నిషేధం చింతామణితో ఆగదు
ABN , First Publish Date - 2022-02-21T07:27:01+05:30 IST
నిషేధాలు మనకు కొత్తేంకాదు. నిషేధాల్లోనూ మనకు ఘనమైన చరిత్రే ఉంది.
నిషేధాలు మనకు కొత్తేంకాదు. నిషేధాల్లోనూ మనకు ఘనమైన చరిత్రే ఉంది. చింతామణి నాటకాన్ని నిషేధించాలని చాలాఏళ్ళుగా కొన్ని కులసంఘాలు డిమాండ్ చేస్తున్నాయ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హఠా త్తుగా చింతామణి ప్రదర్శనని నిషేధిస్తున్నట్టు ఉత్తర్వు జారీ చేసిందనేది తాజావార్త. సరే. ఎవరి కారణాలు వారివి. కానీ నిజంగా చింతామణి నాటకాన్ని నిషేధిం చాల్సిన అవసరముందా? ప్రభుత్వాన్నే తప్పుదోవ పట్టిం చారా? ప్రత్యామ్నాయం లేదా? నిషేధాలపై పునరాలో చించాల్సిన సందర్భం ఇది. ఈ నాటకం నిషేధించాలనే వాళ్ళు రెండు కారణాలు చూపుతున్నారు. ఒకటి- ఈ నాటకం సమాజాన్ని చెడుమార్గం వైపు తిప్పుతోందని. రెండు- వైశ్యుల్ని అవమానకరంగా చూపుతున్నారని.
కాళ్ళకూరి నారాయణరావు రచనగా చింతామణి నాటకం 1921లో అచ్చయింది. దీని లక్ష్యం ‘‘భగవంతుఁడు దీని నింకను వ్యాపకములోనికిఁ దెచ్చి పాపభూయిష్టమగు వ్యభిచారవృత్తిని బరిపూర్తిగ నిర్మూలించుఁ గాక!’’ అని రచయితే స్వయంగా చెప్పుకున్నాడు. ఈ రకంగాచూస్తే ఈ నాటకం వేశ్యావృత్తి పోవాలంటోంది. వ్యభిచారం ఒకవృత్తిగా వేశ్యలు జీవితాలు గడిపిన కాలం నాటిది ఈ రచన. ఇప్పుడేమో వేశ్యావృత్తిని కూడా చట్టబద్ధం చేయాలని అడుగుతున్నకాలంలో ఉన్నాం. వేశ్యలంటే ఆడవాళ్ళే కాదు, మగవేశ్యల వరకూ వచ్చేశాం. వ్యభి చారం, వేశ్యావృత్తి లక్షణాలూ రూపాలూ మారిపో యాయ్. ఇలాచూస్తే నాటకంలోని విషయాలు ఇప్పుడు పాతబడిపోయాయ్. ఇప్పుడు చింతామణి నాటకాన్ని వేశ్యావృత్తి నిర్మూలనకోసం వేయడంలేదు. అందుకోసం ప్రదర్శించాలని ఎక్కువమంది ప్రేక్షకులూ కోరడంలేదు. రచయిత దీన్ని శాంతరసప్రధాన నాటకం అన్నాడు. దీన్ని శృంగారప్రధానంగానూ, హాస్య, అశ్లీల ప్రధానంగా మార్చిందెవరు? దానికి కారణాలేంటో ఆలోచిస్తే చింతా మణి నాటకాన్ని నిషేధించాలన్నంత గగ్గోలు పెట్టం.
ఈ నాటకం ముద్రితమైన వెంటనే ప్రదర్శనలో నటులు, నాటక సమాజాలు వాళ్ళకు కావాల్సినరీతిలోకి మార్చు కుని ప్రదర్శించడం మొదలుపెట్టారు. ‘‘సామర్థ్యము చాలక కొందఱును, సాంకర్యము పాలుచేసి కొందఱును నాటక ముల సౌష్ఠవమును నట్టేటఁ గలుపుచున్నారు. ఇత్యాది విపత్తులనుండి కాపాడుకొనఁ గోరి యింతటినుండి లిఖిత రూపకమైన మాయనుజ్ఞను పొందనిదె యీ నాటకము నెవ్వరును బ్రదర్శింపఁగూడ దని యిమ్మూలకముగా విశదీకరించుచున్నాడను’’ అని మొదటికూర్పు అమ్ముడు పోయిన ఆర్నెల్లకే రెండో కూర్పులో (15.9.1921) రచయితే హెచ్చరిక ప్రకటన చేయాల్సివచ్చింది.
ఈ నాటకం వచ్చిన తర్వాత ఇలాంటి కులసమస్య వచ్చింది కాబోలు, సోమరాజు రామానుజరావు రాసిన చింతామణి నాటకంలో సుబ్బిసెట్టిపోయి ఖాసింసాహేబు వచ్చాడు. అప్పుడుమాత్రం ఇతరుల మనోభావాలు దెబ్బతినవా? కేవలం పేరు మారింది సన్నివేశాలు పూర్తిగా అవే. 1922లో ‘చింతామణి లేదా లీలాశుక’ పేరుతో రామనారాయణకవులు నాటకాన్ని రాశారు. దాని ప్రకటనకర్త పోలిశెట్టి రామయ్య. ఆ నాటకంలోనూ సుబ్బిసెట్టి పాత్ర అలాగే ఉంది. చింతామణి నాటకంపై బలే చింతామణి పేరుతో బి.టి. రాఘవాచార్యులు తీవ్ర విమర్శ రాసి, 1922లోనే పుస్తకం వేశాడు. కానీ ఇలాంటి విమర్శలు చింతామణి ప్రాభవాన్ని తగ్గించలేదు. పైగా తర్వాతి ఎన్నో సంస్కరణ రచనలకు దారిచూపింది. ఈ నాటక ప్రదర్శనని చూసి వేశ్యలు వృత్తి మానుకున్నట్టు, విటులు ఆ మార్గం వదిలేసినట్టు అప్పటికే ఈ నాటక రచయితకు చాలా లేఖలు రాసుకున్నారు.
నిషేధ కారణాల్లో మొదటి విషయానికొస్తే, ఇప్పుడు మనకు వివిధ రూపాల్లో మాధ్యమాల్లోనూ ఇతరత్రా దొరుకుతున్న అడ్డమైన సరుకుకంటే చింతామణి నాటకం చాలా మర్యాదగానే ఉంది. చరిత్ర అధ్యయనానికి తగిన ఆధారాలు మనకు చాలా తక్కువ. అందులో అధిక భాగం సాహిత్యం ఇప్పటికే అలభ్యం. పాతకాలపు రచన లైనా, వర్తమానంలో రచనలైనా రచనని రచనగా చూడాలి. అభిప్రాయాలు అధ్యయనాల్లో తేడాలుంటే రచన ద్వారానే చర్చ జరగాలి. ఒక్కొక్కరి మనోభావాలు దెబ్బతినడం మొదలుపెడితే అసలు మాట, చేష్టల్ని కూడా నిషేధిం చాల్సి వస్తుంది.
ఇక రెండో విషయం వైశ్య కులాన్ని కించపరిచేలా ఉందని. కించపరచడం, చెడుగా చిత్రీకరించడం అనే వాదనలు చేసేముందు మరికొన్ని అంశాల్ని పరిశీలిం చాలి. మొన్నామధ్య కంచ ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమట్లు అనే పుస్తకంలోని భాగం చిన్న పుస్త కంగా వచ్చేసరికి ఇలాంటి వాదనలే వచ్చాయ్. అది మరో కోణం నుండి జరిగిన పరిశోధనాత్మక అధ్యయన ఫలితాలు. మంచిచెడులు ఒక కులానికి పరిమితంకాదు. సుబ్బిసెట్టి కంటే ముందే విటుడిగా క్రీడాభిరామంలో టిట్టిభసెట్టి లాంటివాళ్ళ ప్రస్తావనలు 15 శతాబ్ది నాటికే ఉన్నాయ్. అదే కాలంలో శ్రీనాథుణ్ణి ఆదుకుని, ఆదరించిన అవచి తిప్పయసెట్టి కూడా ఉన్నాడు. నిజంగా ఇప్పుడు నాటక రంగంలో పనిచేస్తున్నవాళ్ళెవరు? వాళ్ళు కావాలనే కులాల్ని కించపరచాలని అలా చేస్తారా? అన్నది విజ్ఞులు ఆలోచించాలి.
అసలు చింతామణి నాటకంలో ‘‘హద్దు చెడి కని పొట్టకై యమ్ముకొనెడి/ సాలె, యుప్పర, యానాది, చాకి, పాకి/ యీండ్ర, జేండ్రపిల్లలగొని యిందువదన/ చంద్రవదనలఁ గావింత్రు సానులిపుడు’’ అనే పద్యంలోని ఇతర వర్గాల ప్రస్తావన అవమానకరం అనుకుని ఆ వర్గాలన్నీ కలిసి చింతామణిని నిషేధించాలని డిమాండ్ చెయ్యక్కర్లేదు. అలా చేస్తే, దాని వెనకున్న చరిత్రను అధ్యయనం చేయకపోతే ఎన్నో వాస్తవాల్ని కోల్పోతాం.
తెలుగు నాటకరంగం అంపశయ్యపై ఉంది. కొత్తగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఇతర రూపాల్లో కళా రూపాలు విజృంభిస్తున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో నాటకం జీవనంగా బతుకుతున్న కళాకారులు, నాటక సమాజాలూ తమవైపు ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి ఎన్నో జిమ్మిక్కులు చేయాల్సి వస్తోంది. నాటకం నిషేధించమని అడిగే వాళ్ళకు ఇప్పుడు నాటకాలు ఎంతమంది చూస్తారో తెలీదా? పైగా ఈ నాటక ప్రదర్శన చాలా పరిమిత పరిధిలోనే జరుగుతోంది. అసలు ఈ తరం అధికశాతం యువతకు చింతామణి నాటకమే తెలీదు. ఇకపై ప్రద ర్శనలు వద్దంటే మరింత జుగుప్సాకరంగా ఆ నాటకాన్ని రికార్డుచేసి యూట్యూబ్లాంటి సాంకేతిక మాధ్యమాల్లో పెడితే అడ్డుకునేదెవరు?
చింతామణి నాటకంలో సుబ్బిసెట్టి పాత్రకు రచయిత నిజజీవితంలో ఎదురైన వ్యక్తే ఆధారం. పాత విషయాలు లోడుకుని ప్రయోజనం లేదు. వైశ్యుల్లో ఎంతోమంది సమాజానికి ఉపయోగపడే ఘనమైన పనులు చేసినట్లు చరిత్రలో రికార్డయ్యింది. ఇప్పటి వైశ్యులు వారి మార్గాన్ని అనుసరించాలి. కాలగతిలో కలిసిపోయి అంతగా ప్రయో జనంలేని విషయాల్ని వదిలేయాలి. అసలే దేశం కులాల కుంపట్లతో అల్లాడుతుంటే సమర్థులు కులపరిధుల్లోనే కూరుకుపోవడం దేశానికంత మంచిదికాదు.
నాటకంలోని కాళ్ళకూరి భావాలు, చూపిన పరిష్కా రాలు ఇప్పటివాళ్ళకు నచ్చకపోయినా, వాటిలో అధ్య యనం చేయాల్సిన అంశాలెన్నో ఉన్నాయ్. పాతకాలపు రచనల్ని ఈ కాలపుదృష్టితో బేరీజు వేయాల్సిందే. అవసరమైనవి తీసుకుని, అనవసరాల్ని త్యజించాల్సిందే. కానీ నిషేధాల వరకూ వెళ్ళక్కర్లేదు. అలా నిషేధించు కుంటూ వెళ్తే ఏవీ మిగలవు. నిషేధం చింతామణితో ఆగిపోదు. అప్పటి సంఘంలోని దురాచారాలపై గట్టిగా కృషి చేసిన రచయిత కాళ్ళకూరి నారాయణరావు. మద్యపాన వ్యతిరేకంగా ‘మధుసేవ’, వరకట్నాలకు వ్యతిరేకంగా ‘వరవిక్రయం’ వంటి నాటకాల్ని రాశాడు. అలాంటి సంస్కర్త రచనలు చెడుమార్గంలోనివని ప్రజలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం దూరదృష్టితో నిషేధంపై పునరాలోచించాలి.
టి. సతీశ్
93916 14443