‘కొత్త రాజ్యాంగం’ జరగాల్సిన చర్చే!

ABN , First Publish Date - 2022-03-23T06:03:02+05:30 IST

విభిన్న భాషా సంస్కృతులతో జీవిస్తున్న మన దేశ ప్రజల మనోభావాలకు విశ్వాసాలకు విఘాతం కలగని రీతిలో ప్రభుత్వాలు వ్యవహరించాలని రాజ్యాంగం చెప్పింది. అందువల్లనే అన్ని వర్గాల ప్రజలు రాజ్యాంగాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు...

‘కొత్త రాజ్యాంగం’ జరగాల్సిన చర్చే!

విభిన్న భాషా సంస్కృతులతో జీవిస్తున్న మన దేశ ప్రజల మనోభావాలకు విశ్వాసాలకు విఘాతం కలగని రీతిలో ప్రభుత్వాలు వ్యవహరించాలని రాజ్యాంగం చెప్పింది. అందువల్లనే అన్ని వర్గాల ప్రజలు రాజ్యాంగాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపైన మతతత్వ వైఖరులను రుద్దడం మొదలుపెట్టారు. ఏకరూపత పాటించాలని ప్రజలపై మానసికమైన, భౌతికమైన దాడులు మొదలయ్యాయి. పౌరసత్వం, ఆహార నియమాలు, దుస్తులు, ఏకరూప సంస్కృతి మాత్రమే ఉండాలని ప్రజలందరిపైన ఒత్తిడి తీసుకురావడంతో భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తి ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితుల్లో విభిన్న మతాల, జాతుల ప్రజలందరి ఆకాంక్షలను, సంస్కృతిని, జీవన విధానాలను పరిరక్షిస్తుంది అనుకున్న రాజ్యాంగంపైనే అనుమానాలు మొదలయ్యాయి.


గతంలో మత పునాదిగల రాజకీయ పార్టీలు తమ మతపరమైన కార్యక్రమాలను సంస్థాగతంగా నిర్వహించుకునేవి. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు వివిధ వర్గాల ప్రజల జీవనశైలిపై బహిరంగంగా దాడి చేయటం మొదలుపెట్టారు. దేశంలో సహజంగా జీవనం సాగిస్తున్న అనేక ప్రాంతీయ తెగలను, వారి సంస్కృతులు అనాగరికమైనవిగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన దేశ మేధావుల సహేతుకమైన స్వరాలను తమ సోషల్ మీడియా మంద బలంతో నొక్కి వేసినారు.


రాజ్యాంగ నిర్మాతలు మన దేశాన్ని పరిపాలనాపరమైన సమాఖ్యగా ఏర్పాటు చేశారు. కానీ సిద్ధాంతపరమైన సమాఖ్యగా ఏర్పాటు చేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను నెలకొల్పాల్సిన ఆవశ్యకతను రాజ్యాంగ నిర్మాతలు గ్రహించారు. రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా ప్రయోగించలేదు. అయినప్పటికీ భారతదేశం సమాఖ్య స్ఫూర్తితోనే కొనసాగుతున్నది. సమాఖ్యలో అత్యంత ముఖ్య లక్షణం అధికారాల విభజన. 7వ షెడ్యూల్‌లో కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాల మ‌ధ్య మూడు రకాలుగా అధికారాలను విభ‌జించారు. దేశంలో కేంద్రానికి ఎక్కువ, రాష్ట్రాలకు తక్కువ అధికారాలు కేటాయించారు. ఉమ్మడి జాబితాలోని అంశాలపై పరోక్షంగా కేంద్రానిదే పైచేయి. విశిష్టాధికారాలు కేంద్రానికి సంక్రమించడం వలన రాష్ట్రాలకు కొన్ని సందర్భాలలో పరిపాలనా పరమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సంస్కరించాల్సిన ఆవశ్యకత కనిపిస్తున్నది.


రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వాఖ్యలను ఈ నేపథ్యం నుంచే చూడాలి. అంటే కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న అంశాలను పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా రాష్ట్రాల అధికారాలను హరించటానికి ప్రయత్నిస్తూ వివిధ దశల్లో చట్టాలు చేస్తూ వస్తున్నది. తెలంగాణ పరిధిలోని అంశాలనే పరిశీలిస్తే– ముందుగా విభజనానంతరం కొత్త రాష్ట్రాలకు ఇవ్వాల్సిన‌ నిధులను ఎగ్గొట్టారు, రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులకు సహాయాన్ని నిరాకరించారు, రాష్ట్రాల పరిధిలోని అంశమైన వ్యవసాయాన్ని తమ పరిధిలోనికి తీసుకుంటూ రైతు చట్టాలను చేశారు (తర్వాత రైతుల ఉద్యమాల వల్ల వెనక్కు తీసుకున్నారు), విద్యుత్ రెగ్యులేటరీ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రాల విచక్షణాధికారాలు లాకున్నారు. అలాగే తెలంగాణకు నష్టం చేసేలా గోదావరి, కృష్ణ నదీపరివాహక బోర్డులను ఏర్పాటు చేశారు. డ్యామ్ సేఫ్టీ బిల్ తీసుకొచ్చి రాష్ట్రాల పరిధిలో ఉన్న నీటి పారుదల శాఖలోని ముఖ్యమైన ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం ఆధీనంలోకి తీసుకున్నారు. రాష్ట్రానికి తలమానికమైన సింగరేణి కాలరీస్‌ను రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా ప్రైవేటీకరణకు ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వరంగ సంస్థలను ఎటువంటి సంప్రదింపులు లేకుండా ప్రైవేట్‌పరం చేస్తున్నారు. జీఎస్టీ తెచ్చి రాష్ట్రాలను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు.


1989 తర్వాత జాతీయ రాజకీయాలను ప్రాంతీయ పార్టీలు కూడా శాసిస్తున్నాయి. ఆ తర్వాతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, లేదా వాళ్ళ భాగ‌స్వామ్య పార్టీల‌తో క‌లిసి అధికారంలో ఉన్న రాష్ట్రాల‌కే మేలు చేసేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేయటం, ప్రాజెక్టులు మంజూరు చేయటం మొదలైంది. ప్రాంతీయ ‌పార్టీలు సహజంగానే ఈ వివ‌క్షపూరిత వైఖరిపై కేంద్రాన్ని నిల‌దీస్తున్నాయి. రాజ‌కీయంగా జాతీయ, ప్రాంతీయ‌పార్టీల మ‌ధ్య వైరుధ్యాలు త‌లెత్తిన‌ప్పుడు పెద్దన్న పాత్రను పోషించాల్సిన కేంద్రం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను అస్థిర‌పరిచే చర్యలు చేపట్టడం కూడా ఇటీవ‌ల కాలంలో ఎక్కువైంది. దీంతో తమ మ‌నుగ‌డ ప్రశ్నార్థకం అవుతున్నదనే అభద్రతా భావంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ ‌పార్టీల నేత‌లు ఒక్కతాటిపైకి వస్తున్నారు. ఈ పరిస్థితులను కల్పించింది కేంద్రమే!


1964 వరకు జవహర్‌లాల్ నెహ్రూ దేశ పరిపాలనాధికారాన్ని చెలాయించారు. ఆయనను ప్రశ్నించే స్థాయి గల నాయకులు అరుదుగా ఉండటంతో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు బాగానే కొనసాగాయి. కానీ, 1980 తర్వాత జరిగిన ఎన్నికల్లో క్రమంగా అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాజ్యాంగంలోని కేంద్రీకృత ధోరణిని ప్రశ్నించటం మొదలుపెట్టాయి. నాటి నుంచి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల్లో విభేదాలు ప్రారంభమయ్యాయి. పశ్చిమబెంగాల్లోని వామపక్ష ప్రభుత్వం, పంజాబ్ లోని అకాళీదళ్ ప్రభుత్వం, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో రావాల్సిన మార్పుల గురించి ప్రస్తావించాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో వ్యత్యాసాలు తీవ్రతరమయ్యాయి. 1987లో జరిగిన ఎన్నికల్లో ఎనిమిది రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం కేంద్ర ఆధిపత్య ధోరణి క్షీణించటానికి కారణమైంది. కేంద్ర ఆదాయవనరులు ఎక్కువగా ఉండటం, రాష్ట్రాలు నేరవేర్చాల్సిన బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రాల్లో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయపరమైన విభేదాలు చెలరేగి కేంద్ర రాష్ట్ర సంబంధాల‌పై ప్రభావం పడింది. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీల నేత‌ల మాట‌లు చూస్తే దీనికి బ‌లం చేకూర్చిన‌ట్టే ఉంటున్నాయి.


కేంద్ర ప్రతినిధులుగా రాష్ట్రాల్లో నియమితులైన గవర్నర్లు కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రాల పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఇటీవ‌ల పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రుల విమ‌ర్శ కూడా ఇదే. ఈ వ్యవహారం కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ప్రభావం చూపుతున్నది. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను తరచూ రద్దు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడటం కూడా కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సంస్కరించాల్సిన ఆవశ్యకతను సూచిస్తున్నది.


కొత్త రాజ్యాంగం కావాలన్న కేసీఆర్ వ్యాఖ్యల వెనుక రాజకీయ కారణాలను మాత్రమే చూడలేం. ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాలని ప్రతిపాదించారు. దేశ ప్రజలందరి దృష్టిని తన వైపు తిప్పుకోగలిగారు. కానీ ఇది ఒక వ్యక్తిగత రాజకీయ ప్రయోజనానికి మాత్రమే పరిమితమైన విషయం కాదు. ఈ చర్చలో వివిధ ప్రాంతాల, జాతుల ఆత్మగౌరవం, సాంస్కృతిక వైవిధ్యం, స్థానిక ప్రజల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. సమాఖ్య స్ఫూర్తి దెబ్బతిన్నదనే విషయాన్ని దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. దానికి కొనసాగింపుగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే వందల సవరణలకు గురైన భారత రాజ్యాంగానికి భవిష్యత్తులో మరికొన్ని సవరణలు జరగడం సహజం, ఒకవిధంగా అవసరం కూడా.


వివిధ సంస్కృతులను కించపరచడం, వ్యక్తిగత దూషణలు, మెజారిటేరియన్ ప్రయోజనాల గురించి మాత్రమే మాట్లాడే సిద్ధాంతాలు ఈ దేశాన్ని ఐకమత్యంగా ఉంచలేవు. బీజేపీ ప్రచారం చేస్తున్న రామరాజ్యం కంటే, అంబేడ్కర్ ప్రవచించిన ధర్మపాలితమైన సమాజం కోసం సంస్థాగతమైన వ్యవస్థలు నిర్మితం కావాలి. ఇదే దేశ ప్రజలంతా కోరుకొంటున్నది.

ఎర్రోజు శ్రీనివాస్

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వికాస సమితి

Read more