నాగరికత

ABN , First Publish Date - 2022-09-19T06:11:13+05:30 IST

నేను కూర్చున్న ఈ నేల కింద నువ్వు నడుస్తున్న ఈ భూమ్మీద అక్కడెక్కడో పొరలు పొరలుగా తిరుగుతున్న...

నాగరికత

నేను కూర్చున్న ఈ నేల కింద

నువ్వు నడుస్తున్న ఈ భూమ్మీద

అక్కడెక్కడో

పొరలు పొరలుగా తిరుగుతున్న

నాగేటిసాళ్ల అడుగున

అలలు అలలగా కొనసాగుతున్న

నీటి లోపల్లోపల ఆ మట్టి కింద

కాలానికి సాక్ష్యమైన పుర్రో

చరిత్రకు ఋజువైన శాసనమో

తెగిపడిన రాజ్య పతాకమో ఉండే ఉంటుంది


బావిలో విసిరిన పాతాళ భైరవి కొక్కానికి

చిక్కిన వస్తువుల్లా

ఆ కింద స్మృతులజాడ

పసుపు కుంకుమ విభూతి

బౌద్ధపీఠమో, పీరో, శిలువో ఏదో ఒక మత సామాగ్రి

మతమౌఢ్యంతో మండిన గుండెలో

సతీసహగమన అవశేషాలో దొరక్కపోవు


మొదటి మానవుడి అనుభూతి గీతం

జానపద స్త్రీ సహజ స్వరపేటిక

గజ్జెకట్టి ఆడిన ఆడపిల్ల పాదాల పసిడి కాంతిరేఖ

పనిముట్లు పట్టి జెండాలా ఎగిరిన చేతులు


తెల్లగా రాలిపడిన మేఘశకలం

ధారగా ప్రవహించే ఉమ్మనీరు

ఎక్కడెకడినుంచో హృదయాలు సాచిన చెట్టు వేర్లు

ప్రకృతి పారేసుకున్న పదచిత్రాలు

అడుగడుగునా దాగిన చారిత్రక సంభాషణ


ఎప్పటి నుండో నొప్పులు భరిస్తున్న నేల

కొనసాగుతున్న మట్టి బొమ్మల గాథ


నేను కూర్చున్న ఈ నేల కింద

నువ్వు నడుస్తున్న ఈ భూమ్మీద

మట్టి కన్న కలలు

సమాధిలో నుంచి మాట్లాడుతుంటాయ్‌

మనిషి మనిషిగా మెరుగుపడటానికి మించిన

సరికొత్త నాగరికత ఏముంటుంది?

సుంకర గోపాలయ్య

94926 38547


Read more