ఈ దుఃఖ తెలంగాణ ఇంకెన్ని రోజులు??
ABN , First Publish Date - 2022-06-25T09:00:09+05:30 IST
బహుజన సామ్రాజ్య చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నను కన్న ఖిలాషాపూర్ గ్రామంలో ఆరంభమైన బహుజన రాజ్యాధికార యాత్ర మండుటెండా కాలంలో..

బహుజన సామ్రాజ్య చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నను కన్న ఖిలాషాపూర్ గ్రామంలో ఆరంభమైన బహుజన రాజ్యాధికార యాత్ర మండుటెండా కాలంలో ఎండకు ఎండుతూ, ఆ తరువాత కురుస్తున్న వానల్లో తడుస్తూ సాగింది. బహుజనులను పాలకులను చేసి, బహుజనరాజ్య స్థాపన చేయాలనే మహా సంకల్పంతో మాన్యవర్ కాన్షీరామ్, బహెన్జీ మాయావతిల ఆశయస్ఫూర్తితో ముందుకు సాగుతోంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ప్రజలు పడుతున్న కష్టాల ముందు మావి పెద్ద లెక్క కాదు. ఇవాళ తెలంగాణలో ఎవ్వరిని కదిలించినా కన్నీళ్లే. ఏ ఊరును చూసినా సమస్యల నిలయాలే. ఏ గూడేనికి వెళ్లినా దీనగాథలే. ఏ వాడను చూసినా దురవస్థల వ్యవస్థలే.
ఈ వంద రోజుల కాలం నా జీవితంలో మరిచిపోలేనిది. ప్రజల మధ్య జీవిస్తే, ప్రజలకు ఏం కావాలో తెలుస్తుంది. కానీ, మన పాలకులు అందుకు సిద్ధంగా లేరు. అందుకే ప్రజలకు, పాలకులకు మధ్య దూరం పెరిగిపోయింది. దీంతో తెలంగాణతోనే బతుకు మారుతుందని ఆశపడ్డ ప్రజలకు నిరాశే మిగిలింది. ఈ యాత్రలో మద్యం వల్ల అకాలమరణాల పాలైన ఎన్నో కుటుంబాల్లోని వితంతువులను కలిశాను. మద్యం అమ్మకాలతో ముప్పయి వేల కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు సీఎం కేసియార్. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు మూడోవంతు కిందికులాల మహిళలు వితంతువులయ్యే ప్రమాదం ఉన్నది. ఇది స్వయంగా పాలకులే చేస్తున్న ఒక నిశ్శబ్ద మారణహోమం. వైరా నియోజకవర్గంలోని టేకులపల్లి మండలంలో గల నైన్త్మైల్ తండాలో 31మంది మహిళలతో మాట్లాడాను. వారిలో పదకొండు మంది వితంతువులే. వారి భర్తలు తాగుడుకు బానిసలు కావడం వల్లే అకాల మరణం పాలయ్యారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో కొండగడప అనే గ్రామంలో బుడగజంగాలకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవు. చిన్నచిన్న పిల్లలే తల్లులుగా మారి దయనీయమైన పరిస్థితిలో బతుకుతున్నారు. తల్లిదండ్రులు వలసపోతే పిల్లలు కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. చాలా చోట్ల ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం ఉన్నదంతా అమ్ముకోవాల్సిన దుస్థితిలో ప్రజలు బతుకుతున్నారు. మోతే అనే గ్రామంలో నూటాయాభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టారు కానీ, వాటిని లబ్దిదారులకు కేటాయించనందువల్ల ఆ కుటుంబాలు గుడారాల్లో బతుకుతున్నాయి. వారంతా బీసీ–ఏ సమూహానికి చెందిన మందుల మరియు పూసల కులస్తులు. అలాగే పోడుభూముల సమస్య భద్రాచలం, పినపాక వంటి నియోజకవర్గాల్లో తీవ్రంగా ఉంది. గుర్రంపోడు భూములు, అసైన్డ్ భూములను ఎలిమినేడు, ఆళ్లగడప వంటి చోట్ల పాలకులే భూములను గుంజుకున్నారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలకు సైతం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూముల నుండే అన్యాయంగా లాక్కున్నది ప్రభుత్వం. మరి భూస్వాముల భూముల నుండి ఎందుకు గుంజుకోవడం లేదని ప్రజలు ప్రతీచోట ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఇదే ఏజెన్సీ ఏరియాలో భూస్వాముల భూములకేమో పట్టాలు ఉంటున్నాయి. పేదలకేమో పట్టాలు ఉండడం లేదు. వారికి అసైన్డ్ భూములే ఉంటున్నాయి. ఏజెన్సీకి చెందిన రాయలపేట, మణుగూరు వంటి ఏరియాల్లో ఉన్న గ్రామాల్లో కనీసం కరెంటు కూడా లేకుండా గిరిజనులు చీకట్లోనే బతుకుతున్నారు. ఇక గుత్తికోయ గూడేల్లోనైతే పశువులకు, మనుషులకు తేడా లేనంత దీనావస్థలో మగ్గుతున్నారు.
తరతరాలుగా పారిశుధ్యం, సఫాయి కర్మచారి వంటి అమానవీయ పనులు చేసే చాలా కుటుంబాలు నేటికి కూడా అవే పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నాయి. పరకాలలో ఒంటేరు రాజయ్య అనే పారిశుధ్య కార్మికుడు నలభై యేళ్లుగా ఆ పని చేస్తూ, చివరికి ఆరోగ్యం పాడై చనిపోయాడు. ఆయన అంత్యక్రియలకు వెళ్లినప్పుడు చాలా దుఃఖం కలిగింది. ఆ తరువాత కొడుకు కూడా అదే పని చేస్తున్నాడు. వీరంతా చాలా దయనీయమైన స్థితిలో బతుకీడుస్తున్నారు. ఏ ఊరికి వెళ్లినా ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూసే వృద్ధుల, వికలాంగుల, వితంతువుల పరిస్థితి దారుణంగా ఉంది. అర్హులైన 14లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే అతీగతి లేదు. జాబితాలో ఉన్న వారికైనా సమయానికి అందుతున్న దాఖలాలు లేవు. ఆ శోకాలు వింటే గుండె తరుక్కుపోతుంది. కనీసం ముసలివాళ్లకైనా బుక్కెడు మెతుకులు దక్కే పరిస్థితి కల్పించలేని పాలకులు ఉండేమి లాభం అంటున్నారు. ఇట్లా ప్రతీచోట సమస్యలే దర్శనమిస్తున్నాయి. ప్రజలు బతకడానికి నానా అవస్థలు పడుతుంటే కేసిఆరేమో తన అధికార పీఠాన్ని కాపాడుకోవాలని ఎత్తుల మీద ఎత్తులు వేస్తూ ఫామ్ హౌజులో పావులు కదుపుతున్నాడు. ప్రశాంత్ కిషోర్ వంటి వారి కోసం తెలంగాణ ప్రజల వివరాలను కులాల వారిగా, మతాల వారిగా అప్పగించే పనిలో మునిగాడు. ఎంతమంది చచ్చినా, తానే అధికారంలో ఉండాలి, తనే తెలంగాణ ఆస్తులను కబ్జా చేసుకోవాలనే తాపత్రయంలో ఉన్నాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా బహుజన రాజ్యాధికార యాత్ర ఆగదు. బహుజనులు ప్రగతి భవన్లో పాలకులుగా అడుగుపెట్టే దాకా ఇది నిరంతరం కొనసాగుతుంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో భాగంగా మా యాత్ర వందరోజులు పూర్తి చేసుకుంది. బాధల్లో నలుగుతున్న ప్రజలకు రేపటి మీద భరోసాను నింపుతూ, ఓటు హక్కు ద్వారానే మన బతుకులు మారుతాయని ఈ యాత్ర బోధిస్తున్నది. ఓటే మన ఆయుధం, ఏనుగు గుర్తే మన విముక్తి ప్రదాత.
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ
(రేపు హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్లో
బహుజన రాజ్యాధికార యాత్ర వందరోజుల సభ)
