కేంద్రం నిధులతో జగనన్న సోకులు
ABN , First Publish Date - 2022-11-12T01:50:37+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన విషయంలో ముఖ్యమంత్రి జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అతిగా ఆయాస పడుతున్నట్టు కనిపిస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన విషయంలో ముఖ్యమంత్రి జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అతిగా ఆయాస పడుతున్నట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేయడానికి ప్రధాని మోదీ నేడు విశాఖపట్నానికి వస్తున్నారు. తమ పాలనకు ప్రధానమంత్రి అనుకూలంగా ఉన్నట్టు చూపాలని రాష్ట్ర పాలకులు భావిస్తే అది వారి సంకుచిత ఆలోచనే తప్ప మరొకటి కాదు.
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, రాయపూర్– విశాఖపట్నం ఆరు వరుసల రహదారి, కాన్వెంట్ జంక్షన్ నుండి షీలానగర్ పోర్ట్ రోడ్, విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, శ్రీకాకుళం నుండి అంగుల్ వరకు పైప్ లైన్, నర్సాపురం నుండి ఇచ్చాపురం రోడ్, ఓఎన్జీసీ ఫీల్డ్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులన్నీ తామే చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తున్నట్టు ప్రజలను పక్క దోవ పట్టించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎంత దిగజారుడు రాజకీయం! నిజానిజాలు ప్రజలకు తెలియవని అనుకుంటున్నారా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని అటకెక్కించి, ఆచరణ సాధ్యం కాని విశాఖపట్నం పరిపాలన రాజధాని అంటూ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టిన వైసిపీ ప్రభుత్వం ఈ రోజు విశాఖపట్నంలో రుషికొండ పర్యావరణ అరాచకాలు, భూముల స్కామ్‌లు తప్ప ఏమైనా అభివృద్ధి చేసిందా? ఏమి చేయని పరిస్థితులలో, ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను తమ పని తనంగా ప్రజలకు చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
రాష్ట్రంలో పాలనపై నరేంద్ర మోదీకి ప్రశంసాపూర్వక దృష్టి ఉండాలంటే కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు గీటురాయి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు జరిగిన నియామకాలలో అమలుపరిచారో లేదో తెలుపగలరా?, ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద మన రాష్ట్రానికి 20 లక్షల 75 వేల గృహాలు కేటాయించారు. కేవలం 6 లక్షల 28 వేల గృహాల నిర్మాణాన్ని మాత్రమే పూర్తి చేశారు. అంటే ౩౦శాతం మాత్రమే. ఇది జాతీయ సగటులో సగం. మరో ముఖ్యమైన కేంద్ర ప్రాయోజిత పథకం జల్ జీవన్ మిషన్. ఈ పథకానికి 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ. 790.48 కోట్లు కేంద్రం విడుదల చేసింది. అందులో 297.62 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా 492.86 కోట్లు కేంద్రానికి వెనక్కి ఇచ్చివేయడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం.
కొవిడ్ విపత్తు అనంతరం దేశంలో 80 కోట్ల అర్హులైన ప్రజలకు ‘గరీబ్ కళ్యాణ్’ పథకం క్రింద గత 21 నెలలుగా ఒక్కొక్కరికి నెలకు 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పథకం లబ్ధిదారులు దాదాపు 2 కోట్ల 70 లక్షల మంది ఉన్నారు. మరి కేంద్రం నుంచి వచ్చిన బియ్యాన్ని సకాలంలో లబ్ధిదారులకు అందించారా? లేదు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పొట్ట కొట్టే ప్రయత్నం చేసి, చివరకు కేంద్రం హెచ్చరికతో దిగొచ్చి బియ్యం పంచింది. మరోవంక కేంద్రప్రభుత్వ నిధులతో అమలయ్యే పథకాలకు తమ స్టిక్కర్లు వేస్తూ ప్రజలను పక్కదారి పట్టించడంలో దిట్టగా జగన్ సర్కార్ వ్యవహరిస్తున్నది. కేంద్రప్రభుత్వం పేదలకు వైద్యం నిమిత్తం 5 లక్షల రూపాయల వరకు ఆయుష్మాన్ భారత్ క్రింద నిధులు అందిస్తోంది. దానికి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ అంటూ స్టిక్కర్ వేశారు. అయినా సకాలంలో హాస్పిటళ్ళకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలో పేదలకు వైద్య సేవలు అందడం లేదు.
కొవిడ్ అనంతరం వీథులలో వ్యాపారం చేసుకొనే హ్యాకర్లను ఆదుకోవడానికై కేంద్ర ప్రభుత్వం ‘పీఎమ్ స్వనిధి’ క్రింద రుణ సహాయం అందిస్తోంది. మన రాష్ట్ర పాలకులు ఆ పథకం పేరు ‘జగనన్న చేయూత’గా మార్చేశారు! రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన పీఎమ్ గతి శక్తి యోజన ప్రయోజనాలను అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. నరేంద్ర మోదీ కాంక్షించే అంత్యోదయ స్ఫూర్తి మేరకు కార్యక్రమాలు జరగకుండా కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు పక్కదారి మళ్లించడం రాష్ట్రంలో పరిపాటిగా మారింది. ఆ పథకాలకు రాష్ట్ర పాలకులు తమ పేర్లు, వారి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ పైన కేంద్రం పన్ను తగ్గించినా కూడా రాష్ట్రంలో తగ్గించలేదు. పైగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పత్రికా ప్రకటన చేసేందుకు జగన్ సర్కార్ తెగబడింది.
విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తున్న సందర్భంగా పైన ప్రస్తావించిన అంశాలను పక్కదోవ పట్టించడం కోసం, రాష్ట్రంలో అధికారపక్షం ప్రోద్బలంతో కొందరు వేరే అంశాలు పైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట నిర్ణయం తీసుకొని స్థల సేకరణ కార్యక్రమంలో ఉంది. అయితే, పార్లమెంట్‌లో వేరే రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైన అడిగే ప్రశ్నలకు సంబంధిత మంత్రులు ఇచ్చే సమాధానాలను ఆంధ్రప్రదేశ్‌కి ఆపాదించడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం మినహా మరొకటి కాదు. ఇక, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అది నిలదొక్కుకోవడానికి అవసరమైన అనేక చర్యలు చేపట్టింది, భవిష్యత్తులో కూడా స్టీల్ ప్లాంట్ వనరులు అన్యాక్రాంతం కాకుండా ఇప్పుడున్న దానికన్నా ఇంకా అధికంగా వృద్ధిలోకి వచ్చి మెండుగా ఉపాధి అవకాశాలు కల్పించే పద్ధతిలోనే మోడీ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. కేరళలో పోర్ట్ కోసం, రాజస్థాన్‌లో పెట్టుబడుల కోసం ఆ రాష్ట్రాల పాలక పక్షాలు ఎవరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయో, అవే రాజకీయ పక్షాలు ఇక్కడ మరో రకంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. డైవెర్షన్ రాజకీయాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి వ్యక్తిగత లబ్ధి పొందాలి అనుకునే వారికి, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టులు కనువిప్పు కాక తప్పదు.
లంకా దినకర్