ఫిరాయింపులను ప్రతిఘటించాలి

ABN , First Publish Date - 2022-06-28T06:17:27+05:30 IST

గెలవడం... గెలవలేకపోతే విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం... ఇదీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం...

ఫిరాయింపులను ప్రతిఘటించాలి

గెలవడం... గెలవలేకపోతే విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం... ఇదీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సూత్రం. 2014 తర్వాత దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చడమే కేంద్రం పనిగా పెట్టుకుంది. దీనికోసం ఈడీ, సీబీఐ, ఐటీలను విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉసిగొల్పడం... వారిని నయానో భయానో పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా మహారాష్ట్ర సంక్షోభం పరిశీలిస్తే... శివసేన పార్టీని చీల్చడంలో బీజేపీ సఫలీకృతమయింది.


ఇటీవల జరిగిన రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే... ‘మా వద్ద ఈడీ ఉంటే... మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా మాకే ఓటు వేసేవాడు’ అని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ చేసిన ప్రకటన వాస్తవం. మహారాష్ట్రలో శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందులో 13 మందిపై ఈడీ దృష్టి సారించిందని గతంలోనే సంజయ్‌ రౌత్ ప్రకటించారు. ఆయన వ్యక్తం చేసిన అనుమానాలను బలపర్చుతూ ఈడీ వేట నుంచి తప్పించుకోవడానికి ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటును లేవదీశారు. షిండేతో సహా ఉన్న 13 మంది ఎమ్మెల్యేలూ వందల కోట్లు వెనకేసుకున్నవారే. ఇందులో బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడబెట్టుకున్న సంపాదన కూడా ఉంది. దేశంలో ఏ పార్టీ వారైనా బీజేపీతో ఉన్నంతవరకు, బీజేపీని సమర్థించినంతవరకు ఆ సంపాదన సక్రమంగానే కనిపిస్తుంది, బీజేపీకి దూరం కాగానే అక్రమంగా మారుతోంది. అయితే శివసేన నేతృత్వంలోని మహావికాస్‌ ఆఘాడీ (ఏంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రతీ ఆయుధాన్ని ప్రయోగించింది. ఆ పార్టీ ప్రభుత్వంలోని మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌, నవాబ్‌ మాలిక్‌లను ఈడీ కేసులతో జైలులో పెట్టింది. చివరికి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశం లేకుండా చేసింది.


2014 తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ... దేశ సంపదను కార్పొరేట్లకు హమారే దోనో (అంబానీ, ఆదానీ)లకు పంచడం ద్వారా వారిని ప్రపంచ కుబేరులుగా చేయడంలో సఫలీకృతమయింది. అదే సమయంలో ప్రజాస్వామ్య విలువలను నామరూపాల్లేకుండా చేయడంలోనూ విజయం సాధించింది. ఇదే క్రమంలో దేశంలో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కార్పొరేట్ల ద్వారా సమకూరిన డబ్బులు, అధికారం ద్వారా ఆధీనంలోకి వచ్చిన సంస్థ (ఈడీ, సీబీఐ, ఐటీ)లను వినియోగించడం ద్వారా కుప్పకూల్చుతున్న బీజేపీ, మాజీ ప్రధాని వాజపేయి ఆచరించిన సిద్ధాంతాలను పాటించే పరిస్థితుల్లో లేదు. ‘అధికారం కోసం పార్టీలను చీల్చి... ఏర్పడే ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించను’ అని 1999 ఏప్రిల్‌లో ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజపేయి పార్లమెంట్‌ సాక్షిగా చేసిన ప్రకటన దేశంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఒకే ఒక్క ఎంపీ తక్కువైనప్పటికీ అడ్డదారుల్లో ఎంపీలను కొనుగోలు చేయడం వంటి దౌర్భాగ్యపు పనులు చేయకుండా ఆయన అధికారాన్ని వదిలేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అశేష ప్రజాదరణతో గెలిచిన వాజపేయి ప్రభుత్వం 1999–2004 దాకా అధికారంలో ఉంది.


స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మత ఉద్రిక్తతలను 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ పెంచింది. సమాజాన్ని విజయవంతంగా చీల్చడంలో సఫలీకృతమయింది. ఒకవైపు అతివాదాన్ని పోషించి ప్రజల హృదయాలను విషపూరితం చేయడం... కలుషితం చేయడం... దానికి ప్రసార, ప్రచురణ మాధ్యమాలను బలంగా వాడుకోవడం... ఈ భావోద్వేగాలు రెచ్చగొడుతూనే దేశం 70 ఏళ్లుగా నిర్మించుకున్న సంస్థలన్నీ ముక్కలు ముక్కలు చేసి... అమ్మడం... దేశ సంపదను అదానీ, అంబానీ గుప్పిట్లో పెట్టడమే పనిగా పెట్టుకుంది. దేశంలో బలం ఉన్న చోట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం... బలం లేని చోట కేంద్ర సంస్థలు (ఈడీ, సీబీఐ, ఐటీ)లను ఉసిగొల్పి... విపక్ష ప్రభుత్వాలను కూలగొట్టడమే ఎజెండాగా చేసుకుంది. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత పేరిట ప్రధానంగా దేశంలో కాంగ్రెస్‌ పాలిత ప్రభుత్వాలను కూలగొట్టడంలో ఈడీ, సీబీఐ, ఐటీ సహకారం బలంగా ఉంది. ఈ సంస్థలన్నీ 2014 తర్వాత బీజేపీ అనుబంధ విభాగాలుగా మారినట్లు తేటతెల్లమవుతుంది. దేశంలోని ప్రజాస్వామిక ప్రభుత్వాలను నేలమట్టం చేయడంలో ఈ సంస్థల పాత్ర కీలకం. 


2014లో అరుణాచల్‌ప్రదేశ్ శాసనసభలోని 60 స్థానాలకు గాను జరిగిన ఎన్నికల్లో 42 చోట్ల కాంగ్రెస్‌ గెలుపొంది... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా... 2016లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెమాఖండు నేతృత్వంలో 41 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీకి చెందిన కూటమిలో చేరారు. ఆ తర్వాత 2015లో బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో నితీశ్ కుమార్‌ నేతృత్వంలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాగా... ఆ కూటమిలో చీలికను తేవడం ద్వారా 2017లో జేడీయూతో కలిసి, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2018 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కమల్‌నాథ్‌ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చింది. 2017 మణిపూర్‌ ఎన్నికల్లో 60 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 28 చోట్ల గెలువగా, కేవలం 21 స్థానాల్లో గెలిచిన బీజేపీ, గవర్నర్‌ బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2017లో గోవాలో జరిగిన ఎన్నికల్లో 40 స్థానాలకు 17 స్థానాలు కాంగ్రెస్‌ గెలుచుకోగా, 13 స్థానాల్లోనే గెలిచిన బీజేపీ, గవర్నర్‌ వ్యవస్థతో అందిన సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2018 ఎన్నికల్లో కర్ణాటకలో జేడీఎస్‌–కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగా... ఫిరాయింపులతో 2019లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2016లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చడంలో బీజేపీ సఫలీకృతమయింది. కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట ప్రాంతీయ పక్షాలతో ఫిరాయింపులను ప్రోత్సహించడంలో బీజేపీ విజయం సాధించింది.


తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని నామరూపాల్లేకుండా చేయడానికి టీఆర్‌ఎస్‌కు రహస్యంగా సహకారం అందించింది బీజేపీయే. వైసీపీ ఏపీలో బీజేపీ అనుబంధ విభాగంగా మారింది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీరు చూస్తే, ఆయన బీజేపీ సభ్యుడా లేక వైసీపీ సభ్యుడా అనే అనుమానం రాక తప్పదు. 2014 నుంచి 2018 దాకా టీడీపీ ఎన్‌డిఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ బీజేపీ వద్ద కాళ్లావేళ్లా పడిన దాఖలాల్లేవు. వైసీపీ బీజేపీ భాగస్వామి కానప్పటికీ అంబానీ అనుచరుడు పరిమళ్‌ నత్వానీని రాజ్యసభకు పంపించింది. ఏపీలోని పోర్టులు, విద్యుత్ సంస్థలను అదానీకి అప్పగించడంలో వైసీపీ సఫలీకృతమయింది. ఇక ఒడిషాలో బిజూ జనతాదళ్‌ జాతీయస్థాయిలో ప్రభావితం చేసే అన్ని నిర్ణయాల్లోనూ బీజేపీవైపే ఉంది. ఆ పార్టీ ఒడిషాలో కాంగ్రెస్‌ను బలహీనపరిచి... బీజేపీకి ప్రాణం పోసే పని చేసింది.


తాజాగా మహారాష్ట్ర సంక్షోభం పరిశీలిస్తే... ఫిరాయింపుల వెనుక బీజేపీ బలమైన శక్తిగా, ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న ఈడీ పాత్ర కీలకంగా ఉంది. విలువలు వదిలేసి... నైతికంగా దిగజారిన బీజేపీ, దేశంలో ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూల్చడం వెనుక ప్రధాన కారణం దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం, అతివాద హిందూత్వ ఎజెండా అమలుతో ప్రజలను రెచ్చగొట్టడమే. ఇటువంటి ప్రమాదకర బీజేపీ ఎజెండాకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలన్నీ ఒక్కటి కావాల్సిన అవసరం మరోమారు ఏర్పడింది. బీజేపీ ఎజెండాను ఓడించకపోతే దేశం ముక్కలు అయ్యే ప్రమాదం ఉంది. ప్రగతిశీల శక్తులు సంఘటితం కాకపోతే దేశం ప్రమాదంలో పడటం ఖాయం. 

డాక్టర్‌ సయ్యద్‌ మొహినుద్దీన్

Updated Date - 2022-06-28T06:17:27+05:30 IST