రెండు పాయల రంగులు

ABN , First Publish Date - 2022-12-05T00:19:03+05:30 IST

రెండు పాయల రంగులు తలలోకి కొన్ని రంగుల్ని మోసుకొచ్చింది రాత్రి కనురెప్పల కింద నిద్ర...

రెండు పాయల రంగులు

రెండు పాయల రంగులు

తలలోకి కొన్ని రంగుల్ని

మోసుకొచ్చింది రాత్రి

కనురెప్పల కింద నిద్ర

దాగుడు మూతలాడుతుంది

రెప్పలు మూతపడుతున్నప్పుడే

లేత నలుపు కాంతిలో

నిద్ర రంగును చూసిన

రంగులు మారుస్తూ కలలొచ్చినయి

అప్పుడే మోటకొడుతున్న

మూసలోని సుట్ట మీద

మూలసుక్క రాలిపడ్డది

గుండె మీద బరువు దిగుతున్నట్టు

ఏటవాలుగా మోటదిగింది

బొక్కనెంట కండ్లెంట

నీళ్లు కలిసే వొచ్చినయి

కడుపు నిండ కన్నది

కంటి నిండా ఏడ్చింది

కామంచి పెయ్యంతా

కన్నీటి చారల రంగు

కాళ్ల కడియాలని కరిగించిన

కరువు రంగు

మెడ గుండ్ల మీద మెరిసిన

కన్నీళ్ల తాపడం

ఏండ్లంటా తిరిగి ఏండ్లంటా పాయే

ఎనక్కీ ముందుకి చూసింది

ఏమి లేదు

సూరులో చెక్కి పోయిన దుఃఖం

సుట్టకుదురు మీదికి వొచ్చింది

ఋతువులు అనువదించిన

రెండు పాయల రంగులు

ఎక్కిల్ల ముందు ఎక్కిల్ల తరువాత

దినం కొలుపు చెప్పింది

ఈ రోజును తనదే అనుకున్నదేమొ ఆత్మ

మసక వెలుగులో చీకటిని విప్పిన

వేకువ అందాన్ని చూసింది

పక్షుల హడావుడి

అంతా ఇంతా కాదు

గుబురు చెట్ల వెనుక

పొద్దును పొడిచి

కిరణాలుగ బాపినయి

పూలు మెరిసి

తుమ్మెదలకు తలలూపినయి

సాయంత్రాన్ని ఖాలీ చేస్తుంటే

పశువులు పచ్చులు

తీరొక్క జీవుల ఉరుకులాట

పొద్దును దాటిపోతున్నట్టు

ఏడికి పోతుందో పక్షి

దేన్ని కలుస్తుందో

దేన్ని జార విడిచి

దేన్ని మోసుకొస్తుందో కాని

ఉరుములు మెరుపులతో

రేపు ఆకాశపు రంగులో

పక్షి ఎగిరొస్తుందని

చెట్ల ఆకుల గుస గుస.

మునాసు వెంకట్‌

99481 58163

Updated Date - 2022-12-05T00:19:03+05:30 IST

Read more