సృజన వ్యక్తిగతం, విమర్శ సామాజికం!

ABN , First Publish Date - 2022-04-25T06:29:17+05:30 IST

ఈ పదాలు విన్నంతనే స్ఫురణకి వచ్చేది సాహిత్యం. సరళంగా ఆలోచిస్తే అంతవరకే స్ఫురిస్తుంది. కాని లోతుగా ఆలోచిస్తే అవి సాహిత్యానికి పరిమితమైన పదాలు కావని తెలుస్తుంది...

సృజన వ్యక్తిగతం, విమర్శ సామాజికం!

ఈ పదాలు విన్నంతనే స్ఫురణకి వచ్చేది సాహిత్యం. సరళంగా ఆలోచిస్తే అంతవరకే స్ఫురిస్తుంది. కాని లోతుగా ఆలోచిస్తే అవి సాహిత్యానికి పరిమితమైన పదాలు కావని తెలుస్తుంది. అంతేకాక, మానవ సమాజంలో అనాది కాలం నుంచి నేటి వరకూ సాగిన, అత్యంత కీలకమైన మానవ కార్యకలాపం దృగ్గోచరమవుతుంది. 


అనాది మానవుని నాటికి సృజన ఏమిటి? ప్రపంచం సరళంగా, గుంపు బతుకులు సహజాతంగా ఉండే రోజులవి. ఆనాడు అసలు సృజన అనేది ఉందా? ఉంది.


తన చుట్టూ ఉన్నదానిని మనిషి చూస్తాడు. వింటాడు. స్పర్శిస్తాడు. ఆఘ్రాణిస్తాడు. రుచి చూస్తాడు. అప్పుడు ఆ మనిషిలో ఒక కదలిక కలుగుతుంది. దానిని మరొకరితో పంచుకోవాలన్న ఆరాటం కలుగుతుంది. అప్పుడు అతని ముందు ఒక కార్యం ఉంది. ఒక లక్ష్యం ఉంది. చూసింది చూపించాలి. విన్నది వినిపించాలి. తాకినది తాకించాలి. మూజూసినది మూజూపించాలి. రుచిని రుచింపజెయ్యాలి.


అప్పుడతను చేసింది సృజన.


అనాది మానవునికి తొలి సాధనం దేహమే. దేహాంగాల కదలికే. గొంతుతో చేసే శబ్దాలే. ఈనాడు మనం సోషల్‌ మీడియా అనేదీ- లేదా సంబంధ సాధనం లేదా కమ్యూనికేషన్‌ మాధ్యమం- ఇవన్నీ నాడు దేహం మాత్రమే.


ఆనాడు అతన్ని కదిపిందీ, మరొకరికి చెప్పాలనిపించిందీ ఏమిటి? చెట్లూ, పుట్టలూ, పశువులూ పక్షులూ, సూర్యచంద్రులూ, ప్రాణరక్షణా, ఆహార సేకరణా. సూర్యుని అందం, రాత్రి భయానకం, ఒకనాడు వాన మరోనాడు ఎండ. ఒకరోజు చలి మరోరోజు వేడి. ఒక తియ్యని పండు మరొకటి పులుపు కాయ.


వీటితో అతను చేసిన ప్రముఖ సృజనలు ఏమిటి? రుచులు, రక్షణ, ఆనంద విషాదాలు. వీటికి మూలం ఏమిటి? ఈ ప్రశ్నకి అతను చేసుకున్న సృజన- దైవం. రక్షకుడు. కోపగించేవాడు. శిక్షించేవాడు.


వీటికి భావప్రసార సాధనాలు ఏమిటి? కంటిచూపు, చేతుల వేళ్ల కాళ్ల కదలికలు, నోటి శబ్దాలు, ముఖ కవళికలు. చెపుతాడు లేదా భావాన్ని వ్యక్తం చేస్తాడు. తర్వాత అరుపులకి నిశ్చితార్థాలు ఏర్పడ్డాయి. నోటిలో పెదాలు, నాలుక కదలికలని అంగుడికి, నోట్లో వివిధ భాగాలకి, పళ్లకీ తాకించుతూ గొంతు నుంచి చేసే శబ్దాలలో వైవిధ్యాన్ని కనుగొంటాడు. క్రమబద్ధీకరణ చేస్తాడు. అది భాషకి దారి తీసింది. కదలికలకి తూగు, లయ చేరాయి. నృత్యం అయింది. చిత్రం ద్వారా భావప్రసార ప్రయత్నాల నుంచి లిపి పుట్టింది.


ఇవన్నీ ఏమిటి?

అభివృద్ధి చెందిన భావప్రసార సాధనాలు.

ఈ సాధనాల అభివృద్ధికి కారణం వ్యక్తిలోని ఆ కదలికయేనా? సృజనయేనా? కాదు. 

మనిషి తన కదలికను, తన భావాన్ని ఎవరితో పంచుకుంటాడు? తోటి మనిషితో. గుంపులోని మనుషులతో. అంటే పలువురితో. సూర్యుడు, చెట్టు, పిట్ట అన్న శబ్దాలకు నిశ్చితార్థాల అవసరం ఎందుకు వచ్చింది? ఎవరికి వచ్చింది? ఒంటరి మనిషికి ఆ అవసరం లేదు. అది గుంపుకి అవసరం. 

ఆ అవసరం నుంచే మరో కార్యం ఆరంభమయింది. అదే విమర్శ. 

సృజనని వినియోగించుకుని దానిని మరింత వేగంగా అది అందరికీ అందే విధంగా క్రమబద్ధీకరణ చేయటమే విమర్శ. సృజనని వర్గీకరణ, క్రోడీకరణ, క్లుప్తీకరణ, సారాంశీకరణ చేసి ఒక సామాజిక ఒడంబడికని చేయటం విమర్శ తత్వం.

ఈ రెండు కార్యాలూ కలిస్తేనే మానవ అభివృద్ధి. కలిసి పని చెయ్యటానికి అత్యంత అవసరం భావప్రసారం. అది భావప్రసార సాధనాలను పెంచింది. మానవ అభివృద్ధికి సంకేతం భావప్రసార సాధనాల పెరుగుదల.


సాధనాలు పెరిగాయి. భాష వచ్చింది. అది వ్యక్తికి జరిగిన ఘటనని పంచుకునీ, జ్ఞాపకం ఉంచుకునే సులువు నేర్పింది. ఆ జ్ఞప్తి ఉంచుకునే అవసరం నుంచి లిపి వచ్చింది. జ్ఞప్తిలో ఉన్నదాని నుంచి కొత్త కదలిక వ్యక్తికి కలిగింది. దానిని వినియోగంలో పెట్టి పనిని సులువుగా చేసే శక్తి వచ్చింది. చెట్టుకి కాయ కాస్తుంది. దాన్ని మనం తినవచ్చన్నది ఒక ఎరుక అయితే దాన్ని మనం కాయించవచ్చు అన్నది మరెంత కాలానికో వచ్చిన కదలిక. 


గుంపులు పెరిగాయి. గుంపుల మధ్య సంబంధాలు పెరిగాయి. వీటన్నింటిలోనూ సృజన, విమర్శ అనే రెండు కార్యక్రమాల సంగమం ఉంది. 


వ్యక్తికి కలిగిన ఊహని సమాజం మెచ్చుతుంది. మెరుగు పరచుతుంది. వాటితో బాటు ఖండిస్తుంది. వినకపోతే దండిస్తుంది. స్థిరీకరించటం తోబాటు నాశనం చేస్తుంది. ఈ బాహిర కార్యాలన్నీ విమర్శ అనే మౌలిక కార్యంలో భాగమే.


అంతేకాదు వ్యక్తికి కలిగే ఊహలు కూడా సర్వ స్వతంత్రమైనవి కావు. అతనికి ఎదురుగా ఉన్నది కేవలం ప్రకృతి కాదు. సమాజం. అభివృద్ధి క్రమంలో వ్యక్తి కదలికలకి కారకాలు విస్తరించాయి. కాని కదలిక అనే మౌలిక లక్షణం వ్యక్తికే పరిమితం. అంటే సృజన వ్యక్తికే పరిమితం. అతనిలో కదలికలకి ఎప్పుడైనా బాహిర ఘటనలే కారకం. రోగం, మరణం వంటి సాధారణ బాహిర ఘటనలే బుద్ధుడిని జ్ఞానాన్వేషణకి తరిమాయి. ప్రపంచ దుఃఖానికి కారణం కోరిక అన్న ఊహకి చేరినపుడు అదే అంతిమంగా ఆయన భావించాడు. మార్క్స్‌ ప్రపంచ దుఃఖానికి కారణం వర్గ సమాజం అన్న ఊహకి చేరాడు. అంటే సృజన వ్యక్తిగతమైతే, విమర్శ సమాజానికి చెందినది. సృజన, విమర్శ ఒక అవిచ్ఛిన్న కార్యక్రమం.

వివిన మూర్తి


Updated Date - 2022-04-25T06:29:17+05:30 IST