. హరితమంటూ తప్పుదోవ పట్టించే గ్రీన్వాష్ పద్ధతులకు స్వస్తి పలకాలి. పునరుత్పాదక ఇంధనాలకు మారడంలోనే మనకూ, ప్రపంచానికీ నిజమైన ప్రయోజనముంది.

డా. కలపాల బాబూరావు

Read more