‘కొత్త’ ఆర్థికం, పాత కథే!

ABN , First Publish Date - 2022-12-31T01:26:58+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా సమస్త దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆ ప్రభావానికి తప్పక తల్లడిల్లిపోతాయని చెప్పడం పరిస్థితి తీవ్రతను, బహుశా, పరిపూర్ణంగా చెప్పడం కాదేమో?!

‘కొత్త’ ఆర్థికం, పాత కథే!

కొత్తసంవత్సరంలోకి ప్రవేశించనున్నాం. అయితే పాత సంవత్సరం aనీడలు అంత త్వరగా తొలగిపోతాయా? అవి, ‘నిర్భాగ్యపు నీడలు’ కాదూ? 2008లో అనూహ్యంగా సంభవించిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం 2009లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గమనాన్ని నిర్దేశించింది. 2020లో దేశ దేశాలను కుదిపివేసిన కొవిడ్ మహమ్మారి 2021లో ఆర్థికాభివృద్ధి తీరుతెన్నులను నిర్దేశించింది. అలాగే 2022లో చోటుచేసుకున్న అనేకానేక సంఘటనలు కలసికట్టుగా 2023లో మానవాళి జీవన ప్రస్థానాన్ని ప్రభావితం చేయనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సమస్త దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆ ప్రభావానికి తప్పక తల్లడిల్లిపోతాయని చెప్పడం పరిస్థితి తీవ్రతను, బహుశా, పరిపూర్ణంగా చెప్పడం కాదేమో?!

సరే, భారత్ మాత్రం ఆ విషమ భవిష్యత్తుకు మినహాయింపు ఎలా అవుతుంది? ఈ అంచనాతో భారత ప్రభుత్వం తీవ్రంగా విభేదిస్తోంది. భారత్ ఒక అసాధారణ ఆర్థిక వ్యవస్థ అని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విశ్వసిస్తోంది. 2023లో ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మరింత అధిక స్థాయిలో ఉంటుందని, ద్రవ్యోల్బణం స్వల్ప స్థాయిలో ఉండవచ్చని, నిరుద్యోగిత రేటు తగ్గుతుందని మోదీ సర్కార్ భావిస్తోంది. ఇది వాస్తవిక దృక్పథమేనా? అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్ల పెంపుదలను కొనసాగిస్తూనే ఉన్నా భారత్‌కు వచ్చే నికర పెట్టుబడులు పెరుగుతాయని, రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉన్నా అంతర్జాతీయ వాణిజ్యం మరింతగా పెరగగలదని మన పాలకులు భావిస్తున్నారు. టీమ్ ఇండియా బ్యాటింగ్ సరైన విధంగా లేనప్పటికీ రవిచంద్రన్ అశ్విన్ 2023లో ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్‌కు చరిత్రాత్మక విజయం సమకూర్చగలరని మనమెందుకు భావించకూడదు? కోరికలు గుర్రాలయితే బిచ్చగాళ్లు వాటిపై స్వారీ చేస్తారన్న సామెత ఊరికే పుట్టిందా? ప్రభుత్వ అధినేతలు, సీనియర్ అధికారులు తమ సొంత నివేదికలు, ప్రపంచ సంస్థల నివేదికలు చదవాలని నేను కోరుతున్నాను. భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై ఆ నివేదికలు ఏమి చెప్పాయో చూద్దామా?

ఆర్థిక వ్యవస్థల పురోగమనంపై వాటి దృష్టి కోణం ఆశావహంగా లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర సంక్షోభం అనివార్యమని అవి భావిస్తున్నాయి. ఆవిర్భవిస్తున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు మరింతగా దుర్బలమవుతాయని పేర్కొన్నాయి ప్రపంచ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుతుందని ఆర్బీఐ బులెటిన్ హెచ్చరించింది. ద్రవ్యోల్బణం విషయానికి వస్తే అది స్వల్పంగా తగ్గుతుందేమో గానీ ఎట్టి పరిస్థితులలోనూ అది సమసిపోదని నిశ్చితంగా చెప్పవచ్చు. ఏమైనా అది ఆర్థిక రంగం సమస్తాన్నీ ఆవహించింది. అంత సులభంగా పరిష్కారమయే అవకాశం ఎంత మాత్రం లేదు. ధరల స్థిరీకరణ లక్ష్య సాధనలో మనదేశం ఇప్పటికే తొలి మైలురాయిని అధిగమించిందని ఆ నివేదికలు వ్యాఖ్యానించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గగలదని అంచనా వేస్తున్నప్పటికీ అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి. దేశీయ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే వినియోగదారు ధరల సూచీ ప్రకారం అది వరుసగా మూడో నెలలో కూడా 6 శాతంగా కొనసాగుతోంది. పట్టణ ప్రాంతాలలో కంటే గ్రామీణ ప్రాంతాలలో అది అధికంగా ఉన్నది. గత నెలలో గ్రామీణ ద్రవోల్బణం 6.09 శాతం కాగా పట్టణ ద్రవ్యోల్బణం 5.68 శాతంగా ఉన్నది.

2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల 2.2 శాతంగా ఉండగలదని ‘ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ’ (ఓఇసిడి) అంచనా. 2022లో అంచనా కంటే ఇది తక్కువ. భారత్ వృద్ధిరేటు అంచనాను 6.6 శాతం నుంచి 5.7 శాతానికి ఆ సంస్థ తగ్గించింది. గత నెల 28న ప్రపంచ వాణిజ్య సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం 2022లో అంతర్జాతీయ వాణిజ్యం మందగించింది. 2023లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆ నివేదిక స్పష్టం చేసింది. 2022 ఏప్రిల్–నవంబర్‌ల మధ్య భారత్ వాణిజ్యలోటు 198.4 బిలియన్ డాలర్లుగా ఉన్నది. 2021–22 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ లోటు 191.0 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఒక్క చైనాతోనే మన వాణిజ్య లోటు 73 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.

కరెంట్ ఖాతా లోటు 2023లో మరింతగా పెరిగే అవకాశమున్నది. ఐఎమ్ఎఫ్‌ అంచనా ప్రకారం ఇది 2022–23లో జీడీపీలో (–) 3.5 శాతంగా ఉంటుంది. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం ఇది (–) 3.2 శాతంగా ఉంటుంది. ద్రవ్యలోటు విషయానికివస్తే 2022–23 కేంద్ర బడ్జెట్ ఆశాభావం వ్యక్తం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతంగా ఉన్న ద్రవ్యలోటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతానికి తగ్గగలదని బడ్జెట్‌లో పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రూ.3,25,756 కోట్ల మేరకు అదనపు పద్దులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నిధులను ఎలా సమకూర్చుకుంటారని ప్రశ్నిస్తే పన్ను రాబడి ఇతోధికంగా పెరుగుతుందని ఈ నెల 21న ఆర్థిక మంత్రి సమాధానమిచ్చారు. ఇది జరిగిన 48 గంటలలోనే జాతీయ ఆహారభద్రతా చట్టం కింద 2022లో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహారధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉచిత పంపిణీకి రెండు లక్షల కోట్ల రూపాయల వ్యయమవుతుంది. ఇందులో రూ.60,111 కోట్లను జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఇప్పటికే కేటాయించారు. మొత్తం మీద బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లకు విధించిన పరిమితి లక్ష్యం మాటేమిటి? ఆర్థిక మంత్రి నుంచి విశ్వసనీయమైన సమాధానం రాలేదు.

నిరుద్యోగిత పరిస్థితి తీవ్రంగా ఉందని ప్రత్యేకంగా చెప్పాలా? సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎమ్ఐఇ) సర్వే ప్రకారం 2022 డిసెంబర్‌ 22న దేశవ్యాప్తంగా నిరుద్యోగం 8.4 శాతంగా ఉన్నది. పట్టణ ప్రాంతాల నిరుద్యోగం 10 శాతంగా ఉన్నది. ఏ విధంగా చూసినా 2023లో ఆర్థిక మాంద్యం తీవ్ర స్థాయిలో నెలకొనే ప్రమాదమున్నదని దేశ ఆర్థిక వ్యవస్థపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక హెచ్చరించింది. నిరుద్యోగిత పెరగడమే కాకుండా ఆర్థిక మాంద్యం తీవ్ర స్థాయిలో నెలకొనడం ఖాయంగా కన్పిస్తున్నప్పుడు దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉండగలదని దేశ పాలకులు ఎలా భావిస్తున్నారు?

ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వ నియంత్రణలో ఉన్న విషయాల కంటే ప్రభుత్వ అదుపులో లేనివే అధికంగా ఉన్నాయి. ఇది స్పష్టం. అయినా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ వాస్తవాన్ని గుర్తించడం లేదు. ఇది నాకు చాలా విస్మయకరంగా ఉన్నది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, విచ్ఛిన్నమైన సరఫరా గొలుసులు, చమురుతో సహా అన్ని సరుకుల ధరల పెరుగుదల, కరోనా వైరస్ కొత్త వేరియంట్ల విజృంభణ మొదలైన విషమ పరిస్థితులను ప్రభుత్వం ఎలా నియంత్రించగలుగుతుంది? కొత్త సంవత్సరంలో భారత్ ఒక అనిశ్చిత ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నది.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-12-31T01:26:59+05:30 IST