దళిత ఆత్మగౌరవ ‘భూమి’క

ABN , First Publish Date - 2022-06-10T07:44:22+05:30 IST

సుఖ సంతోషాలలో ఉన్నవారికి సమాజంలో రాజకీయ పరిణామాలలో నిమగ్నత తక్కువగా ఉంటుంది. నిత్యం జరుగుతున్న అన్యాయాలు రాజకీయ హక్కుల విలువను సామాన్యులకు ఎరుక చేస్తాయి...

దళిత ఆత్మగౌరవ ‘భూమి’క

‘విద్య మన భవిష్యత్తు, 

భూమి మన వర్తమానమూ భవిష్యత్తూ..’

డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ 


సుఖ సంతోషాలలో ఉన్నవారికి సమాజంలో రాజకీయ పరిణామాలలో నిమగ్నత తక్కువగా ఉంటుంది. నిత్యం జరుగుతున్న అన్యాయాలు రాజకీయ హక్కుల విలువను సామాన్యులకు ఎరుక చేస్తాయి. భారతదేశంలో శ్రమజీవుల్ని సంఘటితపరచడంలో దళిత వర్గాలు గొప్ప పాత్రను నిర్వహించవలసివుంది, నిర్వహించగలవు కూడా. 19వ శతాబ్ది ఇంగ్లండులో చార్టిస్టు ఉద్యమాన్ని అధ్యయనం చేసిన గామేజి అనే విజ్ఞుడు ఇలా అన్నారు: ‘సాంఘిక చైతన్యం రాజకీయ ఉద్యమానికి ఊపిరి. సాంఘిక భూమి లేనిదే రాజకీయ ఉద్యమం ఉద్భవించదు’. అప్పుడు మన దేశంలో భూమి విషయంలో పెరుగుతోన్న చైతన్యం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.


భారతీయ ఆర్థిక వ్యవస్థకు అనాదిగా వ్యవసాయమే ఆధారం. వ్యవసాయ రంగంలో సంస్కరణల ఆవశ్యకతను ఆధునిక భారతదేశం గుర్తించింది. అంతేకాదు, అభివృద్ధికి అది ముందస్తు షరతు అనే సత్యాన్ని గ్రహించింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర భారతదేశం కౌలుదారీ చట్టం, భూ సంస్కరణల చట్టం, భూమి గరిష్ఠపరిమితి చట్టం తదితర పలు సంస్కరణలను ప్రవేశపెట్టింది. అయితే వాటి లక్ష్యం పూర్తిగా నెరవేరకముందే వ్యవసాయ రంగానికి సంబంధించిన విధాన ప్రాధాన్యాలన్నీ పూర్తిగా విలుప్తమయ్యాయి. తత్ఫలితంగానే దళితులు, అణగారిన వర్గాలు, గిరిజనుల్లో భూ హక్కుల చైతన్యం పెరిగింది. భూమిని కలిగి ఉండే హక్కును వారు డిమాండ్ చేస్తున్నారు. దళితులు, ఆదివాసీల దృష్టికోణంలో భూమి కేవలం జీవనాధార వనరు మాత్రమే కాదు, కోల్పోయిన గుర్తింపును, ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించుకునే ఆసరా కూడా. ఆ వర్గాల ఆరాటాలు, పోరటాల్లోనే కాదు, విద్యా వ్యాసంగాల్లో కూడా భూమికి కీలక ప్రాధాన్యం లభిస్తోంది. అయినా క్షేత్రస్థాయిలో పేదరికం అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి.


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ దళితుల భూసమస్య పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చారు. కష్టజీవుల పొట్టలు కొట్టే భూస్వామ్య వ్యవస్థలోని స్వాభావిక బలహీనతలను ఆయన ఎత్తిచూపారు. సైమన్‌ కమిషన్‌కు కాంగ్రెస్‌ నిరసన తెలుపుతుండగా, అంబేడ్కర్‌ నేరుగా కమిషన్‌ సభ్యులతో సమావేశమయ్యారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని దళిత భూసమస్యకు ప్రత్యేక పరిష్కారం చూపాలని ఆ కమిషన్‌కు ఆయన ఒక విజ్ఞాపన ఇచ్చారు. ‘విద్య మన భవిష్యత్తు భూమి మన వర్తమానము భవిష్యత్తూ...’ అని 1930లో ఓ సభలో దళితులకు ఆయన ప్రబోధించారు. 1931లో లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలోనూ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలతో పాటు వారి భూసమస్యను పరిష్కరించాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు. 1936లో ఆయన స్థాపించిన ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ (ఐఎల్‌పీ) భూస్వాముల కబంధ హస్తాల నుంచి వ్యవసాయ కూలీలను విముక్తం చేయడాన్ని ప్రధాన కర్తవ్యంగా నిర్దేశించుకుంది. భూమిలేని వ్యవసాయ కూలీల అభ్యున్నతి లక్ష్యంగా వ్యవసాయ రంగంలో సత్వరమే సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేసింది.


దేశ జనాభాలో 77 శాతం గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తుండగా, వారిలో 58 శాతం వ్యవసాయ కూలీలు ఉన్నట్లు 2001 జనగణన వెల్లడించింది. దేశీయ స్థూల ఉత్పత్తిలో 1970–71 నాటికి వ్యవసాయరంగ వాటా 46 శాతం. 2004–05 నాటికి అది 21 శాతానికి పడిపోయింది. ఈ మధ్య కాలంలో దళితుల పరిస్థితి మరింత ఘోరంగా తయారయింది. దళితుల్లో పేదరిక స్థాయి సాపేక్షంగా 36 శాతం నుంచి 40 శాతానికి పెరిగింది. మొత్తం వ్యవసాయ భూమిలో దళితుల సాగుబడిలో ఉన్న మెట్ట లేక కొంత నీటి వసతి గల భూమి 18 శాతం మేర ఉన్నట్టు అంచనా వేశారు. నిజానికి దళితులలో సాగుదారులు కేవలం 11 శాతం మాత్రమే. సాగునీటి వసతి గల భూమి సొంతదారులకే వ్యవసాయ శాఖ పలు పథకాలను అందిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ప్రణాళిక క్రింద వ్యవసాయ రంగానికి కేటాయించిన 18 శాతం నిధులను పూర్తిగా దళితుల సంక్షేమానికే వ్యయం చేయవలసిన అవసరం మిక్కిలిగా ఉంది. ఇది జరిగినప్పుడు మాత్రమే దళితుల జీవితాల్లో సార్థకమైన మార్పులు సంభవిస్తాయి.


అహేతుకమైన కుల కట్టుబాట్ల కారణంగా దళితులు తరతరాలుగా భూమికి, దాన్ని దక్కించుకునేందుకు గల అవకాశాలకు దూరమయ్యారు. ఈ వివక్ష, అణచివేతల నుంచి వారికి విమోచన కలిగించేందుకు భూ సంస్కరణల చట్టాలను శీఘ్రగతిన అమలుపరచాలి. దళితులకు సాగుయోగ్య భూమిని కేటాయించాలని, సమాన స్థాయిలో భూసంస్కరణలను అమలు చేయాలని కోరుతూ 1916లోనే సౌత్‌ బరో కమిటికి అంబేడ్కర్‌ ఒక విజ్ఞాపన అందించారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు రాకుండా ఆర్థికాభివృద్ధిని సాధించలేమని 1918లో ఆయన తెగేసి చెప్పారు. భూమినంతా కొద్ది మంది చేతుల్లో పెట్టే భూస్వామ్య వ్యవస్థను ఆయన గర్హించారు. ఎంతగా గర్హించారంటే జలియన్‌వాలాబాగ్‌ ఊచకోతల కన్నా జీవన వనరుల నుంచి, భూమి నుంచి దళితులను దూరం చేయడమే దారుణాతి దారుణమని 1919లో దురాగతం సంభవించినప్పుడు అంబేడ్కర్‌ అభిప్రాయపడ్డారు. 


స్వతంత్ర భారతదేశంలో భూములు సాగు చేస్తున్న కౌలుదార్లకు శాశ్వత యాజమాన్యం కల్పిస్తూ పట్టాలు మంజూరు చేశారు. అయితే ఇదేమీ భూస్వామ్య వ్యవసాయ సంబంధాల్లో మౌలిక మార్పులు తీసుకురావడానికి చేసిన పనేమీ కాదు. ప్రభుత్వానికి, సాగుదారుకు మధ్య దళారుల్లో మారి ఖజానాను కొల్లగొడుతున్న జమీందారీ వ్యవస్థను రద్దుచేసి రాబడిని పెంచుకునేందుకు భూపాలన వ్యవస్థలో చేసిన మార్పులూ చేర్పులు మాత్రమే. సమాజంలోని అన్ని వర్గాలకూ ప్రత్యేకించి భూమి లేని దళితులకు భూమిని సరి సమానంగా పంపకం చేయాలనే ఆలోచన లేనేలేదు. జమీందార్ల నుంచి కొంత భూమిని తీసుకుని సాగుచేసుకుంటున్న వర్గాలకు మాత్రమే శాశ్వత భూశిస్తు విధానం కింద పట్టాలు మంజూరయ్యాయి. దోపిడి అణచివేతల నుంచి దళితులకు విముక్తి లభించినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రమని అంబేడ్కర్ వ్యాఖ్యానించారు. నిజాం నవాబు తమకు ఇచ్చిన భూములు దురాక్రమణకు గురయ్యాయంటూ 1948లో హైదరాబాద్‌ రాష్ట్ర దళితులు అంబేడ్కర్‌కు విన్నవించారు. ఆయన చేసిన కృషి ఫలితంగా అన్యాక్రాంతమైన భూమి తిరిగి దళితుల సొంతమైంది. గ్రామీణ పేదరిక నిర్మూలనకు భూ సంస్కరణలు అనివార్యం. చిన్నకారు, సన్నకారు కమతాల్లో ఎటువంటి సాగు పద్ధతి అనుసరణీయం అనేది పరిశీలించడానికి కూడా భూ సంస్కరణల వల్ల వీలవుతుంది. దళితులకు భూ పంపీణీ జరగకుండా ఈ దేశంలో ఆర్థిక సామాజిక సమానత్వం సంభవించదు. 

బత్తుల వీరాస్వామి

అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు

Updated Date - 2022-06-10T07:44:22+05:30 IST