పథకాలతోనే పేదరిక నిర్మూలన

ABN , First Publish Date - 2022-08-02T06:13:43+05:30 IST

భారత రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చామని పార్టీలు చెప్పుకోవడం రాజకీయ లబ్ది కోసమే.. తమ ఓటు బ్యాంకులను కాపాడుకునే తాపత్రయమే తప్ప...

పథకాలతోనే పేదరిక నిర్మూలన

భారత రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చామని పార్టీలు చెప్పుకోవడం రాజకీయ లబ్ది కోసమే.. తమ ఓటు బ్యాంకులను కాపాడుకునే తాపత్రయమే తప్ప ఆయా వర్గాల జీవన ప్రమాణాలను పెంచాలన్న ఆలోచనే లేదు. అదే ఉన్నట్లయితే ఆయా వర్గాల అభ్యున్నతికి వివిధ కమిటీలిచ్చిన సిఫారసులను బుట్టదాఖలు చేసేవాళ్లు కాదు.


దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నాయి. స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను ఏడాది పొడవునా జరుపుతున్నారు. కానీ ఏడున్నర దశాబ్దాల్లో సాధించిన ప్రగతి శూన్యం, పెరిగిన జీవన ప్రమాణాలు గుండు సున్నా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాల బతుకుల్లో ఏమాత్రం మార్పులేదు. అణగారిన వర్గాలు అలాగే ఉన్నాయి, అభ్యున్నతి అందని ద్రాక్షే.. వారికి ఉన్నత పదవులు ఇచ్చామని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పినా సామాజికంగా ఆయా వర్గాల జీవన స్థితిగతుల్లో మార్పులేదు.


స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటివరకు బడుగు, బలహీన వర్గాలకు చెందిన జాకీర్ హుస్సేన్ (ముస్లిం), ఫక్రుద్దీన్ అహ్మద్ (ముస్లిం), జైల్ సింగ్ (సిక్కు మైనారిటీ), కేఆర్ నారాయణన్ (ఎస్సీ), అబ్దుల్ కలాం (ముస్లిం మైనారిటీ), రామ్‌నాథ్ కోవింద్ (ఎస్సీ) రాష్ట్రపతులు అయ్యారు. ఇప్పుడు తాజాగా ఎస్టీ వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము అయ్యారు. ఒక వర్గానికి అత్యున్నత పదవి వస్తే ఆ వర్గాల భవితవ్యం మెరుగుపడుతుందని ఆశిస్తే అది అత్యాశే.. రైసినా హిల్స్‌లోకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అడుగుపెట్టినంత మాత్రాన ఆయా వర్గాలకు ఒనగూడిన లబ్ది ఏమీ లేదనేది ఇప్పటికి అనేకమార్లు రుజువైంది. ఓట్లు కొల్లగొట్టడానికి ఆయా పార్టీలు చేసే ప్రచారమే తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదు. పార్టీల లబ్ది కోసమే తప్ప, సామాజిక ఆర్థిక మార్పు కోసం ప్రయత్నం లేదు.


ద్రౌపది ముర్ము ఐదేళ్ల రాష్ట్రపతి పదవీకాలంలోనైనా దేశంలో గత 75 ఏళ్లుగా కరెంటు, రక్షిత తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, విద్య, వైద్యం తదితర కనీస సదుపాయాలకు నోచుకోని ఆదివాసీ గ్రామాలు, గిరిజన తండాలకు మేళ్లు జరిగితే అంతకన్నా అద్భుతం మరోటి ఉండదు. దేశంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్తెసరుగానే చేస్తున్నారు. చేయాల్సిన దానితో పోలిస్తే చేస్తోంది ఆవగింజంతే.. అందుకే పేదరికం అంతకంతకూ ప్రబలుతోంది. ధనిక, పేదల అంతరం పెరిగిపోతోంది.


ఇలాంటి పరిస్థితుల్లో పేదల సంక్షేమ పథకాలపై అవాంఛనీయ చర్చలు ప్రారంభించారు. ఉచిత పథకాలు ప్రమాదకరమని అత్యున్నత పదవుల్లోని నేతలే ప్రవచిస్తున్నారు, ఉచితాలను తీసేయాలనే ప్రచారం చేయడం శోచనీయం. గత 75ఏళ్లలో దేశానికి 15మంది రాష్ట్రపతులు పనిచేశారు. వారిలో ముగ్గురు ముస్లింలు (జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అహ్మద్, అబ్దుల్ కలాం) దేశంలో అత్యున్నత పదవి పొందినా దానివల్ల ముస్లింలకు ఒరిగిందేమీ లేదు, వాళ్ల జీవన ప్రమాణాల్లో ఏ విధమైన పురోగతీ లేదు. షెడ్యూల్ కులాలకు చెందిన ఇద్దరు (కేఆర్ నారాయణన్, రామ్‌నాథ్ కోవింద్) దేశాధ్యక్షులు అయ్యారు. వారిద్దరి పదవీకాలంలో గాని, ఆ తర్వాత గాని ఎస్సీ వర్గాల ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపడిన దాఖలాలు లేవు. దేశాన్ని నాలుగు దశాబ్దాలు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ గాని, ఆ తర్వాత వచ్చిన సంకీర్ణ ప్రభుత్వాలు గాని(నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, యూపిఏ, ఎన్డీఏ) అన్నింటి ఆలోచనా ఒక్కటే. ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప ప్రజల జీవన ప్రమాణాలు పెంచింది లేదు.


పార్టీల భావజాలాలు ఒకరకంగా ఉంటే, ప్రజల ఆలోచనలు వేరేరకంగా ఉన్నాయనేది చరిత్ర చెబుతున్న సత్యం. ముస్లింలను రాష్ట్రపతులుగా చేసినంత మాత్రాన ముస్లింలంతా గంపగుత్తగా ఆ పార్టీకి ఓటేసిన దాఖలాలు లేవు. దళితులను రాష్ట్రపతులుగా చేస్తే షెడ్యూల్ కులాలన్నీ ఆ పార్టీకి మద్దతుగా నిలిచాయా? ఓటు బ్యాంకు రాజకీయాలకు కాలం చెల్లింది.. పదవులిచ్చి, పథకాలకు మంగళం పాడే దురాలోచనలు దురదృష్టకరం. నలుగురు బీసీలను రాజ్యసభకు పంపామనే తేనె మాటలతో మొత్తం బీసీల ఓట్లు పొందాలనుకుంటే అది భ్రమే. ఆదరణ రద్దుచేసి, విదేశీ విద్య ఎగ్గొట్టి, బీసీ భవన్‌లు పాడుబెట్టిన పార్టీకి బీసిలెలా ఓటేస్తారు?


ఇక సిక్కుల ఓట్ల కోసం జైల్ సింగ్‌ను రాష్ట్రపతిగా చేస్తే ఏమైంది? నిరంకుశ నిర్ణయాల కారణంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆ సిక్కుల చేతిలోనే బలయ్యారు. బింద్రన్ వాలే ఉదంతం, ఢిల్లీలో ఊచకోత కారణంగా సిక్కులకు కాంగ్రెస్ పార్టీ దూరమైంది. రాష్ట్రపతులుగా చేసిన ముస్లింల వల్ల ఆ వర్గానికి ఒనగూడిన లబ్ది లేదు. దేశాధ్యక్షులైన ఎస్సీల వల్ల ఆ సామాజిక వర్గం బావుకున్నది లేదు. ఇప్పుడు ఎస్టీకి ఇచ్చారు, అయినంత మాత్రాన ఎస్టీల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్న నమ్మకం లేదు. ఎస్టీలు ఓటుబ్యాంకుగా మారతారని విశ్వసించలేం. 75ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో అడుగడుగునా ఆర్థిక అసమానతలే.. ఎక్కడ చూసినా కులఘర్షణలే.. జాతీయ సమగ్రతకు భంగం వాటిల్లే పరిస్థితులే.


భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో పేదరికం స్థాయి అధికంగా ఉందని గ్లోబల్ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ (జిఎండిఐ) పేర్కొంది. ఎస్టీలలో 50.6 శాతం, ఎస్సీలలో 33.3 శాతం, ఓబీసీలలో 27.2శాతం పేదలే. ప్రతి ఆరుగురు పేదల్లో ఐదుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలేనని తెలిపింది.


దేశ జనాభాలో 9.4 శాతం గిరిజనులు ఉన్నారు. 129మిలియన్ల ఎస్టీలలో 65మిలియన్లు పేదరిక ఊబిలోనే ఉన్నారు. దేశంలోని పేదల్లో ఆరోవంతు ఎస్టీలే. ఎస్సీ జనాభా 18 శాతం ఉన్నారు. 283మిలియన్ల ఎస్సీలలో 94మిలియన్లు పేదరికంలో మగ్గుతున్నారు. అగ్రవర్ణ పేదలతో పోలిస్తే ఎస్టీలలో పేదరికం మూడు రెట్లు అధికంగా ఉంటే, ఎస్సీ, ఓబీసీలలో రెండు రెట్లు అధికంగా ఉందని జిఎండిఐ వెల్లడించింది. ఇక ఓబీసీల విషయానికి వచ్చేసరికి పేదరికం స్థాయి 27.2 శాతం అంటే 588మిలియన్ల ఓబీసీలలో 180మిలియన్లు పేదరికం కోరల్లో ఉన్నారు. మూడింట రెండువంతుల కుటుంబాల్లో ఆడబిడ్డలు ఆరవ తరగతి స్థాయి దాటి చదవడం లేదు. ఇక ఆస్తుల విషయానికి వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాల్లో ఇతర వర్గాల సగటు ఆస్తితో పోలిస్తే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుటుంబాల సగటు ఆస్తి మూడోవంతు మాత్రమేనని ఏఐడిఐఎస్ 2019 నివేదిక పేర్కొంది. అదే అగ్రవర్ణాలలో 15 శాతం మాత్రమే పేదరికంలో ఉన్నారు.


ఎస్టీలలో ప్రతి రెండో వ్యక్తి, ఎస్సీ, ముస్లింలలో ప్రతి మూడోవ్యక్తి పేదరికంలోనే మగ్గుతున్నారని యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ (ఓపిహెచ్‌డిఐ) పేర్కొనడం గమనార్హం. దేశంలోని 640జిల్లాలలో 10ఏళ్ల కాలవ్యవధి(2005–15)కి చేసిన అధ్యయనం వివరాలివి. దేశ జనాభాలో 27 శాతం పేదరిక కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. 105దేశాల జాబితాలో ఇండియా 54వ స్థానంలో ఉంది.


ఏటికేడు పేదరికం ప్రబలడం, ఆర్థిక అసమానతలు పెరిగిపోవడం ఆందోళనకరం. స్వతంత్ర భారతంలో ఇప్పటికీ అనేకమంది పోషకాహారలోపంతో బాధపడటం, విద్యా వైద్యం అందరికీ అందుబాటులోకి రాకపోవడం నిజంగా తలదించుకోవాల్సిన అంశం. ఇంటింటికీ విద్యుత్, రక్షిత మంచినీరు అందించలేకపోవడం, విద్యా వైద్య సదుపాయాలు కల్పించలేకపోవడం, రోడ్లు, డ్రెయిన్లు నిర్మించలేకపోవడం 75ఏళ్ల పాలకుల ఘోర వైఫల్యం కాదా? అధికారం, ధనం కొంతమంది చేతుల్లో ఉండటం వల్ల సామాజిక న్యాయం అందడం లేదు, సాధికారత సాధ్యం కాలేదు. ధనంతో అధికారంలోకి వస్తున్నారు, అధికారంతో ధనవంతులు అవుతున్నారు. డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే ఆ కొంతమందికైనా పదవులు వస్తున్నాయి, అది రాజ్యాంగ భిక్ష.. కానీ పదవులు వచ్చినా, వాస్తవాధికారం పెద్దల చేతుల్లోనే ఉంటోంది. పేరుకు మాత్రమే పదవులుగా మారాయి, అధికారం మీద వారికి స్వేచ్ఛ లేదు.


ఈ వజ్రోత్సవాల వేళ, ఇకనైనా పార్టీల భావజాలం మారాలి. పాలకుల ఆలోచనా సరళి మారాలి. రాజకీయం అనేది ఎన్నికల వరకే.. అధికారంలోకి వచ్చాక ఆలోచనలన్నీ అభివృద్ధి, సంక్షేమం పైనే పెట్టాలి. పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతల తొలగింపు, బడుగుల సాధికారత అన్ని పార్టీల అజెండా కావాలి. అందుకోసం సరైన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలి. కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని దానిని పక్కాగా అమలు చేయాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, కొత్తవాటికి రూపకల్పన చేయాలి. అప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యం, భారత రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన సమసమాజం సాధ్యం. 

యనమల రామకృష్ణుడు

మాజీ మంత్రి

(అభిప్రాయాలు వ్యక్తిగతం)

Updated Date - 2022-08-02T06:13:43+05:30 IST