పోరాటశీలి చంద్రమ్మ

ABN , First Publish Date - 2022-09-22T06:45:33+05:30 IST

శ్రీకాకుళ ఉద్యమంపై కామ్రేడ్ పైలా చంద్రమ్మ ముద్ర మరువలేనిది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం రాజాం గ్రామంలో చెల్లూరి చిన్నయ్య, కామమ్మలకు ఏడవ సంతానం పైలా చంద్రమ్మ....

పోరాటశీలి చంద్రమ్మ

శ్రీకాకుళ ఉద్యమంపై కామ్రేడ్ పైలా చంద్రమ్మ ముద్ర మరువలేనిది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం రాజాం గ్రామంలో చెల్లూరి చిన్నయ్య, కామమ్మలకు ఏడవ సంతానం పైలా చంద్రమ్మ. ఉపాధ్యాయుడు కొట్టాడని చదువు మానేసింది. తర్వాత పార్టీ పెట్టిన రాత్రి పాఠశాలల్లో అక్షరాభ్యాసం చేసింది. పైలా వాసుదేవరావును టెక్కలి డివిజనుకు ఆర్గనైజరుగా పార్టీ పంపించింది. రాజాం గ్రామం టెక్కలి డివిజనులో ఉండేది. అక్కడ అండమాన్ నుంచి వచ్చిన కామ్రేడ్ గొరకల రాంబాబు టీ దుకాణం నడిచేది. ఆ టీ దుకాణం కేంద్రంగా రాజకీయాలు మాట్లాడుకునేవారు. పైలా వాసుదేవరావు రాజాంని కేంద్రం చేసుకొని పనిచేయడం ప్రారంభించారు. గొరకల రాంబాబు, ఇంకొందరు ముఖ్య కార్యకర్తలతో కలసి ఆనాడు సారా వ్యతిరేక ఉద్యమాన్ని గ్రామంలో బలంగా నడిపారు. ఈ ఉద్యమంలోకి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. కూలి రేట్లు పెంచాలని, నిరుపేదలను ఆదుకోవాలని, వ్యవసాయ భూములకు సాగునీరు కావాలని, చెరువులో చెక్ డాములు నిర్మించాలని... ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండాల్ని భుజాన వేసుకుని గ్రామాల్లో తిరిగేవారు. ఈ కార్యక్రమాల ప్రభావం కామ్రేడ్ చంద్రమ్మ మీద బలంగా పడింది. ఆమె బాలల సంఘంలో చేరింది. తర్వాత తెగింపు సంఘంలో సభ్యురాలు అయింది.


గరుడ భద్ర అనే గ్రామంలో భూస్వామి మద్ది కామేష్‌కు వ్యతిరేకంగా కూలి రేట్లు పెంచాలని, కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి, పంచాది నిర్మల నాయకత్వాన మహిళలంతా ఊరేగింపు తీశారు. ఈ సందర్భంగా భూస్వామి గుండాలు రాళ్లు రువ్వారు. నిర్మల జాకట్ చింపి వేశారు. సంఘటన జరిగినప్పుడు చంద్రమ్మ ఉన్నారు. అనంతరం ఉద్దానంలో బొడ్డపాడు, మామిడిపల్లి, మర్రిపాడు, రాజాం తదితర గ్రామాల పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశమై మద్ది కామేష్‌కు సరైన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆయన పంటను కోసి పేదలకు పంచాలని, ఆయన భూములను పేదలకు పంచాలని పార్టీ నిర్ణయం చేసింది. 1968 నవంబరు 24వ తేదీన మద్ది కామేష్ పంట కోతతో సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఈ పంట కోతలో పాల్గొన్న చంద్రక్కపై పోలీసు కేసులు పెట్టారు. ముఖ్యమైన కామ్రేడ్స్ ఎవరూ ఇంటిలో పడుకోవద్దని రహస్యంగా సెంటరు తీసుకోమని పార్టీ డైరెక్షన్ ఇచ్చింది. కామ్రేడ్ గోరకాల అంకమ్మ, చంద్రమ్మ ఇద్దరూ టెక్కలి దగ్గర రావివలస గ్రామంలో అంకమ్మ బంధువుల ఇంటి దగ్గర కొద్ది రోజులు షెల్టరు తీసుకున్నారు. అక్కడ వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించారు. అక్కడి నుండి పార్టీని వెతుక్కుంటూ రాజాం వైపు వస్తే పోలీస్ నిర్బంధం ఎక్కువగా ఉండడంతో కోమర్తికి సుమారు 50 కి.మీ. దూరం కాళ్ల నడకన వెళ్లారు. అక్కడ కామ్రేడ్ మామిడి అప్పలసూరి అందుబాటులో లేరు. స్థానిక కామ్రేడ్స్ వీరిని ఆదరించి వీరికి భోజనం పెట్టి చార్జీలకి డబ్బులు ఇచ్చారు. అక్కడి నుండి బారువ చేరుకున్నారు. పొందల దామోదరం సహకారంతో మహేంద్రగిరి కొండలకు చేరుకున్నారు. అక్కడ పార్టీ జనరల్ బాడీ సమావేశం పెట్టి దళాలు విభజన చేసింది. కామ్రేడ్ పుచ్చ అప్పలస్వామి దళంలో చంద్రక్క సభ్యురాలైంది.


1970 సంవత్సరం ప్రముఖ విప్లవ నాయకుడు పైలా వాసుదేవరావు చంద్రమ్మను వివాహం చేసుకున్నారు. 71లో పాప పుట్టింది. ఉద్యమానికి పిల్లలు ఆటంకమని భావించి విప్లవ సానుభూతిపరులకు బిడ్డను పెంపకానికి ఇచ్చేశారు. కవిటి, ఉద్దానం ఏజెన్సీ ప్రాంతాల్లో భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నారు. అనేకమంది భూస్వాముల హత్యలలో ముఖ్య పాత్ర పోషించారు. రైతాంగ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఉద్దానం జీడి పంట గిట్టుబాటు ధరల కోసం, ఉద్దాన ప్రాంత ప్రజల తాగు–సాగు నీటి కోసం జరిగిన ఉద్యమాల్లో ముందు నిలిచారు. ఆదివాసీల భూములు ఆదివాసీలకే చెందాలని వన్నాఫ్ 70 చట్టం అమలుకోసం పోరాడారు. అటవీ శాఖ అధికారుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటాలు చేశారు. కాకరపల్లి, సోంపేట, వేల ఉద్యమంలో పాల్గొన్నారు. తీర ప్రాంతంలో మత్స్యకారుల, నిర్వాసితుల సమస్యల మీద అనేక ఉద్యమాలు నడిపారు. ఉద్యమాల్లో పుట్టి ఉద్యమాల్లో పెరిగి ఉద్యమాలు చేస్తూనే ఊపిరి విడిచారు.


1975 మే 24న మందస మండలం కొండల్లోకంలో జరిగిన సమావేశంపై పోలీసులు జరిపిన కాల్పుల్లో పైలా వాసుదేవరావు, కుమార్ అన్న తప్పించుకోగా చంద్రమ్మ ముళ్ళపొదల్లో పడి పోలీసుల చేతికి చిక్కింది. మందస పోలీస్ స్టేషనుకు ఆమెను తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టారు. పార్టీ రహస్యాలు చెప్పకపోతే ఎన్‌కౌంటర్ చేస్తామని కళ్ళకు గంతలు కట్టి అడవిలోకి తీసుకువెళ్లి ఆమె తలపై తుపాకి పెట్టి, చివరకు గాల్లో కాల్పులు జరిపారు. ఆ క్షణాల్లోనూ ఆమె ‘మావో జిందాబాద్’, ‘విప్లవం వర్ధిల్లాలి’ అని నినాదాలు చేస్తూ ప్రాణాన్ని గడ్డిపరకగా తీసుకున్నారు. తర్వాత ఆమెని చిత్రవధ చేశారు. మహిళ అని చూడకుండా బట్టలు విప్పి తీవ్రంగా కొట్టారు. అయినా ఆమె నుండి పాలకులు, పోలీసులు ఒక్క రహస్యాన్ని కూడా రాబట్ట లేకపోయారు. చివరకు ఆమెకు ఉద్యోగం ఇస్తామని, మరో వివాహం చేస్తామని కలెక్టరుతో మెజిస్ట్రేటుతో చెప్పించారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ ఆమె తిరస్కరించింది. అప్పుడు గతిలేక విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. సుమారు 40 కేసులు ఆమెపై మోపబడ్డాయి. 84లో పెరోల్ మీద విడుదలైన వెంటనే ఆమె పెరోల్ జంప్ చేశారు. మళ్లీ రహస్య జీవితంలోకి వెళ్లిపోయారు. పార్టీ రాష్ట్ర సమావేశాలకు హైదరాబాదు నుంచి ఆయుధాలు తీసుకుని తిరిగి వస్తుండగా నల్గొండ వద్ద పార్టీ రాష్ట్ర నాయకులు విక్రంతో పాటు నెల రోజులు అరెస్టయ్యారు. మళ్లీ రెండు దఫాలుగా 15 సంవత్సరాలు జైల్లో రాజకీయ ఖైదీగా జీవితం గడిపారు.


2010 సంవత్సరంలో కామ్రేడ్ పైలా వాసుదేవరావు అమరుడైన తర్వాత ఆమె అధైర్య పడకుండా ఎంతో అంకితభావంతో తుది శ్వాస వరకు పార్టీ నిర్మాణంలో భాగంగా ఉన్నారు. సెప్టెంబరు 22, 2020 తేదీన కరోనా జ్వరం కారణంగా ఆమెను విశాఖపట్నం కెజిహెచ్‌కు తరలించారు. మరుసటి రోజే అమరత్వం పొందారు. అలా శ్రీకాకుళ విప్లవోద్యమానికి నాయకత్వం వహించిన త్యాగాలతనం వెళ్ళిపోయింది. జీవితమంతా నిర్బంధాల మధ్య గడుస్తున్నా, తుపాకీ గుళ్ళకు కళ్లముందే సహచరులు అమరులవుతున్నా, గుండె నిబ్బరం చేసుకుని ఎత్తిన జెండా వీడలేదు, ఎన్నడూ వెనకడుగు వేయలేదు. ఆమె త్యాగాన్ని, పట్టుదలను, అంకిత భావాన్నీ నేటి తరం పుణికి పుచ్చుకోవాలి.

వంకల మాధవరావు

సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ

(రేపు టెక్కలిలోని సత్తార్ లోకనాధం కళ్యాణ మండపంలో చంద్రమ్మ ద్వితీయ వర్ధంతి సభ)

Read more