స్వచ్ఛంద వెల్లడితోనే ‘సహ’ సార్థకత

ABN , First Publish Date - 2022-10-12T06:29:33+05:30 IST

‘ప్రజాస్వామ్యాన్ని తన విశ్వాసంగా ఒక సమాజం అంగీకరించినప్పుడు తమ ప్రభుత్వం ఏమి చేస్తు న్నదో తెలుసుకోవడం పౌరుల ప్రాథమిక హక్కు’ –జస్టిస్ పి.ఎన్.భగవతి...

స్వచ్ఛంద వెల్లడితోనే ‘సహ’ సార్థకత

‘ప్రజాస్వామ్యాన్ని తన విశ్వాసంగా ఒక సమాజం అంగీకరించినప్పుడు తమ ప్రభుత్వం ఏమి చేస్తు న్నదో తెలుసుకోవడం పౌరుల ప్రాథమిక హక్కు’ –జస్టిస్ పి.ఎన్.భగవతి (సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి) స్ఫూర్తిదాయక ఉద్ఘాటన అది. అలాంటి ప్రాథమిక హక్కు ‘సమాచార హక్కు చట్టం–2005’ రూపంలో 17 ఏళ్ల క్రితం భారత పౌరులకు సంక్రమించింది. 


భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛలో సమాచార హక్కు అంతర్భాగమని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో అభిప్రాయపడింది. ఆ మేరకు ఆ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన వివిధ తీర్పుల ద్వారా సమాచార హక్కు చట్టానికి పునాదులు ఏర్పడ్డాయి. సమాచార హక్కు పౌరులకు రెండు రూపాలలో సమాచారం అందిస్తుంది: ఒకటి– పౌరులు ఏదైన ఒక అంశంపై సమాచారాన్ని డిమాండ్ చేసినప్పుడు నిర్ణీత సమయంలో సమాచారాన్ని అందించడం; రెండు– ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, ఇతర ఆన్‌లైన్ పద్ధతులలో సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడం. అయితే వ్యక్తిగత ధరఖాస్తుదారులలో పలువురు సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రుసరుసలాడుతున్నారు. దరఖాస్తులకు సత్వరమే సవివరంగా ప్రతిస్పందించేందుకు అవసరమైన వ్యవస్థాగత సౌకర్యాలు కొరవడ్డాయని తమ విధి నిర్వహణలో జాప్యానికి వారు సంజాయిషీ ఇస్తున్నారు. ఇతర బాధ్యతల కారణంగా సమాచార హక్కు (సహ) చట్టం క్రింద దరఖాస్తులకు జవాబు ఇవ్వడానికి కావలసినంత సమయం లభించడం లేదని కూడా వారు చెప్పుతున్నారు. ఇక దరఖాస్తుదారులేమో సహ చట్టం అమలు పూర్తిగా పడకేసిందని, కోరిన సమాచారం లభించడం లేదని వాపోతున్నారు. ఇలా సహ చట్టం అమలులో నైరాశ్యం కమ్ముకున్న పరిస్థితి రాష్ట్రంలో అడుగడుగునా కనిపిస్తోంది.


ఈ స్థితిలో స్వచ్ఛంద సమాచార వెల్లడి కీలకం. సహ చట్టం సెక్షన్ 4 ప్రకారం, సాధ్యమైనంతవరకు ప్రభుత్వం ఎక్కువ సమాచారం స్వచ్ఛందంగా బహిర్గతం చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం వద్ద ఉన్న రికార్డులను, పత్రాలను పదాలు, పట్టికలతో సహా పూర్తిగా ఆయా శాఖల వెబ్‌సైట్‌లో ఉంచాలి. ప్రజలు అతి తక్కువ వ్యయంతో వాటిని పొందే పరిస్థితి ఉండాలి. సమాజ జీవితాన్ని ప్రభావితం చేసే పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముఖ్యమైన విధానాలు రూపొందించేటప్పుడు వాటికి సంబంధించిన వాస్తవాలు వెల్లడి చేయాలి. ఆ నిర్ణయాలు, విధానాల ప్రభావానికి లోనయ్యే వ్యక్తులకు కచ్చితంగా వాటి గురించి వివరించాలనేది సహ చట్టం సెక్షన్ 4 సారాంశం. అలానే అన్ని ప్రభుత్వ శాఖలూ సహ చట్టం సెక్షన్ 4(1)(బి) ప్రకారం 17అంశాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసి వెబ్‌సైట్‌లోనూ, ఆన్‌లైన్ పద్ధతిలోనూ స్వచ్ఛందంగా వెల్లడి చేయాలి. సెక్షన్ 4 సక్రమంగా అమలయితే పౌరులు సమాచారం కోసం దరఖాస్తులు చేయాల్సిన అగత్యం ఉండదు. అధికారులపై పని భారం తగ్గుతుంది. ప్రజా సేవలని అందించే సిబ్బంది అతి తక్కువగా ఉన్న దేశాలలో ఒకటి మనదని మీకు తెలుసా? 


ఆంధ్రప్రదేశ్‌లో సెక్షన్ 4 అమలులో లోపాలు మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఉదాహరణకు సిసిఎల్ఏ కమిషనర్‌గా ప్రస్తుతం జి.సాయి ప్రసాద్, ఐఏఎస్ ఉన్నారు. అయితే ఆ కమిషనరేట్ వారి వెబ్‌సైట్‌లో 4(1)(బి)లో ఎప్పుడో వెళ్ళిపోయిన అనీల్ చంద్ర పునేఠా, ఐఏఎస్ పేరు ఉంది! ఇక్కడ 4(1)(బి) అప్‌డేట్ కావడం లేదు. గృహ నిర్మాణ కార్పొరేషన్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లలో సమాచార హక్కు చట్టం ఊసే లేదు. సరే, పోలీస్ శాఖకు చెందిన పలు వెబ్‌సైట్‌లలో అయితే పాతదో కొత్తదో అసలు ఎలాంటి 4(1)(బి) లేదు! ప్రతి ప్రభుత్వ కార్యాలయం సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 4(1)(బి)ని సక్రమంగా అమలు చేస్తే పౌరులు సమాచారం కోసం దరఖాస్తు చేయకుండానే పరిపాలనలో ఏమి జరుగుతుందో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, రూపొందించే విధానాలు, కల్పించే రాయితీలు, నిర్దేశించే నిబంధనలు, ఇంకా లబ్ధిదారుల వివరాలు మొదలైనవన్నీ స్వచ్ఛందంగా వెల్లడి చేస్తే పాలనా వ్యవహారాలలో పారదర్శకత పెరుగుతుంది.


గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజూ విడుదల చేసే అన్ని జీఓలు, సర్క్యులర్లను వెబ్‌సైట్‌లో ఉంచేవారు. వాటి ద్వారా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందో, తక్షణమే ప్రజలు తెలుసుకునే అవకాశం ఉండేది. ఎలాంటి కారణాలు చూపకుండానే ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం నిలిపివేశారు. గతంలో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షించే విధానం ఉండేది. ప్రస్తుతం అది పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఫలితంగా ప్రజలకు పరిపాలనలో ఏమి జరుగుతుందో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. పేదల సంక్షేమం, అభివృద్ధితో ముడివడి ఉన్న ఉద్యానవన, విద్యాశాఖ, గృహనిర్మాణం, పంచాయితీరాజ్, మునిసిపల్, రెవెన్యూ, సంక్షేమ శాఖల్లో లబ్ధిదారుల వివరాలు, ఎంపిక ప్రక్రియ, గ్రామసభల తీర్మానాలు వంటివి ఆయా శాఖల వెబ్‌సైట్లలో ప్రజలకు అందుబాటులో లేవు.


సహ చట్టం అమలు బాధ్యత ఉన్న సమాచార కమిషన్ స్వచ్ఛంద సమాచార వెల్లడి పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదు. కమిషన్‌కు వస్తున్న అప్పీళ్లు, ఫిర్యాదుల సంఖ్య–పరిష్కరించిన వాటి వివరాలు నెల వారీగా వెబ్‌సైట్‌లో పెడుతున్నా– తిరస్కరిస్తున్న వేలాది దరఖాస్తుల సంఖ్యను మాత్రం వెల్లడించడం లేదు. దేశంలోనే అత్యధికంగా అప్పీళ్లు /ఫిర్యాదులు తిరస్కరిస్తున్న కమిషన్‌గా అప్రతిష్ట పాలవ్వాల్సివస్తుందేమో అని బయటపెట్టడం లేదేమో?! స్వచ్ఛంద సమాచార వెల్లడి క్రింద ప్రచురించాల్సిన వార్షిక నివేదికలను రాష్ట్ర విభజన తర్వాత సమాచార కమిషన్ ఇప్పటి వరకు ఒక్కటి కూడా విడుదల చేయలేదు. ఈ స్థితిలో రాష్ట్రంలో సెక్షన్ 4 అమలు తీరుతెన్నులను సమూలంగా ప్రక్షాళించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు సెక్షన్ 4 అమలుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో చూద్దాం. 


ముందుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్‌ ట్రైనింగ్’ సూచించినట్లుగా ప్రతీ ప్రభుత్వ శాఖ తమ సెక్షన్ 4 అమలుపై స్వతంత్ర సంస్థలతో ఆడిట్ నిర్వహించాలి. అందులో వచ్చిన సూచనలు, సలహాలు పాటించాలి. ఇందుకు సమాచార కమిషన్ తొలుత చొరవ తీసుకోవాలి. రాజస్థాన్‌లో పౌరులు తమకు అవసరమైన సమాచారాన్ని పొందడానికి ‘జనసూచన’ అనే కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తోంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయితీ/మునిసిపల్ వార్డు/ సర్వీస్ డెలివరీ పాయింట్‌ల వద్ద ప్రజలకు తమ ప్రదేశానికి సంబంధించిన సమాచారాన్ని అందించడానికి ఎటిఎం తరహా యంత్రాలను ఏర్పాటు చేసారు. ఈ యంత్రాలలో పౌరులు తమ కుటుంబానికి ఏ ఏ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో తెలుసుకోవచ్చు. స్థానిక ఆసుపత్రులలో మందుల లభ్యత వివరాలతో సహా తమ గ్రామానికి మంజూరయిన రేషన్ వివరాలు తెలుసుకునే అవకాశం ‘జనసూచన’ కల్పిస్తుంది. ఈ నమూనాను అనుసరిస్తూ రాష్ట్రంలో ఇలాంటి యంత్రాలు గ్రామ సచివాలయాలలో ఏర్పాటు చేసి ప్రజలకు వివిధ పథకాలకు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని అందివ్వాలి. కేవలం వెబ్‌సైట్‌లకు పరిమితం కాకుండా గోడపత్రికలు, కరపత్రాల ద్వారా సమాచారం అందించడం స్వచ్ఛంద సమాచార వెల్లడిలో కీలకం. 


ఉదాహరణకు ఉపాధి హామీ పథకంలో గ్రామ స్థాయి అధికారులు ఆ పథకానికి సంబంధించి 7 రిజిస్టర్లు నిర్వహిస్తుంటారు. అదే నమూనాను అనుసరించి ప్రభుత్వ సేవల సమాచారం గ్రామ వాలంటీర్ల దగ్గర ఉంచవచ్చు. అలానే ప్రతి రేషన్ ట్రక్ /డిపో దగ్గర ఆ నెలలో రేషన్ మంజూరయిన వారి పేర్లు, మంజూరయిన దినుసుల వివరాలు ప్రదర్శించడం లాంటివి చేయాలి. అలానే స్థానిక భాషలో సమాచారం అందించడం కూడా స్వచ్ఛంద సమాచార వెల్లడిలో మరో కీలక అంశం. దురదృష్టవశాత్తు మన రాష్ట్ర వెబ్‌సైట్‌లలో తెలుగు భాషలో సమాచారం కనిపించడం దాదాపు మృగ్యం. ప్రస్తుత గ్రామ సచివాలయ వ్యవస్థలో సమాచార హక్కు చట్టం క్రింద దరఖాస్తుల స్వీకార వ్యవస్థే లేదు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 5(2), 5(3) క్రింద బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. సెక్షన్ 4 పూర్తిస్థాయిలో అమలు జరిగినప్పుడే సమాచార హక్కు చట్టం అమలవుతున్నట్లు భావించాలి.


‘మీరు సమాచార హక్కు చట్టం పక్షాన లేకపోతే అవినీతి పక్షాన ఉన్నట్లే’ అని సమాచార హక్కు చట్టం ఉద్యమ వైతాళికురాలు అరుణారాయ్ అన్న మాటను అధికారులు దృష్టిలో ఉంచుకోవాలి. సహ చట్టం అమలవుతున్న తీరు తెన్నులపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. లేనిపక్షంలో ముఖ్యమంత్రి జగన్ తరచూ వల్లించే ‘మేం ప్రజా సేవకులం, పాలకులం కాదు’ అనే మాటలు నీటిపై రాతలుగా మిగిలిపోతాయి.

చక్రధర్ బుద్ధ

ఇమ్మానియేలు డి

(నేడు సమాచార హక్కు దినోత్సవం)

Updated Date - 2022-10-12T06:29:33+05:30 IST