పేరుకు ప్రజాస్వామ్యం, మిగిలింది మూకస్వామ్యం!
ABN , First Publish Date - 2022-10-13T06:36:14+05:30 IST
ఓటర్ల సంఖ్య బట్టి భారతదేశం ఈ భూమ్మీద అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ గొప్ప చెప్పుకోవడానికి మాత్రమే. నిజానికి భారత్‌లో ప్రజాస్వామ్యం జాడ లేదు.
ఓటర్ల సంఖ్య బట్టి భారతదేశం ఈ భూమ్మీద అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ గొప్ప చెప్పుకోవడానికి మాత్రమే. నిజానికి భారత్‌లో ప్రజాస్వామ్యం జాడ లేదు. ప్రజాస్వామ్యం అన్న పదం తప్ప నిజంగా అదెలా ఉంటుందో ఏమిటో భారతీయులకు తెలియదు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా భారత్‌లో ‘ప్రజాస్వామ్యాన్ని’ నిర్మించుకోలేకపోయారు! భారత్‌ను సుదీర్ఘ కాలం పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు మాత్రం తమ దేశంలో రాచరికం పాలన ఛత్ర ఛాయలో ‘ప్రజాస్వామ్యం’ ను నిర్మించుకోగలిగారు. సామాన్య ప్రజలకు కావాల్సినవి అభివృద్ధిపరచుకున్నారు.
భారత స్వాతంత్ర్యోద్యమ నాయకులు చాలా మంది బ్రిటన్‌లో బారిస్టర్ (చట్ట నిపుణుల) విద్యను అభ్యసించారు. ఆ దేశ పాలన, శాసన, చట్ట వ్యవస్థలు, పౌర జీవనంతో ప్రభావితులయ్యారు. స్వదేశంలో అటువంటి వ్యవస్థలను నెలకొల్పుకునేందుకు సంకల్పించారు. అందుకు తొలుత దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు పూనుకున్నారు. స్వాతంత్ర్యాన్ని సాధించి భారత్‌ను ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా రూపొందించారు. దురదృష్టవశాత్తు మలి తరాల వారికి ‘ప్రజాస్వామ్యం’ పట్ల సరైన అవగాహన కొరవడింది. ప్రజాస్వామ్యమంటే ఎన్నికల్లో మెజారిటీ సాధించడంగా అర్ధం చేసుకుంటున్నారు. ‘ప్రజాస్వామ్య’ ఆదర్శాలన్నిటినీ ఉపేక్షించి దేశాన్ని నడిపించేస్తున్నారు! ఈ ‘మెజారిటేరియన్’ విధానంలో నడుస్తున్నవి– ‘వ్యక్తి స్వామ్యం’, ‘ముఠా స్వామ్యం’ లేక ‘మూకస్వామ్యం’ మాత్రమే.
ఎందుకిలా జరిగింది? ‘రాజ్యాంగ’ నిర్మాణంతోనే ఈ తప్పు మొదలయింది. రాజ్యాంగంలో వ్యక్తి సామర్ధ్యం, వ్యక్తి జ్ఞానం, వ్యక్తి నైపుణ్యం, వ్యక్తి ఆవిష్కరణలు, వాటి పేటెంట్‌లు, వాటి సాంకేతిక విలువ, ఆర్థిక విలువ, సంపద, చట్టపరమైన రక్షణ అనే వాటికి బదులు, కులాలు /మతాలు/ ప్రాంతాలు/జెండర్ అంతరాలు అనే వాటిని కీలక ప్రాతిపదికలుగా తీసుకున్నారు. వాటి ఆధారంగా ప్రజాప్రాతినిధ్య పదవులు, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మొదలైన వాటిని నిర్వచించారు. పర్యవసానంగా ‘ముఠాస్వామ్యం’కు బీజం పడింది. ఈ ‘ముఠాస్వామ్యం’ మళ్ళీ పాతకాలపు ‘వ్యక్తిస్వామ్యం’ని తయారుచేసింది. బ్రిటిష్ పాలనా కాలంలో నాటిన ఈ కలుపు మొక్క పెరిగి వృక్షంలా తయారయింది. ఆ బ్రిటిష్ పాలనా సంప్రదాయాలకు అనుగుణంగానే భారత రాజ్యాంగాన్ని రూపొందించారనడంలో సందేహం లేదు.
ఇక ఈ ‘వ్యక్తిస్వామ్యం’, ‘ముఠాస్వామ్యం’ ఎలా చోటు చేసుకుంటున్నాయో చూద్దాం. రాజకీయం అయితే రాజకీయ పార్టీల రూపంలో, ఎన్నికల్లో కులాల/మతాల/ ప్రాంతాల/జెండర్ సంఘాల రూపంలో; న్యాయవాదులు/ న్యాయమూర్తులు/బ్యూరోక్రాట్‌లు/అధికారులు/ఉద్యోగులు /పోలీస్‌లు /వ్యాపారులు ఇంకా చాలా మంది చాలా రకాలుగా సంఘాల రూపంలో ముఠాలుగా మారుతున్నారు. ఒక ముఠా మరొక ముఠాతో తమ తమ స్వప్రయోజనాల కోసం ‘బేరసారాల’కు పాల్పడుతూ నిజమైన ప్రజాస్వామ్యం వికసించకుండా చేస్తున్నాయి. అన్నిటి అంతిమ లక్ష్యం ఎవరికి వారు లబ్ధి పొందడమే. అధికారం కోసం రాజకీయ పార్టీలు పొత్తులు కూడా ఈ కోవలోనివే. ఇవి ఆటవిక విధానాలు. ఈ ముఠాలు స్వలాభం కోసం చేసే కుట్రలు, కుతంత్రాలను, మనకి ‘రాజకీయం’ అని, ఎత్తుగడలు/ ప్రణాళికలు అని రోజూ పాత్రికేయం చెబుతుంటే మనం అవే రాజకీయాలు అని నమ్మి బ్రతికేస్తున్నాము. అవి అసలు రాజకీయాలే కావు.
గత 75 ఏళ్లలో భారత పార్లమెంట్ గాని, శాసనసభలు గాని ఒక్క ‘శాసనం’ చేయలేదు. బ్రిటిష్‌వాడు వదిలి వెళ్లిన పాలనా పద్ధతులలోనే పాలన చేస్తున్నారు. ‘పాలనా అధికారంతో ఉన్న కొద్ది మంది’ బ్రిటిష్ పాలకుల వలే, మెజారిటీ సాధించిన రాజకీయ పక్షం ‘కేబినెట్’ రూపంలో ‘నిర్ణయాలు’ చేసి వాటిని చట్టాలుగా మారుస్తున్నారు. నిజమైన ప్రజాస్వామ్యంలో ఏదేనా ఒక విధానాన్ని రూపొందించాలంటే పలు కోణాల్లో సామాజిక అధ్యయనాలు నిర్వహించాలి. వాటి ఆధారంగా ఏ వ్యక్తికీ నష్టం లేకుండా అందరికీ సమానంగా వర్తించేలా విధానాలను రూపొందించాలి. సమాజంలోని ప్రతి వ్యక్తికీ సమాన అవకాశాలను కల్పించేదిగా, ప్రతి వ్యక్తి సామర్థ్యాన్ని బలోపేతం చేసే హక్కులను అందించేదిగా ఉండడమనేది ప్రజాస్వామ్య ప్రథమ సూత్రం. ఇటువంటి సమున్నత సూత్రాన్ని నిర్దేశించని రాజ్యాంగంతో ప్రజాస్వామ్య నిర్మాణం అసాధ్యం.
స్వతంత్ర భారత్‌లోని ప్రజాస్వామ్య పరిస్థితులు ఒక విషయాన్ని కొట్టొచ్చినట్లు తేటతెల్లం చేస్తున్నాయి: భారతీయులకు ‘శాసనం – హక్కు – చట్టం’ మధ్య ఉన్న అనుబంధం ఏమిటో తెలియదు. వాటిపై అవగాహన ఉన్న బ్రిటిష్ వాళ్ళు, మొదటి రెండిటిని తమకే పరిమితం చేసుకుని, చట్టాలను రచించి వదిలి వెళ్లారు. భారతీయులు వాటిని పట్టుకుని కాలం వెళ్లమారుస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి పైసాకు తిరిగి ఏ సేవ ‘హక్కుగా’ ఇవ్వడం జరుగుతుందో కూడా ప్రతి చోట లిఖితపూర్వకంగా తాను ఇచ్చే రసీదులో క్లుప్తంగా వెల్లడించి తీరాలి. ప్రభుత్వం ఇలా చేస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. ప్రజల హక్కులను తెలుపుతూ ప్రభుత్వ డబ్బు వసూళ్ల వలన ఉపయోగం అనే సదుద్దేశ్య వాతావరణం నెలకొల్పి ప్రజలను చట్టబద్ధులను చేసే బదులు, చట్ట ఉల్లంఘనకు పర్యవసాన జరిమానా/ శిక్షలను ప్రస్తావిస్తూ వసూళ్లు చేస్తుంటారు. రౌడీయిజం పంథాని ‘అధికారంతో అజమాయిషీ’ చేయడం అని భావిస్తున్నారు.
రాజకీయ పార్టీలు అధికారం కోసం రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి వేశాయి. వ్యాపార రాజకీయంలో ఉన్న నాయకులకు శాసనం– హక్కులు అనేవి వారి ఆలోచనకి అంతుపట్టని విషయాలుగా ఉన్నాయి. ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో అదే హక్కుగాను, కోర్టులు ఏవైతే చెప్తాయో అవి ‘న్యాయం’గాను పరిగణిస్తున్నారు. అయితే ఎవడిది పై చేయి అయితే వాడిది ‘న్యాయం’ అనే ఆటవిక వ్యవస్థతో దేశం నడుస్తున్నది. అందుకే ఒకే కేసుకు పలు తీర్పులు పలు కోణాల్లో వెలువడుతున్నాయి.
కొన్ని సమస్యలకు సరైన చట్టాలు లేనందువలన, కోర్టులు ఇచ్చే తీర్పులతో ‘న్యాయం’ ఏర్పడుతున్నది. పరిస్థితిని బట్టి న్యాయం మారుతున్నది, కానీ, హక్కు మాత్రం ఏర్పడటం లేదు. హక్కులు దిక్కులు లాంటివి, అవి మారవు. సమగ్ర, సహేతుక చట్టాలు లేని సందర్భాలలో కోర్టులు పార్లమెంట్‌కు కేసులను రిఫర్ చేస్తూ శాసనాలు అవసరం అని తెలియచేయడం లేదు. శాసన వ్యవస్థకు బదులు చాలా సందర్భాలలో ‘ప్రభుత్వాన్ని’ న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్నాయి. మరి ప్రభుత్వమే ‘పాలనా అధికారంతో ఉన్న కొద్దిమంది కేబినెట్’గా మారిపోయింది కదా. మన రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం, నాయకత్వ నిర్మాణం లేవు. వ్యక్తి పూజ, వ్యక్తి స్వామ్యం ఎన్నికల తంతు తరువాత ప్రభుత్వంలోకి చేరి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. నిజమైన ప్రజాస్వామ్య పార్టీ విధ్యుక్త ధర్మం ప్రజలకు అవసరమైన పనులను చేస్తూ గుర్తింపుపొంది తరువాత ప్రజల ఆమోదంతో అధికారంలోకి రావడమే కాదూ? ఇందుకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు మందిని పోగేసుకుని, ఎవరి ప్రయోజనాలను వారు సాధించుకునే ఆశయంతో ఒక ముఠా మీద మరొక ముఠా కుట్రలు కుతంత్రాలు చేసుకుంటున్నాయి. ఏమి చేస్తే పై చేయి అవుతుందో అవన్నీ చేస్తూ అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ దేశాన్ని నాశనం చేస్తున్నాయి.
ఈ ముఠాల స్వప్రయోజన అపేక్షలకు ఒక ఉదాహరణ 75 సంవత్సరాల తరువాత కూడా కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల ‘కరువు భత్యం’. బ్రిటిష్ వలస పాలకులు తమ ఉద్యోగులకు, సమాజంలోని మిగతా వారి కన్నా అత్యధికంగా డబ్బు అందుబాటులో ఉంచాలని సంకల్పించి, ‘కరువు భత్యం’ అనే ఆర్థిక సదుపాయాన్ని కల్పించారు. సంపదలను సృష్టించే ఆర్థిక కార్యకలాపాలతో సంబంధం లేనిది ఈ ‘కరువు భత్యం’. ఇంతకూ బ్రిటిష్ వాడి ఉద్యోగులు ఎవరు? భారతీయులే. భారత సమాజం ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా, భారతీయుల నుంచి వసూలు చేసిన పన్ను రాబడిని కొద్ది మంది భారతీయులకు ఆదాయ మార్గంగా ఏర్పాటుచేశారు! ఇప్పటికీ కొనసాగుతోన్న ఇలాంటి అవకతవకలు దేశంలో కోకొల్లలు. ముఠాల ప్రయోజనాల కోసం ఇలాంటి దోపిడి పనులు భారత్‌లో ప్రతినిత్యం జరుగుతూ ఉన్నాయి. మరి మన భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎప్పటికైనా నిర్మాణమవుతాయా?
కొడాలి ఏకాంబరరావు