మతం మెలికతో రిజర్వేషన్లపై కుట్ర!

ABN , First Publish Date - 2022-12-10T01:25:22+05:30 IST

పాకిస్థాన్‌లాగా భారత్‌ మత గుర్తింపు గల దేశం కాదు. పాకిస్థాన్‌లో ముస్లింలు మాత్రమే దేశాధ్యక్ష పదవికి అర్హులు.

మతం మెలికతో రిజర్వేషన్లపై కుట్ర!

పాకిస్థాన్‌లాగా భారత్‌ మత గుర్తింపు గల దేశం కాదు. పాకిస్థాన్‌లో ముస్లింలు మాత్రమే దేశాధ్యక్ష పదవికి అర్హులు. భారత్‌ సెక్యులర్‌ దేశం. కుల మతాలతో సంబంధం లేకుండా భారతీయులందరూ అత్యున్నత పదవులను అనుభవించే అవకాశం గల లౌకిక దేశం కాబట్టే కె.ఆర్‌. నారాయణ్‌, అబ్దుల్‌ కలామ్, ద్రౌపది ముర్ము వంటివారు ఆ అత్యున్నత పదవిని అలంకరించగలిగారు.

మత గుర్తింపులేని భారతదేశంలో మనుషులందరూ సమానమని రాజ్యాంగం చెప్పింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన ప్రజలకోసం ప్రత్యేక సదుపాయాలను కల్పించింది. మతంతో సంబంధం లేకుండా ఇడబ్ల్యుఎస్‌, బీసీ, ఎస్టీ రిజర్వేషన్లను అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. కేవలం షెడ్యూల్డు కులాల విషయంలో మాత్రమే మత నియమం తీసుకొచ్చి దళితులకు రాజ్యాంగ ఫలాలు అందకుండా అడ్డంకిని సృష్టించింది. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను రాష్ట్రపతే దుర్వినియోగం చేస్తే రాజ్యాంగానికి ఎవరు భద్రత కల్పిస్తారు? 1950 ఆగస్ట్‌ 10న దేశ మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ తీసుకొచ్చిన ఉత్తర్వు దేశంలోని షెడ్యూల్డు కులాలవారిని హిందూ మతానికి అంటగట్టింది. ‘హిందూ మతానికి భిన్నమైన మతాన్ని ప్రకటించే ఏ వ్యక్తినీ షెడ్యూల్డు కులానికి చెందిన వ్యక్తిగా పరిగణించరాదు’ అని చెప్పిన ఈ ఉత్తర్వు షెడ్యూల్డు కులాల వారిని పెనం మీది నుంచి పొయ్యిలోకి నెట్టింది. దీని ప్రకారం అస్పృశ్యతకు, అంటరానితనానికి పుట్టినిల్లయిన హిందూ మతంలో ఉంటేనే ఎస్సీలుగా గుర్తింపు లభిస్తుంది. ఈ ఉత్తర్వు దళితులను బలవంతంగా హిందువులుగా ఉండేలా చేసింది. ఈ పరిస్థితి ఓసీ, బీసీ, ఎస్టీలలో ఏ ఒక్కరికీ లేదు. ఒక ఎస్సీ కులం కుటుంబంలో ఒకరు హిందూ మతాన్ని ఆచరిస్తే ఎస్సీగా, మరొకరు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తే బీసీగా, కులం పేరు చెప్పకుండా మతం ప్రకటిస్తే ఓసీగా, కులం పేరు చెప్పి మతం ప్రకటించుకుంటే మరొక కొత్త కేటగిరిలోనూ చేరవలసి ఉంటుంది. ఒకే కులంలోని ఒకే కుటుంబంవారిని వివిధ కేటగిరీల్లో చేర్చడం వల్ల వారి సామాజిక హోదాల్లో మార్పు వస్తుందా? మచ్చుకు ఒక్క ఉదాహరణ కూడా చూపడం సాధ్యం కాదు. కుల ప్రాతిపదికన సామాజిక హోదా, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి గానీ మత వివక్ష కాదు.

హిందూ మతంలోని దళితులకు అదే మతంలోని అగ్ర కులాల వారితో కంచం పొత్తు, మంచం పొత్తు కనబడదు. క్రైస్తవ మతంలో కూడా అంతే. మతం వ్యక్తి యొక్క అభిమతం. కులం పుట్టుకతోనే నిర్ణయించబడుతుంది. కులం మారదు అని భారత అత్యున్నత న్యాయస్థానం అనేక సందర్భాల్లో గుర్తు చేసింది. మతం మారవచ్చు. ఏ మతాన్ని స్వీకరించాలన్న విషయంపై ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉందని, హక్కులలో కెల్లా ముఖ్యమైనది స్వేచ్ఛా హక్కు అని, ఈ హక్కు రాజ్యాంగానికి ఆత్మ వంటిదని జస్టిస్‌ సిక్రి అభివర్ణించాడు. పౌరులకు మత హక్కును కల్పించిన ఆర్టికల్‌ 25లో కులం గురించి మాట్లాడలేదు. అంతరాత్మ ప్రబోధానుసారం మత విశ్వాసాలను కలిగి ఉండటం, అనుసరించడం, ప్రకటించుకునే హక్కు గురించి ఆర్టికల్‌ 25 చెప్పింది. అదే విధంగా షెడ్యూల్డు కులాల, తెగల రక్షణ, అభ్యున్నతి గురించి ఏర్పాటు చేసిన ఆర్టికల్‌ 338– 340లలో మత సంబంధ విషయాలతో ముడి పెట్టలేదు.

భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 16 ప్రకారం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థానాలను బట్టి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పనిచేయటానికి అర్హత లేని వారని చెప్పి తారతమ్యాలు చూపరాదు. 1950 ఆగస్టు 10వ తేదీన వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. హిందూ మతం కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు ఎస్సీలుగా గుర్తించబడరు అంటే అది మతపరమైన వివక్షే. ఆర్టికల్‌ 17 నిషేధించిన అంటరానితనం కొనసాగుతూనే ఉన్నది.

ఎంక్వైరి కమిషన్‌ అధ్యక్షులు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.జి. బాలకృష్ణన్‌ను గత నెల 20న పిఎఎఫ్‌ ఇండియా బృందం కలిసి చర్చించినపుడు క్రైస్తవ మతంలో కులం లేదు కాబట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించేవారిని ఎస్సీలుగా గుర్తించలేమని అన్నారు. 75 ఏండ్ల స్వతంత్ర దేశంలో దళితులకు మాత్రమే నిరాకరించిన స్వేచ్ఛా హక్కుకు దళితుడైన బాలకృష్ణన్‌ ద్వారా న్యాయం జరుగుతుందన్న ఆశలు ఆవిరవుతున్నాయి. సమానతను చాటి చెప్పిన బౌద్ధం, సిక్కుమతాల్లో సాంకేతికంగా కులం లేదు. వారిని కూడా షెడ్యూల్డు కులాలుగా భారత ప్రభుత్వం గుర్తించింది. క్రైస్తవంలో కులం లేదనడం హాస్యాస్పదంగా ఉంది. క్రైస్తవ మతంలో కులం లేకపోవచ్చుగానీ దేశంలో కులం ఉన్నదన్న చారిత్రక సత్యాన్ని విస్మరించరాదు. దళిత కులం వారికి ఏ మతంలో ఉన్నా అగ్రకులాలతో నివాసం గాని, వివాహం వంటి కార్యక్రమాల్లోకి, గ్రామంలోకి ప్రవేశం గాని లేదు. క్రైస్తవులుగా మారిన అగ్రకులం వారికి కూడా దళితులతో సామాజిక, సాంస్కృతిక సంబంధాలు లేవు. కారంచేడు హత్యాకాండలో కుల వివక్షకు బలైన దళితులందరూ చర్చికి వెళ్లేవారే. కేథలిక్ సమాజంలో దళిత వివక్ష ఉన్నదని, ఈ వివక్షను రూపుమాపడం కేథలిక్కుల కర్తవ్యమని పోప్‌ ప్రకటించి ప్రత్యేక దళిత పాలసీని రూపొందించారు. ఇటువంటి చారిత్రక సత్యాలను పక్కన బెట్టి హిందూ మతానికి పల్లకీ కట్టడం కోసం దళితులను దళితులు కాదని చెప్పడం, స్వేచ్ఛకు సంకెళ్ళు వేయడమే. దక్షిణ భారతదేశంలోని 90 శాతం దళితులు చర్చికి వెళ్తారు. ఆ కారణంగా వీరందరికీ ఎస్సీ కోటా తొలగిస్తే, రిజర్వేషన్లు శాశ్వతంగా వాటంతటవే రద్దయిపోతాయి. దీనివల్ల అసెంబ్లీ, పార్లమెంటు, పరిపాలన యంత్రాంగంలో దళితులకు అడ్డుకట్ట వేయవచ్చు. ఈ కుట్రలకు మసిపూసి హిందూమతంలోని దళితులను చర్చిలకు వెళ్లే దళితుల మీదకు రెచ్చగొడుతున్నారు. దీనివల్ల దళితులందరు రిజర్వేషన్లు కోల్పోయి వారి ప్రాతినిధ్యమే శూన్యమయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి. కాబట్టి ఈ కుట్రకోణాలను పసిగట్టి అందరం ఒక్కటై దళితుల మెడకు బిగించిన ఉచ్చును తొలగించుకుని స్వేచ్ఛాజీవులుగా రూపొందడానికి పోరాడాలి.

నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ రెలిజియస్‌ అండ్‌ లింగ్విస్టిక్‌ మైనారిటీస్‌ 2007 నివేదిక, 16–17 సిఫారసుల్లో షెడ్యూల్డు కులాల మీద మతపరమైన వివక్ష చూపరాదని, దేశమంతటా కులం వ్యాపించి ఉందని, 1950లో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వు పేరా (3)ను తొలగించాలని, షెడ్యూల్డు కులాలలోని ముస్లింలు, క్రిస్టియన్‌లు, జైనులు, పారసీలకు నిరాకరించిన షెడ్యూల్డు కులాల హోదా గుర్తింపును మత సంబంధం లేకుండా వర్తింపజేయాలని జస్టిస్‌ మిశ్రా కమిషన్‌ సిఫారసు చేసింది. దీన్ని అమలు చేసి దళితులందరికీ మతంతో సంబంధం లేకుండా, సమాన హోదా, సమాన అవకాశాలు కల్పించాలి. ఇదే రాజ్యాంగ సంకల్పం.

పులుగుజ్జు సురేష్‌

అధ్యక్షులు, పి.ఎ.ఎఫ్ ఇండియా

Updated Date - 2022-12-10T01:25:23+05:30 IST